షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’

  • 15 డిసెంబర్ 2019
షారుఖ్ ఖాన్ Image copyright Getty Images

రెండేళ్లుగా తన సినిమాలు సరిగ్గా ఆడలేకపోతుండటానికి కారణం తాను కథను సరిగ్గా చెప్పలేకపోవడమేనని బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ అన్నారు.

బీబీసీ 'టాకింగ్ మూవీస్' కార్యక్రమం ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం కోసం బీబీసీ వ్యాఖ్యాత టామ్ బ్రూక్స్‌కు షారుఖ్ ఖాన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు ఇటీవల ఎదురైన సినీ వైఫల్యాల గురించి ఇందులో మాట్లాడారు.

2013లో చెన్నై ఎక్స్‌ప్రెస్‌తో భారీ విజయం సాధించిన తర్వాత ఆరేళ్లలో ఏడు సినిమాల్లో షారుఖ్ హీరోగా నటించారు. వాటిలో ఒక్కటి కూడా భారీ విజయం లేదు.

కథలను ప్రతిసారీ గొప్పగా చెప్పలేమని, కొన్ని సార్లు అందులో విఫలం కూడా అవుతుంటామని షారుఖ్ అన్నారు.

''మేం మంచి చిత్రాలు తీయలేదు. అందుకే (అవి విజయవంతం కాలేదు). భారత్‌లో క్రికెట్ ఆడటం, సినిమాలు తీయడం అందరికీ తెలుసు. సచిన్‌కు బ్యాటింగ్ ఎలాగో, నాకు కథ చెప్పడం ఎలాగో కూడా కొందరు నేర్పుతుంటారు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నేను కథను సరిగ్గా చెప్పలేకపోయాను. అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నేను వినయంతో ఈ విషయం చెప్పట్లేదు. నిజాయితీగా చెబుతున్నా'' అని వ్యాఖ్యానించారు.

ప్రేక్షకులు తనకు బాస్ లాంటివారని, తాను వారి ఉద్యోగినని.. బాస్‌ను సంతృప్తిపరచలేనప్పుడు తన ఉద్యోగం ఊడుతుందని అన్నారు.

‘‘గత రెండేళ్లుగా నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. అయితే, వారు (ప్రేక్షకులు) మళ్లీ నాకు అవకాశం ఇస్తారు. నేను మళ్లీ వస్తా. తిరిగి నా బాస్‌ను మచ్చిక చేసుకుంటా’’ అని చెప్పారు.

'భవిష్యత్తు తరాలకు మీరు వారసత్వంగా ఏం అందిచాలనుకుంటున్నారు?' అన్న ప్రశ్నకు.. బాగా కష్టపడే గుణం, హాస్య రసం కలిసిన పని సంస్కృతిని ఇవ్వాలనుకుంటున్నానని, అప్పుడే జీవితంలో అలసిపోకుండా ఉండగలుగుతారని ఆయన అన్నారు. విజయాన్ని టీషర్ట్‌లా (క్యాజువల్‌గా) ధరించాలని సూచించారు.

చిత్రం శీర్షిక టామ్ బ్రూక్స్, షారుఖ్ ఖాన్

భారత్‌లో కథను చెప్పే సంస్కృతిలో పాటలు, నృత్యం వారసత్వంగా భాగమయ్యాయని, బాలీవుడ్‌ సినిమాల్లో పాటలు భవిష్యత్తులోనూ చాలా కాలం కొనసాగుతాయని షారుఖ్ అన్నారు.

ఆస్కార్ పురస్కారాలకు భారతీయ సినిమాలను ఎంపిక చేసే పద్ధతిలో మార్పులు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

''మనం భారత్ నుంచి ఆస్కార్స్‌కు పంపేందుకు ఏదో ఒక సినిమా అత్యుత్తమమని భావించి ఎంపిక చేస్తాం. కానీ, చాలా సార్లు అది అత్యుత్తమం కాదు, ఎందుకంటే ఆస్కార్ అభిరుచులకు తగిన విధంగా వాటిని మనం ఎంపిక చేసుకోవడం లేదు. సినీ దర్శకులు, సంఘాలు ఆస్కార్ ఏం ఆశిస్తుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి'' అని అన్నారు.

మీటూ ఉద్యమం భారత్‌లోనూ చాలా మార్పు తెచ్చిందని షారుఖ్ అభిప్రాయపడ్డారు.

''సినీ, మీడియా ప్రపంచం ఇప్పుడు మేల్కొంది. అనుచితంగా ప్రవర్తిస్తే, దానికి పర్యవసానాలు ఉంటాయన్న విషయం జనాలకు అర్థమైంది'' అని అన్నారు.

Image copyright Getty Images

ప్రజల్లో తనకు అంత ఆదరణ వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని షారుఖ్ అన్నారు.

''ఒక్కసారిగా పెద్ద స్టార్ అయిపోతానని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పటికీ ఇది నా ఊహకు అందదు. నాకే ఎందుకు ఇలా జరిగింది, వేరే ఎవరికో ఎందుకు కాదు అన్న విషయం ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఇన్నేళ్లు గడిచినా, జనాలు ఇంకా నన్ను ప్రేమిస్తుండటం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది'' అని చెప్పారు.

''నన్ను ఇష్టపడేవారంటే నాకూ చాలా ఇష్టం. వాళ్లని కలవాలని నాకూ ఉంటుంది. కానీ, నా పని అలాంటి అవకాశాలను ఎక్కువగా ఇవ్వదు. రోజులో 12 గంటలపాటు స్టూడియోలో నేను పనిచేయాల్సి ఉంటుంది'' అని అన్నారు.

ఫెయిర్‌నెస్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉండటం గురించి వస్తున్న విమర్శలపైనా షారుఖ్ స్పందించారు.

''అలాంటి ఉత్పత్తులను ఎందుకు ఎంచుకుంటారని అప్పుడప్పుడూ నాకు ప్రశ్నలు ఎదురవుతుంటాయి. వారికి నేనెప్పుడూ ఒకటే చెబుతుంటా. ఆ ఉత్పత్తులు నన్ను ఎంచుకుంటాయి. నేను వాటిని ఎంచుకోను. అవి చట్టబద్ధమైనవే కదా'' అని అన్నారు.

సినీ వారసత్వం గురించి షారూఖ్ స్పందిస్తూ.. ‘‘లెగసీ అనేది చాలా పెద్ద పదం. నేనెప్పుడూ భావితరాల కోసం పనిచేయలేదు. డబ్బు సంపాదించడానికే పనిచేశాను. అయితే, నా శ్రద్ధాంజలి మాత్రం.. ‘నేను ప్రయత్నించాను. నేను కష్టపడ్డాను, మళ్లీ నేను ప్రయత్నించాను’ అని చదవగలిగితే అదే నాకు నిజాయితీతో కూడిన వాస్తవం అనిపిస్తుంది. చాలామంది ప్రజలకు ఇదే మంత్రం కావాలని నేను అనుకుంటాను’’ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

నిర్భయ దోషులకు మార్చి 3న ఉరిశిక్ష: దిల్లీ కోర్టు

ఒక 'బలవంతపు పెళ్లి' వేల మందిని కాపాడింది

శ్రీనివాస్ గౌడ: ‘ట్రయల్ రన్‌లో పాల్గొనను.. పరుగు పందేలపై ఆసక్తి లేదు’

మహిళలు కూడా ఆర్మీలో కమాండింగ్ రోల్స్‌, శాశ్వత కమిషన్‌కు అర్హులే: సుప్రీంకోర్టు

హాంకాంగ్‌లో టాయిలెట్‌ రోల్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు.. సూపర్ మార్కెట్ల వద్ద భారీగా క్యూలు కడుతున్న జనం

ఉమెన్స్ లీగ్: భారత మహిళల ఫుట్‌బాల్‌లో ఎలాంటి మార్పులొస్తున్నాయి

జపాన్‌ తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్సెస్ నౌక నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి బయల్దేరిన అమెరికన్లు

"ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి