'రేప్ ఇన్ ఇండియా': భారత్‌లో అత్యాచారాలను రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ రాజకీయ అంశంగా ఎలా మార్చారంటే...

  • 14 డిసెంబర్ 2019
రాహుల్ గాంధీ Image copyright Getty Images

అత్యాచారాల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 12న చేసిన వ్యాఖ్యలపై దుమారంతో శుక్రవారం పార్లమెంటు పదేపదే వాయిదా పడింది.

దేశంలో మహిళలపై జరుగుతున్న దారుణమైన నేరాల గురించి ఒక ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రస్తావిస్తూ- ప్రధాని నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' గురించి మాట్లాడుతున్నారని, కానీ ఎక్కడ చూసినా 'రేప్ ఇన్ ఇండియా' పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు.

భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం 'మేక్ ఇన్ ఇండియా'.

రాహుల్ భారత్‌ను అవమానపరుస్తున్నారని, భారత మహిళలపై అత్యాచారం చేయడానికి ఆహ్వానిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని పాలక బీజేపీ ఎంపీలు పలువురు డిమాండ్ చేశారు.

వారి డిమాండ్‌ను రాహుల్ తోసిపుచ్చారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేడు ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ దిల్లీని 'అత్యాచారాల రాజధాని' అని అనేకసార్లు అన్నారని ఆయన విమర్శించారు. దీనికి రుజువుగా 2014 ఎన్నికలకు ముందు మోదీ ప్రచారంతో కూడిన ఒక వీడియోను ట్విటర్లో పెట్టారు.

బీజేపీ ఎంపీలు ఆర్థిక వ్యవస్థ మందగమనం, పౌరసత్వ చట్టానికి వివాదాస్పద సవరణలపై వ్యతిరేకత లాంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనుకొంటున్నారని, అందుకే తన వ్యాఖ్యలను తప్పుబడుతూ పార్లమెంటు కార్యకలాపాలకు ఆటంకం కలిగించేందుకు యత్నిస్తున్నారని రాహుల్ విమర్శించారు.

మహిళలపై నేరాలు ముఖ్యంగా 'దిశ' అత్యాచారం-హత్య ఉదంతంతో భారత్ అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కింది.

ఈ ఘటనను పార్లమెంటులో పార్టీలకు అతీతంగా సభ్యులు ఖండించారు. అత్యాచారానికి పాల్పడ్డవారిని కొట్టి చంపాలని ఒక ఎంపీ డిమాండ్ చేశారు.

'దిశ' ఉదంతం జరిగిన కొన్ని రోజులకే, ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో సామూహిక అత్యాచార బాధితురాలు ఒకరు కేసులో కోర్టు విచారణకు వెళ్తుండగా దుండగులు నిప్పుపెట్టారు. తీవ్ర గాయాలైన ఆమె తర్వాత చనిపోయారు.

ఇంకోవైపు ఉన్నావ్ జిల్లాలోనే జరిగిన మరో అత్యాచార కేసులో బీజేపీ శాసనసభ్యుడి మీద అభియోగాలపై ఈ నెల 16న కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఒక అనుమానాస్పద రోడ్డు ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడినా ఈ కేసు గురించి ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపడం లేదని గురువారం నాటి ర్యాలీలో రాహుల్ ఆరోపించారు. ఈ ఘటనలో బాధితురాలి ఇద్దరు బంధువులు చనిపోయారు. ఆమె న్యాయవాది తీవ్ర గాయాలపాలయ్యారు.

Image copyright Getty Images

రాహుల్ ఆరోపణల్లో కొంతమేర వాస్తవం ఉంది. ఇటీవలి నెలల్లో మహిళలపై నేరాల పట్ల ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారు. 'దిశ' సామూహిక అత్యాచారం-హత్యపై పార్లమెంటులో ఎంపీలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేసిన రోజు, ప్రధాని మోదీ అక్కడ కనిపించలేదు.

2014 ఎన్నికలకు ముందు మోదీ తరచూ మహిళల భద్రత గురించి మాట్లాడేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసే ముందు 2012 దిల్లీ నిర్భయ అత్యాచార ఘటనను గుర్తుతెచ్చుకోవాలని 2013 డిసెంబరులో ఆయన ప్రజలను కోరారు.

2014 మేలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక కొన్ని రోజులకే, మహిళలపై నేరాన్ని తాము ఏ మాత్రం సహించబోమంటూ ప్రభుత్వం విధాన ప్రకటన చేసింది.

మహిళలపై లైంగిక హింసను 2014 ఆగస్టు 15న ప్రధానిగా తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మోదీ ఖండించారు. మగపిల్లలను ఎలా పెంచాలో చెబుతూ కొన్ని సూచనలు చేశారు. అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడంలో సామాజిక, కుటుంబ బాధ్యత ఉందని, ఇంట్లో మగపిల్లలను మరింతగా ప్రశ్నించాలని తల్లిదండ్రులకు సూచించారు.

భారత్‌లో మహిళలకు ఎట్టకేలకు పరిస్థితులు మెరుగుపడొచ్చనే ఆశను ప్రధాని ప్రసంగం చాలా మందిలో కల్పించింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2017లో భారత్‌లో సగటున ప్రతి పావు గంటకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోందని గణాంకాలు చెబుతున్నాయి.

ఇటీవల విడుదల చేసిన అధికారిక నేరగణాంకాలు ఈ ఆశలను నీరుగార్చాయి. 2017లో భారత్‌లో సగటున ప్రతి పావు గంటకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, మోదీ వాగ్దానాలు చాలా మందికి శుష్క వాగ్దానాలుగా అనిపించడం మొదలైంది.

ఈ విషయంలో భారత మహిళలు కోరేది రాజకీయాలు, చిత్తశుద్ధిలేని ఆగ్రహావేశాలు కాదు. భారత్‌ను మహిళలకు సురక్షితమైనదిగా మార్చేందుకు పటిష్ఠమైన కార్యాచరణ చేపట్టాలని వారు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: ఆంధ్రప్రదేశ్‌లో 34 కొత్త కేసులతో 226కు చేరిన కోవిడ్ బాధితులు

కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు