CAB పౌరసత్వ సవరణ బిల్లు: భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?

  • 10 డిసెంబర్ 2019
పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసనలు Image copyright AFP
చిత్రం శీర్షిక మోదీ ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన చర్చ పౌరసత్వ సవరణ బిల్లు తేవటమని ఒక విశ్లేషకుడు అభివర్ణించారు

భారత పార్లమెంటులోని దిగువ సభ అయిన లోక్‌సభ.. మూడు పొరుగు దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లిమేతరులకు ఆశ్రయం ఇవ్వాలని ప్రతిపాదిస్తున్న బిల్లును ఆమోదించింది.

ఈ వివాదాస్పద బిల్లు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన మైనారిటీలకు భారత పౌరసత్వం ఇవ్వజూపుతోంది.

మతపరమైన ఒత్తిళ్లను తప్పించుకుని భారత్ వచ్చే వారికి ఇది ఆశ్రయం కల్పిస్తుందని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సారథ్యంలోని ప్రభుత్వం చెప్తోంది.

ముస్లింలను మరింత అణచివేసే బీజేపీ అజెండాలో ఈ బిల్లు ఒక భాగమని విమర్శకులు అంటున్నారు.

పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్ - కాబ్)కు పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో మంగళవారం నాడు ఆమోదం పొందటం.. బీజేపీకి ఒక పరీక్షే అవుతుంది. ఎందుకంటే ఆ సభలో అధికార పార్టీకి ఆధిక్యం లేదు. ఒక బిల్లు చట్టంగా మారాలంటే దానిని పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాల్సి ఉంటుంది.

ఈ బిల్లు మీద ఇప్పటికే.. బంగ్లాదేశ్ సరిహద్దు గల ఈశాన్య భారతంలో భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. సరిహద్దుకు ఆవలి నుంచి వచ్చిన వలసదారులు తమను ''ముంచెత్తుతార''ని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జమ్మూ కశ్మీర్‌లోని ఒక శరణార్థి శిబిరంలో పాకిస్తాన్‌ నుంచి వచ్చిన హిందూ శరణార్థులు

ఈ బిల్లు ఏం చెప్తోంది?

అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరిస్తుంది.

చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది. ఆ చట్టం ప్రకారం.. అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయటం లేదా జైలులో నిర్బంధించటం చేయవచ్చు.

ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవటానికి 11 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తుంది.

ఇప్పుడు.. ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలకు - హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే.. వారు పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అటువంటి వారు పౌరసత్వం పొందటానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించటం లేదా పని చేసి ఉంటే చాలు.

ప్రవాస భారత పౌరులు (ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా - ఓసీఐ) కార్డులు గల వ్యక్తులు - భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవధికంగా నివసించటానికి లేదా పని చేయటానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు.. చిన్న, పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పోతారని కూడా తాజా సవరణ చెప్తోంది.

Image copyright DILIP SHARMA/BBC
చిత్రం శీర్షిక పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య భారతదేశంలో భారీ నిరసనలు చెలరేగాయి

ఈ బిల్లు మీద వివాదం ఎందుకు?

ఈ బిల్లు వెలివేత పూరితంగా ఉందని, రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలను ఉల్లంఘిస్తోందని దీనిని వ్యతిరేకిస్తున్న వారు అంటున్నారు. పౌరసత్వం ఇవ్వటానికి మత విశ్వాసాన్ని ఒక నిబంధనగా చేయజాలరని చెప్తున్నారు.

రాజ్యాంగం తన పౌరుల పట్ల మత వివక్షను నిషేధిస్తోంది. చట్టం ఎదుట అందరికీ సమానత్వం, సమాన చట్టపరమైన రక్షణను హామీ ఇస్తోంది.

ఈ బిల్లు వలసలుగా భావించే వారిని ముస్లింలు, ముస్లిమేతరులుగా విభజించటం ద్వారా, ''సుదీర్ఘ కాలంగా అనుసరిస్తున్న మన లౌకిక రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా.. మత వివక్షను విస్పష్టంగా, బాహాటంగా చట్టంలో చేర్చుతోంది'' అని దిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్ భాటియా అన్నారు.

''ఈ బిల్లు శరణార్థి భాష ముసుగులో విదేశీయుల కోసం ఉద్దేశించినట్లు కనిపిస్తోంది. కానీ, దీని ప్రధాన లక్ష్యం ముస్లిం పౌరసత్వానికి చట్టబద్ధతను రద్దు చేయటం'' అని చరిత్రకారుడు ముకుల్ కేశవన్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

నిజంగా మైనారిటీలకు రక్షణ కల్పించటమే ఈ బిల్లు లక్ష్యమైనట్లయితే.. తమ సొంత దేశంలో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ముస్లిం మత మైనారిటీలను కూడా - ఉదాహరణకు పాకిస్తాన్‌లో అహ్మదీలు, మయన్మార్‌లో రోహింజ్యాలు వంటి వారిని కూడా చేర్చి ఉండాల్సిందని విమర్శకులు చెప్తున్నారు. (రోహింజ్యాలను భారతదేశం నుంచి తిప్పి పంపించేయాలని కోరుతూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.)

ఈ బిల్లును సమర్థించుకుంటూ, ''ప్రపంచంలో ఏ దేశమూ అక్రమ వలసను అంగీకరించదు'' అని బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ పేర్కొన్నారు.

''రక్తం కారుతున్న హృదయాలు ఫిర్యాదు చేస్తున్నటువంటి ఇతరులందరి కోసం.. భారత పౌరసత్వ చట్టాలు ఉన్నాయి. పౌరసత్వ సిద్ధి ద్వారా పౌరసత్వం పొందటం అనేది.. చట్ట ప్రకారం భారత పౌరసత్వాన్ని కోరుకునే వారికి. ఇతర అక్రమ వలసలు అందరూ చొరబాటుదారులే అవుతారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

స్వరాజ్య మేగజీన్ ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్.జగన్నాథన్ కూడా ఈ బిల్లును సమర్థిస్తూ.. ''ఈ మూడు దేశాలు తమ సొంత రాజ్యాంగాల్లో ప్రకటించటం వల్ల కానీ.. మైనారిటీలను మత మార్పిడి చేయటానికి లేదా వేధించటానికి లక్ష్యంగా చేసుకునే మిలిటెంట్ ఇస్లామిక్‌వాదుల చర్యల వల్ల కానీ.. ఇస్లామిక్ దేశాలు అనే వాస్తవ పరిస్థితి ప్రాతిపదికగా.. ఈ బిల్లు వర్తించే పరిధి నుంచి ముస్లింలను మినహాయించటం జరిగింది'' అని ఈ ఏడాది ఆరంభంలో రాశారు.

Image copyright AFP
చిత్రం శీర్షిక అక్రమ వలసలను గుర్తించటానికి జాతీయ పౌరుల జాబితా అవసరమని ప్రభుత్వం చెప్తోంది

ఈ బిల్లు చరిత్ర ఏమిటి?

ఈ పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జూలైలో పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న పార్లమెంటు దిగువసభ (లోక్‌సభ)లో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే.. ఈశాన్య భారతదేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత ఎగువ సభ (రాజ్యసభ)లో ఇది ఆమోదం పొందలేదు.

ముఖ్యంగా.. ఆగస్టు నెలలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు ఇరవై లక్షల మంది నివాసులకు చోటు కల్పించని అస్సాం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో ఉన్నాయి.

ఈ పౌరసత్వ సవరణ చట్టం, ఆ పౌరుల జాబితా రెండూ ఒకటి కాకపోయినప్పటికీ.. ఆ జాబితాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు.

జాతీయ పౌరుల జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ - ఎన్ఆర్‌సీ) అనేది.. 1971 మార్చి 24వ తేదీ నాటికి - అంటే పొరుగుదేశమైన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారటానికి ఒక రోజు ముందు నాటికి - తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించుకోగలగిన ప్రజల జాబితా.

ఆ జాబితాను ప్రచురించటానికి ముందు ఎన్‌ఆర్‌సీని బీజేపీ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ.. తుది జాబితాను ప్రచురించటానికి కొన్ని రోజుల ముందు అందులో తప్పులు ఉన్నాయంటూ వైఖరి మార్చుకుంది.

