పాకిస్తాన్ హిందూ శరణార్థులు: ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ రోజు

  • 13 డిసెంబర్ 2019
పాకిస్తాన్ హిందూ శరణార్థులు

మా 'నాగరికత'కు నాగరికత (హిందీలో నాగరికత అంటే పౌరసత్వం) లభిస్తుంది.

ఏడేళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి వచ్చి భారత్‌లో నివసిస్తున్న హిందూ శరణార్థి మీరా తన మనవరాలివైపు చూసి ఈ మాట అన్నారు.

నిజానికి లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు 2019 ఆమోదం పొందిన రోజే ఆమె మనవరాలు పుట్టింది.

ఆమె ఇంట్లో ఒకే రోజు రెండు సంబరాలు జరిగాయి. ఒకటి.. ఏళ్ల తరబడి ఎదురుచూసిన పౌరసత్వం కోరిక ఫలిస్తున్నట్లు కనిపించడం. రెండోది, ఆ రోజే మనవరాలు 'నాగరికత' పుట్టడం.

"పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు నేను నా కుమారుడికి భారత్ అని, కూతురికి భారతి అని పేర్లు పెట్టాను. తర్వాత మేం భారత్ వచ్చేశాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నదంతా చూస్తుంటే మాకు పౌరసత్వం లభించేలా ఉంది. అందుకే నేను నా మనవరాలి పేరును 'నాగరికత' అని పెడదామనుకున్నా. పాప పుట్టగానే.. పౌరసత్వం అందించాలనే బిల్లు ఆమోదం పొందింది. ఏమో.. తన అదృష్టం వల్ల మాకు పౌరసత్వం కూడా వస్తుందేమో" అన్నారు మీరా.

పాప తాతయ్య సుఖ్‌నంద్... "ఈరోజు మాకు హోలీ, దీపావళి కంటే పెద్ద పండుగ వచ్చినట్టుంది. ఎందుకంటే ఇక మాకు పౌరసత్వం లభించబోతోంది" అన్నారు.

ఈయన లాగే దిల్లీలోని మజ్నూ ప్రాంతంలో పాకిస్తాన్ నుంచి వచ్చి నివసిస్తున్న హిందూ శరణార్థుల కుటుంబాల్లో సంతోషం కనిపించింది.

ఈ శరణార్థుల కాలనీలో 140 హిందూ కుటుంబాలు ఉన్నాయి. మొత్తం కలిపి సుమారు 700 మంది ఉన్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకు సంబంధించిన చాలా కాలనీలు ఉన్నాయి.

'నాగరికత' కుటుంబం లాగే బస్తీలో ప్రతి కుటుంబంలోనూ అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. ఎందుకంటే, పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత తమకు మంచి రోజులు రాబోతున్నాయని వారికి నమ్మకం వచ్చింది. బిల్లు ఆమోదం పొందగానే, పౌరసత్వం వచ్చినంతగా వారు సంతోషించారు. ఇక అధికారిక పత్రాలు అందడమే మిగిలిందని అనుకుంటున్నారు.

ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ బిల్లు గురించి వివాదం నడుస్తోంది. జనం కోపంతో హింసకు కూడా దిగుతున్నారు. అదే సమయంలో దేశంలో పాకిస్తానీ హిందూ శరణార్థుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

వీరంతా తమకు ఎప్పుడు భారత పౌరసత్వం లభిస్తుందా, అందరూ తమను భారతీయులుగా ఎప్పుడు గుర్తిస్తారా అనే రోజు కోసం ఎన్నో ఏళ్ల నుంచీ ఎదురుచూస్తున్నారు.

మెరుగైన భవిష్యత్తు కోసం...

సోనాదాస్ పాకిస్తాన్‌ సింధ్ ప్రాంతంలోని హైదరాబాద్‌లో ఉంటారు. అక్కడ ఆయనకు భూములు, ఆస్తులు, పొలాలు, పశువులు అన్నీ ఉన్నాయి.

హిందూ కావడం వల్ల తనపట్ల వివక్ష చూపారని, వేధించారని, తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని, అందుకే, పాకిస్తాన్ వదిలి భారత్ రావాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

"మన మతానికి ముప్పు వస్తోంది. నాకు మతం చాలా ముఖ్యం. నేను దానిని రక్షించుకోవాలి. అందుకే నేను నా కుటుంబంతో పాకిస్తాన్ వదిలివెళ్లాలని నిర్ణయించుకున్నా" అన్నారు.

చిత్రం శీర్షిక బల్ దేవి

ఎంతోమంది వెనక్కు వెళ్లారు

సోనాదాస్ లాగే బల్ దేవి కూడా తన అత్తవారితో కలిసి భారత్ వచ్చేశారు. కానీ ఆమె పుట్టింటివారు ఇంకా అక్కడే ఉన్నారు.

భారత్ వచ్చాక ఆమె తన పుట్టింటివారిని కలవడానికి ఎప్పుడూ పాకిస్తాన్ వెళ్లలేదు. మళ్లీ పాకిస్తాన్ వెళ్తే, భారత పౌరసత్వం లభించడంలో సమస్యలు వస్తాయేమో అని ఆమె భయపడ్డారు.

ఇప్పుడు ఆమెకు మళ్లీ ఆశలు చిగురించాయి. భారత పౌరసత్వం వచ్చాక ఏ సమస్యా లేకుండా తను పాకిస్తాన్ వెళ్లవచ్చని ఆమె చెబుతున్నారు. అప్పుడు, తమ పుట్టింటివారు కూడా భారత్ రావడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పారు.

చిత్రం శీర్షిక సుఖనంద్

ఎంతోమంది తల్లులు బిడ్డలను వదిలి వచ్చారు

చాలామంది మహిళలు తమ పిల్లలను పాకిస్తాన్‌లోనే వదిలి రావాల్సి వచ్చిందని హిందూ శరణార్థుల కాలనీ పెద్ద సుఖనంద్ చెప్పారు.

చాలా ఏళ్ల క్రితం మేం 445 మంది కలిసి బృందంగా తీర్థయాత్ర కోసం వీసా తీసుకుని భారత్ వచ్చాం. తర్వాత ఇక్కడే ఉండిపోయాం అన్నారు.

ఆ బృందంలో ఒక మహిళ కూడా ఉంది. ఆమె భారత్ రావడానికి ఒక రోజు ముందే తన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ శిశువుకు పత్రాలు లేకపోవడంతో ఆమె బిడ్డను అక్కడే బంధువుల దగ్గరే వదిలేసి రావాల్సొచ్చింది. తనలా చాలా మంది మహిళలు ఉన్నారని, తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను అక్కడే వదిలేసి వచ్చారని ఆమె చెప్పారు.

త్వరలో తమ పిల్లలు కూడా పాకిస్తాన్ నుంచి భారత్ వచ్చి తమతోనే ఉంటారని ఆ తల్లులందరూ ఇప్పుడు ఆశిస్తున్నారు.

చిత్రం శీర్షిక యశోద

మా వదినను ఎత్తుకెళ్లారు

యశోద భారత్ వచ్చినపుడు, ఆమెకు పెళ్లి కాలేదు. భారత్ వచ్చాక పెళ్లైంది. ఇప్పుడు ఆమెకు ముగ్గురు పిల్లలు.

పాకిస్తాన్‌లో చదువుకోలేకపోయానని ఆమె చెప్పారు. కానీ ఇప్పుడు తన పిల్లలను బాగా చదివించి గొప్పవారిని చేస్తానన్నారు.

కుటుంబంతో సహా పాకిస్తాన్ నుంచి వచ్చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో యశోద చెప్పారు.

"మా వదినను ఎత్తుకెళ్లిపోయారు. రెండు మూడు నెలల వరకూ ఆమె ఆచూకీ తెలీలేదు. ఆమెకు మతమార్పిడి చేశారేమో తెలీదు. ఆ భయంతోనే అక్కడ నుంచి వచ్చేశాం" అన్నారు.

పాకిస్తాన్ కంటే మెరుగైన భవిష్యత్తు కోసం భారత్ వచ్చిన వీరు ఇక్కడకు వచ్చిన తర్వాత తమ పరిస్థితి మెరుగుపడిందని చెబుతున్నారు.

"మేమంతా కలిసి భారత్ వచ్చేశాం. చాలా వదిలేసి వచ్చాం. కానీ ఇక్కడ గౌరవంగా జీవిస్తున్నాం. రాత్రి ప్రశాంతంగా నిద్రపోతున్నాం. కొన్నిసార్లు రెండు పూటలా తిండి సంపాదించడం కూడా కష్టమైపోతుంది. కానీ 200- 250 సంపాదనతో మా రోజు గడిచిపోతుంది" అన్నారు.

ఇక్కడ ఉంటున్న వారిలో ఎక్కువమంది తోపుడు బండ్లపై అమ్మకాలు సాగిస్తుంటారు. పొలాల్లో పనిచేస్తారు, చిన్న చిన్న షాపులతో జీవనం కొనసాగిస్తున్నారు.

ప్రాథమిక సౌకర్యాల కరవు

ఇక్కడి వారు చెబుతున్నట్టు వారి పరిస్థితి మెరుగుపడింది. కానీ ప్రాథమిక అవసరాల లోటు అక్కడ ఇప్పటికీ ఉంది.

బీబీసీ టీమ్ దిల్లీలో ఉన్న మజ్నూ ప్రాంతంలో శరణార్థుల కాలనీకి వెళ్లినపుడు, అక్కడ ఈ హిందూ శరణార్థులందరూ మట్టి ఇళ్లలో ఉండడం కనిపించింది. కాలనీలో ఇరుకు మట్టి దారులు బురదగా ఉన్నాయి. వారందరికీ టాయిలెట్ కోసం కాలనీ మొదట్లోనే ఒక కమ్యూనిటీ మరుగుదొడ్డి నిర్మించారు.

"కరెంటు లేదు, నీళ్లు లేవు, ఉండడానికి సరైన ఏర్పాట్లు లేవు. ఐదారుసార్లు మా ఇళ్లు కాలిపోయాయి. యమునలో నీళ్లు పెరిగితే మా ఇళ్లలోకి వచ్చేస్తాయి. పాములు దూరతాయి. మా పిల్లలు వీధుల్లో ఉండాల్సొస్తుంది. కానీ మేం మోదీ గారికి ఫిర్యాదు చేయం. ఇప్పుడు మాకు పౌరసత్వం లభించబోతోంది. అది వస్తే మాకు అన్నీ వచ్చినట్లే" అని బల్ దేవి చెప్పారు.

పౌరసత్వం లభించిన తర్వాత అన్ని సమస్యలూ దూరమవుతాయని హిందూ శరణార్థులకు అనిపిస్తోంది.

"హోంమంత్రి అమిత్ షా మాకోసం పార్లమెంటులో నిలబడ్డారు. ఆయన, మోదీజీ వందేళ్లు చల్లగా ఉండాలని, ఇలాగే దేశానికి నాయకత్వం వహించాలని నేను ప్రార్థిస్తున్నా" అని సంతోషంగా చెబుతారు సోనాదాస్.

వ్యతిరేకతలపై ఆగ్రహం

దేశంలో చాలా ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇవి హింసాత్మకంగా మారాయి.

వ్యతిరేకతలు చేస్తున్న వారిలో రెండు రకాల వారున్నారు. ముస్లింలపై వివక్ష చూపుతున్నారని, ఈ బిల్లులో తమకు పౌరసత్వం కల్పించే నిబంధన కల్పించలేదని కొందరు అంటున్నారు. దేశంలో అక్రమంగా ప్రవేశించిన ఎవరికీ పౌరసత్వం ఇవ్వకూడదని మరో రకం వారు కోరుతున్నారు.

"భారత్ హిందూ దేశం. వేరే ఏ దేశంలో అయినా హిందువులకు సమస్యలు వస్తే, కష్టంగా ఉంటే వారు ఎక్కడికెళ్తారు? భారత్ మాత్రమే హిందువుల దేశం. హిందువులు ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందచ్చు. అదే ముస్లింల విషయానికి వస్తే వారికి చాలా దేశాలున్నాయి. వాళ్లు ఎక్కడికైనా వెళ్లచ్చు" అంటారు సోనాదాస్.

సోనాదాస్‌తో మా సంభాషణ పూర్తవగానే, అక్కడకు ఆయన తమ్ముడి కూతురు రామ్ ప్యారీ వచ్చింది. ఆమె అప్పుడే స్కూలు నుంచి వచ్చింది. 10వ తరగతి చదువుతున్న రామ్ ప్యారీ ఆలోచనలు తన పెదనాన్నకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి.

"మతం ఆధారంగా ఎవరిమీదా వివక్ష చూపకూడదు. హిందువులు ఎలాగో ముస్లింలు కూడా అంతే. వేధింపులు, సమస్యల వల్ల భారత్‌కు వచ్చిన వారందరికీ మాకు ఇచ్చినట్లే పౌరసత్వం అందించాలి" అని రామ్ ప్యారీ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు