జైపుర్: ముస్లిం చిన్నారులు ఈ బడిలో సంస్కృతం అలవోకగా మాట్లాడుతారు

  • 20 నవంబర్ 2019
సంస్కృతం

రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో ఓ ప్రభుత్వ బడిలోని ముస్లిం విద్యార్థులు సంస్కృతంలో ప్రావీణ్యం చాటుకుంటున్నారు.

నాహ్రీ కా నాకాలో ఉన్న ఈ పాఠశాల పేరు రాజకీయ ఠాకూర్ హరిసింగ్ షెకావత్ మాండ్వా ప్రవేశిక సంస్కృత్ విద్యాలయ. ఇందులో సుమారు 275 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారిలో 227 మంది ముస్లిం చిన్నారులే.

ఆ ముస్లిం చిన్నారుల్లో 200 మంది సంస్కృతం నేర్చుకుంటున్నారు. ఇలా సంస్కృతం నేర్చుకుంటున్నవారిలో బాలికల సంఖ్యే ఎక్కువగా ఉంది.

సంస్కృత పదాల ఉచ్చారణలో చిన్నారులు కనబరుస్తున్న ప్రతిభను ఇక్కడి ఉపాధ్యాయులు మెచ్చుకుంటున్నారు.

అయితే, ఈ బడిపై నిర్లక్ష్యపు నీడ అలుముకుంది. కిక్కిరిసిన మురికివాడలోని ఇరుకు వీధుల గుండా నడిస్తేగానీ అక్కడికి చేరుకోలేం.

ఆ బడి పిల్లలను పలకరిస్తే, గలాగలా సంస్కృతం మాట్లాడేస్తుంటారు.

వారి కుటుంబ సభ్యులు, పూర్వీకులు ఎవరూ సంస్కృతం చదువుకున్నవారు కాదు.

చాలా మంది తల్లిదండ్రులు పొట్టకూటి కోసం కాయకష్టం చేసుకుని బతుకుతున్నవారే.

మానియా అనే బాలిక ఈ బడిలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సంచులు కుడుతుంటారు.

భవిష్యత్తులో సంస్కృత ఉపాధ్యాయురాలిని కావాలనుకుంటున్నానని మనియా చెబుతోంది.

''సంస్కృత భాష అంత కఠినం కాదు. దాన్ని చదువుకోవడం నాకు చాలా ఇష్టం'' అని మనియా అంటోంది.

తమ పాఠశాల ఉన్న ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువని.. ఇక్కడి చిన్నారులు, వారి తల్లిదండ్రులు తమకు ఎంతగానో సహకరిస్తున్నారని ప్రిన్సిపాల్ వేదనిధి శర్మ చెబుతున్నారు.

''చిన్నారులు సంస్కృతంతోపాటు ఇంగ్లిష్, గణితం, సైన్స్ ‌కూడా బాగా చదువుతున్నారు. వారి కుటుంబాలతో మేం మాట్లాడుతుంటాం. అప్పుడప్పుడూ కలుస్తుంటాం. బడిలో రెండు పూటలా నడుస్తోంది'' అని అన్నారు.

ఈ బడికి సరైన సౌకర్యాలు లేవు. సంకల్పం గట్టిదైతే అవేవీ తమకు అడ్డు కాదని పాఠశాల సిబ్బంది అంటున్నారు.

ఓ దాత ఇచ్చిన స్థలంలో ఈ పాఠశాల నడుస్తోంది. నిర్మాణం అసంపూర్తిగా ఉన్న భవనంలో తరగతులు నడుస్తున్నాయి. కొన్ని గదులు నిర్మించేందుకు పునాదులైతే వేశారు. వాటిని పూర్తి చేయాల్సి ఉంది.

చిన్నారులకు మాత్రం చదువులో మంచి పునాదులు పడ్డాయని పాఠశాల సిబ్బంది అంటున్నారు.

''నేను సంస్కృతం చదువుతుంటే, మా అమ్మానాన్న చాలా సంతోషిస్తారు'' అని ఏడో తరగతి చదువుతున్న పర్వీన్ ఫర్రాటే చెబుతోంది.

''మా తల్లిదండ్రులు మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తున్నారు'' అని శబా అనే మరో చిన్నారి అంటోంది. టీచర్ అవ్వాలన్నదే ఆమె కల కూడా. శబా తండ్రి మెకానిక్.

ఈ పాఠశాల సమస్యల గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమీన్ కగ్జీ తమ ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.10 లక్షలు భవన నిర్మాణం కోసం మంజూరు చేశారు.

''చదువులో బాలుర కంటే బాలికలే ముందుంటున్నారు. మేం కూడా వారిని ప్రోత్సహిస్తున్నాం. పాఠశాల భవన నిర్మాణం పూర్తయితే మాకు ఎంతో ఉపయోగపడుతుంది'' అని ప్రిన్సిపాల్ వేదనిధి శర్మ అన్నారు.

''సంస్కృతం పట్ల పిల్లల ఆసక్తి చూశాక, ఉపాధ్యాయుల్లోనూ ఉత్సాహం పెరిగింది. మేం కూడా బోధనలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నాం. చిన్నారులకు నేర్చుకోవాలన్న తపనతోపాటు మంచి ప్రతిభ కూడా ఉంది. వాళ్ల ప్రగతి చూస్తుంటే మాకు కూడా సంతోషంగా ఉంది'' అని పాఠశాలలో సంస్కృతం భోదిస్తున్న కోమల్ శర్మ చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)