దానికి కారణం.. బీజేపీకి బలమైన ఓట్ల పునాదిగా ఉన్న బెంగాలీ హిందువులు చాలా మందిని కూడా ఆ జాబితా నుంచి మినహాయించారు. వారి పరిస్థితి 'అక్రమ వలసదారులు'గా మారే పరిస్థితి తలెత్తింది.

Image copyright AFP
చిత్రం శీర్షిక భారతదేశంలో నివసిస్తున్న రోహింజ్యా శరణార్థులకు వ్యతిరేకంగా మితవాద బృందాలు నిరసనలు చేపట్టాయి

పౌరుల జాబితాకు ఈ పౌరసత్వ బిల్లుకు సంబంధం ఏమిటి?

ఈ రెండిటికీ సన్నిహిత సంబంధం ఉంది. ఎందుకంటే.. ఆ పౌరుల జాబితాలో చోటుదక్కని, తమ స్వదేశానికి తిప్పిపంపించి వేసే లేదా నిర్బంధంలో ఉండే పరిస్థితిని ఎదుర్కొంటున్న ముస్లిమేతరులకు ఈ పౌరసత్వ సవరణ బిల్లు రక్షణ కల్పిస్తుంది.

దీని అర్థం.. ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కని లక్షలాది మంది బెంగాలీ హిందూ వలసదారులు అస్సాం రాష్ట్రంలో నివసించటానికి పౌరసత్వం పొందవచ్చు.

ఆ తర్వాత.. 2024 నాటికల్లా ''భారతదేశంలో ప్రతి ఒక్క చొరబాటుదారుడినీ గుర్తించి, తరిమివేయటం కోసం'' దేశవ్యాప్త పౌరుల జాబితాను రూపొందించాలని హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించారు.

''దేశ వ్యాప్త జాతీయ పౌరుల జాబితా ప్రణాళికను అమలు చేయటంలో ప్రభుత్వం ముందుకు వెళితే.. అందులో చోటు దక్కని వారిని రెండు వర్గాలుగా విభజించటం జరుగుతుంది. ఒకటి - అత్యధిక సంఖ్యలో ఉండే ముస్లింలు: వీరిని ఇప్పుడు అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. రెండు - ముస్లిమేతరులు: ఇంతకుముందైతే వీరిని అక్రమ వలసదారులుగా పరిగణించి ఉండేవారు.. ఇప్పుడు వీరు గనుక తాము అఫ్ఘానిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ వచ్చామని చూపగలిగితే - వీరికి పౌరసత్వ సవరణ బిల్లు ద్వారా రక్షణ లభిస్తుంది'' అని భాటియా పేర్కొన్నారు.

జాతీయ పౌరుల జాబితా, పౌరసత్వ సవరణ బిల్లు - రెండిటినీ కలిపినపుడు.. ''భారతదేశాన్ని.. పౌరసత్వ హక్కుల తారతమ్యాలు గల ఒక అధికసంఖ్యాకుల రాజ్యంగా మార్చివేసే శక్తి వీటికి ఉంది'' అని సామాజిక శాస్త్రవేత్త నీరజా గోపాల్ జయ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

దిల్లీ హింస: అల్లరిమూకలను శర్మ, సైఫీ కలిసి ఎలా అడ్డుకున్నారంటే

లీపు సంవత్సరం ఎప్పుడు మొదలైంది? దీని అవసరం ఏంటి?

పిల్లల్ని కనడానికి సరైన వయసు ఏది?

దిల్లీ హింస: అల్లర్లు చెలరేగిన వీధుల్లో ఐదు గంటల ప్రత్యక్ష అనుభవం ఇది...

అఫ్ఘానిస్తాన్: తాలిబాన్లతో చర్చలు జరిపిన మహిళ ఫాజియా కూఫీ కథ ఇదీ...

కన్హయ్య కుమార్‌పై దేశ ద్రోహం కేసు విచారణకు అనుమతి మంజూరు చేసిన దిల్లీ ప్రభుత్వం

సీఎం కేసీఆర్ ఇంట్లో రోజూ చికెన్, గుడ్లే తింటున్నాం: కేటీఆర్

కరోనావైరస్: చైనాలో ఇళ్లకే పరిమితమైన కోట్ల మంది ఏం చేస్తున్నారు

దిల్లీ హింస: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో నీరజ్ జాదౌన్