‘తెలంగాణలో అమిత్ షా, కేసీఆర్‌ల రాజ్యం నడుస్తోంది... నేనేం నేరం చేశానో చెప్పకుండా కేసు పెట్టారు’ - వీక్షణం ఎడిటర్ ఎన్ వేణుగోపాల్.

  • 19 నవంబర్ 2019
ఎన్ వేణుగోపాల్ Image copyright facebook/nvenugopal.rao

వీక్షణం మాస పత్రిక సంపాదకులు, రచయిత, ఉపన్యాసకులు ఎన్ వేణుగోపాల్‌పై కేసు పెట్టారు తెలంగాణ పోలీసులు. ఐపీసీ సెక్షన్లతో పాటు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ - యుఎపిఎ) కిందా, తెలంగాణ పబ్లిక్ సెక్యూరిటీ చట్టం కిందా ఆయనపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులు అన్న ఆరోపణలతో హైదరాబాద్‌లో ఇద్దర్ని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు.. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్ సహా మరో ఏడుగురిపై కూడా కేసు నమోదు చేశారు.

నవంబర్ 12వ తేదీన హైదరాబాద్‌లో ఎన్ రవిశర్మ, బి అనురాధ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనీ, వారి వద్ద మావోయిస్టు సాహిత్యం దొరికిందనీ, వారి ఇంటికి మావోయిస్టులు వచ్చిపోతున్నారనేది ఈ కేసులో పోలీసుల అభియోగం. అయితే వారి రిమాండ్ రిపోర్టులోనే వేణుగోపాల్ పేరును ఏ7గా చేర్చారు పోలీసులు. ఆయన విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడనీ, పరారీలో ఉన్నడనీ ఆ నివేదికలో రాశారు.

నవంబరు 13 నాడు పోలీసులు కోర్టుకు సమర్పించిన కేసు డైరీ ప్రకారం నర్ల రవి శర్మ, బెల్లపు అనురాధ ఏ1, ఏ2లుగా అరెస్టయిన కేసులో ఏ3గా నంబాల కేశవరావు (భారత మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి), ఏ4గా మల్లోజుల వేణుగోపాల్, ఏ5గా కటకం సుదర్శన్, ఏ6గా యాపా నారాయణ, ఏ7గా నెల్లుట్ల వేణుగోపాల్ (వీక్షణం సంపాదకులు), ఏ8గా ప్రొఫెసర్ చింతకింద ఖాసిం, ఏ9 నలమాసు కృష్ణ, ఏ10 మెంచు రమేశ్‌లుగా పేర్కొన్నారు. అయితే రవి, అనురాధలను తప్ప ఇతరులను పోలీసులు అరెస్టు చేయలేదు. మిగిలిన వారంతా పరారీలో ఉన్నట్లు చూపించారు ఆ రిమాండ్ రిపోర్టులో.

రవిశర్మ ఇంట్లో సోదాలు, అందులో స్వాధీనం చేసుకున్న వస్తువులు, ఆయనపై ఉన్న పాత కేసులు, సంబంధాల గురించి వివరంగా రిపోర్టులో పేర్కొన్న పోలీసులు.. ఏ3 నుంచి ఏ10 వరకూ ఉన్న మిగిలిన వారు ఏం చేశారనేది మాత్రం ఆ నివేదికలో రాయలేదు.

Image copyright facebook/veekshanamtelugu
చిత్రం శీర్షిక వీక్షణం మాసపత్రిక 2019 నవంబర్ ఎడిషన్ ముఖ చిత్రం

రవి, అనురాధలు సుదీర్ఘంగా మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారని పోలీసులు ఆరోపించారు. వారితో పాటు మొత్తం అందరిపై ఐపీసీ సెక్షన్ 120బి రెడ్ విత్ 34, యుఎపిఎ చట్టం సెక్షన్లు 10,13,18, 18బి, 20, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సెక్యూరిటీ చట్టం 8 (1, 2) కింద వీరిపై కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్లన్నీ దేశంపై యుద్ధం ప్రకటించడం, అశాంతి రగిలించడం వంటి నేరాలకు సంబంధించినవి.

రవి మొదటిసారి 1988లో ఆరెస్టు అయ్యారు. 2009లో తిరిగి అరెస్టయ్యారు. 2016లో విడుదల అయినప్పటి నుంచీ హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనపై జార్ఖండ్‌లో 11, తెలంగాణలో 4, ఆంధ్రలో ఒక కేసు ఉన్నాయి. వాటిలో జార్ఖండ్ లోని ఒక కేసు పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ఆయన ఆల్ ఇండియా ఫోరం అగైనెస్ట్ హిందూత్వ ఫాసిస్ట్ అఫెన్సివ్ సంస్థలో చురుగ్గా ఉన్నారు. రవిశర్మ ఒక హార్డ్ కోర్ మావోయిస్టు అని రాచకొండ పోలీసులు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. రవి మావోయిస్టు పార్టీ తరపున తెలంగాణలో పనిచేస్తన్నారనీ, ఆయన్ను చాలా మంది మావోయిస్టులు వచ్చి కలుస్తున్నారనీ తెలిపారు.

అయితే రవి, అనురాధల కేసులో కొత్తగా అప్పటికప్పుడు వేణుగోపాల్ సహా ఇతరుల పేర్లను ఇరికించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయంలో పోలీసుల వైఖరిని విరసం, వీక్షణం తప్పు పడుతున్నాయి.

వేణుగోపాల్‌పై కేసు విషయంలో వీక్షణం పత్రిక ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్య రాజ్యాంగం హామీ ఇచ్చిన భావప్రకటనా స్వాతంత్ర్యానికి అనుగుణంగా, ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు ఒక పత్రికా సంపాదకుడిపై పాలకుల కక్ష సాధింపుకు నిదర్శనమని ఆ పత్రిక పేర్కొంది.

"2009లో వేణుగోపాల్ రాసిన ఒక వ్యాసం మీద వివాదంతో ఆయన విప్లవ రచయితల సంఘం నుంచి దూరం అయ్యాడని అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆయన ఏ సంస్థలోనూ సభ్యుడుగా లేడు. పూర్తికాలం వీక్షణం నిర్వాహకుడిగా ఉన్నాడు. ప్రగతిశీల, ప్రజాస్వామిక, వామపక్ష భావాలున్నంతమాత్రాన ఒక సంస్థలో సభ్యుడుగా ఉండనక్కరలేదు. ఆయన మీద ఆ నిందా ముద్ర వేయడానికి, స్వతంత్ర పాత్రికేయుడిగా ఆయన ప్రతిష్ఠను దిగజార్చడానికి పోలీసులు దురుద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం ఇది" అంటూ వీక్షణం కలెక్టివ్ ప్రకటన విడుదల చేసింది.

చిత్రం శీర్షిక అనురాధ, రవి శర్మ

‘నాలుగైదేళ్లుగా ప్రభుత్వం నాపై కోపంతో ఉంది’

ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నందుకే ఇలా చేస్తున్నారని వీక్షణం సంపాదకులు వేణుగోపాల్ ఆరోపించారు. "నాలుగైదేళ్లుగా ప్రభుత్వం నాపై కోపంతో ఉంది. వాళ్ల విధానాలపై విమర్శనాత్మకంగా రాస్తున్నాను. దీన్ని సైలెన్స్ చేయాలని ప్రయత్నం. ఇప్పుడొక అవకాశం తీసుకుని వారు అరెస్ట్ కాగానే నా పేరూ రాశారు. రిమాండ్ రిపోర్టు ఆరోపితుల జాబితాలో తప్ప, మిగిలిన 12 పేజీల్లో ఎక్కడా నా పేరు రాయకుండా, నేనేం నేరం చేశానో చెప్పకుండా కేసు పెట్టారు. బెదిరించడానికే ఇదంతా చేస్తున్నారు. అమిత్ షా, కేసీఆర్ల రాజ్యం నడుస్తోంది. చట్టపరంగా పోరాడుతాను. జర్నలిస్టు సంఘాలు మద్దతిచ్చాయి. 2005లో కూడా నాపై 120బి కేసు పెడితే కోర్టు కొట్టేసింది. నాకు భావాలున్నాయి. కానీ నేను ఏ సంఘంలోనూ లేను. నేరాలు చేయలేదు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిధిలోనే పనిచేస్తన్నాను" అని బీబీసీతో చెప్పారు వేణుగోపాల్.

ఇక పరారీలో ఉన్నారన్న దానిపై కూడా ఆయన స్పందించారు. పరారీలో ఉన్నారని పోలీసులు రాసిన పేర్లలో ఒకరైన నలమాసు కృష్ణ ప్రస్తుతం మహబూబ్ నగర్ జైల్లో ఉన్నారని చెప్పారాయన.

గత నెల రోజుల్లో 60 మందికి పైగా ఉద్యమకారులపై యుఎపిఎ కేసులు పెట్టారని ఆరోపించింది విరసం. "బ‌హిరంగ ప్ర‌జా జీవితంలో ఉంటూ పాల‌క విధానాల ప‌ట్ల ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా త‌మ అస‌మ్మ‌తిని తెలియ‌జేస్తున్న ర‌విశ‌ర్మ‌, అనురాధ స‌హా విర‌సం కార్య‌క‌ర్గ స‌భ్యులు ప్రొఫెస‌ర్ సి. కాశీం, వీక్ష‌ణం సంపాద‌కులు ఎన్‌. వేణుగోపాల్ త‌దిత‌రుల‌పై పెట్టిన త‌ప్పుడు కేసుల‌ను ప్ర‌భుత్వం వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాలి" అన్నారు విర‌సం కార్య‌ద‌ర్శి పాణి.

ప్రజల పక్షాన మాట్లాడుతన్నందుకే అన్యాయంగా కేసులు పెట్టారని ఆరోపించారు న్యాయవాది రవీంద్రనాథ్. రవిశర్మ ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నాడనీ ఆయన హిందూ పాసిస్ట్ వ్యతిరేక ఫోరంలో చురుగ్గా ఉన్నందుకే ఇలా అరెస్టు చేశారని ఆయన విమర్శించారు.

"భిన్నంగా ఉన్న వారిని వెంటాడి వేధించడం, అరెస్టులు చేయడం మంచిది కాదు. అప్రజాస్వామికం. ఏదైనా ఉంటే నోటీసులు ఇచ్చి, వ్యవధి ఇచ్చి ప్రజాస్వామికంగా వెళ్లాలి. రాజకీయాభిప్రాయాలు కలిగి ఉన్నందుకు ఇలా చేయడం సరికాదు. అసలు సెడిషన్ (రాజద్రోహం) సెక్షన్నే ఎత్తేయాలని సుప్రీం కోర్టు చెబుతోంది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రత్యర్థులపై దాన్నే ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయి. వరవర రావు, సాయిబాబాలను విడుదల చేయమంటే ఈ కొత్త నిర్బంధాలు పెంచుతున్నారు. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, వాటిని కాపాడుకోవడానికి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది" అన్నారు పాత్రికేయులు తెలకపల్లి రవి.

ఈ వ్యవహారంపై పోలీసులను బీబీసీ సంప్రదించింది. కానీ, వారు స్పందించలేదు.

‘వేణుగోపాల్‌పై అక్రమ కేసు ఎత్తివేయాలి’

వీక్షణం మాసపత్రిక సంపాదకుడు వేణుగోపాల్‌పై పోలీసులు నమోదు చేసిన కేసు అక్రమమని, దాన్ని ఎత్తి వేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయు), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె)లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశాయి. ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపినందుకు ఓ పత్రికా సంపాదకుడిపై పాలకుల కక్ష సాధింపు చర్యకు నిదర్శనం వేణుగోపాల్‌పై అక్రమ కేసు నమోదు చేయడమేనని ఐజేయు అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె విరాహత్ అలీ, ఐజేయు కార్యదర్శి వై సరేందర్ రెడ్డి, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ ఆరోపించారు.

జర్నలిస్టుగా పనిచేస్తుండటంతో పాటు అనేక అంశాలపై పుస్తకాలు రచించిన, ప్రసంగాలు చేసిన వేణుగోపాల్‌ ఏం నేరం చేశారో స్పష్టం చేయకుండా కేసు నమోదు చేయడం సరికాదని పలు ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు తప్పుపడుతూ ప్రకటనలు జారీ చేశాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)