పౌరసత్వ సవరణ బిల్లును కోర్టులో సవాలు చేస్తే న్యాయ సమీక్షకు నిలుస్తుందా? - అభిప్రాయం

  • 12 డిసెంబర్ 2019
సుప్రీం కోర్టు Image copyright Getty Images

పార్లమెంటులోని ఉభయ సభలు తాజాగా ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగంలోని 14, 15వ ఆర్టికల్స్‌ను ఉల్లంఘిస్తోందని కొందరు అంటున్నారు. దీన్ని కోర్టులో సవాలు చేయొచ్చని వాదిస్తున్నారు. మరి, వారి వాదనలో నిజం ఉందా? బిల్లును కోర్టులో సవాలు చేస్తే, ఏమవుతుంది?

ఆర్టికల్ 14 ప్రకారం భారత్‌లో అందరికీ సమానత్వపు హక్కు ఉంటుంది. దేశ పౌరులైనా, కాకపోయినా చట్టప్రకారం అందరికీ సమాన రక్షణ ఉంటుంది.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారికి భారత పౌరసత్వం ఇచ్చే విషయం పౌరసత్వ సవరణ బిల్లులో ఉంది. కానీ, వారిలో నుంచి ముస్లింలను మాత్రం పక్కనపెట్టారు. ఆర్టికల్ 14 వారికి కూడా సమానమైన రక్షణ కల్పిస్తుంది.

ఆర్టికల్ 14 అందరికీ ఒకే చట్టం ఉండాలని చెప్పట్లేదు. కానీ, 'ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే ధర్మం, ఒకే భాష' అని వాదించే పార్టీ అధికారంలో ఉందన్న సంగతి మనకు తెలుసు.

ఇప్పుడు ఓ వర్గీకరణ చేసి, కొన్ని వర్గాలను దానికి బయట ఉంచారు. ఇస్లాం, యూదు మతస్తులను పక్కనపెట్టారు. సమానత్వమనే మౌలిక భావనకు ఇది విరుద్ధం.

Image copyright Getty Images

ఉదాహరణకు తెలంగాణలో ఉండేవారందరికీ నల్సార్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఇచ్చారనుకుందాం. మిగతావారికి ఇవ్వలేదనుకుందాం. అప్పుడు ఈ రిజర్వేషన్లకు స్థానికత ఆధారం అవుతుంది. కోర్టు దీన్ని అంగీకరిస్తుంది.

దేశంలోని వివిధ వర్గాలకు, వివిధ చట్టాలు ఉండొచ్చు. కానీ, దాని వెనుక సహేతుకమైన, న్యాయమైన కారణాలు ఉండాలి.

వర్గీకరణకు మతం ఆధారం కాకూడదు. ఆధునిక పౌరసత్వం, జాతీయత భావనలకు అది విరుద్ధం.

భారత్ ఓ చట్టం చేస్తే, మిగతా దేశాలు దాన్ని చూసి నవ్వే పరిస్థితి ఉండకూడదు.

మతం ఆధారంగా జరిగే ఎలాంటి వర్గీకరణనైనా, వివక్షనైనా.. మన రాజ్యాంగం చట్టవిరుద్ధమని చెబుతోంది.

Image copyright Getty Images

ఉమ్మడి పౌర స్మృతి ఎలా తెస్తారు?

ముస్లింలు ప్రత్యేక వర్గం అని చెబుతూ, ఉమ్మడి పౌర స్మృతిని ప్రభుత్వం ఎలా తీసుకురాగలదు? తాము ప్రత్యేక వర్గమైతే, తమకు ప్రత్యేక చట్టం ఉండాలని ముస్లింలు అడుగుతారు.

పౌరసత్వానికి ప్రత్యేక చట్టం ఉంటే, పర్సనల్ లా విషయంలోనూ ప్రత్యేక చట్టమే ఉండాలి. ఇలాంటి వైఖరితో చట్టాల్లో మార్పులు తేవడం, బాగు చేయడం సాధ్యం కాదు.

