'హైదరాబాద్ ఎన్‌కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్

హైదరాబాద్‌లో 'దిశ' అత్యాచారం, హత్యలో నిందితులుగా భావిస్తున్న నలుగురి ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న తెలంగాణ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేసి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ పిటిషన్‌లో నిందితుల కుటుంబాలు కోర్టును కోరాయి.
దీనిపై ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నిందితుల తల్లిదండ్రులు సుప్రీంను ఆశ్రయించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను రద్దుచేయాలని వారు తమ పిటిషన్‌లో కోరారు. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించి, వారిని హత్య చేసేందుకు ప్రయత్నించారని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని వారంటున్నారు.
తమ పిల్లల బూటకపు ఎన్‌కౌంటర్, పోలీసు కస్టడీలో మరణాలకు పరిహారంగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కూడా వారు పిటిషన్‌లో కోర్టును కోరారు.
ఒక నిందితుడి తల్లిదండ్రులు
పిటిషనర్ల తరపున న్యాయవాదులు పీవీ కృష్ణమాచారి, ఆర్ సతీశ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
"ఒక్క నిందితుడు తప్ప మిగిలిన ముగ్గురూ ఎస్సీ వర్గానికి చెందిన పేదలు. నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ, ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఆ నలుగురూ అమాయకులు. వాళ్లు ఎలాంటి నేరం చెయ్యలేదు. ఆగ్రహంతో ఉన్న ప్రజలను తృప్తి పరిచేందుకు, అసలు దోషులను రక్షించేందుకు, సాక్ష్యాలను రూపుమాపడానికి, అసలు దోషులను పట్టుకోవడంలో విఫలమైన పోలీసులు.. ఈ నలుగురినీ బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. చట్టవ్యతిరేకమైన ఈ బూటకపు ఎన్‌కౌంటర్ కారణంగా ఓ యువతిపై జరిగిన అత్యాచారం, హత్య నేరాలకు సంబంధించిన అన్ని కేసులూ ముగిసిపోయాయి" అని పిటిషన్‌లో వారు పేర్కొన్నారు.
మరో నిందితుడి తల్లిదండ్రులు
"నలుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు. కానీ, వీరిపై కూడా ఎలాంటి దయ, జాలి లేకుండా పోలీసులు ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. దీనికి బాధ్యులైన పోలీసులపైన, ఇతరులపైన తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలి" అని పిటిషన్‌లో నిందితుల కుటుంబాలు కోరాయి.
"యువతి శరీరం మంటల్లో కాలిపోవడంతో ఈ నలుగురు నిందితులకు వ్యతిరేకంగా వైద్యపరంగా గానీ, ఇతర సాక్ష్యాలు ఏవీ లభించలేదు. ఈ నలుగురికీ యువతి అత్యాచారం, హత్య, ఆ తర్వాత యువతి శరీరం దహనానికి సంబంధించిన నేరాలతో సంబంధం ఉందని చెప్పేందుకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవు. ఆగ్రహంతో ఉన్న ప్రజలను శాంతింపచేయడానికి, కేసును మూసేయడానికి పోలీసులు ఈ నలుగురినీ దారుణంగా చంపేశారు" అని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తో సహా బాధ్యులైన పోలీసులు సాక్ష్యాలు తారుమారు చేయకుండా, ఈ కేసు విచారణలో జోక్యం చేసుకోకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు సాక్షులను ప్రభావితం చేయకుండా, కోర్టు నియమించిన కమిషన్ ద్వారా స్వతంత్ర విచారణ జరిగేలా సూచనలివ్వాలని కోరారు.
ఇవి కూడా చదవండి.
- హైదరాబాద్ ఎన్‌కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్‌కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
- తొలిసారి నల్లజాతీయులకే టాప్ 5 అందాల కిరీటాలు
- పర్వేజ్ ముషరఫ్‌కు మరణ శిక్ష: 'మాజీ ఆర్మీ చీఫ్ ఎప్పటికీ దేశ ద్రోహి కాలేడు' - పాక్ మేజర్ జనరల్ గఫూర్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)