దేశవ్యాప్తంగా బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్‌ ఎందుకు వేస్తారు?

  • 30 నవంబర్ 2019
బంగారు నగ Image copyright bis.gov.in

భారత్ వ్యాప్తంగా బంగారు నగలకు 'హాల్‌మార్క్' గుర్తును తప్పనిసరి చేస్తున్నామని, ఈ విషయమై జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పుడు గ్రామాలు, చిన్న పట్టణాల్లోని పేద ప్రజలు తాము కొంటున్న బంగారం ఎంత స్వచ్ఛమైనదో గుర్తించలేకపోతున్నారని, తాజా నిర్ణయం వారికి మేలు చేస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ చెప్పారని పీఐబీ తెలిపింది.

'హాల్‌మార్క్' అంటే?

ఏదైనా విలువైన లోహంతో తయారుచేసే వస్తువులో ఆ లోహం ఎంత శాతముందో కచ్చితంగా నిర్ధరించి, అధికారికంగా ముద్ర వేయడమే హాల్‌మార్కింగ్. ఇది చాలా దేశాల్లో విలువైన లోహపు వస్తువుల స్వచ్ఛతకు హామీ ఇస్తుంది.

ఈ వస్తువుల కల్తీ నుంచి ప్రజలకు రక్షణ కల్పించడం, వీటి తయారీలో తయారీదారులు చట్టబద్ధమైన ప్రమాణాలను పాటించేలా చేయడం దీని ప్రధాన ఉద్దేశాలు.

Image copyright Getty Images

నిల్వల విక్రయానికి ఏడాది సమయం

తాజా నిర్ణయం అమలుకు వినియోగదారుల వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని మంత్రి పాశ్వాన్ శుక్రవారం చెప్పారు. హాల్‌మార్క్ లేని సరకు నిల్వలను విక్రయించుకోవడానికి రిటైలర్లకు ఏడాది సమయం ఇస్తామని తెలిపారు.

హాల్‌మార్కింగ్ నిర్ణయం అమలుకు వీలుగా పసిడి ఆభరణాలు, కళాఖండాలకు గిరాకీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు ఎంట్రిప్రెన్యూయర్ల ఆధ్వర్యంలో కొత్తగా 'లోహ స్వచ్ఛత నిర్ధరణ, హాల్‌మార్కింగ్ కేంద్రాల (ఏ& హెచ్ సెంటర్స్)' ఏర్పాటుకు, ఆభరణ విక్రేతల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయడానికి ఏడాది వ్యవధి ఇస్తామని పాశ్వాన్ వివరించారు.

బంగారు నగలు, కళాఖండాల హాల్ మార్కింగ్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడానికి 2016 నాటి భారత ప్రమాణాల బ్యూరో(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-బీఐఎస్) చట్టం వీలు కల్పిస్తుంది. వీటిని అమ్మే వ్యాపారులందరూ బీఐఎస్ వద్ద నమోదు చేయించుకోవాలని, హాల్‌మార్కింగ్ చేసిన సరకే అమ్మాలని ఇది చెబుతోంది.

Image copyright Getty Images

భారత్‌లో ప్రస్తుతం రెండు విలువైన లోహాలు బంగారం, వెండి హాల్‌మార్కింగ్‌లో పరిధిలో ఉన్నట్లు బీఐఎస్ చెబుతోంది. హాల్‌మార్కింగ్‌పై అంతర్జాతీయ విధివిధానాలకు అనుగుణంగా తమ హాల్‌మార్కింగ్ కార్యక్రమం ఉందని పేర్కొంటోంది.

బీఐఎస్ హాల్‌మార్కింగ్ నిబంధనలు 2018 జూన్ 14న నోటిఫై చేశారు. బంగారు నగలకు హాల్‌మార్కింగ్ కార్యక్రమాన్ని బీఐఎస్ 2000 ఏప్రిల్ నుంచి అమలు చేస్తోంది.