ఈ బిల్లు చాలా ప్రమాదకరమన్నది నా అభిప్రాయడం. ఇప్పుడు మత వివక్షను న్యాయసమ్మతంగా చూపిస్తున్నారు. రేపు కుల వివక్షను కూడా ఇలాగే చేస్తారు.

అసలు మనం దేశాన్ని ఎటువైపు నడిపిస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం ప్రజలను వర్గీకరించాలంటే అందుకు న్యాయసమ్మతమైన ఉద్దేశాలు ఉండాలి. ఈ బిల్లు విషయంలో ఉద్దేశాలు న్యాయసమ్మతమైనవి కావు.

ఈ బిల్లుపై ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు ఏ చట్టం చేసినా, అది రాజ్యాంగబద్ధంగానే పరిగణిస్తారు. ఒకవేళ రాజ్యాంగవిరుద్ధమని ప్రకటించాలంటే, దాన్ని సవాలు చేసేవారు ఆ విషయాన్ని నిరూపించాల్సి ఉంటుంది.

ఇలాంటి అంశాలు చాలా సార్లు రాజ్యాంగ ధర్మాసనాల వద్దకు వెళ్తుంటాయి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అంశాలు చాలా ఉన్నాయి. అందుకే, విచారణ అంత త్వరగా జరగదు.

Image copyright Getty Images

కోర్టులో ఏం రుజువు చేయాలి?

దేశం ఓ తప్పు మార్గంలో నడుస్తుందన్న విషయం అర్థం చేసుకోగల అవగాహన కలిగిన పౌరులు ఉన్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఎవరూ మార్చలేరు. పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేదని నిరూపించాల్సి ఉంటుంది.

కోర్టు ఆ విషయాన్ని అంగీకరిస్తేనే, పరిస్థితి మారుతుంది. ప్రస్తుతం దేశ ప్రజల ఆశలు సుప్రీం కోర్టుపైనే ఉన్నాయి. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని కాపాడే నిర్వచనాన్ని ఈ బిల్లుకు ఎలా వర్తింపజేస్తారో చూడాలి. సుప్రీం కోర్టుకు ఇదో పరీక్ష.

దేశ ప్రజల చూపే కాదు, ప్రపంచం చూపు సుప్రీం కోర్టుపైనే ఉంటుంది. అధికసంఖ్యాకవాదం కారణంగా చట్టసభలు కొన్ని సార్లు తప్పుడు చట్టాలు చేస్తుంటాయి. కోర్టులు న్యాయసమీక్ష ద్వారా వాటిని నియంత్రించి, రాజ్యాంగాన్ని రక్షిస్తాయి.

పౌరసత్వ సవరణ బిల్లు విషయంలో భారత న్యాయవ్యవస్థ స్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచమంతా గమనిస్తుంది.

(ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

'పాకిస్తాన్ జిందాబాద్' నినాదాలపై అసదుద్దీన్ ఒవైసీ ఏమంటున్నారు?

Australia Vs India : మహిళా క్రికెట్ ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్

వి-అన్‌బీటబుల్: అమెరికన్ టీవీ టాలెంట్ షో ఫైనల్స్‌లో ముంబయి డాన్సర్స్ గ్రూప్ విజయం

టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020: భారత జట్టు చరిత్ర సృష్టిస్తుందా

కసబ్ దగ్గర హైదరాబాద్ కాలేజ్ ఐడీ, బెంగళూరు ఇంటి అడ్రస్: రాకేశ్ మారియా

రాజస్థాన్‌లో దళిత యువకులపై దాడి: 'మర్మాంగాల్లో పెట్రోల్ పోసి హింసించారు'

జీరో పేషెంట్ అంటే ఏంటి.. కరోనా వైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు.. తెలుసుకోవడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందా

ఇతనో దొంగ.. ఒక బీరువాను దొంగిలించాడు.. అది ఇతని జీవితాన్ని మార్చింది