కైలాస: నిత్యానంద సొంత దేశం... ‘మాది రాజకీయేతర హిందూ దేశం' - ప్రెస్ రివ్యూ

  • 4 డిసెంబర్ 2019
Image copyright NITHYANANDA / TWITTER

అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామీజీ నిత్యానంద సొంతంగా ఓ దేశాన్నే ఏర్పాటు చేసుకున్నారని.. ఈక్వెడార్‌ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి 'కైలాస' అనే పేరు కూడా పెట్టారని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఉన్న తన ద్వీప దేశానికి నిత్యానంద ఒక పాస్‌పోర్ట్‌ను, జెండాను, జాతీయ చిహ్నాన్ని డిజైన్‌ చేశారు. ఒక ప్రభుత్వాన్ని, ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజూ కేబినెట్‌ భేటీలు కూడా జరుపుతున్నారని సమాచారం.

ప్రధానిగా 'మా'ని నియమించారని, గోల్డ్, రెడ్‌ కలర్లలో పాస్‌పోర్ట్‌ను రూపొందించారని ఆ 'దేశ' వెబ్‌సైట్‌ పేర్కొంది. తన 'కైలాస'కు ఒక దేశంగా గుర్తింపునివ్వాలని కూడా నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నారు.

హిందూత్వని ప్రచారం చేస్తున్నందువల్ల భారత్‌లో తన జీవితం ప్రమాదంలో పడిందని ఐరాసకు పంపనున్న వినతి పత్రంలో నిత్యానంద పేర్కొన్నారు. కైలాస రాజకీయేతర హిందూ దేశమని, హిందూత్వ పునరుద్ధరణ కోసం కృషి చేస్తుందని ఆ వెబ్‌సైట్లో చెప్పారు. తమ దేశ పౌరసత్వం కావాలనుకునేవారు విరాళాలు ఇవ్వాలనే విజ్ఞప్తిని కూడా అందులో పొందుపర్చారు.

మెరూన్‌ కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ సింహాసనం ముందు నిత్యానంద కూర్చుని ఉండగా పక్కన నంది ఉన్న చిత్రంతో జెండాను రూపొందించారు. ప్రభుత్వంలో 10 శాఖలను కూడా ఏర్పాటుచేశారు. అందులో ఒకటి నిత్యానంద స్వామి కార్యాలయం కాగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ, సోషల్‌ మీడియా, హోం, కామర్స్, విద్య.. మొదలైన ఇతర శాఖలు ఉన్నాయి.

తమది సరిహద్దులు లేని దేశమని, తమ తమ దేశాల్లో స్వేచ్ఛగా హిందూయిజాన్ని అనుసరించలేని వారి కోసం ఈ దేశం ఏర్పాటయిందని కైలాస వెబ్‌ సైట్లో పేర్కొన్నారు. తమ దేశంలో ఉచితంగానే భోజనం, విద్య, వైద్యం లభిస్తాయని, ఆధ్యాత్మిక విద్య, ప్రత్యామ్నాయ వైద్య విధానాలపై దృష్టి పెడతామని ఆ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

'మాది భౌగోళికపరమైన దేశం కాదు. ఒక భావనాత్మక దేశం. శాంతి, స్వేచ్ఛ, సేవాతత్పరతల దేశం. ఏ దేశ ఆధిపత్యం కిందా లేని మేం ఇతర దేశాలతో, అంతర్జాతీయ సంస్థలతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాం' అని అందులో తెలిపారు.

నకిలీ పాస్‌పోర్ట్‌తో, నేపాల్‌ మీదుగా ఇటీవల నిత్యానంద పారిపోయారు.

Image copyright SCR/Facebook

రైల్వే అప్రెంటిస్‌షిప్‌లో తెలుగువారికి అన్యాయం

రైల్వే సంస్థల్లో అప్రెంటిస్‌షిప్‌ల ఎంపికలో ఇతర రైల్వే జోన్లు స్థానికుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంటే.. సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తోందని అభ్యర్థులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో ఆరు డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలోకి వచ్చే లాలాగూడ వర్క్‌షాప్‌, విజయవాడ, కాజీపేట, గుంతకల్లు, మౌలాలిలలో డీజిల్‌ లోకోషెడ్లు సహా మొత్తం 24 చోట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైల్వే విభాగాల్లో 4,103 అప్రెంటిస్‌షిప్‌ల ఖాళీల భర్తీకి కొద్ది రోజుల క్రితం రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (ఆర్‌ఆర్‌సీ) ద్వారా దక్షిణ మధ్య రైల్వే ప్రకటన ఇచ్చింది.

పదో తరగతితో పాటు ఐటీఐ విద్యార్హత ఉన్నవారు వీటికి అర్హులు. దేశంలో ఈ అర్హతలున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే వెసులుబాటు కల్పించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

చెన్నై కేంద్రంగా ఉన్న సదరన్‌ రైల్వే అప్రెంటిస్‌షిప్‌ల భర్తీకి డిసెంబరు 1 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జోన్‌ భౌగోళిక ప్రాంతం పరిధిలోకి వచ్చే ప్రాంతాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిబంధన విధించింది. తద్వారా ఆ జోన్‌ స్థానికులకే అవకాశం లభిస్తుంది. మరికొన్ని జోన్లూ ఇదే పంథాలో వెళ్తున్నాయి.

ఇతర జోన్లలో స్థానికులకే అప్రెంటిస్‌షిప్‌ అవకాశం ఇస్తున్నారని దక్షిణ మధ్య రైల్వేకు కొందరు సూచించినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే విషయమై తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌కు ఇటీవల లేఖ రాసినా స్పందించలేదు.

దక్షిణ మధ్య రైల్వేలో అప్రెంటిస్‌షిప్‌ దరఖాస్తుకు డిసెంబరు 8వ తేదీ వరకు అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల పరిధిలోని ఎంపీలు రైల్వే శాఖ, దక్షిణ మధ్య రైల్వేపై ఒత్తిడి తెస్తే ప్రస్తుత ప్రకటనను రద్దు చేసి జోన్‌ పరిధిలో స్థానికులకే అవకాశం కల్పించేలా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంటుంది.

దక్షిణ మధ్య రైల్వేలో 81 వేల మంది ఉద్యోగులున్నారు. 14 వేలకు పైగా ఖాళీలున్నాయి. ఇప్పుడున్న ఉద్యోగులతో పాటు అప్రెంటిస్‌షిప్‌ చేస్తున్నవారిలో బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల వారే అధికంగా ఉన్నారు. ఉద్యోగాల కోసం దక్షిణ మధ్య రైల్వేకు వస్తూ కొన్నాళ్ల తర్వాత సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.

ఆర్‌ఆర్‌బీ తాజాగా దేశవ్యాప్తంగా భర్తీ చేస్తున్న 70 వేల ఉద్యోగాల్లో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 7 వేల ఖాళీలున్నాయి. ఇందులో రైల్వేల్లో అప్రెంటిస్‌షిప్‌ చేసిన వారికే 1,400 ఉద్యోగాలు రాబోతున్నాయి. తాజాగా దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్‌షిప్‌ల భర్తీ విధానంతో మళ్లీ ఉత్తరాది రాష్ట్రాలవారే ఎక్కువ మంది వస్తారని.. భవిష్యత్తులో చేపట్టే రైల్వే నియామకాల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారికి నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి.

Image copyright Getty Images

రైలు చార్జీల పెంపు... మెయిల్స్‌, ఎక్స్‌ప్రెస్‌లలో 5-10 శాతం వరకు!

రైళ్లలో ప్రయాణికుల చార్జీలు పెరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని.. ఆర్థిక మాంద్యం ప్రభావం ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ఈ దిశగా రైల్వే బోర్డు అడుగులు వేస్తోందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 5 నుంచి 10 శాతం వరకు చార్జీలు పెంచవచ్చని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున చార్జీల ప్రకటన ఉండకపోవచ్చు. అవి ముగిశాక ప్రకటించే అవకాశాలున్నాయి.

మోదీ సర్కారు వచ్చిన తర్వాత తొలిసారి 2014 జూన్‌ 25న చార్జీలు పెంచారు. అప్పట్లో ప్రయాణికుల చార్జీలు 14.2 శాతం పెరగగా.. రవాణా చార్జీలను 6.5 శాతానికి పెంచారు. ఇప్పుడు పెంచితే ఐదున్నరేళ్లలో పెంపు రెండో సారి అవుతుంది.

రైల్వేకు ఏసీ రైళ్లు ఆదాయ వనరుగా మారాయని కాగ్‌ వెల్లడించింది. మెయిల్స్‌/ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఉండే ఏసీ త్రీ టైర్‌తో పాటు ఇవి కూడా లాభసాటిగా మారాయని పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. '2016-17లో ఏసీ త్రీటైర్‌, ఏసీ చైర్‌కార్‌లతో పోల్చితే మిగతా సర్వీసుల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఏసీ సర్వీసులు ఆ నష్టాన్ని పూడ్చాయి' అని తెలిపింది.

రేషన్ కార్డు Image copyright Getty Images

‘ఒక దేశం ఒకే రేషన్‌ కార్డు’: జూన్‌ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలు

రేషన్‌ కార్డు ఉన్న పేదలు దేశంలోని ఏ ప్రాంతంలోని రేషన్‌ దుకాణానికైనా వెళ్లి అక్కడ లభించే సరుకులను కొనుగోలు చేసే సదుపాయం వచ్చే ఏడాది జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం మంగళవారం లోక్‌సభకు తెలిపినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఈ పథకం వల్ల వలస కార్మికులు, దినసరి కూలీలు లబ్ధి పొందుతారని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరా శాఖల మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ చెప్పారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద లబ్ధిదారులు దేశంలోని ఏ రేషన్‌ దుకాణానికైనా వెళ్లి తమకు నిర్దేశించిన ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చన్నారు.

అయితే సదరు రేషన్‌ దుకాణంలోని 'ఈపోస్‌ (ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌)లో వేలిముద్రలు/ఆధార్‌ కార్డును ధ్రువీకరించుకోవడం ద్వారా మాత్రమే ఈ సదుపాయం పొందవచ్చని స్పష్టం చేశారు.

దేశ పౌరులకు అన్ని సదుపాయాలు పొందేందుకు వీలుగా ఒకే కార్డును జారీచేసే ఆలోచనేదీ లేదని ప్రభుత్వం తెలిపింది.

లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ మాట్లాడుతూ, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జాతీయ జనాభా రిజిస్టర్‌ను సిద్ధంచేసి, తాజాపరచాలని తమ ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి