ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’

  • 12 డిసెంబర్ 2019
సమత అత్యాచారం, హత్య ఘటన

"రోడ్డు మీద చెప్పు కనిపించింది. ఆ పక్కనే కిందికి వెళ్తే ఆమె వస్తువులు అమ్ముకునే సంచి. ఇంకా కిందకు వెళ్తే.. శరీరం... బట్టల్లేవు... వంటినిండా రక్తం ఉంది. ఆమె జుట్టు ఎవరో పట్టుకుని గుంజినట్టు ఉంది. ఛాతీ మీద గోళ్లతో గీరి రక్తం వచ్చిన ఆనవాళ్లు. అరచేతులు, చేతివేళ్లు కోసుకుపోయాయి. తల కణతపై కొడితే కనుగుడ్లు బయటకు వచ్చేశాయి. శరీరం మీద గట్టిగా నొక్కడంతో రక్తం గడ్డకట్టి నల్లగా అయిన ఆనవాళ్లు. గొంతుకోసి చంపేశారు."

ఆసిఫాబాద్ సామూహిక అత్యాచారం, హత్య తరువాత బాధితురాలి (ప్రభుత్వం బాధితురాలి పేరును ‘సమత’గా మార్చింది. అందుకే ఆమె పేరును సమతగా సంబోధిస్తున్నాం)శరీరం ఇలా కనిపించింది. తన భార్య శరీరాన్ని చూసిన ఆ భర్త కళ్లల్లో ఇప్పటికీ ఆ దృశ్యం చెదరలేదు. ఘటన జరిగిన 15 రోజుల తరువాత ఆయన భార్య ఏ పరిస్థితుల్లో దొరికిందో వివరిస్తూ చెప్పిన మాటలివి.

"ఆమె అసలు ఆడమనిషి శరీరంగానే కనిపించలేదు. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సమత అత్త.చిత్రం శీర్షిక 'ఆ ఏరియాలో వ్యాపారం ఎక్కువ ఉంటుంది. కానీ నేను అక్కడకి ఇక వెళ్లలేను. ఆమె జ్ఞాపకాలే వస్తాయి. నేనిక అక్కడ తిరగలేను' అంటూ సమతను గుర్తు చేసుకున్నారు ఆమె భర్త.

ఏం జరిగింది?

తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన భార్యాభర్తలు కొంత కాలంగా ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్నారు. ఇంటింటికీ తిరిగి బుడగలు, ఆడవారి హెయిర్ పిన్నులు వంటి వస్తువులు అమ్మడం, తల వెంట్రుకలు తీసుకుని వాటి బదులు స్టీలు సామాను అమ్మడం వారి కుటుంబ వృత్తి.

జైనూరు, లింగాపూర్ పరిసర గ్రామాల్లో రోజుకు ఒకటో రెండో ఊళ్లకు వెళ్లి వస్తువులు అమ్ముకుంటారు. వ్యాపారానికి అనుకూలంగా ఉంటుందని, ఆరేళ్ల నుంచి తమ పిల్లలిద్దర్నీ ఖానాపూర్ లోని తమ తల్లితండ్రుల దగ్గర వదిలి, జైనూరులో గది తీసుకుని ఉంటున్నారు ఈ భార్యాభర్తలు. రోజూ భర్త, తన భార్యను ఒక ఊరిలో వదలి, తను మరో ఊరు వెళ్లి మధ్యాహ్నానికో, సాయంత్రానికో తన పని ముగించుకుని, భార్య దగ్గరకు వెళ్లి ఆమెను బండి ఎక్కించుకుని ఇంటికి చేరుకుంటారు.

నవంబర్ 24 ఉదయం అలానే సమతను ఒక గ్రామం దగ్గర వదిలారు ఆమె భర్త.

"ఆరోజు ఉదయం ఆరు గంటలకు బయటకు వచ్చి టీ తాగి జైనూరు నుంచి 25 కి.మీ. దూరంలోని గ్రామానికి వెళ్లాం. పది, పదిహేను రోజలకొకసారి ఒక ఊరు చొప్పున వెళ్తాం. 6.30 గంటల ప్రాంతంలో ఆమెను దించి నేను వెనక్కి 10 కి.మీ. దూరంలో ఉన్న వేరే ఊరికి వెళ్లాను. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆమె కోసం వెళ్లాను. ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. ఆ ఊరు వెళ్లి ఒక మహిళను అడిగితే 10.30కే వెళ్లిపోయింది అన్నారు. వేరే ఊరిలో చూశాను. ఆ పక్క ఊరిలోనూ చూశాను. ఎక్కడా లేదు. మేం ఉండే రూంకి ఫోన్ చేశాను.. అక్కడికీ రాలేదన్నారు. మళ్లీ మొదట దించిన ఊరికే వెళ్లాను. పదిన్నరకే వెళ్లిపోయిందని చెప్పారంతా. ఆమె కనిపిస్తే చెప్పండని నా నంబర్ ఇచ్చి, జైనూర్ వచ్చి సామాన్ల సంచి ఇంట్లో పెట్టి మరొకరిని తోడు తీసుకెళ్లి వెతికాను. జాడ లేదు. నేను లేకుండా ఎక్కడకూ వెళ్లదు ఆమె. ఇక వెతికి వెతికి మా తమ్ముడికి ఫోన్ చేశాను. వదిన కనిపించడం లేదు. మనవాళ్లను తీసుకుని రా అన్నాను" అంటూ ఆరోజు జరిగిన విషయాలు చెప్పారు సమత భర్త.

సమత సొంతూరు నుంచి వచ్చిన బంధువులు, మిత్రులు కలిసి వెతికారు. చివరకు రాత్రికి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు, బంధువులు కలిసి వెతికారు. ఒకవేళ సమతకి ఏమైనా జరిగి ఉంటే ఆమె శరీరాన్ని మాయం చేయడానికి ప్రయత్నిస్తారన్న అనుమానంతో గుంపులుగా విడిపోయి ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో పహారా కాశారు.

"తెల్లారాక మళ్లీ వెతికాం. స్థానికులూ వెతికారు. ఈలోపు మా ఊరి అబ్బాయికి రోడ్డుపై చెప్పు కనిపించింది. రోడ్డు పక్కన కిందవైపు సామాన్ల సంచి ఉంది. ఇంకా కింద చెట్ల మధ్య శరీరం దొరికింది. అన్నా బాడీ అని అరిచాడు. అందరం అక్కడకు వెళ్లాం" అని వివరించారు సమత భర్త.

చిత్రం శీర్షిక "ఆమె అసలు ఆడమనిషి శరీరంగానే కనిపించలేదు. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు" అంటూ సమత అత్త కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘క్రూరమైన ఘటన’

"ఒళ్లంతా నెత్తురు చేశారు. చేతులు విరిచేశారు. శరీరం మొత్తం కమిలిపోయింది. బట్టల్లేవు. పీక కోశారు. వెంట్రుకలు పీక్కుంది. గిజ గిజ కొట్టుకుంది. కానీ పీక కోసినంక ఏం చేస్తది. ఒక బొమ్మను ఆడుకున్నట్టు ఆడుకున్నారు నా కోడల్ని. అవన్నీ చూస్తే ప్రాణం ఊసిపోయింది. వెంట్రుకలు చెదిరిపోయాయి. ఆడమనిషి శరీరంలా లేదసలు. ఒక రాక్షసి శరీరంలా కనిపించింది నాకు" అంటూ కన్నీరు పెట్టుకున్నారు సమత అత్త.

బాధితురాలు సమతకు ఇద్దరు పిల్లలు. నానమ్మ దగ్గరుండి ఏడు, ఆరు తరగతుల్లో చదువుకుంటున్నారు ఆ అబ్బాయిలు. "పిల్లల్ని ఎలా పెంచాలి? ఆమె ఉండుంటే ఆ కుటుంబానికి ధైర్యం ఉండేది. ఇప్పుడా ధైర్యం లేదు" అని బాధపడ్డారు సమత అత్త.

"నా కొడుకూ కోడలూ ఎప్పుడూ కలిసే వస్తారు. ఒక్కరోజు కూడా వాళ్లు విడిగా ఎటూ వెళ్లలేదు. ఊరు మీదకు వెళ్లినప్పుడు కూడా, నా కొడుకు వచ్చే వరకూ ఆగుతది. ఆటో ఎక్కదు నా కోడలు" అంటూ కోడల్ని గుర్తుచేసుకుందామె.

