రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకురాగలరా?

రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి ఇద్దరు ప్రముఖులు చేసిన ప్రకటనలతో తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో మరోసారి సినీ నటులే కూర్చోబోతున్నారు అనే చర్చ జోరందుకుంది.
నటి నుంచి నేతగా మారిన జయలలిత, రచయిత నుంచి నేత అయిన ఎం.కరుణానిధి లాంటి మాజీ ముఖ్యమంత్రుల మరణంతో రాష్ట్ర రాజకీయాల్లో కచ్చితంగా ఒక శూన్యం లాంటిది ఏర్పడింది.
జయలలిత, కరుణానిధి లేకపోవడం వల్లే కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయ పార్టీలకు తమిళనాట రాజకీయాల్లో చోటు దొరికిందనే విషయం అందరికీ తెలుసు.
ఇప్పుడు, ఈ ప్రముఖ నటులు ఇద్దరూ 2021లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామనే సంకేతాలు ఇస్తున్నారు. వారు విజయం సాధిస్తారా, లేదా అనే దాని గురించి ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చాలా ఊహాగానాలు రేగుతున్నాయి.
ఈ చర్చ వెనక అసలు కథ
నిజానికి ఇది, "పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం ఒక ఆశ్చర్యకరమైన విషయం అన్న మిత్రుడు రజనీకాంత్‌తో ఏకీభవిస్తున్నాను" అని కమల్ హాసన్ చెప్పడంతో ప్రారంభమైంది. ఇది విమర్శ కాదు, వాస్తవం అని ఆయన రజనీని వెనకేసుకొచ్చారు.
అవసరమైతే తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం తాము కలిసి పనిచేయాలనే అంశంలో తనకు, రజనీకాంత్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని కమల్ హాసన్ చెప్పారు.
అయితే, ఇక్కడ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది అలా ఎప్పుడు జరుగుతుందో వారు చెప్పలేదు. రెండోది వారి లక్ష్యం తమిళనాడు ప్రజల సంక్షేమం, మూడోది అవసరమైతే మాత్రమే అలా జరిగే అవకాశం ఉంది.
దీనిపై స్పందించిన రజనీకాంత్... "అలాంటి పరిస్థితి వస్తే, ప్రజల సంక్షేమం కోసం కమల్ హాసన్‌తో చేయి కలపాల్సి వస్తే కచ్చితంగా అలా చేస్తా" అన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ఈ కూటమి నిలవగలదా?
డీఎంకే, అన్నాడీఎంకే లాంటి రాజకీయ పార్టీల ప్రతినిధులు రజనీకాంత్, కమల్ హాసన్ ప్రణాళికలపై సందేహాలు వ్యక్తం చేశారు.
"వాళ్లు ఎలాంటి ప్రత్యేక ప్రభావం చూపించలేరు. రాజకీయ పార్టీ పెట్టడానికి, దాన్ని నడపడానికి వారికి ఏదో ఒక ఐడియాలజీ కావాలి. దానితోపాటు వారు భాష, ప్రాంతం, సమాజం, ఆర్థిక వ్యవస్థ లాంటి అంశాలపై తమ వైఖరిని స్పష్టం చేయాలి" అని డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ బీబీసీతో అన్నారు.
"తమిళనాడు ఎప్పుడూ భాష, సంస్కృతి, రాజకీయం ఆధారంగా తమ నేతలను ఎన్నుకుంది. వీళ్లు ఈ అంశాలపై ఇప్పటివరకూ గొప్పగా చేసిందేమీ లేదు. ఎలాంటి విధానం లేకుండా ఒక పార్టీని ప్రారంభిస్తే అది విఫలం అవతుంది. శివాజీ గణేశన్ పార్టీ విజయవంతం కాలేకపోవడం దానికి ఒక ఉదాహరణ" అన్నారు.
"కరుణానిధి, ఎంజీ రామచంద్రన్ లేదా జయలలిత లాంటి నేతలు విజయవంతం కావడానికి వెనక అసలు కారణం వారి ఐడియాలజీనే" అని ఆయన చెప్పారు.
ఆసక్తికరంగా అన్నాడీఎంకే ఐటీ సెల్ కన్వీనర్ సింఘై రామచంద్రన్ కూడా ఇలంగోవన్‌తో ఏకీభవించారు.
"మీరు క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఏదైనా కష్టం వస్తే తమకు ఎవరు సాయం చేస్తారు, అండగా ఎవరు ఉంటారు అనేదాన్ని బట్టి ఓటు వేస్తారు. కమల్ హాసన్, రజనీకాంత్ దగ్గర క్యాడర్, అలాంటి మద్దతు గానీ లేదు" అన్నారు.
"ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి లాంటి నేతలు ఎప్పుడూ రాజకీయాలకు సినిమాలకంటే ఎక్కువ విలువ ఇచ్చారు. నేను వారిని (కమల్, రజనీ) తోసిపుచ్చడం లేదు. కానీ, వాస్తవం ఏంటంటే, అవి తెలుసుకోవడానికి మనం సోషల్ మీడియా మద్దతుపై ఆధారపడకూడదు, క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది" అని రామచంద్రన్ చెప్పారు.
క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఒక ఉద్యమం చేస్తున్న సత్తా పంచాయత్ ప్రధాన కార్యదర్శి సెంథిల్ షణ్ముగం ఈ అంశంపై భిన్నంగా స్పందించారు.
"వారి ప్రణాళికలు డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వారిని ఆకర్షిస్తాయి. ఏ పార్టీ అయినా దానిని సవాలు చేయలేదు. అందుకే, ఈ ప్రత్యామ్నాయం కోసం ఆలోచించవచ్చు. వారి బహిరంగ ప్రకటన ఒక సాధారణ కార్యక్రమ ఏర్పాట్లు ప్రారంభించడానికి జరుగుతున్న ఒక ప్రయత్నంలా నాకు అనిపిస్తోంది" అన్నారు.
- ఐఐటీ మద్రాస్: "ఇస్లామోఫోబియా, కులతత్వం, వర్గపోరుతో మా క్యాంపస్ కంపు కొడుతోంది"
- కమల్‌హాసన్ రాజకీయ పార్టీ.. ‘ప్రజా న్యాయ కేంద్రం’
రాజకీయాలు సులభమేనా?
అయితే రాజకీయ విశ్లేషకులు దీనిని వేరేలా చూస్తున్నారు. 2019 మేలో లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన 18 అసెంబ్లీ స్థానాల ఉప-ఎన్నికల ఫలితాలు చాలా భిన్నంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అధిక స్థానాలు సాధించింది. కానీ ఉపఎన్నికల్లో రెండు పార్టీలకు సమానంగా సీట్లు వచ్చాయి.
ఈ ఫలితాలతో ఎంజీఆర్, జయలలితతో అన్నాడీఎంకే ఓట్లు అలాగే ఉన్నాయని తెలుస్తోంది. అది కాకుండా ధనబలం కూడా పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పళని స్వామి స్వయంగా రాష్ట్రంలో మోదీ వ్యతిరేకత ఉందని అన్నారు. అందుకే లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అలా వచ్చాయి అని రాజకీయ విశ్లేషకులు ఎస్ మురారి చెప్పారు.
"ఆ ఎన్నికల్లో కమల్ హాసన్ మక్కళ్ నీతి మయ్యమ్ (ఎంఎన్ఎం)కు కేవలం ఐదు శాతం ఓట్లే వచ్చాయి. వారు (కమల్, రజినీ) ఎలాంటి తేడా చూపించలేరు. కరుణానిధి, జయలలిత.. రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి వీధిలో పర్యటించారు. ప్రజలకు దగ్గరగా ఉన్నారు. కానీ, ఇప్పుడు నటులైన వీళ్లు రాజకీయాలను పార్ట్ టైం జాబ్‌లా భావిస్తున్నారు. ఇది అలా కాదు. ఇప్పటివరకూ వారి రికార్డ్ ఏమిటి? రాష్ట్రంలో వరదలు, సునామీ వచ్చినపుడు వాళ్లు ఏం చేశారు?" అని ఆయన ప్రశ్నించారు.
"కమల్ హాసన్ బీజేపీ వ్యతిరేకి, రజనీకాంత్ బీజేపీ మద్దతుదారుడు... వారిలో ఎంత తేడా ఉంది? ఇద్దరిలో ఎవరైనా ఒకరైనా మారతారా?" అన్నారు.
"కమల్ హాసన్, రజనీకాంత్లలో రాజకీయ విశ్లేషకులకు కనిపిస్తున్న అతిపెద్ద సమస్య సరైన సమయాన్ని జడ్జ్ చేయలేని వారి సామర్థ్యమే. ఇద్దరూ ఇప్పటికే ఒక ఇమేజ్, ఒక ప్రభావం చూపించి ఉండాలి. ఉప-ఎన్నికలు జరిగినపుడు వాళ్లక్కడ లేరు. నటులు స్క్రిప్ట్ ప్రకారం నడుస్తారు. ఎంజీఆర్ నటుడుగా తన పాత్ర పూర్తిగా పోషించారు. కానీ ఆయన దగ్గర ఆర్ఎం వీరప్పన్ అనే ఒక నిర్మాత ఉండేవారు. తన వెంట ఒక స్క్రిప్ట్ రైటర్, నిర్మాత, డైరెక్టర్ లేనంతవరకూ ఒక నటుడు ప్రభావం చూపించలేడు" అని రాజకీయ విశ్లేషకులు బీఆర్పీ భాస్కర్ చెప్పారు.
"రాజకీయాల్లో ఒక వారం అనేదే చాలా సుదీర్ఘ సమయం. అలాంటప్పుడు, రెండేళ్ల తర్వాత పరిస్థితి చాలా మారిపోవచ్చు" అంటున్నారు షణ్ముగం.
ఇవి కూడా చదవండి.
- రాజకీయాల్లోకి వస్తున్నా.. సొంతంగా పార్టీ పెడతా
- భారత ఆర్థిక వ్యవస్థలు సైబర్ దాడుల్ని తట్టుకోగలవా?
- మసీదు దేవుడి ఇల్లయితే, మహిళలకు తలుపులు ఎందుకు మూస్తున్నారు...
- కాలాపానీని భారత్‌లో చూపించినందుకు నేపాల్‌కు కోపం ఎందుకు?
- టిక్ టాక్ యాప్‌తో దేశ భద్రతకు ప్రమాదమా?
- పెద్ద నోట్ల రద్దు: ‘రాజకీయంగా అది మాస్టర్ స్ట్రోక్’
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- భారత నగరాలు ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనవి ఎందుకయ్యాయి
- మీ ఆహార వృథాను అరికట్టటానికి ఆరు మార్గాలు: ప్రపంచ ఆకలిని తగ్గించటంలో మీ వంతు పాత్ర పోషించండిలా...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)