CAB: అస్సాంలో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరుగుతోంది?

  • 14 డిసెంబర్ 2019
అస్సాం ఆందోళనలు Image copyright Getty Images

చర్చనీయాంశమైన అస్సాం ఉద్యమం తర్వాత గువాహటి వీధుల్లో మళ్లీ అలాంటి జన ప్రవాహం మొదటిసారి కనిపించింది. ఆ సమయంలో యువకులుగా ఉన్నవారు ఇప్పుడు వృద్ధులైపోయారు.

వారికి అసామియా అస్థిత్వం కోసం జరిగిన పోరాటంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఆనాటి పురాతన కథలు ఇప్పటికీ గుర్తున్నాయి.

అప్పటి పిల్లలు ఇప్పుడు యువకులు అయ్యారు. 'జై అఖమ్' నినాదాలతో రోడ్లపైకి వచ్చారు. CAB వారిని మళ్లీ ఒక్కటి చేసింది.

అలాంటప్పుడు, ఇంత పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించేది ఎవరు, దీని పగ్గాలు ఏ వ్యక్తి లేదా ఏ సంస్థ చేతుల్లో ఉన్నాయనే ప్రశ్న తలెత్తుతుంది.

ఇది ప్రజా-ఉద్యమం

ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు) చీఫ్ సముజ్వల్ భట్టాచార్య ఇది నిజానికి ప్రజాఉద్యమం అంటున్నారు.

బీబీసీతో మాట్లాడిన సముజ్వల్ భట్టాచార్య... "అస్సాం ప్రైడ్, అసామియా గుర్తింపు కోసం నడుస్తున్న ఈ ఉద్యమంలో అందరి నుంచీ మద్దతు లభించిందన్నారు. మేం CABను పార్లమెంటుకు తీసుకురావడానికి వ్యతిరేకంగా డిసెంబర్ 10న ఈశాన్య రాష్ట్రాల్లో బందుకు పిలుపునిచ్చాం. నార్త్ ఈస్ట్ స్టూడెంట్ యూనియన్ (నెసో) బ్యానర్‌తో జరిగిన ఆ అపూర్వ బంద్ తర్వాత రోజు, అంటే డిసెంబర్ 11న జనం స్వయంగా వీధుల్లోకి వచ్చారు" అన్నారు.

"ఆ సమయంలో హింస జరగడంతో, నేతృత్వం లేకుంటే ఉద్యమానికి దిశానిర్దేశం లేకుండా పోతుందని మాకు అనిపించింది. అందుకే 12న లతాశీల్ మైదానంలో జరిగిన సభలో ఉద్యమం శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా చేయాలని నిర్ణయించుకున్నాం".

"మేం రోజూ ఒక ప్రణాళిక ప్రకారం ఉద్యమం చేస్తున్నాం. అలాంటప్పుడు, ఎవరైనా హింసామార్గాన్ని ఎంచుకుంటే, వారు మా ఉద్యమానికి స్నేహితుడు కాదు, శత్రువు" అన్నారు.

ఈ ఉద్యమానికి 'ఆసు' నేతృత్వం వహిస్తోందా?

సముజ్వల్ భట్టాచార్య ఈ ఉద్యమంలో అతిపెద్ద నేత అని గువాహటి నుంచి ప్రచురితమవుతున్న 'దైనిక్ పూర్వోదయ్' ఎడిటర్ రవిశంకర్ రవి చెబుతున్నారు. ఈ ఉద్యమానికి 'ఆసు' నేతృత్వం వహిస్తుందనేది అది స్పష్టం చేస్తోందన్నారు.

"మొదట్లో విద్యార్థులు, యువకుల ద్వారా ప్రారంభమైన ఈ ఉద్యమానికి ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది. ఇప్పుడు ఇది ప్రజాఉద్యమంలా మారింది. ఇందులో అస్సాం సమాజంలోని ప్రతి వర్గానికి చెందినవారూ పాల్గొంటున్నారు" అన్నారు.

''ఇది మా అస్థిత్వ పోరాటం. ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారు'' అని అసామియా సినిమాల్లో నటించే ప్రముఖ నటి తరిఫా వాహిద్ బీబీసీతో అన్నారు.

"అస్సామీ తల్లిదండ్రులు తమ పిల్లలకు CABను వ్యతిరేకించాలని చెబుతున్నారు. ఉద్యమం కోసం రాత్రి ఇంటికి రాలేకపోయినా, ఫర్వాలేదు అంటున్నారు. మేం వారి వెంట నిలుస్తున్నాం. మేం మా గుర్తింపు, సంస్కృతి, హక్కులను రక్షించుకోవాలి. అందుకే పౌరసత్వ సవరణ బిల్లును వెనక్కి తీసుకునేవరకూ ఈ ఉద్యమం నడుస్తుంది" అని ఆమె చెప్పారు.

Image copyright FACEBOOK/SARBANANDA SONOWAL
చిత్రం శీర్షిక సర్బానంద్ సోనోవాల్

ప్రభుత్వం ఏం అనుకుంటోంది

ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ కూడా ఇది అస్సాం ప్రైడ్ పోరాటం అంటున్నారు.

ఆయన బీబీసీతో... "ప్రతి వ్యక్తికీ తన రాష్ట్రం, భూమి గురించి ఆత్మగౌరవం ఉంటుంది. అస్సాం ప్రజలు కూడా ఇదే సమాజంలో ఒక భాగం. వారికి కూడా తమ రాష్ట్రం, దేశంపై గౌరవం ఉంటుంది" అన్నారు.

"కానీ, CABను నిజానికి అస్సాం ప్రజలకు వారి హక్కులు అందించడం కోసమే తీసుకొచ్చారు. కొంతమంది తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ హింసను రెచ్చగొడుతున్నారు" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)