పవన్ కల్యాణ్: 'బీజేపీకి దూరం కాలేదు.. అమిత్ షా అంటే ఇష్టం' - ప్రెస్ రివ్యూ

  • 5 డిసెంబర్ 2019
Image copyright JanaSenaParty/twitter

‘బీజేపీకి ఎన్నడూ దూరంగా లేను’

బీజేపీకి తాను ఏనాడూ దూరంగా లేనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించినట్లు 'ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

ప్రత్యేక హోదా, మరికొన్ని అంశాల్లో మాత్రమే బీజేపీతో విభేదించానని, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అంటే తనకు ఇష్టమని పవన్ కల్యాణ్ అన్నారు.

''నేను ఎదురుపడితే వైసీపీ నేతలు రెండు చేతులూ ఎత్తి నమస్కారం పెట్టాలి. ప్రధాని మోదీ వద్దకు వెళ్లి, చంద్రబాబు దగ్గర కూర్చుని 2014లోలాగా కలిసి పోటీ చేద్దామని నేను నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రోజు మాట్లాడుతున్న నాయకులంతా ఏ స్థాయిలో ఉండేవారో'' అని వ్యాఖ్యానించారు.

''టీడీపీతో అనుబంధం ఉంటే కలిసే పోటీ చేసేవాళ్లం. విడిగా ఉండాల్సిన అవసరమేంటి? వైసీపీ వారు నాకు ఎన్నిసార్లు కబురు పంపించారో, దానికి ఏమి సమాధానమిచ్చి పంపానో చెబితే అవమానంతో ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో కూడా తెలియదు'' అని అన్నారు.

Image copyright ltmhyd/twitter

మెట్రోలో పెప్పర్ స్ప్రేకు అనుమతి

మహిళల భద్రత దృష్ట్యా మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేను ఇకపై అనుమతిస్తారని 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఓ వార్త రాసింది.

బాలికలు, యువతులు, మహిళలు తీసుకువచ్చే పెప్పర్ స్ప్రేను మెట్రోలో అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ విషయాన్ని మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు.

దిశ ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

Image copyright solapur.gov.in

మహారాష్ట్రలో తొలి తెలుగు మహిళా మేయర్

మహారాష్ట్రలో మేయర్ పదవి చేపట్టిన తొలి తెలుగు మహిళగా యెన్నం కాంచన ఘనత సాధించినట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త రాసింది.

సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన కాంచన మహారాష్ట్రలోని షోలాపుర్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

జిల్లా పరిషత్‌ సీఈవో ప్రకాశ్‌ వాయ్‌చల్‌ పర్యవేక్షణలో ఎస్‌ఎంసీ కౌన్సిల్‌ హాల్‌లో బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో కాంచన విజయం సాధించారు. ఆమె బీజేపీలో ఉన్నారు.

కాంచన కుటుంబం సదాశివపేట నుంచి చాలా కాలం కిందటే షోలాపూర్‌కు వెళ్లి స్థిరపడింది. కాంచన భర్త రమేశ్‌ దుప్పట్లు, టవల్స్‌ సేల్స్‌ ఏజెంటుగా పనిచేస్తుంటారు.

2002లో ఎన్నికల బరిలో దిగిన తొలిసారే షోలాపూర్‌ కార్పొరేటర్‌గా కాంచన గెలిచారు. ఆ తర్వాత 2007, 2012, 2017 ఎన్నికల్లోనూ వరుసగా విజయం సాధించారు.

విద్యుత్ Image copyright PA

‘బీటెక్ డిగ్రీ కాదు’

విద్యుత్‌ శాఖలో కొన్ని ఉద్యోగాల ‌భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌లో బీటెక్‌ను డిగ్రీగా గుర్తించలేదని 'వెలుగు' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

2,500 జూనియర్‌‌ లైన్‌‌మెన్‌‌ (జేఎల్ఎం), 25 జూనియర్‌‌ పర్సనల్‌‌ ఆఫీసర్‌‌ (జేపీవో), 500 జూనియర్‌‌ అసిస్టెంట్‌‌ కమ్‌‌ కంప్యూటర్‌‌ ఆపరేటర్‌‌ (జేఏసీఏ) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు డిగ్రీ అర్హతగా విద్యుత్ శాఖ ఇటీవల నోటిఫికేషన్‌‌ జారీ చేసింది.

జేఎల్‌‌ఎం పోస్టులకు 58,568 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఐటీఐ అభ్యర్థులను మాత్రమే ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించారు.

జేపీవో ఉద్యోగాలకు 36,557, జేఏసీఏ ఉద్యోగాలకు 1,13,891 మంది దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 23,018 మంది దరఖాస్తులను చెల్లవంటూ అధికారులు తిరస్కరించారు. దీనిపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘‘ఈ ఉద్యోగాలకు బీటెక్ చేసినవారిని అనుమతిస్తే, భవిష్యత్తులో తమకు అర్హత ఉందంటూ వారు సబ్‌‌ ఇంజనీర్‌‌, ఏఈ పోస్టులకు మార్చమని అడిగే అవకాశం ఉంటుంది. చట్టపరంగానూ పోరాడొచ్చు. పాలనాపరమైన సమస్యలు వస్తాయి’’ అని అధికారులు వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)