శ్రీజ డెయిరీ: ‘పూర్తిగా మహిళలతో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సంస్థ’

  • 4 డిసెంబర్ 2019
శ్రీజ డైరీ మహిళలు

చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం చిట్టెం రెడ్డిగారి పల్లె గ్రామానికి చెందిన ఉషారాణికి ఇది వరకు సొంత భూమి ఏమీ లేదు. ఒక ఆవు ఉండేది. ప్రైవేటు డెయిరీలకు పాలు పోస్తూ ఇతర పనులు చేసుకునేది. కానీ, శ్రీజ డెయిరీ ఆమె జీవితంలో పెద్ద మార్పే తెచ్చింది. ఇప్పుడామె నాలుగు ఆవులతో పాటూ ఎకరం పొలానికి యజమానురాలు.

"మాకు ఆస్తులు లేవు. మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని చేస్తుండే వాళ్లం. పాలతో వచ్చే డబ్బు పిల్లల చదువులకు, ఇంటి ఖర్చులకు పోనూ పొదుపు చేసి ఒక ఆవును, రెండో ఆవు.. అలా పెంచుకుంటూ నాలుగు ఆవులను కొన్నాం. ఆ డబ్బుతోనే పొలం కొన్నాం. బోర్ వేశాం. ఇప్పుడు వరి, టమాట వంటి పంటలతో పాటూ పశుగ్రాసం కూడా వేసుకుంటున్నాం. సాగు, పాడి రెండూ నేనూ, నా భర్తా కలిపి చేసుకుంటున్నాం. ప్రైవేటు డెయిరీల్లో రేటు మారుతుంది. ఇక్కడ మారదు. ఇక్కడ పాలకు నెలనెలా 25 నుంచి 35 వేల దాకా వస్తుంది. ఆ డబ్బునే వ్యవసాయంలో పెట్టుబడిగా వాడుతున్నాం" అంటూ తను ఎదిగిన క్రమాన్ని బీబీసీతో పంచుకున్నారు ఉషారాణి.

చిత్రం శీర్షిక ఉషారాణి

ఉషారాణి మాత్రమే కాదు, చిత్తూరు ప్రాంతంలో అనేక మంది మహిళలు ఇప్పుడు పాల వ్యాపారం చేస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. దశాబ్దాలుగా చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తికి పేరుగాంచినప్పటికీ, తాజా క్షీర విప్లవం స్థానిక మహిళల జీవన పరిస్థితులను మార్చేసిందనే చెప్పాలి.

చంద్రగిరి మండలం తిరుమణ్యం గ్రామానికి చెందిన హేమలతకు ఆరేళ్ల క్రితం వరకూ రెండు ఆవులు ఉండేవి. ఇంటి అవసరాలకు పాలు సరిపోను, మిగిలితే ప్రైవేటు డెయిరీలకు పోసేవారు. భర్తది ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. కానీ, ఇప్పుడు ఆమె దగ్గర పది ఆవులు ఉన్నాయి. భర్త ఉద్యోగం మానేసి పాడి చూసుకుంటున్నారు.

"ఇంతకుముందు వ్యవసాయం చేసేవారం. ఆయన చిన్న ఉద్యోగానికి వెళ్లేవారు. ఒక ఆవు పాలు ప్రైవేటు డెయిరీలకు వేసేవారం. 2016 నుంచి శ్రీజ డెయిరీకి పోస్తున్నాం. అప్పటి నుంచి డబ్బు నేరుగా మా బ్యాంకు ఖాతోలో పడిపోతుంది. అప్పట్లో రెండు ఆవులు ఉండేవి. ఆ డబ్బు పొదుపు చేసి ఇప్పుడు పది ఆవులు కొన్నాం. పాత డెయిరీల్లో లీటర్ల కొలత ఉండేది. వీళ్లు మెషీన్ మీద తూకం వేస్తున్నారు. వాళ్లకూ వీళ్లకూ రేటు రెండు మూడు రూపాయల తేడా ఉంది. ఆయన నెలకు సంపాదించేది ఇక్కడ 15 రోజులకే వస్తోంది. అందుకే ఆయన కూడా ఉద్యోగం మానేసి, ఇద్దరం కలసి డెయిరీ పెట్టాలని అనుకుంటున్నాం. ఇప్పుడు నెలకు 20-30 వేల రూపాయల జీతంతో సమానంగా వస్తోంది" అంటూ అని హేమలత వివరించారు.

కానీ, ఈ విషయం వినగానే ఎవరికైనా ఒక అనుమానం వస్తుంది. పాలు ఏ డెయిరీకి పోసినా ఒకటే కదా, శ్రీజ డెయిరీకి పాలు పోస్తే భూములు కొనేంత, జీవితాలు మారేంత డబ్బు వచ్చేస్తుందా? అని..

ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే చిత్తూరు పాల చరిత్ర తెలియాలి.

చిత్తూరు డెయిరీ నుంచి శ్రీజ కంపెనీ వరకూ

చిత్తూరు జిల్లాలో పాల ఉత్పత్తి ఎక్కువ. స్థానిక మహిళలు పాడి పశువుల పెంపకంలో చురుగ్గా ఉంటారు. పాలు ఇక్కడ ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఒకప్పుడు కోపరేటివ్ వ్యవస్థలో చిత్తూరు డెయిరీ ఇక్కడ బలంగా ఉండేది. అది మూత పడింది. తరువాత ప్రైవేటు ఏజెంట్లు, ప్రైవేటు డెయిరీలు వచ్చాయి. ప్రైవేటు డెయిరీల సమయంలో రేట్ల విషయంలో, కొలతల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని స్థానికులు చెప్పారు.

2006 ప్రాంతంలో ఒక దశలో లీటర్ పాలకు రైతులకు 6 రూపాయలే ఇచ్చిన రోజులున్నాయి. అప్పట్లో జాతీయ పాడి అభివృద్ధి సంస్థ (ఎన్డీడీబీ) ఛైర్మన్‌గా ఉన్న కురియన్‌కి స్థానిక రైతులు తమ పరిస్థితి వివరిస్తూ అర్జీ ఇచ్చారు.

ఆ పరిస్థితుల్లో ఎన్డీడీబీ ఇక్కడ బాలాజీ డెయిరీని నెలకొల్పింది. దాన్ని మదర్ డెయిరీ తీసుకుంది. (మదర్ డెయిరీ కూడా ఎన్డీడీబీ ఏర్పాటు చేసిన సంస్థే - దిల్లీలో పాలు అమ్ముతుంటుంది). కొంత కాలం పాటూ బాలాజీ డెయిరీ కార్యకలాపాలు నిర్వహించింది. బాలాజీ డెయిరీ 2014 వరకూ ఉంది.

అయితే, ఎన్డీడీబీ సొంతంగా డెయిరీ వ్యాపారంలోకి రావాలనుకోవడం లేదు. కానీ, రైతులకే సొంతమైన, రైతులచే నడపబడే సంస్థ ఒకటి ఉండాలనుకుంది. 90వ దశకం నుంచీ కోపరేటివ్ వ్యవస్థ - అంటే సహకార సంఘాలన్నీ దేశవ్యాప్తంగా దెబ్బతింటూ వచ్చాయి. మితిమీరిన రాజకీయ జోక్యం ఆ వ్యవస్థలను దెబ్బతీసింది. దానికి తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నో ఉదాహరణలున్నాయి. దేశవ్యాప్తంగా కుప్పుకూలుతున్న సహాకార సంస్థల ప్రభావం పాల ఉత్పత్తిపై పడింది.

మరోవైపు 1991 సంస్కరణల తరువాత ప్రైవేటు కంపెనీలు డెయిరీ రంగంలోకి ప్రవేశించాయి. వారు ఉత్పత్తిదారులను ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. వీటిని ఆపాలంటే కొత్త వ్యవస్థ ఉండాలని ఎన్డీడీబీ ఆలోచించింది. ఆ ఆలోచన ఒక కొత్తరకం వ్యవస్థకు దారి చూపింది.

