జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగం ఉంటుందా?

హైదారాబాద్ శివార్లలోని షాద్‌నగర్ వద్ద దిశ అత్యాచారం, హత్య ఘటన తరువాత జీరో ఎఫ్ఐఆర్ అంశం తెరమీదకు వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా చర్చ జరుగుతోంది. ఇంతకీ నిజంగా ఈ జీరో ఎఫ్ఐఆర్ వల్ల అంత ఉపయోగం ఉంటుందా?
పోలీసులకు మనం ఏదైనా ఫిర్యాదు ఇస్తే దాన్ని నమోదు చేసుకుంటారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) అంటారు. ఇది నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి. కానీ జీరో ఎఫ్ఐఆర్ అంటే నేరం ఎక్కడ జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా, దగ్గర్లో లేదా అందుబాటులో లేదా తెలిసిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. తరువాత ఆ స్టేషన్ వారే ఆ కేసును సంబంధిత పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేస్తారు.
నిర్భయ కేసు తరువాత వచ్చిన అనేక చట్టపరమైన మార్పుల్లో ఇదొకటి. జస్టిస్ వర్మ కమిటీ నివేదిక ఆధారంగా క్రిమినల్ లా సవరణ చట్టం 2013లో ఈ జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్టును ప్రవేశపెట్టారు.
సాధారణంగా పోలీసుల కేసులు అన్నిటికీ ఎఫ్ఐఆర్ నంబరు ఉంటుంది. కానీ ఇలా తమ పరిధి కాని కేసులను తీసుకునేప్పుడు ఆ నంబర్ ఇవ్వకుండా సున్నా నంబర్ ఇస్తారు. తరువాత దాన్ని సంబంధిత స్టేషన్‌కి బదిలీ చేశాక, ఆ రెండవ స్టేషన్ వారు ఎఫ్ఐఆర్ నంబరు ఇస్తారు. ముందుగా జీరో నంబర్‌తో నమోదు చేస్తారు కాబట్టి దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు.
- ‘దిశ’ అత్యాచారం: "నాకు చాలా బాధేసింది.. ఆ బాధితురాలు కూడా సాటి ఆడదే" - ఓ నిందితుడి భార్య ఆవేదన
- షాద్ నగర్ అత్యాచారంపై రేణూ దేశాయ్ అభిప్రాయం: ‘‘ఒక తల్లిగా నేను చేయలిగింది.. నా కూతుర్ని నిరంతరం భయంతో పెంచటం మాత్రమేనా?’’
అంతేకాదు నంబర్ జీరో ఇచ్చారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్ విలువ ఏ మాత్రం తగ్గదు. ఆ నివేదిక విలువ, చట్టపరమైన ప్రక్రియ అంతా మామూలే. అంటే నంబర్ తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ జీరో ఎఫ్ఐఆర్ మామూలు ఎఫ్ఐఆర్తో సమానమే. ఈ విధానం వల్ల ప్రజలకు సరైన పోలీస్ స్టేషన్ తెలుసుకునే బాధ మాత్రమే తప్పుతుంది. అలాగే స్టేషన్‌కి వచ్చిన ఎవర్నీ పోలీసులు వెనక్కు, వేరే స్టేషన్‌కి పంపడానికి వీలుండదు.
కాగ్నిజబుల్ కేసులు - ఏ కేసులో అయితే కోర్టు అనుమతి లేకపోయినా పోలీసు వారు నేరుగా అరెస్టు చేయవచ్చో దాన్ని కాగ్నిజబుల్ కేసులు అంటారు - తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిధితో, ఫిర్యాదుదారు ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది.
బాధితులు, కుటుంబ సభ్యులు, సాక్షులు, నేరస్తులు, పోలీసులు, జడ్జీల ఆదేశాలు, లేదా నేరం గురించి తెలిసిన ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. దాని ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే.
ఒక్క మాటలో చెప్పాలంటే నేరం జరిగిన ప్రాంత పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లో అయినా కేసు పెట్టగలగడమే జీరో ఎఫ్ఐఆర్. దానికి మగ, ఆడ సంబంధం లేదు. అందరికీ వర్తిస్తుంది.
- షాద్ నగర్ వెటర్నరీ డాక్టర్ సోదరి: ‘‘ప్రపంచం ఇంత క్రూరంగా ఉంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు’’
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
2013లోనే ఈ పద్ధతి ప్రారంభం అయినా, వాస్తవంగా చాలా చోట్ల ఇది అమలు కావడం లేదు. తాజా షాద్‌నగర్ ఘటనలో కూడా ఇదే సమస్య ఎదురైందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు, శంషాబాద్, విమానాశ్రయ స్టేషన్లలో పనిచేసే ముగ్గురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ కూడా చేశారు.
సాధారణంగా తమ పరిధి కాని కేసు తీసుకోవడానికి పోలీసులు నిరాకరిస్తుంటారు. ఆ సమస్య రాకూడదనే గతంలో సుప్రీంకోర్టు, కేంద్ర హోంశాఖలు అనేక సందర్భాల్లో జీరో ఎఫ్ఐఆర్ గురించి నొక్కి చెప్పాయి. తాజగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆ వివరాలన్నీ రాశారు.
ఒకవేళ ఎవరైనా పోలీసు అధికారి ఎఫ్ఐఆర్ రాయడానికి తిరస్కరిస్తే ఐపీసీ సెక్షన్ 166 ఏ కింద ఏడాది శిక్ష, జరిమానా విధించవచ్చు. అలాగే సీఆర్పీసీ సెక్షన్ 154 ప్రకారం ఫిర్యాదు చేసే వాళ్లు నోటితో చెప్పిన వివరాలు కూడా పోలీసుల రాసుకుని, కింద సంతకం తీసుకోవాలి. అలాగే ఒక కాపీ ఉచితంగా అందివ్వాలి. రిజిస్టర్లో సంతకం పెట్టాలి.
కర్ణాటక హైకోర్టు 2019 సెప్టెంబరు 19న ఒక రిట్ పిటిషన్ విషయంలో జీరో ఎఫ్ఐఆర్ కచ్చితంగా అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. తన ఉత్తర్వుల్లో భాగంగా, జీరో ఎఫ్ఐఆర్ గురించి 2014 ఫిబ్రవరి 6న కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం పోలీస్ అధికారి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా నేరం గురించి తెలిసిన వెంటనే కేసు కచ్చితంగా తీసుకోవాలని కేంద్ర హోంశాఖ చెప్పింది.
దానికంటే ముందే 2013 నవంబరులో సుప్రీంకోర్టు లలిత కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసులో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇచ్చింది. పోలీసుల శిక్షణలో కూడా జీరో ఎఫ్ఐఆర్ గురించి చేర్చాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల డీజీపీలనూ ఆదేశించింది. ఇదే అంశంపై అన్ని రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీలకూ కేంద్ర హోంశాఖ 2015 అక్టోబర్ 12న ఒక లేఖ రాసింది.
ఇలా జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదయిన సంచలన కేసులు కూడా ఉన్నాయి. ఆశారాం బాపు కేసులో.. ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో జరిగితే, కేసు దిల్లీలోని కమలా మార్కెట్ స్టేషన్లో నమోదు అయింది. తరువాత దాన్ని రాజస్థాన్‌కి బదిలీ చేశారు.
‘‘ఈ జీరో ఎఫ్ఐఆర్ వల్ల తక్షణం స్పందించే అవకాశం ఉంటుంది. సమాజానికి ఉపయోగకరం. ఇది ప్రజా ప్రయోజనం కాబట్టి సీఆర్పీసీ (క్రిమినల్ ప్రోసీజరల్ కోడ్) కి కూడా విరుద్ధం కాదు. జస్టిస్ ఎట్ డోర్ స్టెప్ స్ఫూర్తికి అనుకూలం ఈ జీరో ఎఫ్ఆర్’’ అని విజయవాడకు చెందిన న్యాయవాది బడే రాఘవ రావు బీబీసీతో అన్నారు.
''అవసరంలో ఉన్నవారు, బాధితులు ఇబ్బంది పడకూడదని చేసిన చట్టం ఇది. న్యాయం వేగంగా జరగడం కోసం జీరో ఎఫ్ఐఆర్ అవసరం. షాద్‌నగర్ కేసులో పోలీసుల స్పందన ఆలస్యం అయింది. దానికి వారిని కూడా నిందితులను చేయాలి. న్యాయం ఆలస్యం అయితే, న్యాయం దక్కనట్టే (జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్). న్యాయం వేగంగా జరగాలంటే పోలీసులు ఈ పద్ధతిని పాటించాలి. సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. పోలీసులను ఈ విషయంలో ఆదేశించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది'' అని రాఘవ రావు తెలిపారు.
తాజా ఘటన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై స్పందించింది. రాష్ట్రంలో ఇకపై జీరో ఎఫ్ఐఆర్ తీసుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అలా తీసుకోకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి:
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- 5 నెలలు.. 7 జిల్లాలు.. 2 రాష్ట్రాలు.. 1300 కి.మీ... ఆడ తోడు కోసం తిరిగిన మగ పులి
- ఎయిడ్స్ డే: పాకిస్తాన్లో వందల మంది చిన్నారులకు హెచ్.ఐ.వీ ఎలా సోకింది...
- చంద్రయాన్-2: ‘విక్రమ్ ల్యాండర్ దొరికింది.. కనిపెట్టింది నేనే’
- సర్కెగూడ ఎన్కౌంటర్లో మరణించింది గిరిజనులేనని తేల్చిన జ్యుడిషియల్ కమిటీ
- 'ఒక మహిళ ఒక వ్యక్తితో సెక్స్‌కు అంగీకరిస్తే, దాని అర్థం అతడు ఏం చేసినా ఫరవాలేదని కాదు'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)