బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది?

  • 2 డిసెంబర్ 2019
బిల్లా, రంగా Image copyright Twitter

అది 1982, జనవరి 31. తిహార్ జైల్లో ఇద్దరు కరడుగట్టిన నేరగాళ్లను ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నేరగాళ్ల పేర్లు బిల్లా, రంగా.

తెల్లవారు జామున 5 గంటలకు వాళ్లిద్దరూ నిద్ర లేవగానే, జైలు అధికారులు టీ ఇచ్చారు.

మేజిస్ట్రేట్ ముందు విల్లు ఏమైనా రికార్డు చేయించుకోవాలనుకుంటున్నారా అని చివరిసారిగా వారిని అధికారులు అడిగారు. ఆ ఇద్దరూ లేదని చెప్పారు.

ఇద్దరి చేతులు, కాళ్లకు అధికారులు బేడీలు వేశారు. డెత్ వారెంట్‌లో ఉరి తీసేందుకు సూచించిన సమయానికి ఇంకా పది నిమిషాలు ఉంది. ఉరికంబం వైపు వాళ్లను తీసుకువెళ్లడం మొదలుపెట్టారు.

''రంగా చాలా ఉత్సాహంగా ఉండే మనిషి. అతడి ఎత్తు ఐదడుగుల 10 అంగుళాలు. ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు. తనను ఉరి తీస్తున్నారన్న బాధ అతడిలో కనిపించేది కాదు. అప్పట్లో బాలీవుడ్‌లో 'రంగాఖుష్' అనే పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది'' అని చెప్పారు 'బ్లాక్ వారెంట్ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ తిహార్ జైలర్' పుస్తక రచయిత సునీల్ గుప్తా. బిల్లా, రంగాల ఉరిశిక్షల అమలుకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఆ సమయంలో ఆయన ఆ జైల్లో అధికారిగా ఉన్నారు.

''బిల్లా వృత్తిరీత్యా టాక్సీ డ్రైవర్. అతడి ఎత్తు ఐదున్నర అడుగులు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండేవాడు. రంగానే తనను మోసపూరితంగా నేరంలోకి లాగాడంటూ ఏడుస్తుండేవాడు. బిల్లానే తనను నేరంలోకి లాగాడని రంగా అనేవాడు. ఇలా ఇద్దరూ ఒకరినొకరు నిందించుకునేవారు'' అని సునీల్ వివరించారు.

రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించే వరకూ ఉరి శిక్ష పడ్డ ఖైదీలను కూడా చట్ట ప్రకారం సాధారణ ఖైదీల్లానే చూస్తారని సునీల్ గుప్తా అన్నారు. పిటిషన్ తిరస్కరణ తర్వాతే వారిని చీకటి గదిలోకి తీసుకువెళ్లి, బేడీలు వేస్తారని చెప్పారు.

''నేను ఆ జైలుకు వెళ్లే సమయానికి వాళ్ల న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ ఇద్దరూ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించేవారు'' అని సునీల్ చెప్పారు.

ఇంతకీ ఈ బిల్లా, రంగా ఎవరు? దేశం అంతా వాళ్లను ఉరి తీయాలని ఎందుకు కోరుకుంది?

Image copyright SUNDAY STANDARD

‘లిఫ్ట్ ఇచ్చింది గూండాలు’

''ఒక రిపోర్టర్‌గా నేను గమనించినదాని ప్రకారం.. ఈ తరంలో మనం చూసిన అతిపెద్ద నేరం నిర్భయ ఘటన. అలాగే, మన ముందు తరంలో బిల్లా, రంగా కేసు కూడా అలాంటిదే'' అని 'బ్లాక్ వారెంట్' సహరచయిత, హిందుస్థాన్ టైమ్స్ పొలిటికల్ ఎడిటర్ సునేత్రా చౌధరీ అన్నారు.

''1978 ఆగస్టు 26న (శనివారం) సాయంత్రం 16 ఏళ్ల గీతా చోప్రా, ఆమె సోదరుడు 14 ఏళ్ల సంజయ్ చోప్రా.. ఆల్ ఇండియా రేడియో స్టూడియోకు వెళ్లేందుకు లిఫ్ట్ అడిగి ఓ కారు ఎక్కారు. అక్కడ 'యువవాణి' అనే కార్యక్రమంలో వాళ్లు పాల్గొనాల్సి ఉంది. దురదృష్టవశాత్తు వారికి లిఫ్ట్ ఇచ్చింది ఇద్దరు గూండాలు. ఆ ఇద్దరూ బొంబాయి నుంచి దిల్లీకి వచ్చిన చిల్లర నేరగాళ్లు. పిల్లలను అపహరించి, వాళ్ల దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేయాలన్నది వారి పథకం. అలా బాగా డబ్బు గుంజాలని భావించి.. గీతా, సంజయ్‌లను వాళ్లు అపహరించారు. కానీ, ఇది తర్వాత అత్యాచారం, హత్య కేసుగా మారిపోయింది'' అని చెప్పారు.

గీతపై అత్యాచారం చేయడం.. ఆమెను, ఆమె సోదరుణ్ని హత్య చేయడం మొత్తం భారత్‌ను కుదిపేసింది.

ఈ కేసు గురించి 1978, సెప్టెంబర్ 30న వెల్లడైన 'ఇండియా టుడే' సంచికలో దిలీప్ బాబ్ ఓ కథనం రాశారు.

''గీతా, సంజయ్‌ల తండ్రి నావికాదళంలో కెప్టెన్. ఆయన పేరు ఎమ్ఎమ్ చోప్రా. అపహరణకు గురైన రోజు సాయంత్రం 6:15కు.. గీత, సంజయ్ వారి ఇంటి (ధౌలా కువా ఆఫీసర్స్ క్వార్టర్స్) నుంచి బయటకు వెళ్లారు. గీత జీసస్ అండ్ మేరీ కాలేజీలో కామర్స్ రెండో సంవత్సరం విద్యార్థిని. పార్లమెంటు వీధిలోని ఆల్ ఇండియా రేడియో స్టూడియోకు ఆమె వెళ్లాల్సి ఉంది'' అని పేర్కొన్నారు.

''గీత సోదరుడు సంజయ్ 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు ఉంటాడు. అతడు పదో తరగతి విద్యార్థి. ఆ రోజు ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో బయట అంతా మబ్బులుగా ఉంది. రేడియో కార్యక్రమం ముగిసిన తర్వాత ఆకాశవాణి భవనం నుంచి గీతను, సంజయ్‌ను ఎక్కించుకుని ఎమ్ఎమ్ చోప్రా ఇంటికి తీసుకువెళ్లాలి. ఆయన అక్కడికి వెళ్లేసరికి గీత, సంజయ్ లేరు. కార్యాలయం లోపలికి వెళ్లి, అడిగితే.. వాళ్లు అసలు రికార్డింగ్‌కే రాలేదని ఆల్ ఇండియా రేడియో సిబ్బంది చెప్పారు'' అని దిలీప్ బాబ్ రాశారు.

గీతపై అత్యాచారం

గీత, సంజయ్‌ల ఆచూకీ కనుక్కొనేందుకు దిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా రంగంలోకి దిగారు.

''సాయంత్రం 6 గంటలకు లోహియా ఆసుపత్రి దగ్గర నా స్కూటర్ పక్క నుంచి ఓ ఫియట్ కారు చాలా వేగంగా వెళ్లిపోయింది. అందులో నుంచి ఓ అమ్మాయి అరుపు వినిపించింది. నేను వారిని వెంబడించి, దగ్గరికి వెళ్లాను. కారు ముందు సీట్లలో ఇద్దరు వ్యక్తులున్నారు. వెనుక సీట్లలో ఓ అమ్మాయి, అబ్బాయి కనిపించారు'' అని భగవాన్ దాస్ అనే ప్రత్యక్ష సాక్షి పోలీసులకు చెప్పారు.

''రెడ్ సిగ్నల్ దగ్గర కారు నెమ్మదించింది. ఏం చేస్తున్నారంటూ నేను కారు వైపు అరిచాను. కారు అద్దానికి మొహం ఆనించి ఉన్న అబ్బాయి తన టీషర్ట్ వైపు చూడమని సైగ చేశాడు. ఆ టీషర్ట్‌కు రక్తపు మరకలు ఉన్నాయి. ఆ అమ్మాయి వెనుక నుంచి డ్రైవర్ జుట్టు లాగుతోంది'' అని భగవాన్ వివరించారు.

''డ్రైవర్ ఒక చేత్తో కారు నడుపుతూనే మరో చేత్తో అమ్మాయిని కొడుతున్నాడు. మందిర్ మార్గ్, పార్క్ స్ట్రీట్ క్రాసింగ్ దగ్గర కారు వేగం పెంచి, రెడ్ సిగ్నల్ పడ్డా ముందుకు వెళ్లిపోయాడు. ఆ అబ్బాయి చూడటానికి కొంచెం విదేశీయుడిలా కనిపించాడు. అది మస్టర్డ్ రంగు కారు. నెంబర్ హెచ్ఆర్‌కే 8930'' అని పోలీసులకు తెలిపారు.

గీత, సంజయ్‌లను అపహరించి, రిజ్ ప్రాంతంలోని బుద్ధా గార్డెన్‌వైపు రంగా, బిల్లా తీసుకువెళ్లారు. అక్కడో నిర్జన ప్రదేశంలో కారు ఆపి, మొదట సంజయ్‌ని హత్య చేశారు. ఆ తర్వాత గీతపై అత్యాచారం చేశారు.

నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో రంగా తమ అకృత్యం గురించి వివరించాడు.

''సంజయ్ మృతదేహం ఉన్నవైపు నేను గీతను తీసుకువెళ్తున్నా. ఆమె కుడివైపు నడుస్తున్నా. బిల్లా నాకు సైగ చేయడంతో, కొంచెం ముందుకు నడిచా. బిల్లా బలంగా ఆమె మెడపై కత్తితో వేటు వేశాడు. ఆ వెంటనే ఆమె చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పొదల్లో పడేశాం'' అని రంగా అన్నాడు.

Image copyright Getty Images

సైనికులకు చిక్కారు

ఈ ఘటన గురించి వార్తలు బయటకు రాగానే జనాల్లో ఆగ్రహం వ్యక్తమైంది.

బోట్ క్లబ్ వద్ద జీసస్ అండ్ మేరీ కాలేజీ విద్యార్థినులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వారితో మాట్లేడేందుకు అప్పటి విదేశాంగ మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ వెళ్తే, విద్యార్థినులు రాళ్ల దాడి చేశారు.

ఒక రాయి వాజ్‌పేయీ తలకు తగిలి, రక్తం కారడం మొదలైంది.

''ఇప్పటికీ నాకు అది గుర్తుంది. ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ అప్పటి ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లారు. ఇలాంటి నేరాలకు సంబంధించి బాధితుల కుటుంబాల వద్దకు ప్రధాని లాంటివారు వెళ్లడం చాలా అరుదు'' అని సునీల్ గుప్తా అన్నారు.

పోస్ట్‌మార్టంలో గీత శరీరంపై ఐదు గాయాలున్నట్లు తేలింది. సంజయ్ శరీరం మీద మొత్తంగా 21 గాయాలున్నాయి. గీత ప్యాంట్‌లో గుర్తింపు కార్డు కూడా అలాగే ఉంది. ఓ వ్యాలెట్ కూడా వారి వద్ద లభించింది. అందులో రూ.17 ఉన్నాయి.

ఘటన జరిగిన తర్వాత బిల్లా, రంగా దిల్లీ నుంచి పారిపోయారు. మొదట ముంబయి (అప్పట్లో బొంబాయి)కి, ఆ తర్వాత ఆగ్రాకి వెళ్లారు.

ఆగ్రా నుంచి దిల్లీకి వచ్చేందుకు వాళ్లు ఓ రైలు ఎక్కారు. అయితే, వారు ఎక్కింది సైనికులు ప్రయాణిస్తున్న బోగీ. బిల్లా, రంగాలను సైనికులు పట్టుకుని, పోలీసులకు అప్పగించారు.

''హత్యల తర్వాత బిల్లా, రంగా భయపడిపోయారు. మిగతా నగరాల వైపు పారిపోవడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వాళ్లు సైనికులు ప్రయాణిస్తున్న ఓ రైలు బోగీలో ఎక్కారు. వాళ్లతో గొడవపడ్డారు. సైనికులు వాళ్లను గుర్తింపు కార్డు చూపించమని అడిగారు. అప్పుడు రంగా 'చేతి రాతతో ఉన్న కార్డు' చూపించమని బిల్లాకు చెప్పాడు. వాళ్లపై సైనికులకు అనుమానం వచ్చి, దిల్లీ స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు'' అని సునేత్ర వివరించారు.

