వీడియో: టీచర్లు ఉన్నారు బడిలేదు... చెట్టు కిందే చదువులు

ఓ చేతిలో గోనెసంచి, మరో చేతిలో పుస్తకాల బ్యాగు పట్టుకుని ఈ చిన్నారులంతా వెళ్లేది ఈ పాఠశాలకే. మరి, విద్యార్థులు పొలాల్లోకి వెల్తున్నారేంటీ అనుకుంటున్నారా? అసలు మతలబు ఇక్కడే ఉంది.

ఈ ఊరిలో స్కూలు భవనం లేకపోవడంతో ఈ విద్యార్థులంతా పొలాల మధ్యలో ఉండే చెట్ల కిందే చదువుకుంటున్నారు. మూడేళ్లుగా ఈ చెట్లకిందే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సి వస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా మడ్డువలస రిజర్వాయర్ సమీపంలో ఉన్న దేవకీవాడలో పరిస్థితి ఇది.

పొలాల్లో స్కూలు

శ్రీకాకుళం జిల్లాలో మడ్డువలస జలాశయం నిర్మాణంతో కొన్ని గ్రామాలు ముంపునకు గురవ్వడంతో అక్కడి ప్రజలు నిర్వాసితులయ్యారు. వారిలో కొందరు నివాసం ఉంటున్న ఒక నిర్వాసిత గ్రామం దేవకీవాడ.

2016లో ఈ ఊరికి అప్పటి ప్రభుత్వం పాఠశాలను మంజూరు చేసింది. దానికి పునాదులు కూడా వేసారు. తరువాత వివిధ కారణాలతో భవన నిర్మాణం పూర్తికాకుండా మధ్యలోనే ఆగిపోయింది.

దేవకీవాడలో 35 మంది విద్యార్ధులున్నారు. వారికి పాఠాలు చెప్పేందుకు ఇద్దరు ఉఫాధ్యాయులు వస్తున్నారు. కానీ, పాఠశాల భవనం లేదు. దాంతో కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉన్న ఇళ్లల్లో ఉపాధ్యాయులు పాఠాలు చెప్పారు. ఆ ఇంటి యజమాని ఇళ్లు ఖాళీ చేయమనగానే చేసేదేమీలేక అక్కడి నుంచి మరోచోటకు వెళ్లాల్సి వచ్చేది.

ఇలా జరుగుతున్న క్రమంలో ఎందుకొచ్చిన ఇబ్బందిలే అని ఆలోచించిన ఉపాధ్యాయులు పొలాల్లో ఇలా చెట్ల కింద విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం ప్రారంభించారు.

విద్యార్థులు నేలపైనే బస్తాలు కూర్చుంటున్నారు. చీమలు కుడుతుంటే వాటిని చంపుకుంటూ పాఠాలు వింటున్నారు. వాన వచ్చిందంటే ఇంటికి పరుగులు పెట్టాల్సిందే.

రోజులు నెలలు కాదు, మూడు సంవత్సరాలుగా వీళ్లు ఇవే ఇబ్బందులు పడుతున్నారు.

ఈ గ్రామంలో ఒకప్పుడు 18 మంది విద్యార్దులే ఉండేవారు. ఇక్కడ ఒకటవ తరగతి నుంచి అయిదు వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు కృషివల్ల నేడు ఆ సంఖ్య 35కి పెరిగింది.

అయినా, పక్కా భవనం లేకపోవడంతో వాళ్లంతా ఊరికి సమీపంలో ఉన్న చెట్ల కిందే చదువుకోవాల్సి వస్తోంది.

ఆ చెట్ల కిందకు వెళ్లాలంటే ఊరు దాటిన వెంటనే పొలాల మధ్యలోంచి ఓ పెద్ద బావి పక్క నుంచే నడవాలి. ఆ పక్కనే ఉన్న పెద్ద చెరువును దాటి వెల్లాలి. పిల్లలు బావి వైపు, చెరువు వైపు వెల్లకుండా చూసేందుకు రోజూ కాపలాగా పెద్దవాళ్లు రెండుపూటలా ఉండాల్సి వస్తోంది.

బీబీసీ ఈ గ్రామాన్ని సందర్శించినప్పుడు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చలికాలం కావడంతో తేళ్లు, పాములు సంచరిస్తాయోమోనని భయాందోళన చెందుతున్నట్లు వారు చెప్పారు.

మేము 'చెట్టు కింది స్కూల్'‌ను సందర్శించినప్పుడు ఓ వైపు ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నారు. అదే సమయంలో తమను కుడుతున్న చీమలను చిన్నారులు చంపుతున్న దృశ్యం కనిపించింది.

ఫొటో క్యాప్షన్,

పాఠశాల భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది

పాఠశాల నిర్మాణంలోనూ రాజకీయాలా?

దేవకీవాడలో పాఠశాల భవనం నిర్మాణం పూర్తి కాకపోవడానికి రాజకీయాలే కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మడ్డువలస రిజర్వాయర్ నిర్వాసిత గ్రామమైన ఈ ఊరిలో రాజకీయ చైతన్యం ఎక్కువ.

దేవకీవాడ ఊరు ఏర్పడినప్పుడు 500 కుటుంబాలు ఉండేవి. ఇందులో 300 కుటుంబాలు టీడీపీకి, మిగతా 200 కుటుంబాలు వైసీపీకి అనుకూలంగా ఉండేవి. అయితే, వైసీపీకి అనుకూలంగా ఉన్నవారు కుటుంబాల వారు కొత్తగా దేవకీవాడ నిర్వాసిత కాలనీ ఏర్పాటు చేసుకున్నారు.

ఈ క్రమంలో విద్యార్దులు సంఖ్య ఎక్కువుగా ఉండడంతో ఈ కాలనీకి 2016లో ప్రభుత్వం ఓ పాఠశాలను మంజూరు చేసింది కానీ నిధులివ్వలేదు.

టీడీపీ అధికారంలో ఉండడంతో, వైసీపీ అనుకూల కుటుంబాలతో ఏర్పడిన దేవకీవాడ కాలనీలో కట్టాల్సిన పాఠశాల భవనానికి రాజకీయ కారణాల వల్లే బిల్లులు రాలేదని స్థానికులు చెప్పారు.

''ఇప్పుడు 'నాడు- నేడు' అనే కార్యక్రమంలో భాగంగా పాఠశాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. మా ఊరిలో అసలు స్కూలే లేదు, ఇక మౌలిక వసతులు ఎప్పుడు కల్పిస్తారు? వైసీపీ ప్రభుత్వం వచ్చినా ఇప్పటికీ మా బడికి నిధులు మంజూరు చేయడంలేదు. అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదు" అని గ్రామస్థుడు శివకుమార్ అన్నారు.

''నా పిల్లలు ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు. వాళ్ల చదువు కంటే పిల్లల్ని కాపాడుకోవడానికి మాకు టైం సరిపోతోంది. రోజూ రెండు పూటలా ఇక్కడికొచ్చి మా పిల్లలు చెరువు వైపు వెళ్లకుండా చూసుకుంటాను. మా ఊరిలో తొందరగా పాఠశాల భవనాన్ని నిర్మిస్తే మా పిల్లలకు కష్టాలు పోతాయి" అంటూ స్థానిక మహిళ అక్కమ్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

చీమలు, దోమలు కుడుతున్నాయి

"మాకు చదువుకోవాలని ఉంది. స్కూల్ భవనం లేకపోవడంతో ఖాళీగా ఉన్న ఇళ్ళల్లో టీచర్లు చదువు చెప్తారు. ఖాళీ ఇళ్లు లేనప్పుడు పొలాల్లో ఇలా చెట్లకిందికి వస్తాం. పొలాల్లో నుంచి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను బాగా చదువుకొని పోలీస్ ఉద్యోగం చేయాలనుకుంటున్నా. కానీ ఇలా అయితే ఎలా చదువుకుంటాం. ఈ చెట్లకింద నేలపై కూర్చుని పాఠాలు వింటుంటే కింద చీమలు, పైన దోమలు కుడుతున్నాయి" అని నాలుగో తరగతి విద్యార్థి భానుప్రసాద్ వివరించారు.

కనీసం రేకుల షెడ్డు అయినా వేయండి: ప్రధానోపాధ్యాయుడు

పాఠశాల భవనం లేక ఊరిలో ఖాళీగా ఉన్న ఇంటి యజమానిని బతిమిలాడి బడి నడపాల్సి వస్తోంది. కొన్ని సార్లు ఖాళీ ఇల్లు ఉండడం లేదు. దాంతో ఊరికి దూరంగా ఉన్న పొలాల్లో ఈ చెట్ల కింద చదువు చెప్తున్నాం. అధికారులకు, గ్రామ నాయకులకు చాలాసార్లు చెప్పాం. కనీసం రేకుల షెడ్ అయినా నిర్మించాలని కోరాం. ఎవరూ ముందుకు రాలేదు. అధికారులు వచ్చి చూసి వెల్లిపోతున్నారు తప్ప భవన నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు పొలాల్లో చెట్ల కింద స్కూల్ నడుపుతున్నాం" అని ప్రధానోపాధ్యాయుడు పి.మురళి చెప్పారు.

తాత్కాలిక పరిష్కారమైనా చూపిస్తాం: డీఈవో

"దేవకీవాడ కాలనీ పాఠశాల గురించి మండల విద్యాశాఖ అధికారులును ప్రతిపాదనలు అడిగాం. సర్వశిక్షా అభియాన్ ద్వారా తాత్కాలిక ఏర్పాట్లు చేసేలా చూస్తాం. 'నాడు- నేడు' కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెల్తాం. రేకుల షెడ్ అయినా నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకుంటాను. త్వరలోనే ఆ స్కూల్‌ను సందర్శిస్తాను. కలెక్టర్ సాయంతో పరిష్కారం చూపుతాం" అని డీఈవో చంద్రకళ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)