కశ్మీర్: మోదీ మోసం చేశారని ఆరోపిస్తున్న భారత్ అనుకూల నేతలు

  • 5 డిసెంబర్ 2019
నిర్బంధానికి గురైన ఫరూక్ అబ్దుల్లా(ఎడమ వైపు) Image copyright Getty Images
చిత్రం శీర్షిక నిర్బంధానికి గురైన ఫరూక్ అబ్దుల్లా(ఎడమ వైపు)

ఆగస్టులో జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక కశ్మీర్‌లో పదుల సంఖ్యలో రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిర్బంధంలో ఉన్నారు. కశ్మీర్‌ లోయలోని రాజకీయ నాయకులు, కార్యకర్తలు తాము మోసపోయామని ఎందుకు అనుకుంటున్నారో వివరిస్తూ 'సమీర్ యాసిర్' కథనమిది.

శ్రీనగర్ నడిబొడ్డు మీదుగా పాకిస్తాన్‌లోకి ప్రవహించే జీలం నదిని తన గది కిటికీ వద్ద దిగులుగా నిల్చుని చూస్తున్నారు సమీర్ మీర్.

కశ్మీర్‌లో ఎప్పటి నుంచో ఉన్న భారత్ అనుకూల నేషనల్ కాన్ఫరెన్సు పార్టీకి ప్రజలతో ఓట్లు వేయించేందుకు ఏళ్లుగా పనిచేస్తున్న మీర్ ఇప్పుడు తన జన్మభూమి నుంచి వెలివేతకు గురయినట్లుగా బాధపడుతున్నారు.

ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న ఈ ప్రాంతంపై దిల్లీ పాలనను వ్యతిరేకిస్తూ సాగిన 30 ఏళ్ల సాయుధ పోరాట సమయంలో భారత పక్షాన నిలిచిన మీర్ వంటి కొందరు కశ్మీరీలపై సొంత ప్రజలే ద్రోహులన్న ముద్ర వేశారు.

''ఇప్పుడు మేం భారత ప్రభుత్వం దృష్టిలోనూ శత్రువులమే'' అన్నారు మీర్.

కొన్నేళ్లుగా తీవ్రమైన హింసకు సాక్షంగా నిలిచిన కుల్గాం జిల్లా మీర్ స్వస్థలం.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన ఎన్నికల్లో ఓటేయడానికి బారులు తీరిన కశ్మీరీలు

'భారత శత్రువులు'

వివాదాస్పద కశ్మీర్ ప్రాంతంలో కల్లోలాన్ని నివారించడానికంటూ ప్రధాని మోదీకి చెందిన పాలక భారతీయ జనతా పార్టీ కఠిన చర్యలకు దిగింది.

కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ ప్రాంతాన్ని కేంద్రం అధీనంలోకి తీసుకుని భారత అనుకూల నేతలు సహా అనేక మంది నాయకులు, రాజకీయ కార్యకర్తలను జైళ్లలో పెట్టింది.

''హింసకు దారితీయగలిగే ఎలాంటి కార్యక్రమాల్లోనూ రాజకీయ నాయకులు పాల్గొనరాదన్నది మా ఉద్దేశం. గతంలో అలా ఎన్నోసార్లు జరిగింది. దీనికి అనుబంధంగా సోషల్ మీడియా, ఇంటర్నెట్‌ను హింసను ప్రేరేపించేందుకు గతంలో వాడుకున్నారు. ప్రాణాలు పోకుండా ఆపాలన్నది మా ఉద్దేశ''మని భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యమ్ జైశంకర్ చెప్పారు.

భారత ప్రభుత్వం నిర్బంధించిన 5000 మందికి పైగా వ్యాపారులు, పౌరులు, న్యాయవాదులు, కార్యకర్తలలో మీర్ కూడా ఒకరు.

ఇప్పటికీ నిర్బంధంలో ఉన్నవారిలో మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఉన్నారు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిర్బంధంలో ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రి అబ్దుల్లా ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు. ఆయన్ను వివాదాస్పద ప్రజాభద్రతా చట్టం(పీఎస్‌ఏ) ప్రకారం అరెస్టు చేశారు. ఈ చట్టం ప్రకారం ప్రాథమిక అభియోగాలు లేకుండానే రెండేళ్లు నిర్బంధంలో ఉంచొచ్చు.

కశ్మీర్ భవితను దిల్లీ చేతిలో పెట్టడంలో కీలకపాత్ర పోషించిన కుటుంబానికి చెందిన అబ్దుల్లా నిర్బంధానికి ముందు టీవీల్లో కనిపించారు.

''ఇంతకాలం మీ పక్షాన నిలిచాను, ఇప్పుడు మీరు నా పక్షాన నిలవాల్సిన సమయమొచ్చింద''ని ప్రజలకు విజ్ఞప్తి చేశారాయన.

పీడీపీకి చెందిన ఎంపీ మీర్ మొహమ్మద్ ఫయాజ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో నిర్బంధంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను విడుదల చేయాలని కోరారు.

నిర్బంధంలో ఉన్న నాయకులను ఇటీవలే అత్యంత అవమానకరమైన రీతిలో వేరే జైలుకు తరలించారని ఆయన తన లేఖలో ఆరోపించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2014లో మెహబూబా ముఫ్తీ ఎన్నికల ప్రచారం

మధ్యేమార్గం ముగిసింది

కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలు ఎన్నడూ మధ్యేమార్గంగా పనిచేసేవి. భారత్‌లో విలీన ప్రాంతంగా ఉంటూనే పూర్తి స్వతంత్రతను కోరుకుంటుండేవి.

భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనడం, ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా వారు ఈ ప్రాంత వ్యవహారాల్లో దిల్లీ జోక్యానికి వీలు కల్పించే హక్కును అంగీకరించారు. కానీ, ఎన్నికలలో ఓట్ల సాధనకు గాను వారు ప్రజల్లో ఉన్న సెంటిమెంటుపై మాట్లాడాల్సి వచ్చేది.

దాంతో కశ్మీర్‌లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత సమాఖ్య నిర్మాణంలో భాగంగా ఉంటూనే స్వయంప్రతిపత్తి, స్వయంపాలన హక్కుకు కట్టుబడ్డారు.

తిరుగుబాటు తరువాత దశాబ్దకాలం పాటు కశ్మీర్‌లో కొనసాగిన యథాతథ స్థితి ఎక్కువగా భారత్‌కు అనుకూలమైంది.

కశ్మీర్‌ ప్రజలు ఎన్నికల్లో పాలుపంచుకున్నారు.. అది ఆ ప్రాంతంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోందని రుజువు చేసిందని భారత ప్రభుత్వం చెప్పింది.

నాయకుల నిర్బంధంతో పరిస్థితులు మారిపోయాయి.

''దిల్లీలోని కేంద్రం ప్రభుత్వం తీసుకున్న చర్యతో కశ్మీరీ నేతల మధ్యేమార్గ రాజకీయాన్ని తుడిచిపెట్టింది. ఈ శూన్యతను ఉగ్రవాదులు భర్తీ చేసే అవకాశముంద''ని సిద్దిఖ్ వాహిద్ అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఆగస్టు 5 నిర్ణయం తరువాత నిర్మానుష్యంగా ఉన్న కశ్మీర్‌లో ఒక వీధి

'నమ్మకం పోయింది'

ప్రధాన స్రవంతి రాజకీయాలన్న ఆలోచన కశ్మీర్‌లో ఇప్పుడు గతించిపోయిందని కశ్మీర్‌కే చెందిన రిటైర్డ్ ఎయిర్ వైస్ మార్షల్ కపిల్ కక్ అన్నారు.

కశ్మీర్ వివాద పరిష్కారం లక్ష్యంగా జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న కపిల్.. ''కశ్మీర్‌లో 70 ఏళ్ల కృషిని భారత్ కోల్పోయింది.. దీనికి ఎవరిది పూచీ'' అని ప్రశ్నించారు.

బెదరింపులు, దాడులు, బహిరంగ అవమానాలకు వెరవకుండా భారత్‌కు మద్దతిచ్చిన రాజకీయ కార్యకర్తలు ఇప్పుడు పూర్తిగా నీరుగారిపోయారు. ఇప్పుడు వారు తమ భద్రతపైనా ఆందోళన చెందుతున్నారు.

''మేమింకెన్నడూ భారత్‌ను నమ్మకూడదు'' అన్నారు నిర్బంధం నుంచి బయటపడ్డ సమీర్ మీర్.

హత్యకు గురైన పీడీపీ వ్యవస్థాపక సభ్యుడొకరి సోదరుడు రెహ్మాన్ షేక్ మాట్లాడుతూ తన సోదరుడి త్యాగాలను మోదీ ప్రభుత్వం తక్కువ చేసిందని ఆరోపించారు.

''భారత్ కోసం మేం రక్తం ధారపోశాం. కానీ, మా ప్రాథమిక రాజకీయ హక్కులను బలవంతంగా లాక్కుంది భారత్'' అన్నారాయన.

''పార్టీ కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి తమ భవిష్యత్తేమిటని అడుగుతుంటార''ని తన్వీర్ ఆలమ్ అనే నాయకుడు చెప్పారు. ఆయన సోదరుడూ నిర్బంధంలోనే ఉన్నారు.

కార్యకర్తల ప్రశ్నకు తన దగ్గర జవాబు లేదని, వారలా అడిగినప్పుడు తాను మౌనం వహిస్తున్నానని ఆలమ్ చెప్పారు.

'మా పని సరి'

''సాయుధులు మా ఇంటి తలుపు తడితే ఇకపై మమ్మల్ని కాపాడేవారే లేరు'' అని ముంతాజ్ పీర్ అన్నారు. ముంతాజ్ పీర్ చూస్తుండగానే ఆయన తండ్రిని మిలిటెంట్లు కాల్చి చంపారు.

''మా పని సరి'' అన్నారాయన.

ఈ ప్రాంతంలో, ప్రజల్లో భారత్ పట్టు పెంచేలా పనిచేయాల్సింది పోయి ఇక్కడి ప్రధాన రాజకీయవర్గం కశ్మీర్ స్వాతంత్ర్యం కోసం లాబీయింగ్ చేస్తూ సమయం వృథా చేసిందని పీర్ అన్నారు.

''మేం కశ్మీరీలం, ముస్లింలు కావడమే మా సమస్య. కశ్మీర్‌లో మేం భారత్ తరఫున పోరాడాం. అందుకు ప్రతిఫలంగా మాకు లభించిందిదీ'' అన్నారు పీర్.

కల్లోలం తీవ్రంగా ఉన్న సమయంలో ఉత్తర కశ్మీర్‌లో అనేక ఎన్నికల్లో పోటీ చేసి, ఆ తరువాత కూడా మిలిటెంట్ల నుంచి ఎన్నో బెదిరింపులు వచ్చినా బెదరని గులామ్ హసన్ రహీ మాట్లాడుతూ.. ఇప్పుడు తన కార్యకర్తలు ఎదురైతే వారి ముందు తలొంచుకుంటున్నానని చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

"తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి": ఆదివాసీ హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి