‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన

  • 3 డిసెంబర్ 2019
నాలుగో నిందితుడి భార్య

దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల్లో ముగ్గురు ఒకే గ్రామానికి చెందినవారు కాగా, మరొకరు పక్క ఊరి యువకుడు.

నిందితుల ఇల్లు చూపించడానికి ఓ గ్రామస్థుడు తనంతట తానే మాతో వచ్చారు. తమ ఊరివారు ఇలాంటి హేయమైన పనిచేయడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని ఆయన మాతో అన్నారు.

"మాలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలు. బతుకుదెరువు కోసం చిన్నాచితకా పనులు చేసుకుంటాం" అన్నారాయన. ఈ గ్రామం హైదరాబాద్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పోలీసులు రెండో నిందితుడిగా పేర్కొన్న వ్యక్తి తల్లి రెండే గదులున్న ఒక పూరి గుడిసెలో ఉంటున్నారు. ఆమె చాలా బలహీనంగా, కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కూలి పని చేసి ఇంటికి వచ్చిన భర్తతో మాట్లాడాలని ఆమె మాకు చూపించారు.

ఏం జరిగిందో తనకు తెలియదని ఆయన చెప్పుకొచ్చారు. "నాకిద్దరు కొడుకులు, ఒక కూతురు. రేపు నా కూతురికే అలాంటిది జరిగితే మౌనంగా కూర్చోలేను. అందుకే వాళ్లు చెప్తున్నట్లు నిజంగా మా కొడుకు చేసుంటే, వాడిని ఉరి తీసి చంపేయమనే చెబుతున్నా " అని చేతులు జోడించి చెప్పారాయన.

నవంబర్ 28 రాత్రి కొడుకు పని నుంచి తిరిగి వచ్చినప్పుడు చివరిసారిగా అతడితో మాట్లాడినట్టు ఆయన తెలిపారు.

చిత్రం శీర్షిక ఒక నిందితుడి తల్లిదండ్రులు

'నా కొడుకు కోసం న్యాయవాదిని పెట్టుకోవాలని లేదు'

"మా అబ్బాయి నాకేం చెప్పలేదు. ఆ రోజు అతడు నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. అప్పుడు కూడా నాకు ఇలాంటిది జరిగిందని తెలియదు. నన్ను పోలీసులు స్టేషన్‌కు రమ్మని పిలిచినప్పుడే ఈ కేసు గురించి నాకు తెలిసింది. నేను నా కొడుకు కోసం లాయర్ని పెట్టుకునే పరిస్థితుల్లో కూడా లేను. లాయర్ని పెట్టుకోవాలని కూడా నాకు లేదు. ఒకవేళ నా కొడుకు అలాంటి పని చేసుంటే నా డబ్బు, శక్తి పెట్టి అతన్ని రక్షించాలని నేను అనుకోవడం లేదు" అన్నారు నిందితుడి తండ్రి.

ఇంకో నాలుగు వీధులు దాటివెళ్తే నాలుగో నిందితుడి ఇల్లు ఉంది. అది మూడు గదుల పక్కా ఇల్లు. ఇంటి ముందు నిందితుడి తల్లి, భార్య కూర్చుని ఉన్నారు.

భార్య ఏడు నెలల గర్భంతో ఉన్నారు.

"మాది ప్రేమ వివాహం. నాకు అతను ఏడాదిన్నరగా బాగా తెలుసు. ఎనిమిది నెలల క్రితం పెళ్లైంది. పెళ్లికి అతని తల్లితండ్రులు మొదట ఒప్పుకోలేదు. కానీ తర్వాత ఒప్పుకున్నారు" అని ఆమె చెప్పారు.

మాటల మధ్యలో నిందితుడి తల్లి కల్పించుకొని, తన కొడుక్కు మూత్రపిండాల వ్యాధి ఉందనీ, రెండేళ్లుగా మందులు వాడుతున్నాడనీ చెప్పారు.

"నా కొడుకు అలాంటి పని చేశాడంటే నమ్మలేను. ఎవరో బలవంతంగా వాడి చేత మందు తాగించి ఇందులో ఇరికించారనే అనుకుంటున్నాను" అన్నారామె.

ఆ వార్త చూసినప్పుడు చాలా బాధపడ్డానన్నారు నిందితుడి భార్య.

"ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే. నాకు చాలా బాధేసింది. మా ఆయన చేశాడా, లేదా అనేది నేను మాట్లాడను. కానీ జరిగింది సరికాదు. ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు" అన్నారామె.

చిత్రం శీర్షిక ఎరుపు లైన్: బాధితురాలు వచ్చి, తన వాహనాన్ని పార్క్ చేసిన మార్గం; నీలం లైన్: నిందితులు ఆమె వాహనాన్ని తీసుకెళ్లిన మార్గం

మూడో నిందితుడి ఇంటికి మేం వెళ్లే సరికి ఎవరూ లేరు.

ఈ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో మొదటి నిందితుడి ఊరు ఉంది. ఒకే గది ఉన్న గుడిసె ముందు, నిందితుడి తల్లి, తండ్రి కూర్చుని ఉన్నారు. బలహీనంగా, మాట్లాడటం కూడా కష్టంగా ఉన్నట్లు వారు కనిపించారు.

తమ అబ్బాయి ఏం చేస్తున్నాడో తమకు తెలియదని చెప్పుకొచ్చారు.

"అతను ఇంటి దగ్గర సరిగా ఉండడు. స్నానం చేయడానికి వచ్చి, వెళ్లిపోతాడు. ఇంట్లో అతనొక్కడే సంపాదిస్తున్నాడు కాబట్టి మేం అతణ్ణి పెద్దగా ఏమీ అడగం" అని చెప్పారు తల్లి.

చిత్రం శీర్షిక మరో నిందితుడి తల్లిదండ్రులు

ఈలోపు చుట్టుపక్కలవారు గుమిగూడారు. వాళ్లబ్బాయి ఏం చేశాడన్నది తల్లిదండ్రులకు తెలియదని వారు చెప్పారు.

నవంబరు 28న సాయంత్రం తమ కొడుకు ఇంటికి వచ్చినట్టు తండ్రి చెప్పారు.

"తను నడిపిన లారీ యాక్సిడెంట్లో చిక్కుకుందని చెప్పాడు. స్కూటరు నడుపుతున్న మహిళను ఢీకొట్టానని, ఆమె చనిపోయిందనీ చెప్పాడు. నేను అతణ్ని మందలించాను. నువ్వు బాధ్యతతో ఉండాలని చెప్పాను. అతను మాతో ఏదైనా విషయం చెప్పడం అదే మొదటిసారి. మా ఇంటికి పోలీసులు వచ్చాకే అతను ఏం చేశాడన్నది మాకు తెలిసింది " అని తండ్రి వివరించారు.

తమ కొడుకు ఎలా మారిపోయాడో తమకు తెలియదని తల్లితండ్రులు చెప్పారు.

అప్పుడే మాతో మాట్లాడిన పక్కింటి వ్యక్తి ఒకరు- ఈ ఘటన తమకు 'షాక్' అన్నారు. "కానీ, మొదటి నిందితుడు ఇలా చేశాడంటే నేను ఆశ్చర్యపోలేదు. అతను మద్యానికి బానిసైపోయాడు. మంచి బతుకుతెరువు చూసుకో అని చెప్పాలని చూశాను. అతను నాకు సుమారు పదేళ్ల నుంచి తెలుసు" అని ఆయన తెలిపారు.

నవంబర్ 29 తెల్లవారుజామున నిందితులను పోలీసులు తీసుకెళ్లినట్టు వారి కుటుంబ సభ్యులు చెప్పారు.

అర్ధరాత్రి ఒంటిగంటకు పోలీసులు వచ్చినట్టుగా రెండో నిందితుడి తండ్రి చెప్పారు. "వాళ్లు మా అబ్బాయిని పిలిచారు. మా అబ్బాయి బండి దగ్గరకు వెళ్లి బండి ఎక్కుతున్నాడు. 'మా వాడిని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎవరు మీరు' అని అడిగాను. పోలీసులమని వారు చెప్పారు. మా అబ్బాయి పనిచేసే లారీ యజమాని కూడా అందులోనే ఉన్నారు. మా అబ్బాయిని మొదటి నిందితుడి ఇంటికి దారి చూపించాలని అడిగారు. ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. తర్వాత పోలీసులు నన్ను స్టేషన్‌కు పిలిపించినప్పుడు ఏం జరిగిందో అర్థమైంది" అని ఆయన వివరించారు.

మిగతా నిందితుల కుటుంబాల వారు కూడా తమ పిల్లలను పోలీసులు ఇలానే తీసుకెళ్లినట్టు చెప్పారు.

చిత్రం శీర్షిక షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసనలు

నిందితులను షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. వారిని తమకు అప్పగించాలనీ, వారిని చంపేయాలంటూ బయట ఆందోళనకారులు పెద్ద నిరసన చేపట్టారు.

వారిని బయటకు తీసుకెళ్లే పరిస్థితి లేక, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌నే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వారిని ఆయన ఎదుట హాజరు పరిచారు.

నవంబరు 30న ఆ నలుగురికీ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్.

తర్వాత వాళ్లను హైదరాబాద్ చర్లపల్లి జైలుకు తరలించారు.

ఆ నలుగురినీ తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. నిందితుల భద్రత దృష్ట్యా ఈ విషయంపై పోలీసులు ఏమీ మాట్లాడటం లేదు.

నేరపూరిత కుట్రతో బాధితురాలిని ఎత్తుకుపోవడం, దొంగతనం, మూకగా లైంగిక దాడి, క్రూరమైన హత్య, మృతదేహాన్ని కాల్చడం అనే నేరాలకు నిందితులు పాల్పడినట్లు పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు.

కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని, నేరానికి పాల్పడ్డవారికి కఠిన శిక్ష పడేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

మహిళలపై అత్యాచారాలకు రవాణా సౌకర్యాలు కొరత కూడా ఒక కారణమా?

ఆంధ్రప్రదేశ్: 'దిశ' బిల్లులకు శాసనసభ ఆమోదం

'పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకించే వారితో చర్చలకు సిద్ధం' - అస్సాం సీఎం

బోరిస్ జాన్సన్: బ్రిటన్ ప్రధానిగా మళ్ళీ కన్సర్వేటివ్ నేత... ఎన్నికల్లో టోరీల ఘన విజయం

ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు: పాకిస్తాన్ హిందూ శరణార్థులు

గొల్లపూడి మారుతీరావు (1939-2019): "ఒక్క జీవితంలోనే పది జీవితాలు చూసిన మనిషి"

ఏపీ అసెంబ్లీ: చంద్రబాబును మార్షల్స్ తోసేశారు.. టీడీపీ; మార్షల్స్‌ను పీక పట్టుకుని బెదిరించారు.. వైసీపీ

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు