పౌరసత్వ సవరణ చట్టం: దేశంలో ముస్లింల భయాందోళనల గురించి మోదీ ప్రభుత్వంలో మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఏం చెప్పారు?

ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో హింస తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమర్థించుకుంటోంది. దేశంలో ఉన్న ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదంటోంది. ఈ అంశంపై కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని బీబీసీ ప్రతినిధి సరోజ్ సింగ్ ఇంటర్వ్యూ చేశారు.
బీబీసీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ వచ్చిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసుల జారీ చేసింది. కోర్టు ఈ కేసులో తర్వాత వాదనలను జనవరి 22న విననుంది. కానీ, పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అస్సాం నుంచి దిల్లీ, చెన్నై వరకూ జనం రోడ్లపైకి వస్తున్నారు. ప్రజలు పౌరసత్వ సవరణ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. దీని గురించి ప్రభుత్వం ఏం చెబుతోంది. దానిపై ఇక్కడ మనతో చర్చించడానకి రాజ్యసభ సభ్యులు, కేంద్ర మంత్రి అయిన ముక్తార్ అబ్బాస్ నక్వీ ఉన్నారు. మొదటి చెప్పండి.. పౌరసత్వ సవరణ చట్టం రూపొందించి, దానిపై పార్లమెంటులో చర్చించినపుడు మీరు, మీ పార్టీ ఈ స్థాయిలో హింస జరుగుతుందని ఊహించారా...?
నఖ్వీ: ఎన్ఆర్సీ ప్రక్రియ 1951లో మొదలైంది. 1971లో ముందుకు తీసుకెళ్లారు. 2003లో కాంగ్రెస్ హయాంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఆ ప్రక్రియ మొదలైంది. నాకొకటి చెప్పండి.. ఏ దేశమైనా తమ దేశంలోకి అక్రమంగా చొరబడేవారి సంఖ్య భారీగా పెరుగుతుంటే దానిని పట్టించుకోకుండా ఉండగలదా..
బీబీసీ: జనం రోడ్లపైకి వస్తున్నారు. జామియాలో అనుమతి లేకుండానే పోలీసులు ప్రవేశించారు. తర్వాత..విద్యార్థులను కొట్టారు. దాన్ని అందరూ చూశారు.(మధ్యలో)
నఖ్వీ: లేదు, లేదు వదిలేయండి.. నా ప్రశ్నకు జవాబు చెప్పండి..
బీబీసీ: మీరు దాన్ని సమర్థిస్తారా..? (మధ్యలో)
నఖ్వీ: లేదు, వదిలేయండి, దాన్ని పక్కన పెట్టండి. అవి ఎందుకు జరుగుతున్నాయి. వాళ్లపై మోదీ కాల్పులు జరిపారా.. మోదీ వాళ్లతో మీరిక్కడ చదవడానికి వీల్లేదన్నారా..మోదీ వాళ్లకు భోజనం ఆపేశామని చెప్పారా..మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వమని అని మోదీ గారు వారికి చెప్పారా..
ఫొటో సోర్స్, Getty Images
ముంబయిలో నిరసన
బీబీసీ: ప్రభుత్వం బిల్ తీసుకొచ్చింది. దానిని ముస్లింలకు ఇక్కడనుంచి పంపించేయడానికి లోలోపలే కుట్ర జరుగుతున్నట్టు చూస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా పార్లమెంటులో అదే చెబుతున్నాయి. ఈ బిల్లు నుంచి ముస్లింలను బయటపెట్టారు అంటే పౌరసత్వం ఇవ్వకుండా వారిని మీరు వంచిస్తున్నారని అంటున్నారు.
నఖ్వీ: అలాంటి వదంతులతో శాంతికి భంగం కలిగిస్తున్నారు. ప్రభుత్వం అలా ఎప్పుడు చెప్పింది. బిల్లులో మేం ముస్లింలను ఉండనివ్వం అని ఎక్కడ ఉంది.
బీబీసీ: ఎందుకంటే బిల్లులో ముస్లింలను మేం శరణార్థులుగా అంగీకరిస్తాం అని మీరు చెప్పలేదుగా(మధ్యలో).
నఖ్వీ: మీరు పౌరసత్వ సవరణ బిల్లును ఎన్ఆర్సీతో జోడిస్తున్నారు. వేరు వేరు దగ్గర ఉన్న వేర్వేరు అంశాలను తీసుకుని మీరు వాటన్నిటినీ కలిపేస్తున్నారు. అలా చేస్తే ప్రజలు తప్పుదోవపట్టచ్చు. కానీ అది తాత్కాలికం.
బీబీసీ: అంటే మీరు పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ రెండు వేరు వేరు అంశాలు అంటున్నారా
నఖ్వీ: అవును, కచ్చితంగా.. అవి రెండు వేరు
బీబీసీ : వాటికి ఒకదానికి ఇంకొకదానితో సంబంధం లేదా?
నఖ్వీ: అసలు లేదు, పౌరసత్వ సవరణ చట్టం పాకిస్తాన్, అప్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో దశాబ్దాల నుంచీ హింసకు, వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం తెచ్చింది.
బీబీసీ: ఇప్పుడు పౌరసత్వం నిరూపించుకోవాల్సి ఉంటుంది, అంటే దానికి పత్రాలు కావాలి. అవి చాలా మంది దగ్గర లేవు. అందుకే ఎన్నార్సీ గురించి ఇంత గందరగోళం నెలకొంది. అందుకే, ఎన్నార్సీ , సీఏఏను మీరు ఏ విధంగా వేరుగా చూస్తున్నారు తెలుసుకోవాలని అనుకుంటున్నా. ఎన్నార్సీలో వచ్చిన హిందువులందరినీ వేరు చేయడానికే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చారని. అలా అలా చివరికి ముస్లింలు బయట ఉండిపోతారని భావిస్తున్నారు. ఆ ఐడియాలజీని మీరు ఎలా చూస్తున్నారు.
నఖ్వీ: భయాలు, భ్రమల్లో ఉన్న వారిలోనే ఇలాంటి ఆలోచనాధోరణి ఉంది.
బీబీసీ: అందులో నిజం లేదంటారా?
నఖ్వీ: అందులో ఎలాంటి నిజం లేదు. ఒక్క శాతం కూడా లేదు. నేను మళ్లీ చెబుతున్నాను.. తరాల నుంచీ భారత్‌లో ఉంటున్న ముస్లింల పౌరసత్వం నూటికి నూరు శాతం సురక్షితంగా ఉంటుంది. దానికి ఎలాంటి ముప్పూ రాదు.
బీబీసీ: వాళ్లు తమ పత్రాల చూపించాల్సి ఉంటుందా?
నఖ్వీ: పత్రాలు హిందువులు కూడా చూపించాల్సుంటుంది. అందులో మీకు సమస్యేంటి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నార్సీ ఆధారంగా దేశంలోని కోట్లాది ముస్లిలుం, కోట్లాది మైనారిటీల పౌరసత్వానికి ఎలాంటి సమస్య రాదు. ఆ మాట ప్రధాని చెప్పారు, హోం మినిస్టర్ కూడా చెప్పారు. ఆ తర్వాత కూడా ఎవరైనా గందరగోళం సృష్టిస్తుంటే వాళ్ల ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి.
బీబీసీ: కానీ 22 యూనివర్సిటీల విద్యార్థులు కూడా రోడ్డు మీదకు వచ్చారు. సామాన్యులు కూడా ఆందోళనలు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా దిల్లీ, అస్సాం, పట్నా, చెన్నైలో ఏం జరుగుతోందో మీరు చూశారు. సామాన్యులకు దీన్ని అర్థమయ్యేలా చెప్పడంలో ప్రభుత్వం విఫలమైంది. అది భ్రమ అయితే మీరు ఆ భ్రమలు దూరం చేయలేరా.. అది కూడా ప్రభుత్వ వైఫల్యమే కదా..
నఖ్వీ: కొన్నిసార్లు దుష్ప్రచారాలు నిజమైన ప్రచారాన్ని డామినేట్ చేస్తాయి. కొన్నిసార్లు దేశంలో చాలా భయానక వాతావరణం ఉందని చెబుతారు.
బీబీసీ: సర్ ఆ విషయానికే వద్దాం.. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. మొదట 370 తీసుకొచ్చారు, అప్పుడూ ఇలాగే అయ్యింది. మీరు మాత్రం దేశమంతా సమాన చట్టం అమలు చేయాల్సిన అవసరం ఉంది, అందుకే తెచ్చాం అన్నారు. తర్వాత ప్రభుత్వం ఎన్ఆర్సీ తీసుకొచ్చి, దాన్నుంచి ఈశాన్య, ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాలను మినహాయించండి అంది. అంటే.. మీ సౌలభ్యం కోసం మీరు చట్టాలను ఎలా మార్చేస్తారు.
నఖ్వీ: మేం ఏ చట్టం చేస్తున్నా.. రాజ్యాంగ సౌలభ్యం కోసం, దేశ సౌలభ్యం కోసం చేస్తున్నాం.
బీబీసీ: లేదు, ఇది పార్టీ సౌలభ్యం కోసమే..
నఖ్వీ: కాదు, కాదు.. మాకు పార్టీ దేశం కంటే ఎక్కువ కాదు. మా పార్టీకి కమిట్ మెంట్ ఉంది, ఉంటుంది. మేం కొన్ని చేస్తామని చెప్పాం. వాటిని చేస్తాం. మేం వాటిని చాటుమాటుగా చేయలేదు.
బీబీసీ: అంటే మీరు మతం ఆధారంగా విభజిస్తున్నారు. ముస్లింలకు ఉన్న సమానత్వ హక్కు నుంచి మీరు వాళ్లను వేరు చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా..పౌరసత్వం గురించి ప్రశ్నించారా..(మధ్యలో)
నఖ్వీ: లేదు లేదు.. బయట ఆ అరుపులు, మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను జనం నమ్మడం లేదు. తమ రాజ్యాంగ, సామాజిక, ఆర్థిక, మతపరమైన హక్కులను రక్షించడానికి మోదీ నిబద్ధతతో ఉన్నారని వారికి ఆయనపై పూర్తి నమ్మకం ఉంది.
ఫొటో సోర్స్, AFP
బీబీసీ: చివరి ప్రశ్న, దేశంలో, ముస్లింలలో భయానక వాతావరణం నెలకొంది. దానికి కారణం గత కొన్ని నెలలుగా అమలు చేస్తున్నవే. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, అయోధ్యపై సుప్రీం తీర్పు, ఇప్పుడు ఈ చట్టం. మీరు ముస్లింలకు ప్రతినిధి, ప్రభుత్వంలో వారికి ప్రతినిధిగా ఉన్నారు. దీనిపై మీ దగ్గరకు ఎవరైనా వచ్చారా.. ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారా
నఖ్వీ: రోజూ నన్ను 300 నుంచి 400 మంది కలుస్తుంటారు..వారిలో ముస్లింలతోపాటూ మిగతా వారూ ఉంటారు.
బీబీసీ: వాళ్లు ఈ అంశం మీద ఆందోళన వ్యక్తం చేశారా..
నఖ్వీ: భయం మీరు వ్యాప్తి చేస్తున్నారు. వాళ్లలో భయం కనిపించలేదు. పక్షపాత ఆలోచనాధోరణి వల్లే కొందరిలో ఆ భయం ఉంది. మోదీ వచ్చాక ఈ దేశంలో ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదా? దేశ ముస్లింలకు విద్యా సాధికారత లభించడం లేదా? ఈ దేశ ముస్లింలకు మిగతా వారిలా ఉపాధి అవకాశాలు అందడం లేదా?
బీబీసీ: మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెడతారా.. మళ్లీ ప్రతిపక్షాల దగ్గరకు వెళ్తారా..లేక ఈ ఘర్షణ స్థితి ఇలాగే ఉంటుందా?
నఖ్వీ: అవసరం అయితే వెళ్తాం.. మేం ప్రజాస్వామ్య విలువలను నమ్ముతాం. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం ఉండేలా చూడడం మా ప్రభుత్వం ప్రాధాన్యత. అందుకే, మీ ఎజెండాల నుంచి బయటికి వచ్చి దేశంలో విభజన, ఘర్షణ లాంటి స్థితికి ముగింపు పలకాలని మేం ఎపుడూ వారికి చెబుతూ వచ్చాం. దానికి ప్రయత్నించాం. మేం, ఏ ఆందోళనలకూ భయపడం, నిరసనలతో వెనక్కు తగ్గం. అవి ప్రజాస్వామ్యంలో భాగం, అవి జరగాలి. ప్రజాస్వామ్యంలో అంగీకారం, వ్యతిరేకత ఉంటాయి. అది మీ హక్కు. కానీ సమ్మతి, అసమ్మతి మధ్య ఈ భయం అనే భూతాన్ని నిలబెట్టి హింస సృష్టించకూడదు. అది ఆమోదయోగ్యం కాదు.
బీబీసీ: కోర్టు ఈ కేసులో 22న విచారణలు జరుగుతాయని కేంద్రానికి నోటీసు ఇచ్చింది. కోర్టు దీనిపై కఠినంగా వ్యవహరిస్తే, ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటుందా..
నఖ్వీ: ఇలా అయితే, అలా జరిగితే, అనే ప్రశ్నలకు మేం సమాధానం ఇవ్వలేం. ఇలాంటి వాటివల్లే ఇప్పుడు జనాల్లో భయాందోళనలు వ్యాపిస్తున్నాయి.
బీబీసీ: ఈ అంశంపై కోర్టులో 70 పిటిషన్లు దాఖలు చేశారు.
నఖ్వీ: కోర్టు నోటీసుకు ప్రభుత్వం స్పందిస్తుంది. తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- బండి నారాయణస్వామి 'శప్తభూమి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- Fake news: దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- మీ లంచ్‌ని తోటి ఉద్యోగి దొంగిలిస్తే.. అదో వైరల్!
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- ‘‘భారత్‌ను హిందుత్వ భావజాల దేశంగా మార్చాలని చూస్తున్నారు.. అలా జరగనివ్వం’’- గాయకుడు టీఎం కృష్ణ
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)