"అప్పటి ఎన్డీడీబీ చైర్మన్ పిజె కురియన్ ఆలోచనలతో వైకె. అలగ్ కమిటీ ఎన్నో దేశాల్లో, ఎన్నో రకాల సంస్థలను అధ్యయనం చేసి ఉత్పత్తిదారుల సంస్థ (ప్రొడ్యూసర్స్ కంపెనీ) అనే ఫార్మాట్‌ను ముందుకు తెచ్చింది. ఆ ఫార్మాట్‌ను ప్రవేశపెట్టాలని ఎన్డీడీబీ 1999లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. 2003లో పార్లమెంటు చట్టం చేసింది. కంపెనీల చట్టం చాప్టర్- 13లో దీని గురించి పేర్కొన్నారు. మరోవైపు ఉత్పత్తిదారుల సంస్థ విధి విధానాలు ఎలా ఉండాలి? ఎలా ఉంటే రైతులకు మేలు జరుగుతుందనే దానిపై ఎన్డీడీబీ ఎంతో లోతైన అధ్యయనం జరిపింది. ఎంతో పరిశోధన తరువాత 2010-11 నాటికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో దేశవ్యాప్తంగా ఎన్డీడీబీ మూడు కంపెనీలను ప్రారంభించింది. వాటిలో శ్రీజ ఒకటి. మిగిలిన కంపెనీల్లో ఆడ, మగ ఇద్దరూ సభ్యులుగా ఉంటారు. శ్రీజను మహిళలకే ప్రత్యేకంగా ఉంచారు" అని శ్రీజ ప్రస్థానం ప్రారంభమైన విధానాన్ని జయతీర్థ వివరించారు. ఆయన ఇప్పుడు శ్రీజ కంపెనీ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్.

ప్రొడ్యూసర్స్ కంపెనీ అనేది ఒక రకమైన వ్యాపార సంస్థ. ప్రొప్రైటర్, పార్టనర్, ప్రైవేట్ లిమిటెడ్ ఎలానో ప్రొడ్యూసర్స్ కంపెనీ అలానే. ఉత్పత్తి చేసే వారే భాగస్వాములుగా, వాటాదార్లుగా ఉంటారు. కానీ, యాజమాన్యం మాత్రం పూర్తిగా కార్పొరేట్ తరహాలో ఉంటుంది. అంటే సహకార స్ఫూర్తితో, కార్పొరేట్ యాజమాన్యంతో ఉండేదే ప్రొడ్యూసర్ కంపెనీ. కంపెనీ చట్టాలకు లోబడి స్వతంత్రంగా పనిచేస్తుంది.

27 మంది నుంచి 72,000 వేలకు

ఇప్పుడు మొత్తం మహిళలే ఉన్న ప్రపంచంలోని అతి పెద్ద ప్రొడ్యూసర్స్ కంపెనీ శ్రీజ అని చెబుతోంది ఆ సంస్థ యాజమాన్యం.

శ్రీజ ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. ప్రారంభంలో శ్రీజలో సభ్యత్వం కోసం మహిళలను ఒప్పించడం కష్టమైందని సంస్థ చైర్మన్ లావణ్య చెప్పారు. లావణ్య కూడా శ్రీజకు పాలుపోసే మహిళే. స్వతంత్ర్య పానెల్ ద్వారా ఆమె సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

"మొదట్లో శ్రీజ కంపెనీ సభ్యత్వం కోసం మహిళలను ఒప్పించడం కష్టమైంది. మగవారూ, ఆడవారూ ఇద్దరూ ఒప్పుకోలేదు. ఖాతా నాకు ఎందుకు నా భర్త ఉన్నారు కదా, ఆయన ఉండగా మాకెందుకు? అని మహిళలు అనేవారు. సిగ్గుపడేవారు. కానీ, కొందరు ఖాతాలు తీసుకున్న తరువాత, వారికి వచ్చే లాభాలు చూసి, మిగతా వాళ్లు కూడా పాస్ పుస్తకం, ఆధార్ కార్డులు తీసుకుని మేము కూడా చేరుతామంటూ వచ్చేస్తున్నారు" అని లావణ్య వివరించారు.

"2014లో 27 మందితో ప్రారంభమై నాలుగేళ్లలో 72 వేల మందికి పైగా మహిళా సభ్యులున్న సంస్థగా అవతరించింది శ్రీజ డెయిరీ. ఈ 72 వేల మంది మహిళలే ఈ కంపెనీ సభ్యులు, ఓనర్లు. ఇప్పుడు శ్రీజ రోజుకు నాలుగున్నర లక్షల లీటర్ల పాలు సేకరిస్తోంది. గతేడాది రూ.415 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. సభ్యులు, ఓనర్లుగా ప్రపంచంలో మరే కంపెనీలో ఇంత సంఖ్యలో మహిళలు లేరు. అందుకనే మాది ప్రపంచంలోనే పెద్ద మహిళల సొంత కంపెనీ అని చెబుతున్నాం" అని వివరించారు జయతీర్థ.

మహిళా సాధికారత

శ్రీజ డెయిరీ స్థానికంగా తెచ్చిన పెద్ద మార్పు మహిళా సాధికారత. స్వయం సహాయక బృందాలు ఎటువంటి మార్పు తెచ్చాయో, ఇక్కడ శ్రీజ కూడా అలాంటి మార్పే తెచ్చింది. చిత్తూరు ప్రాంత మహిళల చురుకుదనానికి, ఆర్థిక చేయూతను ఇచ్చింది శ్రీజ.

"ఆవుల్ని చూసుకునేది, పాలు పితికేది అన్నీ మహిళలే చేస్తారు. అందుకే మహిళా సాధికారత కోసం ఈ సంస్థలో ఉత్పత్తిదారులు, సభ్యులు మహిళలే అయితే బావుంటుందని ఎన్డీడీబీ కోరకుంది. అందుకే ఇది పూర్తి స్థాయి మహిళల సంస్థ అయింది" అని జయతీర్థ వివరించారు.

శ్రీజ వల్ల స్థానిక మహిళలకు స్వతంత్ర్యత పెరిగిందని ఛైర్మన్ లావణ్య అంటున్నారు.

"అప్పుడూ ఇప్పుడూ మహిళలు చేసేది ఒకే కష్టం. కానీ, ప్రైవేటు డెయిరీల సమయంలో డబ్బు భర్తకు వెళ్లేది. శ్రీజ వచ్చాక మహిళల ఖాతాల్లోకే ఆ డబ్బు వస్తోంది. దీంతో మహిళలు పొదుపు చేసి ఇంటి ఖర్చులకు, చదువులకు, ఇలా అన్నింటికీ ఇస్తున్నారు. భర్తకు సహకారంగా ఉంటూనే ఆర్థిక స్వతంత్ర్య భావనా కనిపిస్తోంది. పెట్టుబడికి కావాల్సిన పెద్ద మొత్తాలు కూడా భర్త ప్రమేయం లేకుండానే ఖర్చు చేయగలుగుతున్నారు. డబ్బు ఎలా దాచుకోవాలో తెలిసింది. బ్యాంకుల్లో దాయడం తెలిసింది. ఒక ఆవును పది ఆవులు ఎలా చేయాలో తెలిసింది. ఇప్పుడు మహిళల పరిస్థితి ఎలా ఉందంటే, మీక్కావాల్సినా మేమే ఇస్తాం. మాక్కావల్సినా మేమే తీసుకుంటాం అంటున్నారు. ఒకప్పుడు భర్తను అడిగి తీసుకునేవారే, ఇప్పుడు ఇచ్చే స్థాయికి ఎదిగారు. భర్త వ్యయసాయం చేస్తుంటే, భార్య పాడి పశువుల పోషణ చూసుకుంటూ ఆదాయం పెంచుకున్నారు. కలసిమెలసి డబ్బు ఖర్చు చేస్తున్నారు" అన్నారు లావణ్య.

డబ్బు కోసం భర్తను అడగక్కర్లేదు

ప్రొడ్యూసర్స్ కంపెనీ ఫలితాలు గ్రామీణ రైతులకు, అందునా మహిళా రైతలుకు అందడంతో స్థానిక పాడి రైతుల కుటుంబాల్లో మార్పు ప్రారంభం అయింది. స్థిరంగా 15 రోజులకొకసారి సొమ్ము అందడం, డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాలో పడడం, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివన్నీ ఫలితాన్ని ఇచ్చాయి. ఇది చిత్తూరు ప్రాంత గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది.

"డబ్బు బ్యాంకులో పడుతోంది. మా ఊరిలోనే బ్యాంకు ఉంది. భార్యాభర్తలిద్దరూ కష్టపడుతున్నారు. డబ్బు ఆడవారికి వస్తే వృథా చేయరు. నీ డబ్బు నా డబ్బు అనేం లేదు. చివరకు కుటుంబానికే ఉపయోగపడతాయి. మగవారి డబ్బు పైఖర్చులకు ఉంటాయి. ఈ కంపెనీ రాకముందు ప్రతీ రూపాయి భర్తను అడగాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం పిల్లల ఫీజులు కూడా భర్తను అడక్కుండా కట్టుకోగలుగుతున్నాం. శ్రీజ వచ్చాక ఒక ఆవు ఉన్న వారు కూడా మూడు ఆవులు పెట్టుకున్నారు. కొందరైతే సాగు నిలిపివేసి మరీ గడ్డి పెంచుకుంటున్నారు. ప్రైవేటుకు పాలు పోసే పనైతే, శ్రీజ లేకపోతే వాళ్లిచ్చే డబ్బులకు ఒక్కావుతోనే సరిపెట్టుకుని వేరే పనులు చూసుకునే వాళ్లం" అని తమ ఊరిలో పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు హేమలత.

చిత్రం శీర్షిక హేమలత

"ఐదారేళ్లు నుంచి శ్రీజ కంపెనీలో ఉన్నాం. అప్పట్లో ఆర్థికంగా ఇబ్బందిగా ఉండేది. ఫీజులు కట్టడం కూడా కష్టంగా ఉండేది. శ్రీజ వచ్చాక రేటు బావుంటుంది. పాలు ఎక్కువైతే ప్రైవేటు వాళ్లు తీసుకోరు. తిప్పి పంపేస్తారు. కానీ శ్రీజ వాళ్లు ఎన్ని పాలైనా తీసుకుంటారు. రేటుతో పాటూ బోనస్, డివిడెండ్ అన్నీ వస్తాయి. షేర్లు ఉంటాయి. సబ్సిడీలు ఉంటాయి. కంపెనీలో మెంబర్షిప్ ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా మనదిలా ఉంటుంది ఈ కంపెనీ" అంటారు ఉషారాణి.

"మగవారు దీనికి ఏం అభ్యంతరం పెట్టరు. శ్రీజ కంపెనీ వల్ల మహిళలకు ఆదాయంతో పాటూ కుటుంబంలో విలువ కూడా పెరిగింది. మర్యాద పెరిగింది. వారు ఆడవాళ్లకు విలువ ఇస్తారు. మేం దాన్ని నిలబెట్టుకున్నాం. ప్రైవేట ఈ కంపెనీలో డబ్బు మగ వారికి ఇస్తారు. ఆడవారికి ఇవ్వరు. కానీ ఇక్కడ ఆడ వాళ్లకు డబ్బు ఇస్తారు. ఆడవారు డబ్బు పాడు చేయకుండా మట్టంగా ఎత్తిపెడతారు (దాచిపెడతారు). ఆ డబ్బు మగవారూ వాడుకోవచ్చు. కానీ మొత్తంగా కుటుంబానికే కదా లాభం" అని ఉషారాణి అభిప్రాయపడ్డారు.

రైతులే బోర్డు సభ్యులు

శ్రీజ ఈ కంపెనీ బోర్డు డైరెక్టర్లు, చైర్మన్ ఎంపిక ప్రక్రియ రాజకీయాలకు అతీతంగా ఒక స్వతంత్ర్య ప్యానల్ ద్వారా జరగుతుంది. ఏదో నామమాత్రంగా రైతులను బోర్డులో పెట్టి పెత్తనం అంతా అధికారులే చేసే పరిస్థితి ఇక్కడ లేదు. పాలు పోసే వారిలో చదువుకున్న మహిళలను ఎంపిక చేసి వారికి బోర్డు వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి మరీ కంపెనీలో పదవులు ఇస్తున్నారు. బోర్డులో వారితో పాటూ కొందరు నిపుణులు కూడా ఉంటారు. ఛీఫ్ ఎగ్జిగ్యూటివ్ నాయకత్వంలోని ఉన్నతాధికారుల బృందం ఈ బోర్డుతో సమన్వయం చేసుకుంటూ రోజూ వారీ సంస్థ వ్యవహారాలు చక్కబెడుతుంది.

కేవలం బోర్డు స్థాయిలోనే కాకుండా, గ్రామ స్థాయి నుంచీ మహిళా పాల ఉత్పత్తిదార్ల బృందాల నిర్మాణం ఉంది. వాటి సమావేశాలు నిర్ణీత వ్యవధిలో జరుగుతాయి. బోర్డు మెంబర్లు కూడా వీటి నుంచే వస్తారు. ఆ సమావేశాల్లో కూడా మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు.

"మీటింగులకు వెళ్లకపోతే ఏం తెలుస్తుంది? మీటింగులకు వెళ్తే నాలుగు విషయాలు చెప్తారు. డాక్టర్లతోనీ, కంపెనీ వాళ్లతోనీ మాట్లాడి ఇంకా పాలు పెంచుకోవచ్చు" అంటారు హేమలత.

"ఇదివరకూ డబ్బు తేడా వచ్చినా, ఏమైనా తేడా ఉన్నా మగవారు వెళ్లి ప్రైవేటు ఈ కంపెనీ వాళ్లను అడిగే వారు. అవుతుందో లేదో కూడా తెలీదు. కానీ శ్రీజ మీటింగుకు వెళ్లి సమస్య చెప్పి, తిరుపతి ఫోన్ చేయిస్తే, వెంటనే పరిష్కారం అయిపోతుంది" అంటారు ఉషారాణి.

