కేటీఆర్ ట్వీట్: ‘నరేంద్ర మోదీజీ, నిర్భయ హంతకుల్ని ఏడేళ్లైనా ఉరితీయలేదు.. రోజంతా పార్లమెంటులో చర్చించాలి, చట్టాల్ని మార్చాలి’

  • 1 డిసెంబర్ 2019
ప్రధాని నరేంద్ర మోదీ, కేటీఆర్ Image copyright Getty Images/facebook/KTRTRS

హైదరాబాద్ శివార్లలోని షాద్ నగర్ సమీపంలో అత్యాచారం, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ కేసుపై తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు.

ఈ కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ బాధిత కుటుంబం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో బాధ్యులైన ఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

తమ కుమార్తె సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో వెతికేందుకు వెళ్లిన తాము తక్షణం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని, అయితే ‘మీ అమ్మాయి ఎవరితోనో వెళ్లిపోయి ఉంటుంది’ అంటూ పోలీసులు చులకనగా మాట్లాడారని, మా పరిధి కాదంటే మా పరిధి కాదంటూ శంషాబాద్, శంషాబాద్ రూరల్, ఆర్‌జీఏఐ పోలీసు స్టేషన్ల మధ్య తిప్పారని బాధిత కుటుంబం తమను కలసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసైలకు తెలిపారు.

ఈ నేపథ్యంలో శనివారం శంషాబాద్ ఎస్సైని, ఆర్‌జీఐఏ విమానాశ్రయ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుళ్లు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు.

అయితే, మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై ఇంత వరకూ స్పందించలేదని పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు నిందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆదివారం మధ్యాహ్నం వరుసగా నాలుగు ట్వీట్లు చేశారు.

‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీ, నిర్భయపై దారుణమైన అత్యాచారం, హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత కూడా నిందితులను ఉరి తీయలేదు! తొమ్మిదేళ్ల పసిపాప ఈ మధ్యనే అత్యాచారానికి గురైంది. కింది కోర్టు ఉరిశిక్ష విధిస్తే హైకోర్టు ఆ తీర్పును సవరించి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది! హైదరాబాద్‌లో ఒక యువ పశువైద్యురాలిని పాశవికంగా హత్య చేశారు. వారిని పట్టుకున్నాం. అయితే, ఆ డాక్టర్‌కు న్యాయం చేయాలని కోరుతున్న బాధిత కుటుంబాన్ని మనం ఎలా ఓదార్చగలమనే నేను ఆలోచిస్తున్నా’’ అని ఈ ట్వీట్లలో కేటీఆర్ పేర్కొన్నారు.

‘‘న్యాయం చేయడం ఆలస్యమైతే, న్యాయం చేయడానికి నిరాకరించినట్లే లెక్క సర్. ఎలాగూ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి, ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చి ఒక రోజు మొత్తం దీనిపై చర్చ జరపాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ)లను సవరించండి. మన మహిళలు, పిల్లలపై ఇలాంటి క్రూరమైన హింసకు పాల్పడే వారికి తక్షణం ఉరిశిక్ష విధించేలా, ఈ తీర్పుపై ఎలాంటి సమీక్ష లేకుండా చట్టాలను సవరించాలి’’ అని కేటీఆర్ ప్రధాని మోదీకి సూచించారు.

‘‘మన చట్టం, న్యాయంలో ఉన్న పురాతన భాగాలను సవరించాల్సిన సమయం వచ్చింది. దేశంలోని చట్టం అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్న ఈ జంతువుల నుంచి మన జాతిని రక్షించుకునేందుకు మనం వేగంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ జీ, దుఃఖంతో ఉన్న, ఏమీ చేయలేకున్న, మనలాంటి చట్టసభ్యులు సమయానికి అనుగుణంగా స్పందించి వేగంగా న్యాయం చేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది ప్రజల తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

పోలీసులపై విచారణ జరుపుతామన్న జాతీయ మహిళా కమిషన్ విచారణ కమిటీ

ఈ హత్యోదంతాన్ని సుమోటోగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్ దీనిపై విచారణకు శ్యామల ఎస్ కుందర్ నేతృత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ శనివారం బాధిత కుటుంబాన్ని కలసింది. అనంతరం హైదరాబాద్‌లో మీడియాతో కమిటీకి నేతృత్వం వహిస్తున్న శ్యామల మాట్లాడుతూ.. బాధిత కుటుంబం పోలీసు స్టేషన్‌కు వెళితే అక్కడి పోలీసు సిబ్బంది ‘బండి పోయిందా? అమ్మాయి పోయిందా?’ అంటూ మాట్లాడారని, ఫిర్యాదు స్వీకరించడంలో కాలయాపన చేశారని చెప్పారు. శంషాబాద్, ఆర్‌జీఐఏ విమానాశ్రయ పోలీసు స్టేషన్ సిబ్బంది తీరుపై విచారణ జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

‘బేటీ బచావో’ ప్రచారానికే పరిమితం కాకూడదు - సల్మాన్ ఖాన్

వెటర్నరీ డాక్టర్ అత్యాచారం, హత్యపై క్రీడాకారులు, నటీనటులు సోషల్ మీడియాలో స్పందించారు.

బాధిత కుటుంబానికి త్వరగా న్యాయం జరిగేలా చూడాలని చిరంజీవి కోరగా, ఇలాంటి క్రూరమైన నేరాలకు కఠిన శిక్షలు విధించే చట్టాలు ఉండాలని మహేశ్ బాబు కోరుతూ కేటీఆర్, ప్రధానమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

‘బేటీ బచావో’ ప్రచారానికే పరిమితం కారాదని సల్మాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం జరిపి హత్య చేసిన వారు మానవ రూపంలో ఉన్న సైతాన్లని ఆయన అభివర్ణించారు.

టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. హైదరాబాద్‌లో జరిగిన సంఘటన సిగ్గుచేటని, ఇలాంటి అమానవీయ దుర్ఘటనలకు అంతం పలకాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి