సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’

  • 15 డిసెంబర్ 2019
సర్దార్ పటేల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక సర్దార్ పటేల్

సర్దార్ పటేల్‌ను దిల్లీ నుంచి జైపూర్‌కు తీసుకువెళ్తున్న విమానం జాడ కనిపించకుండా పోయిందంటూ 1949, మార్చి 29న రాత్రి 9 గంటలకు ఆల్ ఇండియా రేడియో ఓ వార్త ప్రసారం చేసింది.

ఆ విమానంలో పటేల్‌తోపాటు ఆయన కుమార్తె మణిబెన్, సెక్రటరీ వి.శంకర్, జోధ్‌పూర్ మహారాజు హన్వంత్ సింగ్ ఉన్నారు. సాయంత్రం 5.32కు జైపూర్‌లో వారు టేకాఫ్ అయ్యారు.

దాదాపు 158 కి.మీ.ల దూరం ఉన్న దిల్లీకి వెళ్లేందుకు వారికి ఒక గంటకు మించి సమయమేమీ పట్టదు. పటేల్ గుండె సమస్యలను దృష్టిలో పెట్టుకుని, విమానాన్ని 3 వేల అడుగులకు మించి ఎత్తుకు తీసుకువెళ్లొద్దని విమాన పైలెట్ లెఫ్ట్‌నెంట్ భీమ్ రావ్‌కు ఆదేశాలున్నాయి.

హన్వంత్ సింగ్‌కు కూడా ఫ్లైయింగ్ లెసెన్స్ ఉంది. దాదాపు ఆరు గంటలకు విమానంలో ఓ ఇంజిన్ పనిచేయడం లేదన్న విషయాన్ని ఆయన పటేల్ దృష్టికి తెచ్చారు. విమానం రేడియో కూడా ఆగిపోయింది. వారు ప్రయాణిస్తున్న ఎత్తు వేగంగా తగ్గిపోతూ వస్తోంది.

''అప్పుడు మనసులో ఏముందో ఆయనకే తెలియాలి. బయటకు మాత్రం ఆయన ఏ ఆందోళన లేకుండా, ప్రశాంతంగా కనిపించారు. అసలేం జరగట్లేదన్నట్లుగా ఉంది ఆయన తీరు'' అని 'రిమినెసెన్సెస్' పేరుతో పటేల్ సెక్రటరీ వి.శంకర్ ఆత్మకథలో రాశారు.

Image copyright THE MAN WHO SAVED INDIA

జైపూర్‌కు 30 మైళ్ల దూరంలో విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేసి దించాలని పైలెట్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో విమానం తలుపులు బిగుసుకుపోవచ్చని, పైకప్పు భాగంలో ఉండే అత్యవసర ద్వారం నుంచి బయటకు వెళ్లాలని ప్రయాణికులకు ఆయన సూచించారు. అందులో చిక్కుకునిపోతే, ఇంధనానికి మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది.

6.20కి అందరూ సీటు బెల్టు పెట్టుకోవాలని పైలెట్ సూచించారు. మరో ఐదు నిమిషాల తర్వాత విమానం నేలపై క్షేమంగా దిగింది. అత్యవసర ద్వారం అవసరమే పడలేదు.

కొంత సమయం తర్వాత సమీపంలో ఉన్న ఊరి జనాలు విమానం ల్యాండ్ అయిన చోటుకువచ్చారు. విమానంలో ఉన్నది సర్దార్ పటేల్ అని తెలుసుకుని.. ఆయన కోసం నీళ్లు, పాలు తెప్పించారు. కూర్చోడానికి ఓ మంచం కూడా పట్టుకువచ్చారు.

Image copyright PHOTO DIVISION

హన్వంత్ సింగ్, విమానంలోని రేడియో ఆఫీసర్ అక్కడికి దగ్గరగా రోడ్డు ఏదైనా ఉందా అని వెతికే పనిలో పడ్డారు. అప్పటికి చీకటి పడిపోయింది.

విమానం ఉన్న చోటుకి అందరి కన్నా ముందుగా కేబీ లాల్ అనే అధికారి చేరుకున్నారు.

''అక్కడికి వెళ్లేసరికి విమానం నుంచి విడిపోయిన సీటులో పటేల్ కూర్చొని ఉన్నారు. కారులో కూర్చోమని నేను ఆయన్ను కోరా. ముందుగా నా బృందంలోని సభ్యులను, జోధ్‌పూర్ మహారాజును కారులో కూర్చోపెట్టాలని ఆయన చెప్పారు'' అని కేబీ లాల్ ఓ పుస్తకంలో రాశారు.

రాత్రి 11 గంటలకు సర్దార్ పటేల్ సిబ్బంది జైపూర్ చేరుకున్నారు. అప్పటివరకూ మిగతా భారతీయుల్లానే.. వారు కూడా పటేల్ విమాన ప్రమాదానికి గురయ్యారన్న ఆందోళనలోనే ఉన్నారు.

11 గంటలకే పటేల్ సురక్షితంగా ఉన్నట్లు నెహ్రూకు కూడా సమాచారం అందింది. మార్చి 31న పటేల్ దిల్లీ చేరుకున్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో పెద్ద సంఖ్యలో జనం పటేల్‌కు స్వాగతం పలికారు.

Image copyright PATEL A LIFE

పటేల్ ఎత్తు 5 అడుగుల 5 అంగుళాలు. నెహ్రూ ఆయన కన్నా మరో మూడు అంగుళాల పొడవు ఎక్కువగా ఉంటారు.

''ఈ రోజు భారత్ ఇలా ఉందంటే, అందులో సర్దార్ పటేల్ పాత్ర చాలా గొప్పది. అయినా, మనం ఆయన్ను విస్మరిస్తుంటాం'' అని భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు పటేల్ జీవిత చరిత్ర రాసిన రాజ్‌మోహన్ గాంధీ పేర్కొన్నారు.

''స్వతంత్ర భారతంలో పాలనావ్యవస్థను చక్కదిద్దడంలో గాంధీ, నెహ్రూ, పటేల్ త్రిమూర్తుల లాంటివారు. ఈ విషయంలో గాంధీ, నెహ్రూల పాత్రను అందరూ అంగీకరిస్తారు. పటేల్‌ను మాత్రం ప్రశంసించరు'' అని రాజ్‌మోహన్ గాంధీ రాశారు.

సునీల్ ఖిల్నానీ రాసిన 'ది ఐడియా ఆఫ్ ఇండియా' పుస్తకంలో నెహ్రూ ప్రస్తావన 65 సార్లు ఉంటే, పటేల్ ప్రస్తావన కేవలం 8 సార్లు ఉంటుంది. రామచంద్ర గుహ రాసిన 'ఇండియా ఆఫ్టర్ గాంధీ'లో నెహ్రూ ప్రస్తావన 185 సార్లు ఉంటే, పటేల్ ప్రస్తావన 48 సార్లు ఉంటుంది.

Image copyright Getty Images

పటేల్ జీవితచరిత్రను 'ద మ్యాన్ హూ సేవ్డ్ ఇండియా' పేరుతో హిండోల్ సేన్‌గుప్తా కూడా రాశారు.

''గాంధీ ఇమేజ్ రాట్నం తిప్పుతూ, అహింస, మానవీయ విలువల గురించి బోధించేవాడిగా ఉంటుంది. నెహ్రూ కోటుకు ఎర్ర గులాబీ పెట్టుకునే వ్యక్తిగా కనిపిస్తారు. ఇంకో వ్యక్తి భార్యతో రొమాన్స్‌కు సంకోచించనివాడిగా కూడా ఆయనకు ఇమేజ్ ఉంది. కానీ, సర్దార్ పటేల్ జీవితంలో ఎలాంటి రొమాన్సూ లేదు (పటేల్ భార్య చాలా కాలం క్రితమే కాలం చేశారు. ఆమె తప్ప పటేల్ జీవితంలో మరో మహిళ కనిపించరు). తన గురించి, తన అవసరాల గురించి చాలా తక్కువ మాట్లాడే మనిషి ఆయన'' అని హిండోల్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

పటేల్ జీవిత చరిత్రగా 'సర్దార్ ఆఫ్ ఇండియా' అనే మరో పుస్తకం కూడా వచ్చింది. పీఎన్ చోప్రా దీన్ని రాశారు.

''మీరు భారతీయులకు ఏం చెప్పాలి... మీరు రాజులను అంతం చేయకుండానే, రాజుల పాలనను అంతం చేశారు'' అని రష్యా ప్రధానిగా ఉన్న నికోలయి బుల్గనిన్ వ్యాఖ్యానించినట్లు చోప్రా ఆ పుస్తకంలో చెప్పారు.

Image copyright PATEL A LIFE

బుల్గనిన్ అభిప్రాయం ప్రకారం పటేల్ సాధించింది బిస్మార్క్ జర్మనీ ఏకీకరణ కన్నా గొప్ప విషయం.

''నెహ్రూ హోంమంత్రిగా లేకపోవడం మంచిదైంది. లేకపోతే అంతా నాశనమయ్యేది. పటేల్ యదార్థవాది. ఆయన పనిని చాలా మెరుగ్గా పూర్తిచేశారు'' అని లార్డ్ మౌంట్‌బాటెన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు ప్రముఖ రచయిత హెచ్‌వీ హాడ్సన్ చెప్పారు.

భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్‌గా, అసోం, జమ్మూకశ్మీర్‌లకు గవర్నర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఎస్‌కే సిన్హా 'చేజింగ్ ఇండియా - స్ట్రెయిట్ ఫ్రమ్ హార్ట్' పేరుతో ఆత్మకథ రాసుకున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కరియప్ప

''తక్షణమే పటేల్ తనను కలవాలనుకుంటున్నట్లు జనరల్ కరియప్పకు సందేశం వచ్చింది. అప్పుడు కరియప్ప కశ్మీర్‌లో ఉన్నారు. వెంటనే దిల్లీకి వెళ్లి, పటేల్‌ను కలిశారు. అప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా. కరియప్ప లోపల పటేల్ తనతో ఏం మాట్లాడారన్న విషయం నాకు చెప్పారు. 'పటేల్ నన్ను చాలా సరళమైన ప్రశ్న అడిగారు. హైదరాబాద్ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ నుంచి ఏదైనా ప్రతిస్పందన వస్తే, అదనపు సాయం లేకుండా వాళ్లను ఎదుర్కోవచ్చా? అని ప్రశ్నించారు' అని కరియప్ప అన్నారు. అందుకు 'అవును' అని జవాబు ఇచ్చినట్లు వివరించారు. అంతే, వారి భేటీ ముగిసిపోయింది'' అని అందులో ఎస్‌కే సిన్హా రాశారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఎస్‌కే సిన్హా

''అప్పటికి భారత ఆర్మీ జనరల్ రాయ్ బూచర్.. కశ్మీర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌పై చర్యలను తీసుకునేందుకు సుముఖంగా లేరు. హైదరాబాద్‌ విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే మొత్తం ముస్లిం దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా నిలబడతాయని జిన్నా హెచ్చరికలు చేస్తున్నారు. కానీ, కరియప్పతో భేటీ తర్వాత పటేల్ హైదరాబాద్ యాక్షన్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఒక వారంలో హైదరాబాద్ భారత్‌లో అంతర్భాగమైపోయింది'' అని సిన్హా చెప్పారు.

Image copyright PATEL A LIFE

సముద్ర గుప్తుడు (నాలుగో శతాబ్దం), అశోకుడు (క్రీస్తుపూర్వం 250), అక్బర్ (16వ శతాబ్దం) పాలన కాలాల్లో కన్నా సర్దార్ పటేల్ హయాంలోనే భారత్ విస్తీర్ణం ఎక్కువ. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమైంది. పటేల్ బతికినప్పుడు, మరణించాక కలుపుకొని నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి ఆరుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. పటేల్ మాత్రం ఒకే ఒక్కసారి 1931లో ఆ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. మౌలానా అజాద్, మదన్‌మోహన్ మాలవీయ్ లాంటి నాయకులు కూడా ఆయన కన్నా ఎక్కువ సార్లు ఆ పదవి చేపట్టారు.

పటేల్ యువకుడిగా ఉన్నప్పటి విషయాల గురించి రాస్తూ.. ''1928లో బర్దోలీలో రైతుల ఆందోళనలో పటేల్ గొప్ప పాత్ర పోషించారు. దాని గురించి అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న మోతీలాల్ నెహ్రూ... 'ఇప్పుడు పటేల్ హీరో అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కనీసం మనం ఆయన్ను కాంగ్రెస్ అధ్యక్షుడిగానైనా చేయాలి. ఏదైనా కారణం చేత అలా జరగకపోతే, నెహ్రూ మన రెండో ఆప్షన్‌గా ఉండాలి' అంటూ గాంధీకి ఓ లేఖ రాశారు'' అని రాజ్‌మోహన్ గాంధీ వివరించారు.

''పటేల్ వర్సెస్ నెహ్రూ చర్చలో చాలా మంది నెహ్రూ వైపు మొగ్గుతారు. ఎందుకంటే నెహ్రూ వయసులో పటేల్ కన్నా 14 ఏళ్లు చిన్నవారు. తెల్లగా, ఆకర్షణీయంగా ఉంటారు. పటేల్ గుజరాతీ రైతు కుటుంబం నుంచి వచ్చినవారు. మౌనంగా ఉన్నట్లు కనిపించే మనిషి. మీసాలు తీసేసేవారు. జుట్టు చిన్నగా ఉండేది. కొంచెం కఠినంగా కనిపించేవారు'' అని రాజ్‌మోహన్ గాంధీ రాశారు.

Image copyright Getty Images

నెహ్రూ, పటేల్ దాదాపు ఒకే సమయంలో న్యాయవాద విద్యను చదువుకున్నారు. అయితే, ఆ సమయంలో వారు ఒకరినొకరు కలుసుకున్నట్లు రికార్డులేవీ లేవు.

నెహ్రూ చనిపోయి 55 ఏళ్లు గడిచినా, ఆయన ధరించిన షేర్వాణీలు, కోటుపై ధరించే గులాబీ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు.

లండన్ పర్యటన సమయంలో వెస్టర్న్ దుస్తులపై పటేల్‌కు ఇష్టం ఏర్పడింది. దీని గురించి 'సర్దార్ పటేల్స్ కరెస్పాండెన్స్' అనే పుస్తకంలో దుర్గాదాస్ ప్రస్తావించారు. ''అహ్మదాబాద్‌లో బాగా డ్రై క్లీనింగ్ చేసేవారు లేకపోవడంతో, బొంబాయిలో డ్రై క్లీనింగ్ చేయించుకునేవారు. ఆయనకు బ్రిటిష్ బట్టలంటే అంత ఇష్టం'' అని రాశారు. అయితే, గాంధీ స్వదేశీ ఉద్యమానికి ప్రభావితమై, పటేల్ భారతీయ దుస్తులను ధరించడం మొదలుపెట్టారని పేర్కొన్నారు.

పటేల్ తన గ్రామీణ నేపథ్యాన్ని ఎప్పుడూ మరిచిపోయేవారు కాదు. ఆయనలో మొండితనం, బిడియం, ఔదార్యం అన్నీ ఉండేవి.

''పటేల్ పాదాలు ఎప్పుడూ నేలపైనే ఉంటే, నెహ్రూ పాదాలు ఎప్పుడూ గాల్లో ఉంటాయని మౌంట్‌బాటెన్ అనేవారు'' అని దుర్గాదాస్ తన పుస్తకంలో రాశారు.

''నెహ్రూను ఓ ప్రపంచ నేతగా చూపించుకునేందుకు ఆయన బృందం ఇష్టపడేది. వారి దృష్టిలో పటేల్ ఒక ప్రాంతీయ నేత. ఎక్కువలో ఎక్కువగా చేతులు కట్టుకుని ఉంటూనే రాజకీయ విజయాలు సాధించే ఓ 'బలమైన వ్యక్తి'. కానీ, పటేల్ సమర్థకులు నెహ్రూను మంచి బట్టలు వేసుకునే బలహీన నాయకుడిగా చిత్రించేవారు. కఠినమైన రాజకీయ పరిస్థితులను సంభాళించే దమ్ము గానీ, శక్తి గానీ ఆయనకు లేవని వాళ్ల అభిప్రాయం'' అని హిండోల్ సేన్‌గుప్తా రాశారు.

Image copyright Getty Images

నెహ్రూ, పటేల్ సామర్థ్యాల గురించి రాజ్‌మోహన్ గాంధీ కూడా విశ్లేషించారు.

''1947 నాటికి పటేల్ వయసు అప్పటి కన్నా ఒక పది, ఇరవై ఏళ్లు తక్కువగా ఉంటే నెహ్రూ కన్నా మంచి ప్రధాని అవుతానని ఆయన నిరూపించుకునేవారేమో. కానీ, పటేల్.. నెహ్రూ కన్నా 14 ఏళ్లు పెద్ద. ఆయన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ప్రధాని పదవికి ఆయన న్యాయం చేసేవారు కాదు'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

''1941కి పటేల్ పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నొప్పి భరించలేక తెల్లవారు జామున మూడున్నరకే ఆయన నిద్ర లేచేవారు. ఓ గంట సేపు టాయిలెట్‌లో గడిపేవారు. ఆ తర్వాత నడక సాగించేవారు. 1948 మార్చి తర్వాత ఆయన్ను వాకింగ్‌కు కూడా వెళ్లొద్దని వైద్యులు చెప్పారు. జనాలను కలవడం కూడా ఆయన బాగా తగ్గించారు'' అని పటేల్ కూతురు మణిబెన్ చెప్పినట్లు దుర్గాదాస్ తన పుస్తకంలో వివరించారు.

1948 చివరి నాటికి పటేల్‌కు మతిమరుపు మొదలైందని, వినికిడి శక్తి కూడా కొంత తగ్గిందని, త్వరగా అలసిపోయేవారని వి.శంకర్ ఆత్మకథలో రాసుకున్నారు.

1950, నవంబర్ 21న పటేల్ మంచంపై రక్తపు మరకలు ఉండటం ఆయన కూతురు గమనించారు. ఆయనకు 24 గంటలు వైద్య సేవలందించేలా ఏర్పాట్లు జరిగాయి. కొన్ని రాత్రులు ఆయనకు ఆక్సిజన్ పెట్టేవారు.

Image copyright Getty Images

డిసెంబర్ 5 నాటికి తాను మరణశయ్యపై ఉన్నట్లు పటేల్ అర్థం చేసుకున్నారు. ఆ మరుసటి రోజు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్.. పటేల్‌ను పరామర్శించారు. పది నిమిషాలు ఆయన వద్ద కూర్చున్నారు. అయితే, పటేల్ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు.

బెంగాల్ సీఎంగా ఉన్న బిధాన్‌చంద్ర్ రాయ్ వచ్చినప్పుడు పటేల్ ఆయన్ను.. 'ఉండటమా? పోవడమా?' అని ప్రశ్నించారు. బిధాన్‌చంద్ర రాయ్ స్వయంగా వైద్యుడు.

''మీకు పోవాలనే ఉంటే, నేను మీ దగ్గరికి రావడం ఎందుకు'' అని పటేల్‌కు బిధాన్‌చంద్ర సమాధానం ఇచ్చారు.

Image copyright PHOTO DIVISION

ఆ తర్వాత రెండు రోజులూ సర్దార్.. కబీర్ కీర్తనలను పాడుకుంటూ ఉన్నారు.

ఆ మరుసటి రోజు పటేల్‌ను బొంబాయి తరలించాలని, అక్కడి వాతావరణం ఆయనకు అనుకూలించవచ్చని వైద్యులు సూచించారు.

''వాయుసేన విమానంలో పటేల్‌ను బొంబాయికి తరలించే ఏర్పాట్లు జరిగాయి. విమానం మెట్ల ముందు రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, ప్రధాని నెహ్రూ, మాజీ గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి, పారిశ్రామికవేత్త ఘన్‌శ్యామ్ దాస్ బిర్లా నిల్చున్నారు. పటేల్ వాళ్లందరికీ నవ్వుతూ వీడ్కోలు పలికారు. నాలుగున్నర గంటల ప్రయాణం తర్వాత విమానం బొంబాయిలో దిగింది. ఆయనకు స్వాగతం పలికేందుకు బొంబాయి తొలి సీఎం బీజీ ఖేర్, మొరార్జీ దేశాయ్ వచ్చారు'' అని రాజ్‌మోహన్ గాంధీ తన పుస్తకంలో రాశారు.

Image copyright Getty Images

రాజ్‌భవన్ కారులో ఆయన్ను బిర్లా హౌస్‌కు తరలించారు. కానీ ఆయన పరిస్థితి విషమించింది.

1950 డిసెంబర్ 15న తెల్లవారు జామున మూడు గంటలకు పటేల్‌కు గుండెపోటు వచ్చింది. నాలుగు గంటలు గడిచిన తర్వాత ఆయన కొంత స్పృహలోకి వచ్చారు. మణిబెన్ గంగాజలంలో తేనెను కలిపి ఆయనకు పట్టించారు. ఉదయం 9.37కు పటేల్ తుదిశ్వాస విడిచారు.

Image copyright PATEL- A LIFE

మధ్యాహ్నం నెహ్రూ, రాజగోపాలాచారి దిల్లీ నుంచి బొంబాయికి వచ్చారు. నెహ్రూ వద్దని సూచించినా, రాజేంద్ర ప్రసాద్ కూడా బొంబాయికి చేరుకున్నారు.

''రాష్ట్రపతి కేబినెట్ మంత్రుల అంత్యక్రియల్లో పాల్గొనకూడదన్నది నెహ్రూ అభిప్రాయం. అలా చేస్తే ఒక తప్పుడు సంప్రదాయం మొదలవుతుందని ఆయన భావించేవారు'' అని కేఎమ్ మున్షీ 'పిలిగ్రిమేజ్' అనే పుస్తకంలో రాశారు.

పటేల్ అంత్యక్రియల సమయంలో రాజేంద్రప్రసాద్, నెహ్రూ, రాజగోపాలాచారీ కన్నీరు పెట్టుకున్నారు. ఆయన చితి వద్ద రాజేంద్రప్రసాద్ ప్రసంగం కూడా చేశారు.

''సర్దార్ శరీరాన్ని ఈ అగ్ని దహించివేయొచ్చు. కానీ, ఆయన కీర్తిని దహించే అగ్ని ఈ ప్రపంచంలో లేదు'' అని రాజేంద్రప్రసాద్ అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: 'పాకిస్తానీలకు కరోనావైరస్ సోకదనే భ్రమలు వద్దు, అది ఎవరినీ వదలదు' -ఇమ్రాన్ ఖాన్

కరోనావైరస్ లాక్‌డౌన్: 'ఆదివారం రాత్రి 9 గంటలకు లైట్లు మాత్రమే ఆఫ్ చేయాలి'

కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం

కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు... ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?

తెలంగాణ లాక్‌డౌన్: గర్భిణులు, ఇతర రోగులు పడుతున్న ఇబ్బందులు ఇవీ..

హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?

వివిధ దేశాల్లో కరోనా లాక్‌డౌన్ నిబంధనలు: ‘ఆడవాళ్లు బయటకు వచ్చే రోజు మగవాళ్లు రాకూడదు.. భార్యలు భర్తల్ని విసిగించొద్దు’

కరోనావైరస్: 'లాక్‌డౌన్‌లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'

కరోనావైరస్: రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడం ఇన్ఫెక్షన్‌ సోకడానికి సూచన కావొచ్చు - పరిశోధకులు