ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

  • 13 డిసెంబర్ 2019
పౌరసత్వ సవరణ బిల్లు Image copyright Getty Images

పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చే వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు భారత పార్లమెంట్ ఆమోదం తెలిపింది.

2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంది.

మోదీతో పాటు ఆయన పార్టీకి ఒకవైపు ప్రజాదరణ పెరుగుతుంటే అదే సమయంలో వారు తీసుకున్న కొన్ని నిర్ణయాలు అంతర్జాతీయంగా విమర్శలపాలయ్యాయి.

ముఖ్యంగా మోదీ ప్రభుత్వం 'మైనారిటీలను చిన్నచూపు చూస్తోంది' అనే విమర్శ కీలకమైంది.

భారత్‌లో దాదాపు 20 కోట్ల మంది ముస్లింలున్నారు. ప్రపంచంలో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న రెండో దేశంగా భారత్ ఉంది.

మోదీ ప్రభుత్వం తీసుకున్న మూడు కీలక నిర్ణయాలు ముస్లింల ఆందోళనలను తీవ్రతరం చేస్తున్నాయి.

Image copyright Getty Images

1. పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)

పౌరసత్వ సవరణ బిల్లు (సీఏబీ)కు రెండు రోజుల వ్యవధిలో రెండు సభలూ ఆమోదం తెలిపాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. రాష్ట్రపతి ఆమోదంతో ఇది చట్టంగా మారింది.

పొరుగు దేశాల్లో పీడనకు గురవుతున్న హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్శీలు, క్రిస్ట్రియన్లకు త్వరితగతిన భారత పౌరసత్వం లభించేందుకు ఈ చట్టం తోడ్పడుతుందని అధికార బీజేపీ నేతలు అంటున్నారు.

ఈ చట్టం భారత పౌరసత్వానికి సంబంధించి కనీస సంవత్సరాలను 11 నుంచి ఆరు సంవత్సరాలకు కుదించింది. కానీ, ముస్లింలను దీని నుంచి మినహాయించారు.

దీంతో ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మత ప్రాతిపదికన వివక్ష చూపించరాదని భారత రాజ్యాంగంలో పేర్కొన్నప్పటికీ ఆ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టం ఉందని అంటున్నాయి.

అయితే, తాము ముస్లింలపై వివక్ష చూపించడం లేదని, భారత్‌లో వాళ్లకు భద్రత ఉందని మోదీ ప్రభుత్వం చెబుతోంది.

కానీ, ముస్లిం సంఘాలు, మానవహక్కుల కార్యకర్తలు మాత్రం దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను బలహీనపరిచే చర్య ఇది అని చెబుతున్నాయి.

ప్రతిపాదిత చట్టం భారతదేశంలోని ప్రస్తుత పౌరులను ప్రభావితం చేయదు. కానీ, బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చిన వేలాది హిందూ వలసదారులకు సహాయం చేస్తుంది.

ఈ కారణంగానే భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలు ఈ కొత్త చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నాయి.

Image copyright Getty Images

2. ఆర్టికల్ 370

మోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్టికల్ 370 సవరణ కూడా వివాదాస్పదమైంది. ముస్లిం జనాభా మెజారిటీగా ఉన్న కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ సవరణ తర్వాత అక్కడ ఆందోళనలు చెలరేగాయి.

కశ్మీర్ స్వయంప్రతిపత్తిపై దేశంలో చాలా ఏళ్లుగా చర్చ జరుగుతున్నపటికీ ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని తొలిగించే నిర్ణయం తీసుకోలేదు. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే మోదీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేసింది.

కశ్మీర్ లోయను పూర్తిగా బంద్ చేసి, అక్కడ సైన్యాన్ని మోహరించి, మీడియా, టెలిఫోన్ సర్వీసులను మూసివేసి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు జరిపింది.

ఆర్టికల్ 370 వల్లే తాము భారతదేశంలో భాగంగా ఉన్నామని చాలా మంది కశ్మీరీల భావన. దానిని ఉపసంహరించి దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు కశ్మీర్‌పై హక్కును కల్పించి, ముస్లిం మెజారిటీ రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని స్థానికుల ఆరోపణ.

ఈ చర్య పార్లమెంటును అట్టుడికించింది. కొంతమంది న్యాయ నిపుణులు దీనిని రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు.

మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలో ఆందోళనలు జరుగుతున్నాయి.

3. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ)

అస్సాంలో నివసిస్తున్న భారతీయ పౌరుల జాబితాను నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్‌ఆర్‌సీ)గా పిలుస్తారు.

తమ రాష్ట్రంలోకి బంగ్లాదేశీయులు అక్రమంగా ప్రవేశించారంటూ అస్సాంలో ఆరేళ్ల పాటు జరిగిన సుదీర్ఘ ప్రజా ఉద్యమం ఫలితమే ఈ ప్రక్రియ అని చెప్పవచ్చు. ఆ ఉద్యమం తరువాత, అస్సాం ఒప్పందం జరిగింది. 1986లో పౌరసత్వ చట్టాన్ని సవరించి, అస్సాం కోసం ప్రత్యేక నిబంధనను చేర్చారు.

పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఎ ప్రకారం, 1966 జనవరి 1కి ముందు నుంచి అస్సాంలో నివసిస్తున్నవారు భారతీయ పౌరులు. మీరు 1966 జనవరి, 1971 మార్చి 25 మధ్య అస్సాంలో నివాసం ఉండేందుకు వచ్చినట్లయితే, మీరు వచ్చిన తేదీ నుంచి 10 ఏళ్లకు మీకు భారతీయ పౌరుడిగా గుర్తింపు వస్తుంది. ఓటు హక్కు కూడా పొందుతారు.

ఒకవేళ మీరు 1971 మార్చి 25 తర్వాత భారతదేశంలోకి ప్రవేశించినట్లయితే (అది బంగ్లాదేశ్ యుద్ధం ప్రారంభమైన తేదీ కూడా) అక్రమ వలసదారుడు అవుతారు. విదేశీయుల ట్రిబ్యునల్ మిమ్మల్ని దేశం నుంచి బహిష్కరిస్తుంది. ఆ చట్టం ప్రకారమే ఎన్‌ఆర్‌సీ జాబితా సిద్ధమవుతోంది.

అస్సాంలో ఎన్‌ఆర్‌సీ జాబితా తయారు చేయడం ఇదే తొలిసారి కాదు. అస్సాంలో మొదటిసారి ఎన్‌ఆర్‌సీ జాబితాను 1951లో రూపొందించారు. అయితే, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే 'అక్రమ వలసదారులను' గుర్తించే ప్రక్రియను ప్రాధాన్యతగా తీసుకుంది.

తాము భారతీయ పౌరులమేనని నిరూపించుకునేందుకు రాష్ట్రంలోని కుటుంబాలన్నీ ఎన్‌ఆర్‌సీ ముందు హాజరై తగిన గుర్తింపు పత్రాలను సమర్పించాలి. పౌరసత్వాన్ని నిరూపించలేనివారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు.

దేశంలో బహుళ జాతీయులు ఉన్న రాష్ట్రాలలో అస్సాం ఒకటి. గుర్తింపు, పౌరసత్వం ప్రశ్నలు ఇక్కడ నివసిస్తున్న లక్షలాదిమంది విషయంలో వివాదాస్పదంగా మారాయి.

అస్సాంలో బెంగాలీలు, హిందీ మాట్లాడే అస్సామీలు, గిరిజన జాతుల తర్వాత ముస్లింలు అత్యధికంగా ఉన్నారు.

కశ్మీర్ తర్వాత ముస్లింల జనాభా నిష్పత్తి అధికంగా ఉన్న రెండో రాష్ట్రం అస్సాం.

ప్రస్తుతం అస్సాంలో నివసిస్తున్న చాలా మంది బ్రిటిష్ పాలన కాలంలో ఇక్కడికి వలసవచ్చినవారి సంతతి. తమను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకున్నాయని వారు అంటున్నారు.

అస్సాం రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజల్లో 19 లక్షల మంది భారతీయులు కాదని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

అయితే, వీరిలో ఎక్కువ భాగం ముస్లింలుండటం, మరోవైపు దేశమంతా ఎన్‌ఆర్‌సీ అమలు చేయాలని బీజేపీ చెబుతుండటంతో మైనారిటీలు మరింత ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు: మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు - చంద్రబాబు

వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు

జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు

థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు

మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు

‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లల ఫొటో చూసి ఆగిపోయా’ - టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్

భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ

భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా, జంతువులు కూడా నొప్పితో బాధపడుతాయా