మగవాళ్ళకు గర్భనిరోధక సూదిమందు: భారత్ కనిపెట్టిన ఔషధం విజయవంతమవుతుందా?

  • 8 డిసెంబర్ 2019
రిసుగ్ ఔషధం స్పెర్మ్‌ను క్రియారహితం చేస్తుంది Image copyright Getty Images
చిత్రం శీర్షిక రిసుగ్ ఔషధం స్పెర్మ్‌ను క్రియారహితం చేస్తుంది

మగవారిపై నేరుగా ఆధారపడే గర్భనిరోధక విధానాలు చాలా కాలంగా రెండే రెండు ఉన్నాయి. ఒకటి- కండోమ్ ధరించడం. రెండు- వృషణాల నుంచి అంగానికి స్పెర్మ్‌ను తీసుకెళ్లే నాళాలను కత్తిరించే, లేదా మూసివేసే శస్త్రిచికిత్స 'వేసెక్టమీ' చేయడం. మగవారు వేసుకొనే గర్భనిరోధక మాత్ర, గర్భనిరోధక జెల్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, మగవారికి ఇచ్చే గర్భనిరోధక సూదిమందును త్వరలోనే విడుదల చేస్తామని భారత్ ప్రకటించింది. ఇది విజయవంతమవుతుందా?

దేశ రాజధాని దిల్లీలోని 78 ఏళ్ల బయోమెడికల్ ఇంజినీర్ సుజోయ్ గుహ ఈ సూదిమందును కనిపెట్టారు. అమెరికాలో మిసోరి రాష్ట్రంలోని సెయింట్ లూయీ విశ్వవిద్యాలయం నుంచి మెడికల్ ఫిజియాలజీలో ఆయన డాక్టరేట్ అందుకున్నారు.

మత్తుమందు ఇచ్చి, వృషణాల నుంచి అంగంలోకి స్పెర్మ్‌ను తీసుకెళ్లే నాళాల్లోకి ఈ ఔషధాన్ని సిరంజితో చొప్పిస్తారు. సిరంజిలో దీనిని ముందే నింపి ఉంచుతారు. ఈ ఔషధంలో హార్మోన్లు ఏవీ ఉండవని, సుదీర్ఘంగా 13 ఏళ్లపాటు గర్భనిరోధకంగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఈ మందును 'రిసుగ్(Risug)' అంటారు. 'రిసుగ్' పూర్తిరూపం 'రివర్సిబుల్ ఇన్‌హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్'. పరిశోధకులు సంవత్సరాలపాటు మనుషుల్లో ఈ ఔషధాన్ని పరీక్షించారు. ఉత్పత్తికి ఇది సిద్ధంగా ఉంది.

Image copyright BLOOMBERG/GETTY IMAGES
చిత్రం శీర్షిక రిసుగ్ ఔషధంపై డాక్టర్ సుజోయ్ గుహ 1978 నుంచి పనిచేస్తున్నారు

ఈ ఔషధంలోని చిక్కటి ద్రవపదార్థం(జెల్), స్పెర్మ్‌ను క్రియారహితంగా మార్చేస్తుంది. తద్వారా గర్భం రాకుండా నిరోధిస్తుంది. గర్భం ధరించాలనుకున్నప్పుడు ఇంకో సూదిమందు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఈ జెల్ కరిగిపోయేలా చేస్తుంది. అప్పుడు దాని ప్రభావం ఉండదు. సంతానోత్పత్తికి అవరోధం తొలగిపోతుంది. ఈ మందును జంతువులపై పరీక్షించగా, పనిచేసింది. మనుషులపై ఇంకా పరీక్షించలేదు.

ఇతర గర్భనిరోధక సాధనాల మాదిరే రిసుగ్ కూడా లైంగిక కార్యకలాపాలతో సంక్రమించే వ్యాధుల నుంచి రక్షణ కల్పించదు.

"రిసుగ్ మగవారికి ప్రపంచస్థాయి గర్భనిరోధక ఔషధం అవుతుంది. ఇది సురక్షితమైన, ప్రభావవంతమైన, సుదీర్ఘకాలం పనిచేసే ఔషధం. దీని ఉత్పత్తికి సమీప భవిష్యత్తులోనే అనుమతులు లభిస్తాయని మేం భావిస్తున్నాం" అని ఈ ఔషధ ప్రయోగాల్లో ప్రధాన పరిశోధకుడైన ఆర్‌ఎస్ శర్మ చెప్పారు. ఆయన దిల్లీలోని భారత వైద్య పరిశోధన మండలిలో పునరుత్పాదక జీవశాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.

రిసుగ్ గర్భం వద్దనుకొన్నప్పుడు నిరోధించడానికి, కావాలనుకొన్నప్పుడు ధరించడానికి అనువుగా తయారుచేసిన సిసలైన 'రివర్సిబుల్ గర్భనిరోధక ఔషధమేనా' అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

'రిసుగ్' శస్త్రచికిత్సతో కూడిన వేసెక్టమీ స్థానంలో అనుసరించే ఒక ప్రత్యామ్నాయ విధానమేనని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భారత పరిశోధకులు దీనిని పూర్తిగా కొట్టిపారేయడం లేదు.

Image copyright BLOOMBERG/ GETTY IMAGES
చిత్రం శీర్షిక సిరంజిలో రిసుగ్ ఔషధాన్ని ముందే నింపి ఉంచుతారు

ఈ ఔషధం ప్రస్తుత స్థితిలో గర్భినిరోధకం(కాంట్రాసెప్టివ్)గా కంటే 'స్టెరిలైజేషన్‌(సంతానోత్పత్తికి వీల్లేకుండా చేయడం)'గానే కనిపిస్తోందని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో పునరుత్పాదక జీవశాస్త్రవేత్త అయిన మైకేల్ స్కిన్నర్ బీబీసీతో చెప్పారు. కావాలనుకొన్నప్పుడు తిరిగి గర్భం ధరించడానికి ఇది ఎంత మేర వీలు కల్పిస్తుందనేదానిపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

కావాలనుకొన్నప్పుడు తిరిగి గర్భం ధరించడానికి వీలు కల్పించే ఔషధాన్ని తాము మనుషులపై పరీక్షించాల్సి ఉందని, ఆ పరీక్షల తర్వాత ఔషధానికి 'రివర్సిబిలిటీ' ఉందని చెప్పగలమని, ఆ నమ్మకం తనకుందని సుజోయ్ గుహ తెలిపారు. ఇప్పుడున్న స్థితిలో ఔషధం తిరిగి సంతానోత్పత్తికి వీలు కల్పిస్తుందని తాము చెప్పబోమని స్పష్టం చేశారు.

ప్రస్తుతానికి ఇది 'వేసెక్టమీ' కన్నా మెరుగైన విధానంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వేసెక్టమీతో పోలిస్తే ఈ ఔషధం తీసుకోవడంలో మగవారికి తక్కువ బాధ ఉంటుందని, శస్త్రచికిత్స ఉండనే ఉండదని వివరించారు.

ఈ ఔషధం క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఆర్‌ఎస్ శర్మ ఈ ఏడాది ఇంతకుముందు ప్రచురించారు. 41 ఏళ్ల వయసు ఉన్న, వివాహమైన, కనీసం ఇద్దరు పిల్లలున్న 139 మంది మగవారికి ఈ సూదిమందు ఇచ్చి, ఆరు నెలలపాటు పరిశీలించారు.

వీరిలో కండోమ్ లాంటివి ధరించకుండా సంభోగంలో పాల్గొన్న 133 మంది మగవారి భార్యలు గర్భం దాల్చలేదు. మిగతా ఆరుగురి మగవారి భార్యలు గర్భం దాల్చారు. సిరంజీలో లీకేజీ వల్లగాని, స్పెర్మ్ తీసుకెళ్లే నాళాలకు రంధ్రాలు పడటం వల్లగాని వీరి విషయంలో ఔషధం పనిచేయలేదని ఈ ఫలితాలు వివరిస్తున్నాయి. ఈ 139 మందిపై జరిపింది మూడో దశ అధ్యయనం. ఇది కీలకమైనది.

ఔషధం వైఫల్యం రేటు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇది ముఖ్యమైనదని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ ప్రొఫెసర్ స్టెఫానీ పేజ్ లాంటి కొందరు పరిశోధకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రతికూల ప్రభావాలు, వైఫల్యం రేటు ప్రకారం చూస్తే 'స్కాల్పెల్ వేసెక్టమీ'తో పోలిస్తే ఈ విధానం భిన్నమైనదేమీ కాకపోవచ్చని స్టెఫానీ బీబీసీతో చెప్పారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.

Image copyright Science Photo Library

మొత్తమ్మీద చూస్తే కీలకమైన మూడో దశ అధ్యయనం ఫలితాలు సానుకూలంగానే ఉన్నాయని స్టెఫానీ అభిప్రాయపడ్డారు. ఈ అధ్యయనం 139 మందిపైనే జరిపారని, ఇది పరిమితమైన సంఖ్య అని చెప్పారు. ఈ అధ్యయనంలో ఫాలోఅప్ కాలం ఆరు నెలలే ఉందని, చాలా ప్రమాణాల ప్రకారం ఇది అంత సుదీర్ఘ సమయం కాదని వ్యాఖ్యానించారు.

ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొంటే ఈ ఔషధం ఒక ముందడుగేనని, కానీ సమూల మార్పు తీసుకొచ్చేదేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.

మనుషులపై మూడు దశల పరీక్షల్లో రిసుగ్ విజయవంతమైందని భారత పరిశోధకులు చెబుతున్నారు. 1990ల ప్రారంభం నుంచి 500 మందికి పైగా వాలంటీర్లపై ఈ పరీక్షలు చేస్తూ వచ్చారు. తాము అత్యుత్తమ విధానాలను అనుసరించామని వారు స్పష్టం చేస్తున్నారు. మూడు దశాబ్దాల్లో 24 అధ్యయనాలు జరిపామని, గర్భాన్ని నిరోధించడంలో ఈ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుందని పేర్కొంటున్నారు.

