జేఎన్‌యూ: ఆగని విద్యార్థుల ఆందోళన... ఫీజుల పెంపుపై విద్యార్థులు ఏమంటున్నారు?

  • 21 నవంబర్ 2019
జేఎన్‌యూ Image copyright Getty Images
చిత్రం శీర్షిక జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన

''నేను అంధ విద్యార్థిని. నన్ను కొట్టొద్దు... పరుగెత్తి తప్పించుకోలేను' అని నేను ఆ పోలీసుకు చెప్పాను. 'నువ్వు గుడ్డోడివైతే ఈ నిరసన ప్రదర్శనకు ఎందుకు వచ్చావు?' అని అతడు అడిగాడు''

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లోని తన హాస్టల్ గదితో కూర్చుని గుర్తు చేసుకున్నాడు శశిభూషణ్ సమద్.

ఒక రోజు ముందు విద్యార్థులు పోలీసులతో తలపడిన ఒక నిరసన ప్రదర్శనలో అతడు పాల్గొన్నాడు. చాలా మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

సమద్ తనకు కళ్లు కనిపించవని పోలీసులకు చూపించటానికి తన కళ్లద్దాలు తీస్తుండటం, పోలీసులు అతడిని బలవంతంగా లాగివేయటం ఒక వీడియోలో కనిపిస్తుంది.

''వాళ్ల కాళ్ల కింద నన్ను తొక్కేశారు. ఒకరు నన్ను మోకాళ్లతో గుద్దారు. పొట్టలో పొడిచారు. నా వీపు మీద కాళ్లతో తొక్కారు'' అంటూ సమద్ తన వీపు మీద చొక్కా పైకెత్తి కమిలిన గాయాలను చూపించాడు.

అదే హాస్టల్‌లోని పక్క గదిలో రాశీ సింగ్ తన కాలుని టేబుల్ మీద పెట్టి కూర్చున్నారు.

''పోలీసులు లాఠీలు పట్టుకుని తరిమినపుడు నేను పరుగెడుతూ కాలికి ఏదో తగిలి పడిపోయాను. నన్ను ఎవరు ఎత్తుకెళ్లి రోడ్డు పక్కన పడుకోబెట్టారో కూడా నాకు తెలియదు'' అని చెప్పింది. కాలు విరగలేదని డాక్టర్లు చెప్పినట్లు ఆమె తెలిపారు.

చిత్రం శీర్షిక పోలీసులు లాఠీలతో తరమటంతో కిందపడిపోయిన రాశీ సింగ్ కాలికి తీవ్రగాయాలయ్యాయి

పెంచిన హాస్టల్ ఫీజులను తగ్గించాలని జేఎన్‌యూ విద్యార్థులు కొన్ని వారాలుగా ఆందోళన చేస్తున్నారు.

హాస్టల్ ఫీజును ఇంత భారీగా పెంచటం వల్ల పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేరని ఈ విద్యార్థులు వాదిస్తున్నారు.

విద్యా బోధన, పరిశోధనలకు ప్రఖ్యాతి గాంచిన ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థ జేఎన్‌యూలో.. ప్రైవేటు విద్యా సంస్థలతో పోలిస్తే ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ చదువుకోవటానికి ముఖ్యంగా ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులు అధిక ప్రాధాన్యమిస్తారు.

ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అధికార యంత్రాంగం, జర్నలిజం, పోలీసు విభాగం.. దాదాపు అన్ని ప్రజా జీవిత రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉన్నారు.

''భారత సమాజం ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందటానికి ఉన్నత సంస్థల ప్రజాస్వామికీకరణ అత్యంత కీలకం. కాబట్టి జేఎన్‌యూ వంటి విద్యా సంస్థలు మనకు పదుల సంఖ్యలో అవసరం'' అంటారు జేఎన్‌యూ మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ వై.కె.అలగ్.

ఫీజులు పెంచటం వల్ల దిగువ వర్గంలోని వారికి ఉన్నత విద్య అందుబాటులో లేకుండా పోతుందని విద్యార్థులు అంటున్నారు.

జేఎన్‌యూ విద్యార్థి అలీ జావేద్ వర్సిటీలోని 463 మంది విద్యార్థులను నమూనాగా తీసుకుని చేసిన ఒక 'ముసాయిదా సర్వే' విద్యార్థుల్లో పంపిణీ అవుతోంది.

ఈ సర్వే కోసం గూగుల్ ఫామ్ సర్వే ద్వారా సమాచారం సేకరించినట్లు జావేద్ తెలిపారు.

చిత్రం శీర్షిక జేఎన్‌యూ విద్యార్థుల్లో దాదాపు సగం మంది కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,44,000 లోపేనని జావేద్ అలీ ముసాయిదా సర్వే చెప్తోంది

విద్యార్థుల్లో గణనీయంగా 42 శాతం మంది.. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 1,44,000 లోపు ఉన్న కుటుంబాల వారేనని ఈ సర్వే చెప్తోంది.

''ఒక విద్యార్థి చిరిగిన తన ప్యాంటును కొన్ని రోజుల పాటు కుట్టించుకోలేకపోవటం నాకు తెలుసు. మరొక విద్యార్థికి చలికాలంలో కప్పుకోవటానికి ఒక రగ్గును నేను అరువిచ్చాను'' అని చెప్పారు ఎంఫిల్ ఎకానమిక్స్ విద్యార్థి అలీ. ఆయన కొంత 'మెరుగైన నేపథ్యం' నుంచి వచ్చారు.

''ఆకలితో పడుకునే విద్యార్థులు ఉన్నారు. టాక్సీ, ఆటోల్లో రాలేక కిలోమీటర్ల దూరం నడిచే విద్యార్థులు ఉన్నారు. డబ్బులు ఆదా చేయటం కోసం పాడైపోయిన బూట్లు తొడుక్కునే విద్యార్థులు ఉన్నారు. కుటుంబ అప్పులు తీర్చటానికి ఖాళీ సమయంలో పనులు చేసుకునే విద్యార్థులు ఉన్నారు. ఇటువంటి అణగారిన వర్గాల విద్యార్థులు చదువుకోవటానికి ఒక విద్యా సంస్థను మనం తయారు చేయలేమా?'' అని ఆయన ప్రశ్నించారు.

అయితే.. ప్రస్తుత ఫీజుల పెంపు ఇప్పటికే చాలా ఏళ్లు ఆలస్యమయిందని.. హాస్టల్ గదుల అద్దెలను గత మూడు దశాబ్దాలలో పెంచలేదని జేఎన్‌యూ పాలకవర్గం చెప్తోంది.

జేఎన్‌యూలో దాదాపు 8,000 మంది విద్యార్థులు చదువుతున్నారని.. వారిలో సుమారు 60 శాతం మంది హాస్టళ్లలో నివసిస్తుంటారని విద్యార్థులు చెప్తున్నారు.

విద్యార్థులు తరగతులకు హాజరవ్వాలని పాలకవర్గం విజ్ఞప్తి చేసింది.

Image copyright Getty Images

దీనికిముందు.. వర్సిటీలోని ఒక ఆడిటోరియంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన ఒక కేంద్రమంత్రి దృష్టికి తమ డిమాండ్‌ను తీసుకువెళ్లటానికి విద్యార్థులు ఆడిటోరియం వెలుపల ఆందోళనకు దిగారు. కానీ భద్రతా సిబ్బంది వాటర్ క్యానన్లు ఉపయోగించి మరీ వారిని బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు.

తాజాగా విద్యార్థులు పార్లమెంటు వరకూ ప్రదర్శన నిర్వహించాలని ప్రణాళిక రచించటంతో వారిని నిలువరించటానికి పోలీసులు బారికేడ్లు ఉపయోగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

''మేం పార్లమెంటు ముందు శాంతియుతంగా ధర్నా చేయటం ద్వారా మా మనోభావాలను తెలియజేయాలని కోరుకున్నాం. కానీ మమ్మల్ని ఆపటానికి పోలీసులు క్రూరమైన బలప్రయోగం ఉపయోగించారు'' అని యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాతో చెప్పారు.

