షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేయలేకపోవటానికి కారణం ఏంటంటే..’

  • 3 డిసెంబర్ 2019
హైదరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనం

షాద్‌నగర్‌లో ఓ పశువైద్యురాలు అత్యాచారం, హత్యకు గురైన కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిందితులను తక్షణమే శిక్షించాలని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద సంఖ్యలో జనం ఆందోళనకు కూడా దిగారు.

మరోవైపు ఈ ఘటన గురించి స్పందిస్తూ తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ శుక్రవారం సాయంత్రం చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది.

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత, ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థతో హిందీలో మాట్లాడారు.


''మాకు చాలా బాధగా ఉంది. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నేరాలు జరుగుతున్నా, కట్టడి చేస్తున్నారు. హనుమకొండలో పాపపై అత్యాచారం కేసులో దోషికి రెండు నెలల్లోనే ఉరిశిక్ష పడింది. (షాద్ నగర్ ఘటన) బాధితురాలు బాగా చదువుకుంది. డాక్టర్ అయ్యింది. కానీ, 100 (పోలీస్ ఫోన్) నెంబర్‌కు కాకుండా, వాళ్ల చెల్లికి ఫోన్ చేసింది. 100కి ఫోన్ చేస్తే ఆమె సురక్షితంగా ఉండేది. దీనిపై అవగాహన కల్పిస్తాం. 100 ఫ్రెండ్లీ నెంబర్. ఫోన్ చేసిన 3-4 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారు'' అని అన్నారు.

హోంమంత్రి తన వ్యాఖ్యల్లో షాద్‌నగర్ ఘటన బాధితురాలి పట్ల సానుభూతి ప్రకటించారు. పోలీసులు నేరాల్ని అదుపు చేస్తున్నారని చెప్పారు. అయితే, బాధితురాలు చెల్లెలికి బదులు 100 నంబరుకు ఫోన్ చేసి ఉంటే బాగుండేదంటూ ఆయన అనడంపై వివాదం రేగింది. ఆయన తీరు తప్పును బాధితురాలి మీదకు నెట్టినట్లుందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

తెలుగుతో పాటూ, ఇంగ్లీష్, హిందీ మీడియా సంస్థలు కూడా ఈ వ్యాఖ్యలను హైలెట్ చేశాయి.

బాధితురాలు ఉండే ప్రాంతంలో నివసించే మహిళలు కూడా రోడ్లపైకి వచ్చి మంత్రి మాటలను తప్పు పట్టారు. అవి బాధ్యతారహితంగా ఉన్నాయని పలువురు విమర్శించారు.

Image copyright MahmoodAliTRS/facebook
చిత్రం శీర్షిక మహమూద్ అలీ (పాత చిత్రం)

దీంతో హోం మంత్రి తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌తో కలిసి మరోసారి మీడియా ముందుకు వచ్చారు.

బాధితురాలు తన కూతురు లాంటిదని పదే పదే చెప్పారు. ఘటన పట్ల తనకూ బాధగా ఉందనీ, ఆమె సమయం వృథా చేసిందని తాను అనలేదనీ వివరణ ఇచ్చారు.

''(దోషులకు) త్వరలో తగిన శిక్ష పడుతుంది. నేనూ చాలా బాధపడ్డా. ఆమె నాకు కూతురులాంటిది. ఆమె తల్లితండ్రులనూ కలిశాను. నా కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. తెలంగాణ కూతురామె. నా కూతురామె. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి విచారణ జరిపిస్తాం. అమ్మాయిలందరి కోసం చెప్పాను. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం 'షీ టీమ్స్' పెట్టారు. అవి బాగా పనిచేస్తున్నాయి'' అని మహమూద్ అలీ అన్నారు.

'బాధితురాలు చెల్లెలికి ఫోన్ చేసి సమయం వృథా చేసిందని అన్నారు కదా?' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ''నేను సమయం వృథా అని ఎప్పుడూ అనలేదు. (బాధితురాలు) చెల్లెలికి ఫోన్ చేసినప్పుడు.. చెల్లెలు కానీ, ఆమె కానీ ఒకవేళ 100కి కాల్ చేసి ఉంటే తొందరగా చర్యలు తీసుకునే వీలుండేదని అన్నా. కానీ, ఆమె ఆందోళనలో ఉండొచ్చు'' అని వ్యాఖ్యానించారు.

మహిళలపై లైంగిక దాడులు జరిగిన ప్రతిసారీ కొందరు రాజకీయ నాయకుల మాటలు వివాదాస్పదం అవుతూ వస్తున్నాయి. చాలా సందర్భాల్లో మహిళల ప్రవర్తన లేదా వేసుకున్న బట్టల గురించి ఈ చర్చ జరుగుతూ వచ్చింది.

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మాటలు మహిళల ప్రవర్తన గురించి కాకపోయినా, ''ఆమె ఇలా కాకుండా అలా చేసి ఉంటే బావుండేది. చెల్లెలికి కాకుండా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే బావుండేది'' అనడం అనుచితంగా ఉందని విమర్శలు వచ్చాయి.

"ఈ ఘటనపై హోంమంత్రి చాలా బాధపడ్డారు. ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్లేముందు ఒక రిపోర్టర్ ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగితే ఆయన తన నివాసం వద్ద మాట్లాడారు. ప్రజలకి ఇలాంటి సందర్భాల్లో ఎలా స్పందించాలో చెప్పే క్రమంలో భాగంగా 100 నెంబర్ గురించి కూడా వివరించారు. ఆ క్రమంలోనే ఆ అమ్మాయి 100 నెంబరుకి కాల్ చేసి ఉంటే పోలీసులు తొందరగా వచ్చే అవకాశం ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ అమ్మాయి కాల్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పడం లేదా ఆ అమ్మాయిది తప్పు అని చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. మిగిలిన వారికి అవగాహన కల్పించడమే ఆయన ఉద్దేశం" అని బీబీసీతో చెప్పారు హోం మంత్రి కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.

చిత్రం శీర్షిక షాద్‌నగర్ అత్యాచారం, హత్య కేసులో నిందితులు

‘పోలీసులేమీ వెతికిపట్టుకోలేదు’

100 నెంబర్‌కు ఫోన్ చేసుంటే బాగుండేదని సాధారణ ప్రజలు అనుకోవడంలో తప్పులేదని.. కానీ, ఈ ఘటనకు సంబంధించి చర్చించాల్సిన విషయం మరొకటి ఉందని మహిళల హక్కుల కార్యకర్త సజయ అన్నారు.

''అమ్మాయి తల్లితండ్రులు స్టేషన్‌కి వెళ్లినప్పుడు అది మా పరిధి కాదు అని వేరే చోటుకు పంపడం చాలా తప్పు. 100కి ఫోన్ చేస్తే బావుండేది అనేది ఒక సాధారణ అభిప్రాయం. వంద నంబర్ పరుగెట్టుకుని రాదు. వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ, స్వయంగా స్టేషన్‌కి వెళ్లిన వాళ్లను వెనక్కు పంపించడం నిర్లక్ష్యం. అసలు కింది స్థాయి పోలీసులకి అత్యవసర సమయాల్లో ఎలా ప్రవర్తించాలనేది తెలీదు. జీరో ఎఫ్ఐఆర్ చేయలేదు. వాళ్లు వెంటనే స్పందించి ఉంటే, ఇలా ఉండేది కాదు. మరునాడు ఎవరో ఫోన్ చేసి గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం వస్తే వెళ్లారు తప్ప, పోలీసులేమీ వెతికి పట్టుకోలేదు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

''ఈ విషయంలో సున్నితంగా ఉంటే, 'ఆమె ఆ సమయంలో అక్కడెందుకు ఉంది? వందకు ఫోన్ చేసి ఉండాల్సింది వంటి మాటలు రావు'. తప్పు బాధితుల మీదకు నెట్టడం బాధాకరం'' అని అన్నారు సజయ.


‘అంత సీరియస్ అనుకోలేదు’ : బాధితురాలి సోదరి

100 నెంబర్‌కి ఫోన్ చేసి ఉండాల్సింది అన్న వ్యాఖ్యలపై బాధితురాలి సోదరి స్పందించారు.

''నేను కానీ, అక్క కానీ 100కి కాల్ చేసి ఉండాల్సింది అని అందరూ అంటున్నారు. ఆ సమయంలో అక్క 100కి కాల్ చేయాల్సిన పరిస్థితి ఉందని నేను అనుకోలేదు. ఎందుకంటే మనమెవరం అటువంటి పరిస్థితుల్లో లేము. ఆమె ఉంది ఆ పరిస్థితుల్లో'' అని బీబీసీతో ఆమె చెప్పారు.

"ఆమె అప్పటికే చాలా భయపడి ఉంది. కంగారు, అభద్రత, బాధతో ఉంది. ఆమె 100కి కాల్ చేయాల్సింది అని నేను అనుకోలేదు. కానీ, ఏదైనా తేడా ఉందని కాస్త అనిపించినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలి. ఒకవేళ విషయం ఇంత సీరియస్ అని నాకు తెలిసినా నేనే ఫోన్ చేసేదాన్ని. కానీ ఆ పరిస్థితి అంత సీరియస్ అని నాకు తెలియదు" అని అన్నారు బాధితురాలి చెల్లెలు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు