మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది?

  • 22 నవంబర్ 2019
మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది Image copyright Getty Images

భారత ద్రవ్య లోటు 6.45 లక్షల కోట్లు ఉంది. అంటే, దాని అర్థం ఖర్చు చాలా ఎక్కువ. రాబడి తక్కువ. ఖర్చు, రాబడి మధ్య 6.45 లక్షల కోట్ల వ్యత్యాసం ఉంది.

ప్రభుత్వం దీన్నుంచి బయటపడ్డానికి తమ కంపెనీల ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా డబ్బులు సేకరించే పనిలో పడింది.

మోదీ క్యాబినెట్ 5 ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ఆమోదించింది. అంతకు ముందు ఆగస్టులో బీబీసీతో మాట్లాడిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ "పెట్టుబడుల ఉపసంహరణ లేదా అమ్మకాల కోసం కేంద్ర ప్రభుత్వానికి 46 కంపెనీల ఒక జాబితాను ఇచ్చామని, క్యాబినెట్ వాటిలో 24 కంపెనీల్లో పెట్టుబడుల ఉపసంహరణను ఆమోదించిందని" తెలిపారు.

అలా చేయడం ద్వారా ఈ ఏడాది 1.05 లక్షల కోట్లు సంపాదించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది.

Image copyright Getty Images

పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ అంటే?

ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణలను తరచూ ఒకేసారి ఉపయోగిస్తారు. కానీ ప్రైవేటీకరణ దీనికి భిన్నం. ఇందులో ప్రభుత్వం తన కంపెనీలోని 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ వాటాను వేరే ఏదైనా కంపెనీకి అమ్మేస్తుంది. దానివల్ల కంపెనీ మేనేజ్‌మెంట్ ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన వారి దగ్గరకు వెళ్లిపోతుంది.

పెట్టుబడుల ఉపసంహరణలో ప్రభుత్వం తమ కంపెనీలోని కొంత వాటాను ప్రైవేటు రంగం, లేదా వేరే ఏదైనా ప్రభుత్వ కంపెనీకి అమ్మేస్తుంది.

ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం అనే మూడు రకాలుగా డబ్బు పోగుచేసే ప్రయత్నం చేస్తోంది.

దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సంక్షోభంగా ఏర్పడి ఉన్న సమయంలో ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది. దేశంలో పెట్టుబడులు చాలా తక్కువగా ఉన్నాయి. స్వదేశీ కంపెనీల దగ్గర పెట్టుబడులు లేవు. వీటిలో ఎక్కువ కంపెనీలు అప్పుల్లో ఉన్నాయి. బ్యాంకుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది.

పెట్టుబడుల ఉపసంహరణ అనుకూల వాదనల ప్రకారం ప్రభుత్వ కంపెనీల కార్యకలాపాలు ప్రొఫెషనల్‌గా ఉండడం లేదు. దానివల్ల చాలా ప్రభుత్వ కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.

అందుకే వాటిని ప్రైవేటీకరణ చేయాలి. దానివల్ల వాటి కార్యకలాపాల్లో మార్పు వస్తుంది. కంపెనీ ప్రైవేటుకు అప్పగించడం వల్ల డబ్బులు వస్తుంది. దాంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు.

Image copyright Getty Images

పెట్టుబడుల ఉపసంహరణ నిజమేనా?

ఈ ఏడాది జులై 5న బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పీఎస్‌యూ)లో తమ పెట్టుబడులను 51 శాతం కంటే తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

దీన్నే సరళంగా చెప్పుకోవాలంటే ప్రభుత్వానికి 51 శాతం కంటే తక్కువ షేర్ హోల్డింగ్ ఉంటుంది. అంటే ప్రభుత్వం యాజమాన్యానికి తెర పడుతుంది.

కానీ, ప్రభుత్వం 51 శాతం డైరెక్ట్ హోల్డింగ్ అనే ప్రస్తుత విధానాన్ని మార్చాలని కూడా అనుకుంటోందని అదే ప్రకటనలో చెప్పారు. దానిని మార్చి డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ ప్రభుత్వ హోల్డింగ్ చేయాలని అనుకుంటున్నారు.

Image copyright Getty Images

ప్రభుత్వం చేతుల్లో పగ్గాలు

ఉదాహరణకు ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)ను తీసుకుంటే, ఇందులో ప్రభుత్వానికి 51.5 శాతం డైరెక్ట్ హోల్డింగ్ ఉంది. అది కాకుండా ఇందులో మరో ప్రభుత్వ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ)కి 6.5 శాతం షేర్స్ కూడా ఉన్నాయి. అంటే ఐవోసీఎల్‌లో ప్రభుత్వం ఇన్‌డైరెక్ట్ హోల్డింగ్ కూడా ఉంది.