బీఐఎస్ ధ్రువీకరించిన ఆభరణ విక్రేతలు వారి నగలకు బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ&హెచ్ కేంద్రాల నుంచి హాల్‌మార్కింగ్ పొందవచ్చు.

2019 అక్టోబరు 31 నాటికి దేశవ్యాప్తంగా 877 ఏ&హెచ్ కేంద్రాలు ఉన్నాయి. ఇప్పటివరకు 26,019 మంది బంగారు ఆభరణాల వ్యాపారులు బీఐఎస్ వద్ద నమోదు చేయించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 43, తెలంగాణలో 31 ఏ&హెచ్ కేంద్రాలు ఉన్నాయి. బీఐఎస్ గుర్తింపు పొందిన ఏ&హెచ్ కేంద్రాల్లో వినియోగదారులు తమ నగలను పరీక్ష చేయించుకోవచ్చు.

Image copyright bis.gov.in

నిర్ణయాన్ని సత్వరం అమలు చేయాలి: ఆభరణ విక్రేతల సంఘం

తప్పనిసరి హాల్‌మార్కింగ్ ప్రకటనపై 'ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్' ఏపీ శాఖ అధ్యక్షుడు విజయ్ కుమార్ స్పందిస్తూ- దీనివల్ల బంగారు వ్యాపారులందరూ నిర్దేశిత ప్రమాణాలకు తగినట్లుగా నగలను విక్రయించాల్సి ఉంటుందన్నారు.

ఈ నిర్ణయాన్ని సత్వరం అమలు చేయాలని ఆయన కోరారు.

గ్రామాల్లో చాలా మంది చిన్న వ్యాపారస్తులు అమ్మే బంగారు నగల్లో బంగారం 60 నుంచి 70 శాతం మధ్యే ఉంటోందని, కానీ దీనిని 91.6 (22 క్యారెట్స్) శాతం బంగారమని అమ్ముతున్నారని, దీనివల్ల కొనుగోలుదారులు మోసపోతున్నారని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం హాల్‌మార్కింగ్ తప్పనిసరిచేయడం, అమలుచేయడం ప్రజలకు మేలు చేస్తుందని విజయ్ బీబీసీతో చెప్పారు.

18 క్యారెట్స్(75 శాతం) బంగారమున్న నగలను కూడా 18 క్యారెట్స్ అనే ముద్ర వేసి హాల్‌మార్కింగ్‌తో అమ్మొచ్చని గతంలో చెప్పారని, అది కొనుగోలుదారులకు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

'హాల్‌మార్కింగ్' చిన్నగా కనిపించే ముద్ర అని, 75 శాతం హాల్‌మార్కింగ్‌ను అనుమతిస్తే, 916 బంగారమని చెప్పి మళ్లీ 75 శాతమే బంగారమున్న నగలను అమాయకులైన కొనుగోలుదారులకు అంటగడతారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు.

Image copyright Getty Images

భారత్‌లో ఏటా 800 టన్నుల వినియోగం

భారతీయులకు బంగారంపై మక్కువ ఎక్కువ. పసిడి వినియోగం పెరుగుతూ వస్తోంది.

1982లో వార్షిక వినియోగం 65 టన్నులుగా ఉందని అంచనా. ఇప్పుడది 800 టన్నులపైనే ఉంది.

దాదాపు 80 శాతం ఆభరణాల(ప్రధానంగా 22 క్యారెట్ స్వచ్ఛత) తయారీకే వెళ్తోంది.

ఫిక్కీ అధ్యయనం ప్రకారం భారత్‌లో బంగారం ప్రాసెసింగ్ పరిశ్రమలో దాదాపు 15 వేల సంస్థలు ఉన్నాయి. దాదాపు 80 యూనిట్లకు 50 లక్షల డాలర్లకు పైగా రాబడి ఉంది.

దేశంలో దాదాపు నాలుగున్నర లక్షల మంది స్వర్ణకారులు, లక్ష మందికి పైగా బంగారు నగల అమ్మకందారులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)