"ఆమె లేకపోవడం మొత్తం లోటే. ఏం తోచడం లేదు. పిల్లలు తల్లి లేనివాళ్లైపోయారు. ఇద్దరం కలిసే పనిచేసుకునేవాళ్లం. ఆ ఏరియాలో వ్యాపారం ఎక్కువ ఉంటుంది. కానీ నేను అక్కడకి ఇక వెళ్లలేను. ఆమె జ్ఞాపకాలే వస్తాయి. నేనిక అక్కడ తిరగలేను. ఆమె ఉంటే కుటుంబాన్ని కాపాడుకునేది" అంటూ భార్యను గుర్తు చేసుకున్నారు భర్త.

చిత్రం శీర్షిక ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఎం.మల్లారెడ్డి

నిందితులు దొరికారు..

ఈ కేసులో పోలీసులు ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సాక్ష్యాలు సేకరిస్తున్నారు.

"నవంబరు 24న రాత్రి 8 గంటలకు కేసు పెట్టారు. ముందు అదృశ్యం కేసుగా నమోదు చేసుకున్నాం. మర్నాడు శరీరం దొరికాక, అత్యాచారం, హత్య కేసుగా మార్చాం. ఎస్సీ వర్గానికి చెందిన మహీళ కావడంతో, ఆ సెక్షన్లు కూడా చేర్చాం. పోలీసులు బృందాలుగా బంధువులతో కలసి వెతికారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలను దించి సాక్ష్యాలు సేకరించాం. పంచనామా, శవ పంచాయితీ ద్వారా ఆమె శరీరం నుంచి సాక్ష్యాలు సేకరించాం. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టాం. ఇక ఫోరెన్సిక్ నివేదిక రావాలి. మిగతా విచారణ పూర్తయినట్టే. రెండు మూడు రోజుల్లో అది రాగానే, వెంటనే చార్జిషీట్, అంటే ఘటన జరిగిన 20 రోజుల్లోనే చార్జి షీట్ వేస్తాం. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి లేఖ రాశాం. ఒకవేళ అది కూడా ఏర్పాటైతే వీలైనంత త్వరలోనే నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చేస్తాం" అని బీబీసీతో చెప్పారు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ ఎం.మల్లారెడ్డి.

"నిందితుల్లో ఒకరిపై గతంలో బైక్ దొంగతనం కేసు ఉంది. వారి ముగ్గురి భార్యలూ వీరి నుంచి దూరంగా ఉంటున్నారు. వీరు కలప అక్రమ రవాణా చేస్తుంటారని గ్రామస్తులు చెప్పారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారిలో ఇద్దరు ఆమెను పట్టుకుంటే, ఒకరు గొంతు కోశారు. ఆ నిందితుడి దగ్గర ఎప్పుడూ కత్తి ఉంటుంది. విచారణలో వారు నేరం తామే చేసినట్టు ఒప్పుకున్నారు" అని బీబీసీతో చెప్పారు ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ.

చిత్రం శీర్షిక సమత అత్యాచారం, హత్య జరిగిన ప్రదేశం

వివాదం

హైదరాబాద్‌లో 'దిశ' ఘటన జరగడానికి మూడు రోజుల ముందు ఈ ఘటన జరిగింది. కానీ రెండు ఘటనలనూ పోల్చి చూసినప్పుడు నాయకులు, ప్రభుత్వం, పోలీసులు, మీడియా పోషించిన పాత్ర వివక్షాపూరితంగా ఉందని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.

"హైదరాబాద్‌లో ఓసీ బిడ్డపై, ఆసిఫాబాద్‌లో ఎస్సీ బిడ్డపై అత్యాచారం, హత్య జరిగాయి.. ఆసిఫాబాద్‌ ఘటనలో శిక్షలు పడలేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టూ లేదు. ఆసిఫాబాద్ తరువాత జరిగిన హైదరాబాద్ ఘటనలో మాత్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేశారు. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చేలోపు నలుగురిని బయటకు తీసుకెళ్లి చంపేశారు.

తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలపై అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ, ఏ కేసుల్లోనూ న్యాయం జరగడం లేదు. నలుగురు పిల్లలను చంపేసిన శ్రీనివాస రెడ్డి ఇంకా జైల్లోనే ఉన్నాడు. ఎమ్మార్పీఎస్ అన్ని వర్గాల మహిళలనూ పరామర్శించి, వారి తరపు మాట్లాడుతుంది. కానీ హైదరాబాద్ ఘటనలో మాత్రం పెద్ద నాయకులు, ఆ బాధితురాలి సామాజిక వర్గం వారు కేవలం ఆ అమ్మాయి గురించే మాట్లాడారు. పార్లమెంటులో కూడా ఆ అమ్మాయి గురించి మాత్రమే ప్రస్తావించారు. ఇది వివక్ష కాదా?" అని ప్రశ్నించారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ.

ఆసిఫాబాద్ కేసులో బాధితులకు న్యాయం చేయాలంటూ స్థానికంగా రకరకాల పద్ధతుల్లో ఆందోళన నిర్వహించాయి వివిధ సంస్థలు. మూడు మండలాలు బంద్ చేశాయి. నిందితులు ఉపయోగించిన బైక్‌ను ఆందోళనకారులు తగలబెట్టారు. దళిత సంఘాల నాయకులు వెళ్లి పరామర్శించారు.

"మేం మధ్య యుగాల నాటి న్యాయం కోరడం లేదు. రాజ్యాంగం ఇచ్చిన చట్టబద్ధ శిక్ష కోరుతున్నాం. 'దిశ' కేసులో నరహంతకులు అని రాసిన మీడియా, ఆసిఫాబాద్ కేసులో మాత్రం నిందితులు అని రాస్తుంది. హైదరాబాద్ కేసులో మేం పరామర్శకు వెళ్తే, కేవలం వేరే వాళ్లవే కవర్ చేసింది. ఇప్పటికీ హైదరాబాద్ ఘటనపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఆసిఫాబాద్ ఘటన గురించి ఎందుకు రావు" అని ప్రశ్నించారాయన.

సోషల్ మీడియాలో కొందరు ఈ అంశంపై చర్చ ప్రారంభించారు. కులం వల్లే హైదరాబాద్ - ఆసిఫాబాద్ కేసుల్లో తేడా కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. దీంతో ఘటన జరిగిన 15 రోజుల తరువాత బాధితులను పరామర్శించడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెళ్లారనే వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

చిత్రం శీర్షిక సమత అత్యాచారం, హత్య జరిగిన ప్రదేశం

సహాయం

ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద బాధితులకు రూ. 8.25 లక్షల పరిహారం ఇస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది. ఇందులో సగం మొత్తాన్ని ఇప్పటికే సమత భర్తకు అందించారు.

అంతేకాకుండా, మూడెకరాల భూమి, ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామని జిల్లా అధికారులు హామీ ఇచ్చినట్టు సమత భర్త చెప్పారు.

జిల్లా పోలీసులు చొరవ తీసుకుని బాధితురాలి పిల్లలిద్దరికీ తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించారు.

స‌మ‌త‌ కేసు విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టు

స‌మ‌త కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. దీనికి హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్ర‌త్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆదిలాబాద్ జిల్లా కోర్టును ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ఉత్త‌ర్వులో పేర్కొన్నారు.ప్రత్యేక‌ కోర్టు ఏర్పాటుతో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్న‌ట్లు న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ‘నాలాంటి నాలుగు వేల మంది బతుకులు రోడ్డు మీద పడ్డాయి’

కరోనా లాక్‌డౌన్: కరోనాపై పోరులో మనకున్న ఏకైక ఆయుధాన్ని వాడుదాం - కేసీఆర్

లాక్‌డౌన్ కష్టాలు: కొడుకు శవాన్ని చేతుల్లో మోసుకెళ్లిన తండ్రి

‘కరోనావైరస్ మీద నేను ఎలా పోరాడుతున్నానంటే...’ - హైదరాబాద్‌ పేషెంట్ నంబర్ 16 స్వీయ అనుభవం

కరోనా లాక్‌డౌన్: ‘చావు తప్పదనుకుంటే మా ఊళ్లోనే చనిపోతాం’

కరోనా వైరస్: ఇది సోకకూడదంటే రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉండాలి

కరోనావైరస్: ఆయన మరణించారు.. బంధువుల్లో 19 మందికి సోకింది.. ఇంకా 40 వేల మందికి సోకిందేమోనన్న టెన్షన్

కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారత శాస్త్రవేత్త ఈమే.. కిట్ ఇచ్చిన గంటకే బిడ్డకు జన్మనిచ్చిన మీనల్

కరోనావైరస్: ట్విటర్‌లో #ShameOnBCCI ట్రెండింగ్, ఎందుకు