ఈ ఇంజెక్షన్ ధర తక్కువగానే ఉంటుందని, గర్భధారణను నిరోధించడానికి ఇదో దీర్ఘకాలిక మార్గమని భారత పరిశోధకులు చెబుతున్నారు. ఈ ఔషధం తీసుకోవడం వల్ల లైంగికవాంఛ తగ్గడంగాని, ఇతర ప్రధానమైన ప్రతికూల ప్రభావాలుగాని లేవని పరీక్షల్లో పాలుపంచుకొన్న వాలంటీర్లు చెప్పారని వివరిస్తున్నారు.

ఈ ఔషధం ఉత్పత్తి చేయడానికి, ప్రజలకు అమ్మడానికి దిల్లీలోని 'కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో)' త్వరలోనే అనుమతి ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ఉత్పత్తి, విక్రయాన్ని ప్రభుత్వమే చేపట్టే అవకాశముంది.

అవాంఛిత, అనుకోని గర్భధారణ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మహిళలు చాలా కాలంగా ఎదుర్కొంటూ వస్తున్నారు. మగవారే గర్భం రాకుండా చూడటానికి వీలుగా ఒక ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం ఇప్పటికే రావాల్సి ఉంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 12కు పైగా గర్భనిరోధక సాధనాలు, విధానాలపై మహిళలు ఆధారపడుతున్నారు.

అమెరికాలో సుమారు 60 ఏళ్ల క్రితం తొలిసారిగా గర్భనిరోధక మాత్ర అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 12కు పైగా గర్భనిరోధక విధానాలపై మహిళలు ఆధారపడుతున్నారు. వీటిలో మాత్రలు, ప్యాచ్‌లు, ఇంజెక్షన్లు, ఇంప్లాంట్లు, రింగ్స్, కప్స్, స్పాంజెస్ తదితరాలు ఉన్నాయి.

'రిసుగ్‌'లో అంతర్జాతీయ ప్రయోజనం కూడా ఉంది.

ఈ ఔషధాన్ని అమెరికాలో విడుదల చేసేందుకు అమెరికాలోని బెర్క్‌లీకి చెందిన లాభాపేక్ష లేని 'పార్సెమస్ ఫౌండేషన్'‌కు సుజోయ్ గుహ అనుమతి ఇచ్చారు. 'వాసాజెల్' అనే మరో గర్భనిరోధక సాధనం ప్రస్తుతం ప్రి-క్లినికల్ పరీక్షల దశలో ఉంది.

ఆరు ఐరోపా దేశాల్లో రిసుగ్ క్లినికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి.

సుజోయ్ గుహకు 'బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్' గ్రాంట్ అందిస్తోంది. మహిళలకు ఇచ్చే 'రిసుగ్' తరహా ఔషధం తయారీకి ఆయన పరిశోధనలు జరుపుతున్నారు. గర్భాన్ని నివారించేందుకు ఈ ఔషధాన్ని ఫలోపియన్ నాళాల్లోకి చొప్పిస్తారు.

మరి మగవారు తమ బాధ్యత నిర్వర్తిస్తారా?

భారత్ లాంటి పితృస్వామ్య సమాజాల్లో మగవారు గర్భనిరోధక విధానాలు పాటించడం చాలా తక్కువ. వివాహిత జంటల్లో 90 శాతం మందికి పైగా కండోమ్‌లు వాడరని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల్లో వేసెక్టమీ రేటు అతి తక్కువగా ఉంది.

ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాతీరు మారుతుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

"కాలం మారుతోంది, అంతర్జాతీయంగా ఆలోచనాధోరణులు మారుతున్నాయి. మగవారు గర్భనిరోధక విధానాలు పాటించడం తక్కువగా ఉండటానికి ఒక కారణం, వారికి కొన్నే ప్రత్యామ్నాయాలు ఉండటం. మగవారికి సాధ్యమైనన్ని విధానాలు, సాధనాలు అందుబాటులో ఉంచాలన్నది ఆరోగ్య పరిశోధనా రంగం లక్ష్యం. అవి అందుబాటులో ఉన్నప్పుడే గర్భనిరోధంలో బాధ్యతలను పంచుకోగలరు" అని స్టెఫీనా అభిప్రాయపడ్డారు.

మగవారికి అవసరమైన గర్భనిరోధక సాధనాల్లో రిసుగ్ అత్యంత కీలకమైనదిగా నిలుస్తుందా, లేదా అన్నది కాలమే చెప్పాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...

నెలకు రూ.7 వేల వేతనం కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న రైతు కూలీలు

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు

కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

ఆఫ్రికా: ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

అఫ్గానిస్తాన్‌లో మా విమానం కూలడం నిజమే: అమెరికా సైన్యం

ఎయిర్ ఇండియా: రూ. 22,863 కోట్ల రుణ భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం

కోబ్ బ్రయాంట్: బాస్కెట్ బాల్ సూపర్ స్టార్, ఆయన 13 ఏళ్ళ కుమార్తె హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం