విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు.. ఈ ప్రాంతమే ఎందుకంత అనుకూలం?

  • 30 నవంబర్ 2019
స్ట్రాబెర్రీ తోటలో మహిళ

స్ట్రాబెర్రీ సాగు విశాఖ ఏజెన్సీలో జోరందుకుంది. గతంలో ఇద్దరు ముగ్గురు రైతులు మాత్రమే స్ట్రాబెర్రీస్ పండించేవారు. లాభాలు ఎక్కువగా ఉండడంతో మరింత మంది రైతులు స్ట్రాబెర్రీ సాగులోకి దిగుతున్నారు.

విటమిన్ సీ, పోషక విలువలు స్ట్రాబెర్రీస్‌లో అధికంగా ఉంటాయి. సమశీతోష్ణ స్థితి ఉష్ణోగ్రతల్లో స్ట్రాబెర్రీస్ బాగా పండుతాయి. అంటే ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 25 డిగ్రీల మధ్య ఉండాలి.

హరియాణ, మహారాష్ట్రల్లో పాలీ హౌస్ తోటల్లో వీటిని సాగు చేస్తున్నారు. పంజాబ్, కర్నాటకలో కొద్ది ప్రాంతాల్లో ఇవి పండిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో 2007 నుంచి రైతులు సాగు చేస్తున్నారు. పూర్తి ఉద్యాన పంట కావడంతో ఎంతో జాగ్రత్తగా సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు.

ఎలా సాగు చేస్తారు?

వీటి కోసం అడుగున్నర ఎత్తులో 'బెడ్' నిర్మిస్తారు. అంటే మట్టిని నేల కంటే కాస్త ఎత్తుగా పోస్తారు. ఒక్కో బెడ్డులో రెండు వరసల్లో జిగ్ జాగ్ క్రమంలో మొక్కలు వేస్తారు. బిందు సేద్యం(డ్రిప్ సిస్టం)తో సేంద్రీయ, జీవ రసాయనాలను అందిస్తారు.

సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో విడతలుగా మొక్కలు వేస్తారు. 'ఫ్రూట్' దశలో 20 నుంచి 25 డిగ్రీల మధ్య, 'ఫ్లవరింగ్' దశలో 15 నుంచి 20 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటేనే నాణ్యమైన స్ట్రాబెర్రీ వస్తుంది.

మొక్క నాటిన 45 రోజుల నుంచి పంట చేతికొస్తుంది.

విశాఖ ఏజెన్సీలో చల్లటి వాతావారణం ఉండే అరకు, పాడేరు, చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ సాగవుతోంది.

'రెండో సంవత్సరం నుంచి నష్టమే రాలేదు'

స్ట్రాబెర్రీ సాగు చేసే గిరిజన రైతు కుశలవుడు బీబీసీతో మాట్లాడుతూ- స్నేహితుడి ద్వారా తెలుసుకొని మొక్కలను తెప్పించి 2007లో ప్రయోగాత్మకంగా వేశానని, హెక్టారుకు ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చయిందని, కానీ అప్పుడు మొక్క పూర్తిగా పాడైపోయిందని చెప్పారు.

"రెండో సంవత్సరం మరో రకాన్ని తీసుకొని సాగు చేశాను. గతంలో చేసిన తప్పులు చెయ్యకుండా సాగు మొదలు పెట్టాను. పాతిక వేలు లాభం వచ్చింది. ఆ తర్వాతి నుంచి నష్టం రాలేదు" అని ఆయన తను అనుభవాన్ని పంచుకున్నారు.

''మహాబలేశ్వరం స్ట్రాబెర్రీలు చాలా పుల్లగా ఉంటాయి. మన పళ్లను ఇక్రిశాట్ వాళ్లతో పరీక్ష చేయించాం. రుచి బాగుందని తేలాకే మార్కెట్లోకి వదిలాం. దీనివల్ల మా గిరిజనులకు ఏడాదిపాటు పని దొరుకుతోంది. ఒక్కో స్ట్రాబెర్రీ ఫాంలో రోజూ 20 నుంచి 30 మంది పనిచేస్తున్నారు. మాతోనే ఉండి కొన్ని కుటుంబాలు పనిచేసుకుంటున్నాయి" అని కుశలవుడు వివరించారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: విశాఖ ఏజెన్సీలో స్ట్రాబెర్రీ సాగు

నాలుగు నెలలపాటు కాపు

పంట చేతికి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలలపాటు కాపు కాస్తూనే ఉంటుంది. ఒక్కో మొక్కకు 500 గ్రాముల పళ్లు వస్తాయి. సగటున హెక్టారుకు మూడు నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి ఉంటుంది.

విశాఖ ఏజెన్సీలో గతంలో ఎక్కువగా పర్యాటకులే ఈ పండ్లు కొనేవాళ్లు. ఇప్పుడు రైతులు కొన్ని సూపర్ మార్కెట్లతో ఒప్పందాలు చేసుకొని అమ్ముతున్నారు.

స్ట్రాబెర్రీ నిల్వ చెయ్యలేం. కొన్న రెండు మూడు రోజుల్లోనే వాడేయాలి. లేకపోతే పాడవుతుంది. విక్రయం కాకుండా మిగిలిపోయే పండ్లతో 'జాం' తయారు చేస్తున్నారు రైతులు. ఇది అదనపు ఆదాయం.

మైదాన ప్రాంతాల్లోనూ సాగు

స్ట్రాబెర్రీ స్థానిక గిరిజన రైతులే కాకుండా మైదాన ప్రాంత రైతులూ సాగు చేస్తున్నారు.

భాస్కరరాజు అనే రైతు హైదరాబాద్ నుంచి వచ్చి విశాఖపట్నం జిల్లా రాజుపాకలలో నాలుగు ఎకరాలు లీజుకు తీసుకొని స్థానిక రైతుల సాయంతో సాగు చేస్తున్నారు.

'మార్కెటింగ్ సరిగా లేదు'

"గతంలో హైదరాబాద్ పరిసరాల్లో నిమ్మగడ్డి నుంచి ఆయిల్ తీసే వాడిని. మూడేళ్లుగా ఇక్కడ స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నా. ఈసారి 50 వేల మొక్కలు వేశాను. గతంలో మొక్కకు కేజీ స్ర్టాబెర్రీలు తీశాం. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడటం వల్ల అర కేజీయే వస్తుంది. పుణె తర్వాత ఇదే అనుకూలమైన వాతావరణం. మార్కెటింగ్ సరిగా లేదు. ఏసీ సదుపాయమున్న వ్యాన్లుంటే రాజమండ్రి, కాకినాడ, విజయవాడకు సరఫరా చెయ్యొచ్చు" అని ఆయన బీబీసీతో చెప్పారు.

తమ పొలాల్లో రోజుకు 20 నుంచి 25 మంది పనిచేస్తున్నారని, సంవత్సరమంతా పని ఉంటుందని భాస్కరరాజు తెలిపారు. బ్రకోలి, జుకుని, మిరప లాంటి అంతర పంటలు వేస్తున్నామని వివరించారు.

''రెండేళ్లుగా బెడ్డింగ్ లు, మంచింగ్ (మట్టి బెడ్ మీద వేసే ప్లాస్టిక్ షీట్) లాంటి వాటికి ప్రభుత్వం సహకారం అందిస్తామని చెబుతోందిగాని మాకు ఫండింగ్ రావడం లేదు. ప్రభుత్వం నుంచి రాయితీ వస్తుందని చెబుతున్నారు. గతంలో చిరుధాన్యాలు పంపించేవాళ్లం. ఇప్పుడు వాటితో పోలిస్తే ఈ పంట త్వరగా చేతికి వస్తుంది. కాబట్టి మాకు మెరుగ్గానే ఉంది. పురుగులు పట్టకుండా పంట బెడ్లను ఆనుకొని బంతి, గులాబీ, పొద్దుతిరుగుడు లాంటి మొక్కలు వేస్తున్నాం. దీనివల్ల పంటను నాశనం చేసే పురుగులు పూల వైపు మళ్లుతాయి'' అని భాస్కరరాజు చెప్పారు.

మెలకువతో చేస్తే లాభదాయకమే

స్ట్రాబెర్రీ సాగు మెలకువతో చేస్తే లాభదాయకమే. పైగా పెట్టుబడి పెట్టిన రెండు నెలల్లోనే ఆదాయం రావడం మొదలవుతుంది.

పెట్టుబడి లక్షల్లో ఉండటంతో పెద్ద రైతులే స్ట్రాబెర్రీ వైపు మళ్లుతున్నారు.

స్ట్రాబెర్రీ సాగుకు మనుషుల అవసరం ఎక్కువ కావడంతో ఉపాధి కూడా బాగానే దొరుకుతోంది.

ఖర్చు తగ్గించుకోవచ్చు

విశాఖ ఏజెన్సీ వాతావరణం అనేక పంటలకు అనుకూలంగా ఉంటుందని, అందువల్లే ఇక్కడ వినూత్న పంటలు పండుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

''అరకు, అనంతగిరి, పాడేరు, చింతపల్లిలో స్ట్రాబెర్రీ ఎక్కువగా సాగు చేస్తున్నారు. సుమారు పాతిక మంది రైతులు వందకు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్నారు. స్ట్రాబెర్రీకి 'ఫ్రూట్' దశలో 20 నుంచి 25 డిగ్రీలు, 'ఫ్లవరింగ్' దశలో 15 నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత ఉండాలి. అలాంటి వాతావరణమే విశాఖ ఏజెన్సీలో ఉంది" అని చింతపల్లి ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శివకుమార్.

ఆర్గానిక్ పద్దతుల్లో సాగు చేస్తున్నారని, తెగుళ్లు రాకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు చెబుతున్నామని ఆయన తెలిపారు.

విశాఖ ఏజెన్సీలో కాఫీ పంటలో అంతరపంటగా మిరియాలు ఎక్కువగా సాగు చేస్తారని, అది చేతికి రావడానికి రెండు, మూడేళ్లు పడుతుందని, అలా కాకుండా స్ట్రాబెర్రీ అయితే వేసిన రెండు నెలల నుంచే ఆదాయం వస్తుందని శివకుమార్ చెప్పారు.

కాఫీ పంటకు స్ట్రాబెర్రీ పంటకు పోటీ ఏమీ ఉండదని, కాఫీ వర్షాభావాన్ని తట్టుకుంటుందని, స్ట్రాబెర్రీకి నీరు కావాల్సిందేనని, అలా అని నీరు ఎక్కువైపోతే పాడైపోతాయని శివకుమార్ తెలిపారు.

మెత్తటినేలలు కావడంతో స్ట్రాబెర్రీకి ఏజెన్సీ అనుకూలంగా ఉంటుందని, గడిచిన సంవత్సరం మొక్కల నుంచి బ్రీడింగ్ చేయగలిగితే ఖర్చు తగ్గుతుందని ఆయన వివరించారు.

స్ట్రాబెర్రీ సాగును మరింత ప్రోత్సహిస్తామనీ, రాయితీలు అందేలా చూస్తామని సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీ(ఐటీడీఏ) అధికారులు చెబుతున్నారు.

''ఈ సంవత్సరం పంట విస్తీర్ణం బాగా పెరిగింది. పర్యాటకులకు ఎక్కువగా అమ్మడం వల్ల ప్రభుత్వ పరంగా చర్యలు తక్కువగానే ఉన్నాయి. స్ట్రాబెర్రీ సాగు చాలా ఖర్చుతో కూడుకుంది. అన్ని ఖర్చులతో కలిపి హెక్టారుకు 10 లక్షల రూపాయల వరకు పెట్టాలి. సబ్సిడీ ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. మంచి ఆదాయం వస్తుందని బిందు సేద్యానికి 100 శాతం రాయితీ అందిస్తున్నాం. 'షీట్స్'కు సబ్సిడీ ఇస్తున్నాం. పాడేరు ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రైతులకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించాం" అని పాడేరు ఐటీడీఏ వ్యవసాయ అధికారి ప్రభాకరరావు బీబీసీతో చెప్పారు.

మార్కెట్ అవసరాలను గుర్తించామని, రైతులు- మార్కెట్ మధ్య అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని, మున్ముందు మరింతగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగించిన ప్రభుత్వం.. SEC పదవీకాలం కుదింపు, ఇకపై హైకోర్టు జడ్జిగా పనిచేసినవారికే పదవి

కరోనావైరస్‌-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా.. ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి

కరోనావైరస్: చేతులు కడుక్కోవడం, దాని వెనుక చరిత్ర

కరోనావైరస్ లాక్‌డౌన్: సంక్షోభం దిశగా చిన్న-మధ్య తరహా పరిశ్రమలు... దిక్కుతోచని స్థితిలో లక్షలాది కార్మికులు

కరోనావైరస్: లాక్‌డౌన్‌ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలి - కేసీఆర్

కరోనా లాక్‌డౌన్: విపరీతంగా బయటపడుతున్న ఎలుకలు.. వీటిని నివారించడం ఎలా

కరోనావైరస్‌తో కరువు బారిన పడనున్న 50 కోట్ల ప్రజలు - ఐక్య రాజ్య సమితి నివేదిక

రువాండా మారణకాండకు 26 ఏళ్లు: వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని ఊచకోత కోశారు.. బయటపడ్డ వారు ఇప్పుడు ఎలా ఉన్నారు

కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది