దిశ అత్యాచారం, హత్య: భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?

  • 4 డిసెంబర్ 2019
మహిళల నిరసన Image copyright Getty Images
చిత్రం శీర్షిక దిశ అత్యాచార కేసు తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.

అత్యంత పాశవికమైన 'దిశ' అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని మరోసారి షాక్‌కు గురిచేసింది.

2012 నిర్భయ ఘటన తర్వాత ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం అనేక మంది రోడ్ల మీదికొచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

గత వారంలోనే దేశంలో మరో అయిదు రేప్ కేసులు నమోదయ్యాయని మీడియా కథనాలు చెబుతున్నాయి.

మరి, ఈ అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి? ఈ కేసుల్లో బాధితులకు సరైన న్యాయం అందుతోందా?

చట్టాలు ఎలా ఉన్నాయి?

2012 డిసెంబర్‌ 16న దేశ రాజధాని దిల్లీలో జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అనేక మంది రోడ్ల మీదికొచ్చి నిరసనలు వ్యక్తం చేశారు. దాంతో, 2013లో కేంద్ర ప్రభుత్వం కఠినమైన అత్యాచార నిరోధక చట్టాన్ని (నిర్భయ చట్టం) తీసుకొచ్చింది.

నిర్భయ చట్టంతో యాసిడ్ దాడులు, లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడటం లాంటి నేరాల్లో శిక్షలు కాస్త కఠినతరం అయ్యాయి.

జైలు శిక్షను పెంచడంతో పాటు, తీవ్రమైన అత్యాచార నేరాలకు పాల్పడే వారికి మరణ శిక్ష పడేలా ఈ చట్టంలో ఉంది.

చిత్రం శీర్షిక ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళితే అవమానాలకు గురవుతున్నామని చాలా మంది బాధితులు చెబుతున్నారు.

ఈ చట్టాలు బాధితులకు ఉపయోగపడ్డాయా?

మంచి విషయం ఏటంటే, గతంతో పోల్చితే ఇప్పుడు ఎక్కువ మంది తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.

జాతీయ నేర గణాంకాల బ్యూరో నివేదికల ప్రకారం, 2008లో 21,467 మంది బాధిత మహిళలు ఫిర్యాదు చేయగా, 2016 నాటికి ఆ సంఖ్య 38,000కి పెరిగింది.

అయితే, ఇప్పటికీ తమపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేయడంలో, న్యాయం పొందడంలో మహిళలు అవరోధాలు ఎదుర్కొంటున్నారు.

బాధిత బాలికలు, మహిళలు ఇప్పటికీ పోలీసు స్టేషన్లలో, ఆస్పత్రుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన న్యాయ సహాయం, వైద్య సేవలు అందుబాటులో ఉండట్లేదని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదిక చెబుతోంది.

బాధితులకు న్యాయం అందుతోందా?

దేశంలో న్యాయవ్యవస్థ ఇప్పటికీ కొన్నిసార్లు రాజకీయపరమైన ఒత్తిళ్లకు లోనవుతోంది. అందుకే, కొందరు బడా నేతల ప్రమేయం ఉన్న కొన్ని కేసుల్లో నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు.

కోర్టు తీర్పుల్లోనూ జాప్యం జరుగుతోంది. అనేక కేసుల్లో విచారణలు నెలలు, సంవత్సరాలు కొనసాగుతున్నాయి.

2018లో వెల్లడైన పరిశోధనా నివేదిక ప్రకారం, దేశంలో నమోదవుతున్న ప్రతి నాలుగు అత్యాచార కేసుల్లో ఒక్క దాంట్లోనే దోషులకు శిక్షలు పడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో నమోదైన రేప్ కేసుల్లో కేవలం 12 శాతం నుంచి 20 శాతం కేసుల్లోనే విచారణ పూర్తయ్యింది.

రేప్ బాధితుల్లో అనేక మంది సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.

పెండింగ్‌లో ఉన్న అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేసేందుకు దేశంలో కొత్తగా 1,000 ఫాస్ట్‌-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అలాంటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిగిన కేసుల్లో 2012 నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు ఒకటి.

ఆ కేసులో నలుగురు నిందితులకు మరణ శిక్షను సమర్థిస్తూ 2017లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయినా, వారికి శిక్ష అమలు చేయాలంటే ఇంకా నెలలు, సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

చిత్రం శీర్షిక జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం అత్యాచార ఘటనలు ఏటా పెరుగుతున్నాయి.

లైంగిక హింస రేటు తగ్గుతోందా?

దేశంలో మహిళల పట్ల లైంగిక హింస తగ్గుతున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవు.

ప్రపంచంలో మహిళలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉందని గత ఏడాది థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ సర్వే వెల్లడించింది. అంతర్గత సంక్షోభాలతో సతమతమవుతున్న అఫ్గానిస్తాన్, సిరియాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని తెలిపింది.

తాజా అధికారిక నేర గణాంకాల ప్రకారం, 2017లో దేశవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో 33,658 అత్యాచార కేసులు నమోదయ్యాయి. అంటే, రోజూ సగటున 92 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దేశంలో ఇప్పటికీ చాలా రేప్ కేసుల్లో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదు.

బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.

2012 నుంచి 2016 మధ్య కాలంలో దేశంలో బాలికల మీద అత్యాచారాలకు సంబంధించిన కేసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

పితృస్వామ్య వ్యవస్థ, శతాబ్దాలుగా కొనసాగుతున్న మహిళల పట్ల వివక్ష, లింగ నిష్పత్తిలో వ్యత్యాసాలు లాంటివి మహిళలపై నేరాలు పెరగడానికి కారణమై ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు.

అక్రమ అబార్షన్లతో దేశంలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. ప్రతి 100 మంది బాలికలకు, 112 మంది బాలురు జన్మిస్తున్నారు.

అత్యధిక గ్యాంగ్ రేప్ కేసులు నమోదయ్యే హరియాణా రాష్ట్రంలో లింగ నిష్పత్తి అత్యంత దారుణంగా ఉంది.

"గత రెండు దశాబ్దాలుగా దేశం ఆర్థికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ, పాశ్చాత్య ఉదారవాదం పట్ల అవగాహన పెరుగుతున్నా, ఇప్పటికీ దేశంలో చాలామంది పురుషులు మహిళలను ఒక వస్తువుగా చూస్తున్నారు" అని దక్షిణాసియాలో మహిళల సమస్యలపై కథనాలు రాసే జర్నలిస్టు నీతా భల్లా అన్నారు.

భారతీయ చిత్రాల్లో బూతు, అసభ్యత ఎక్కువగా కనిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారు.

''బాలీవుడ్‌తో సహా అనేక ప్రాంతీయ చిత్రాల్లో చెడ్డవాళ్లను కూడా హీరోలుగా చూపించడం, క్రూరత్వాన్ని గొప్పగా ప్రదర్శించడం, వేధింపులను ప్రణయంగా, ఆమోదయోగ్యంగా చిత్రీకరించడం జరుగుతోంది'' అని బీబీసీ ఇండియా విమెన్ అఫైర్స్ ఎడిటర్ దివ్య ఆర్య అన్నారు.

''మహిళల హక్కులు, భద్రత ఎన్నికల్లో అంశంగా ఎప్పుడూ లేదు. ప్రజల్లోనూ ఇలాంటి ఘటనలపై ఉదాసీనత ఉంది'' అని బీబీసీ ప్రతినిధి సౌతిక్ బిస్వాస్ అన్నారు.

''అనేక రాజకీయ పార్టీలు, ప్రధాని మోదీకి చెందిన బీజేపీతో సహా ఏ పార్టీ కూడా దీన్నో సామాజిక సంక్షోభంగా గుర్తించడం లేదు'' అని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్ అత్యాచారం కేసు తర్వాత పరిణామాలు ఏమిటి?

హైదరాబాద్‌లో పశువైద్యురాలు దిశ అత్యాచారం, హత్య ఘటన తర్వాత ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది.

బాధితురాలు డయిల్ 100కు ఎందుకు ఫోన్ చేయలేదని స్థానిక అధికారులు ప్రశ్నించారు.

అయితే, దీనిపై బాధితురాలు సోదరి బీబీసీతో మాట్లాడుతూ ''ఆమె అప్పటికే తీవ్రంగా భయపడి ఉంది. ఆందోళనతో ఉంది. ఇంకా ఎలా ఫోన్ చేయగలదు'' అని అన్నారు.

బాధితురాలికి మద్దతుగా ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

మరోవైపు, ఈ ఘటనలో నిందితులుగా ఉన్న వారి కుటుంబాలు మీడియాతో మాట్లాడాయి. తమ వాళ్లు తప్పు చేస్తే వారిని శిక్షించాలని కోరాయి.

''వారికి ఏ శిక్షనైనా విధించండి. నాకూ ఓ కూతురు ఉంది. ఆ తల్లి బాధను అర్థం చేసుకోగలను'' అని ఓ నిందితుడి తల్లి పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

బాధితురాలి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యారు. తమను పరామర్శించడానికి ఎవరూ రావొద్దని ఇంటి ముందు ప్లకార్డులు పెట్టారు. తమకు పరామర్శలు వద్దని, న్యాయం కావాలని అడుగుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు, గువాహటిలో కర్ఫ్యూ, 10 జిల్లాల్లో ఇంటర్‌నెట్ నిలిపివేత

‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’

రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ

పౌరసత్వ సవరణ బిల్లు: రాజ్యసభలో బీజేపీ సమీకరణలను శివసేన మార్చగలదా?

అభిప్రాయం: 'పౌరసత్వ బిల్లును పార్టీలు జాతీయ భద్రత, మానవీయ కోణంలో చూడాలి'

బ్రిటన్ ఎన్నికల్లో కశ్మీర్ ప్రస్తావన ఎందుకు వస్తోంది... మతం ప్రధానాంశంగా ఎలా మారింది?

బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి