అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు

  • 17 నవంబర్ 2019
మీడియాతో మాట్లాడుతున్న పర్సనల్ లా బోర్డు ప్రతినిధులు

అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ్ లల్లా(బాల రాముడు)కే చెందుతుందన్న సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని 'అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్‌బీ)' చెప్పింది.

ఈ మేరకు బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆదివారం లఖ్‌నవూలో బోర్డు కార్యవర్గ సమావేశం జరిగిందని, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నవంబరు 9న ఇచ్చిన ఈ తీర్పుపై భేటీలో కూలంకషంగా చర్చించామని బోర్డు తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పులో కనీసం పది తప్పులు ఉన్నాయని అభిప్రాయపడింది. చట్టం కల్పించిన అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలనుకొంటున్నామని తెలిపింది. రివ్యూ పిటిషన్ దాఖలు తమ న్యాయపరమైన హక్కు అని వ్యాఖ్యానించింది.

సమావేశం తర్వాత బోర్డు కార్యదర్శి జఫర్యాబ్ జిలానీ, బోర్డులోని ఇతర సభ్యులు మీడియాతో మాట్లాడారు.

బోర్డు తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తారని జిలానీ తెలిపారు. ఇంతకుముందు ముస్లింల తరపున సర్వోన్నత న్యాయస్థానంలో రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు.

లా బోర్డుకు అది సాధ్యం కాదు: హిందూ మహాసభ న్యాయవాది

బోర్డు వ్యాఖ్యలతో హిందూ మహాసభ న్యాయవాది విభేదించారు.

అయోధ్య స్థల వివాదం కేసులో ముస్లిం పర్సనల్ లా బోర్డు కక్షిదారు కాదని, ఇది ఎలా రివ్యూ పిటిషన్ దాఖలు చేయగలదని హిందూ మహాసభ న్యాయవాది వరుణ్ సిన్హా ప్రశ్నించారు. రివ్యూ పిటిషన్, వేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవాల్సింది కేసు కక్షిదారుల్లో ఒకటైన సున్నీ వక్ఫ్ బోర్డు అని ఆయన చెప్పారు.

రివ్యూ పిటిషన్ దాఖలుకు హక్కు ఉన్నప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేసేందుకు న్యాయపరంగా సరైన ప్రాతిపదిక లేదని వరుణ్ వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు చెప్పిన చాలా అంశాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని, తీర్పు నిష్పాక్షికంగా లేదని బోర్డు భావిస్తోందని జిలానీ చెప్పారు. ఈ కారణాలవల్లే రివ్యూ పిటిషన్ వేయాలని బోర్డు నిర్ణయించిందని చెప్పారు.

Image copyright Getty Images

అయోధ్య పట్టణంలో ఏదైనా ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణం కోసం కేటాయించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై జిలానీ స్పందిస్తూ- బాబ్రీ మసీదుకు బదులుగా ఈ స్థలాన్ని తాము స్వీకరించలేమన్నారు.

ముస్లింలు న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారని, బాబ్రీ మసీదుకు బదులుగా స్థలం అడగలేదని జిలానీ చెప్పారు. అయోధ్యలో ఇప్పటికే 27 మసీదులు ఉన్నాయని, ముస్లింలు న్యాయపోరాటం చేసింది కేవలం మసీదు కోసం కాదని తెలిపారు.

అయోధ్యలో మసీదుకు ఉద్దేశించిన ఐదెకరాల స్థలాన్ని సున్ఫీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా చేసి హిందువులకు, ముస్లింలకు పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సుప్రీంకోర్టు నవంబరు 9న తీర్పు వెలువరించింది. ఈ స్థలమంతా రామ్ లల్లాకే చెందుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది. రామ్ లల్లా, నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్ ఈ అప్పీళ్లను దాఖలు చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)