Image copyright AFP

‘తలారులు మద్యం తీసుకుంటారు’

బిల్లా, రంగాలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించాయి.

క్షమాభిక్ష కోసం బిల్లా, రంగా చేసుకున్న పిటిషన్లను ఆ సమయంలో రాష్ట్రపతిగా ఉన్న నీలం సంజీవరెడ్డి తిరస్కరించారు. ఉరి తీయడానికి ఒక వారం ముందు మూడో నెంబర్ జైల్లోని ఉరి ఖైదీల గదికి అధికారులు వాళ్లను తరలించారు. మిగతావారికి దూరంగా వారిని ఒంటరిగా ఉంచారు. నిరంతరం తమిళనాడు స్పెషల్ పోలీసు సిబ్బంది వారికి గస్తీ కాశారు.

బిల్లా, రంగాలను ఉరి తీసేందుకు ఫరీద్‌కోట్ నుంచి ఫకీరా, మేరట్ నుంచి కాలూ అనే తలారులను పిలిపించారు.

''కాలూ, ఫకీరా 'దిగ్గజాలు'. ఉరి తీయడానికి ముందు వాళ్లకు 'ఓల్డ్ మాంక్' మద్యం ఇవ్వడం ఓ సంప్రదాయంలా మారింది. ఎందుకంటే, తలారిగా ఉన్నాగానీ, పూర్తి స్పృహలో ఉంటే వాళ్లు మరొకరి ప్రాణాలు తీయలేరు. జైలు మాన్యువల్‌లో ఉరి తీసినందుకు వారికి రూ.150 ఇవ్వాలని మాత్రమే ఉంటుంది. అది చాలా తక్కువ మొత్తం'' అని సునేత్రా అన్నారు.

ఈ ఇద్దరినీ ఉరి తీసేందుకు ప్రత్యేకంగా బక్సర్ జైలు నుంచి తాడును తెప్పించారు.

''ఆ తాడు బయట మార్కెట్‌లో దొరకదు. బక్సర్ జైల్లోనే ప్రత్యేకంగా దాన్ని తయారు చేస్తారు. సాగే గుణం వచ్చేందుకు ఆ తాడుకు మైనం గానీ, వెన్న గానీ పూస్తారు. కొందరు తలారులు అరటిపళ్ల గుజ్జును కూడా పూస్తుంటారు. ఆ తాడు పొడవు 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల దాకా ఉంటుంది. తలారి ఫకీరా నల్లగా ఉండేవాడు. తనను తాను యముడిలా చూపించుకునే ప్రయత్నం చేసేవాడు. కాలూ పొట్ట బయటకు వచ్చి ఉంటుంది. ఇద్దరూ భయంకరంగా కనిపించే ప్రయత్నం చేసేవారు'' అని సునీల్ గుప్తా చెప్పారు.

Image copyright Getty Images

‘ఇదే ఆ రుమాలు’

ఉరి తీయడానికి ఒక రోజు ముందు దిల్లీకి చెందిన ఐదుగురు పాత్రికేయులు బిల్లా, రంగాలను కలిసేందుకు ఆసక్తి చూపించారు. అప్పట్లో 'నేషనల్ హెరాల్డ్‌'కు పనిచేసిన ప్రకాశ్ పాత్రా కూడా వారిలో ఉన్నారు.

అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ప్రకాశ్ మాట్లాడారు.

''రంగా మమ్మల్ని కలిసేందుకు నిరాకరించాడు. బిల్లా మాత్రం మాతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడాడు. మాతో మాట్లాడుతున్నప్పుడు అతడు వణికిపోతూ కనిపించాడు. తాను ఈ నేరం చేయలేదన్న విషయం దేవుడికి తెలుసని చివరి దాకా మాతో అంటూ వచ్చాడు. కానీ, అతడి బాడీ లాంగ్వేజ్ గమనిస్తే, అతడు అబద్ధం చెబుతున్నాడని అర్థమైంది'' అని అన్నారు.

ఉరి తీయడానికి ముందు రోజు రాత్రి రంగా భోజనం చేసి, మామూలుగానే నిద్ర పోయాడు. బిల్లా ఏమీ తినలేదు. ఒక్క నిమిషం కూడా పడుకోలేదు.

రాత్రంతా తన గదిలో అటూఇటూ తిరుగుతూ ఉండిపోయాడు.

1982 జనవరి 31న ఉదయం వాళ్లద్దరి తలలకు నల్ల ముసుగు వేశారు. ఆ తర్వాత బిల్లా, రంగాల మెడ చుట్టూ ఉరితాడు బిగించారు.

''ఉదయం 5 గంటలకు వాళ్లను నిద్ర లేపాం. స్నానం చేయమని చెప్పాం. రంగా స్నానం చేశాడు. బిల్లా చేయలేదు. ఉరి తీయడానికి ముందు.. బయటేం జరుగుతుందో వారికి తెలియకుండా, వారి తలలకు నల్లటి ముసుగులు తొడిగాం. ఉరి తీసేటప్పటికీ బిల్లా ఏడుస్తూనే ఉన్నాడు. రంగా మాత్రం ఉత్సాహంగా కనిపించాడు. 'జో బోలే సో నిహాల్, సత్‌శ్రీ అకాల్' అని నినాదం చేశాడు'' అని సునీల్ గుప్తా చెప్పారు.

''ఉరి తీయడానికి తీసుకెళ్లేముందు బిల్లా, రంగాల మొహాలు రంగు మారిపోయాయి. భయంతో వారి ముఖం నల్లగా మారిపోయినట్లు అనిపించింది'' అని అన్నారు.

నిర్ణీత సమయానికి జైలు సూపరింటెండెంట్ ఆర్య్ భూషణ్ శుక్లా ఎర్ర రుమాలు ఊపారు. ఫకీరా సాయంతో కాలూ లివర్ లాగారు.

ఆ తర్వాత కొన్నేళ్ల వరకూ శుక్లా.. 'బిల్లా, రంగాలను ఉరిలో ఉపయోగించిన రుమాలు ఇదే' అంటూ ఆ రుమాలును తన స్నేహితులకు చూపించుకుంటూ వచ్చారు.

ఉరి తీసిన రెండు గంటల తర్వాత వైద్యులు బిల్లా, రంగా శరీరాలను పరీక్షించారు. బిల్లా చనిపోయాడు. రంగా నాడి మాత్రం కొట్టుకుంటూ ఉంది.

''దోషి బరువు ఎంతున్నాడన్నది ముఖ్యం. రంగా శరీరం పెద్దది. ఉరి తీసేటప్పుడు అతడు శ్వాసను బిగబట్టాడు. అందుకే వెంటనే అతడి ప్రాణం పోలేదు. జైలు సిబ్బంది ఒకరు కిందకు వెళ్లి, అతడి కాళ్లను లాగారు. అప్పుడు అతడి ప్రాణం పోయింది. అప్పట్లో ఉరి శిక్ష తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించాలన్న నిబంధన లేకపోవడం మంచిదైంది. లేకపోతే 'బయటి ప్రమేయం'తోనే అతడిని చంపినట్లు వార్తలు బయటకు వచ్చేవి. 32 ఏళ్ల తర్వాత శత్రుఘన్ చౌహాన్ కేసులో ఉరి శిక్ష అమలు చేశాక పోస్ట్‌మార్టం నిర్వహించడం తప్పనిసరి అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఉరి తీసేటప్పుడు, లివర్‌ను మరీ బలంగా లాగడం వల్ల మెడ, మొండెం వేరైన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఉరి తర్వాత వ్యక్తి మొహం భయకరంగా మారిపోతుంది. ఒక్కోసారి నాలుక, కళ్లు బయటకు వస్తుంటాయి. అయితే, అప్పట్లో జైల్లో జరిగిన విషయం బయటివారికి ఎవరికీ తెలియదు. దాన్ని పట్టించుకున్నవారు కూడా లేరు'' అని సునీల్ గుప్తా అన్నారు.

బిల్లా, రంగా శరీరాలను తీసుకువెళ్లేందుకు వారి బంధువులు ఎవరూ ముందుకురాలేదు. జైల్లోనే వారికి అంత్యక్రియలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'

'దిశ' నిందితుల ‘ఎన్‌కౌంటర్’... కాల్చి చంపాలనుకుంటే చట్టాలు, కోర్టులతో పనేముంది?