ప్రభుత్వం ఐఓసీఎల్ నుంచి తమ డైరెక్ట్ ప్రభుత్వ హోల్డింగ్ తగ్గించినా, ఇన్‌డైరెక్ట్ హోల్డింగ్ వల్ల నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అంటే, ఎవరైనా కొత్త పెట్టుబడిదారులు వచ్చి, ఈ కంపెనీలను మార్చి అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. కానీ ఎక్కడో ఒకచోట వీటిలో ప్రభుత్వ జోక్యం ఉంటుందని అనుకోవచ్చు.

దాదాపు గత 30 ఏళ్లలో ప్రభుత్వ కంపెనీల అమ్మకాలను గమనిస్తే, అది పెట్టుబడుల ఉపసంహరణ కాదని, ఒక ప్రభుత్వ కంపెనీ వాటాలను మరో ప్రభుత్వ కంపెనీ కొనడమే అని ఆర్థిక, వ్యాపార ప్రపంచంలోని ఒక పెద్ద వర్గం మాత్రం భావిస్తున్నారు.

దానివల్ల ప్రభుత్వ బడ్జెట్ లోటు తగ్గిపోతుంది. కానీ, కంపెనీ షేర్ హోల్డింగ్‌లో పెద్ద వ్యత్యాసం రావడం గానీ, కంపెనీ పనితీరు మెరుగుపడడం గానీ ఉండదు.

Image copyright Getty Images

పెట్టుబడి ఉపసంహరణకు భయం ఎందుకు?

కానీ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కూడా ఆర్థికవ్యవస్థ లాగే మందగమనంతో ఉంది. మోదీ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో ఈ ఏడాది టార్గెట్ 16 శాతం మాత్రమే పూర్తయ్యింది. టార్గెట్ 1.06 లక్షల కోట్లలో ప్రభుత్వం సుమారు 17,365 కోట్లు మాత్రమే కూడబెట్టగలిగింది.

ఎయిర్ ఇండియాను అమ్మేయడానికి కూడా ప్రభుత్వం పెట్టుబడిదారులను వెతుకుతోంది. ఇది ఆలస్యం అవుతోంది. ఎందుకంటే, ప్రభుత్వం మొదట ఇందులో 24 శాతం హోల్డింగ్ ఉంచుకోవాలని చూసింది. కానీ ఇప్పుడు పూర్తిగా అమ్మేసేందుకు సిద్ధంగా ఉంది.

పెట్టుబడుల మందగమనంతో దీనిపట్ల వ్యతిరేకత కూడా వస్తోంది. ఎందుకంటే అలా చేయడం వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది.

Image copyright Getty Images

ఆరెస్సెస్‌ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ కంపెనీలకు అమ్మడాన్ని వ్యతిరేకిస్తోంది.

ఎందుకంటే, ప్రైవేట్ కంపెనీ ఎవరినైనా ఉద్యోగాల నుంచి తొలగించగలదు. అయితే, ఆర్థికవేత్త వివేక్ కౌల్ మాత్రం "ఉద్యోగాల నుంచి తొలగించినంత మాత్రాన ఉద్యోగులు రోడ్డుపైకి రారు. ఉద్యోగులకు వీఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) ఇవ్వాల్సి ఉంటుంది. వారికి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ కూడా ఇవ్వాలి" అన్నారు.

గతంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం 1999 నుంచి 2004 మధ్య ద్రవ్య లోటు తగ్గించడానికి పెట్టుబడుల ఉపసంహరణ విధానం అమలుచేసింది. అప్పుడు దీనికోసం ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను కూడా ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ కూడా ఇలాంటి కసరత్తులు చేసింది. కానీ, ప్రస్తుతం అది ఎన్డీయే ప్రభుత్వం చర్యలను విమర్శిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ అగ్నిప్రమాదం: ‘సమయానికి వెళ్లా, ముగ్గుర్ని కాపాడా.. కానీ, సోదరుడిని కాపాడుకోలేకపోయా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీకి 12 స్థానాల్లో ఆధిక్యం

హైదరాబాద్ 'ఎన్‌కౌంటర్‌' మీద సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌.. ఏ తుపాకీతో కాల్చారనే అంశాలపై ఎన్‌హెచ్ఆర్‌సీ దృష్టి

'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - మాజీ ప్రధాని కుమార్తె

‘ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్‌కౌంటర్ చేయడం సాధ్యమేనా’

నల్లజాతి బ్రిటన్ విద్యార్థులకు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తొలిసారిగా స్కాలర్‌షిప్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’

దిల్లీ: స్కూలు బ్యాగుల పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం... 43 మంది మృతి