లాభం అంతా రైతులకే

శ్రీజ టర్నోవర్ ఇప్పుడు 415 కోట్లు. దాంతో పోలిస్తే వచ్చే లాభం చాలా తక్కువ. పది శాతం కూడా ఉండదు. రైతులకు పాల ధర ఎక్కువ చెల్లించడం, ఆ ధరలో తేడాలను డివిడెండ్ల రూపంలో రైతులకు అందిచడం వల్ల శ్రీజ లాభం తక్కువగానూ, రైతుల లాభం ఎక్కువగానూ ఉంటోంది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయడం వల్ల, దాన్ని నిరంతర ఆదాయంగా గుర్తించిన బ్యాంకులు రైతులకు పశువుల కోసం లోన్లు సులభంగా ఇస్తున్నాయి.

"మేం శుభ్రమైన పాలు అందించాలనుకుంటున్నాం. పాలు అందరికీ అవసరం. కానీ స్వచ్ఛమైన పాలు అందించడం ఎన్డీడీబీ లక్ష్యం. ఇప్పుడు క్లీన్ మిల్క్ ఎక్కడా దొరకడం లేదు. అందుకే మహిళలకు వాళ్లు వాడే క్యాన్ దగ్గర నుంచి ఆవులకు పెట్టే ఆహారం వరకూ అన్నిట్లోనూ జాగ్రత్తగా, శుభ్రంగా ఉండేలా శిక్షణ ఇస్తాం. శుభ్రమైన పాలు సేకరించేలా చూస్తాం. పాల సేకరణ కాకుండా రైతులకు ఇతరత్రా సహకారం అందిస్తున్నాం. నాయకత్వ శిక్షణ ఇవ్వడం, మేత, మందులు, పశు వైద్యంపై అవగాహన, సబ్సిడీ ధరలపై వాటిని అందించడం చేస్తున్నాం. మా పాలు అత్యంత స్వచ్ఛమైనవి, శుభ్రమైనవని పక్కాగా చెప్పగలం. మా దగ్గర లక్షల లీటర్లున్నా అందులోని ప్రతీ లీటరు ఎక్కడి నుంచి వచ్చిందనే మూలాలు కనుక్కోగలం. ఏ ఊరి నుంచి వచ్చాయో, ఏ క్యాన్ నుంచి వచ్చాయో కూడా ట్రేస్ చేసే వ్యవస్థ ఉంది. ఖర్చు ఎక్కువ అయినా నాణ్యత విషయంలో రాజీపడం. ఆవు పాలు, గేదె పాలు వేర్వేరుగా ప్రొసెస్ చేస్తాం" అని వివరించారు జయతీర్థ.

ప్రస్తుతం చిత్తూరు జిల్లాతో పాటూ అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో శ్రీజ పాలు సేకరిస్తోంది. త్వరలో రాయలసీమ మొత్తం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు విస్తరించే ఉద్దేశంలో ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తిరుపతి, చెన్నైల్లో రీటైల్ మార్కెటింగ్ చేయబోతున్నారు. ప్రస్తుతం తిరుపతిలో ఫోన్ యాప్ ద్వారా పాల డెలివరీ అందిస్తున్నారు.

అంతేకాదు, ఇక శ్రీజ మిల్క్ పార్లర్ డీలర్షిప్ కూడా మహిళలకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆ సంస్థ.

శ్రీజ సభ్యత్యం మగవాళ్లకి ఇవ్వొచ్చు కదా అని సభ్యురాలు ఉషారాణిని అడిగింది బీబీసీ బృందం. "ఇవ్వం. మగవారికి ఎందుకిస్తాం. ఇక్కడ మెంబర్లు, ఎంఆర్జీలు, వీఆర్జీలు, బోర్డులో డైరక్టర్లూ అందరూ ఆడవారే. శ్రీజ అంటే ఆడవారిదే" అంటూ సగర్వంగా చెప్పారామె.

శ్రీజపై స్థానిక మహిళలకు ఉన్న పట్టు, అవగాహన, శ్రీజను వారు సొంతం చేసుకున్న తీరుకు ఈ సమాధానం ఒక ఉదాహరణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

హైదరాబాద్ అత్యాచారం, ఎన్‌కౌంటర్: "మనం కోరుకునే న్యాయం ఇది కాదు"

ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి

‘కైలాస్ లేనే లేదు.. మేం అమ్మలేదు’

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్