పోలీసుల ప్రతిస్పందన వల్ల ఎంతోమంది విద్యార్థులు గాయాలపాలయ్యారు.

అయితే, పోలీసులు అత్యధికంగా సంయమనం పాటించారని, విద్యార్థులు బారికేడ్లను ధ్వంసం చేయటానికి ప్రయత్నించే క్రమంలో గాయపడి ఉంటారని దిల్లీ పోలీస్ సీనియర్ అధికారి ఎం.ఎస్.రణధవా బీబీసీతో అన్నారు.

Image copyright Getty Images

డజన్ల సంఖ్యలో విద్యార్థులను తీసుకెళ్లి అనేక గంటల పాటు నిర్బంధించారు.

కానీ, ''వామపక్ష చింతనా కోట''గా పేరుపడ్డ జేఎన్‌యూ చాలా కాలంగా తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా కొనసాగుతోంది.

జేఎన్‌యూ విద్యార్థులను ''పరాన్నభుక్కులు'' అని, ''బిచ్చగాళ్లు'' అని, ''పన్ను చెల్లించే ప్రజలకు భారం'' అని చాలా మంది దూషిస్తున్నారు.

జంటలు స్వేచ్ఛగా కలిసి తిరుగుతూ, సెక్స్‌లో పాల్గొనే ''నాస్తికుల సదనం'' అని కూడా జేఎన్‌యూను అపఖ్యాతి పాలుచేశారు.

ఒక జంట ముద్దు పెట్టుకుంటున్న ఒక ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేసి, ''మేం చదువు కోసం డబ్బులు చెల్లిస్తున్నాం. పోర్నోగ్రఫీ కోసం కాదు'' అంటూ ట్వీట్ చేశారు.

ప్రత్యేకించి, 2001లో భారత పార్లమెంటు మీద దాడి కేసులో దోషిగా నిర్ధరితుడైన ఒక కశ్మీరీ వేర్పాటు వాదికి ఉరిశిక్షను అమలు చేసి సంవత్సరం అయిన సందర్భంగా జేఎన్‌యూలో 2016లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో... జేఎన్‌యూ విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారంటూ అధికారులు ఆరోపించిన తర్వాత ఈ విద్యా సంస్థ మీద, ఇక్కడి విద్యార్థుల మీద విమర్శలు తీవ్రతరమయ్యాయి.

ఆ ఉదంతం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాలు, దానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి.

విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడు అనంతరం బెయిల్ మీద విడుదలయ్యాడు. అతడు 2019 పార్లమెంటు ఎన్నికల్లో పార్లమెంటులో అడుగు పెట్టటానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు.

జేఎన్‌యూను ''ద్రోహుల'' సదనం అని దానిని ప్రక్షాళన చేయాలని విమర్శకులు పిలుపునిస్తున్నారు.

విద్యార్థుల తాజా ఆందోళనతో అదే పరిభాష, అవే విమర్శలు మళ్లీ పునరావృతమవుతున్నాయి.

Image copyright Reuters

''యూనివర్సిటీలో ప్రబలంగా ఉన్న వామపక్ష మొగ్గుకు ప్రస్తుత అధికార వర్గం వ్యతిరేకం కనుక.. జేఎన్‌యూను లక్ష్యంగా చేసుకున్నారు'' అంటున్నారు ప్రొఫెసర్ అక్తరుల్ వాసీ. ఆయన భారతదేశంలోని చాలా ప్రముఖ యూనివర్సిటీల్లో సీనియర్ పదవుల్లో పనిచేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మితవాద జాతీయవాద ప్రభుత్వం గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.

ఇటీవలి కాలంలో భారతదేశంలోని పలు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు - పాలకవర్గాల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అలహాబాద్ యూనివర్సిటీ వంటివి ఈ ఘర్షణలతో వార్తలకెక్కాయి.

అణగారిన వర్గాల వారి ప్రజాస్వామిక హక్కులు, సమానత్వం, అందరికీ విద్య అనే అంశాలు కేంద్రంగా విద్యార్థుల ఆగ్రహం రాజుకుంది.

''యువతరం ఆదర్శవంతంగా ఆలోచిస్తుంది. వాళ్లు మార్పు కోరుకుంటారు. వారి ఆదర్శ భావాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. కానీ, వారి తలలను కొట్టటానికి ప్రయత్నిస్తే, వాళ్లు తిరిగి కొడతారు'' అని ప్రొఫెసర్ అలగ్ వ్యాఖ్యానించారు.

Image copyright BIKKU RATHOD/HCU

''క్రియాశీల శక్తిలో ఈ యువతరం అతి పెద్ద భాగంగా ఉన్న ఒక దేశంలో, అలా చేయటం మూర్ఖత్వం. ఆ మార్పును తీసుకురావటాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది'' అని ఆయన చెప్పారు.

జేఎన్‌యూ విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లలో ఒకటి.. ఉన్నతవిద్య అందరికీ చౌకగా అందించటం.

ప్రైవేటు విద్యా చాలా ఖరీదైనది. ప్రభుత్వ సంస్థల్లో సీట్లు చాలా పరిమితంగా ఉన్నాయి.

''సరళీకరణ అనంతరం మనం మన విద్య, ఆరోగ్య రంగాలను మార్కెట్‌కు అప్పగించేశాం. దీనివల్ల పేదలు వీటికి దూరమవుతారు'' అని ప్రొఫెసర్ వాసీ పేర్కొన్నారు.

''పిల్లలు ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారంటే, మనం వారిని గౌరవించాలి. విద్య అనేది వ్యాపారం కాదు'' అని చెప్పారు.

ఈ సిద్ధాంతాల సంఘర్షణను పక్కనపెడితే.. చాలా మంది జేఎన్‌యూ విద్యార్థుల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది.

చిత్రం శీర్షిక పెంచిన ఫీజుల వల్ల తను చదువు మానేసి ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి తలెత్తిందని జ్యోతి కుమారి చెప్తోంది

జ్యోతి కుమారి (21) ఈ వర్సిటీలో రష్యన్ భాషలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు.

ఆమె తండ్రి ఒక రైతు. బిహార్‌లో ఓ చిన్న కమతం సాగుచేస్తున్నాడు. ఆయన వార్షికాదాయం రూ. 70,000 నుంచి రూ. 90,000 మధ్య ఉంటుంది.

అల్పాదాయ కుటుంబాల కోసం ఉద్దేశించిన స్కాలర్‌షిప్ సాయంతో జ్యోతి తన నెల వారీ ఖర్చులను భరించగలుగుతున్నారు.

''స్కాలర్‌షిప్ రానపుడు పరిస్థితి కష్టంగా ఉంటుంది. ఒక రైతు సంపాదన ఎంత తక్కువో మీకు తెలుసు. నేను నా తండ్రితో మాట్లాడాను. ఈ ఫీజుల పెంపును ఆయన జీర్ణం చేసుకోలేకపోయాడు'' అని చెప్పారు.

''నా చెల్లెలు, తమ్ముడు కూడా జేఎన్‌యూలో చదవుకోవాలని ఆశిస్తున్నారు. కానీ, ఇంతగా ఫీజులు ఇంతగా పెరిగితే వాళ్లు ఎలా చదువుకోగలరు? నేను కూడా మధ్యలో మానేసి వెళ్లిపోక తప్పేలా లేదు'' అని జ్యోతి అన్నారు.

ఈ ఫీజుల పెంపు వల్ల తను చదువులు మానేసి ఏదైనా పని చూసుకోవటమో, పెళ్లి చేసుకోవటమో చేయాల్సిన పరిస్థితి తలెత్తిందని జ్యోతి స్నేహితురాలు ఇందు తెలిపారు.

''నిర్ణీత గంటల్లో పనిచేసే ఉద్యోగం వెతుక్కోవటం కాకుండా... పరిశోధన కొనసాగించాలన్నది నా కోరిక. కానీ, ఇప్పుడు ఈ ఫీజుల పెంపుతో ఉద్యోగం కోసం వెదకటం మొదలుపెట్టాను'' అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం