ఆంధ్రప్రదేశ్ రాజధాని: 'దక్షిణాఫ్రికా మోడల్ ఆంధ్రప్రదేశ్‌కు పనికిరాదు, మనమే కొత్త మోడల్ చూసుకోవాలి' - అభిప్రాయం

  • ఈఏఎస్ శర్మ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
  • బీబీసీ కోసం
విశాఖ పట్నం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

'అమరావతి కంటే విశాఖలోనే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి'

అమరావతిలో శాసనసభ, కర్నూలులో హైకోర్టు, విశాఖ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు అన్నప్పుడు మూడు ప్రాంతాలకూ న్యాయం జరుగుతుంది. కానీ, అది సరిపోదు.

న్యాయస్థానం కర్నూలులో ఉంటే ఉత్తరాంధ్ర నుంచి ప్రజలు అంతదూరం వెళ్లాలి. దీంతో అదనంగా ఖర్చుతో పాటు, శ్రమ, సమయమూ వృధా అవుతుంది. రాయలసీమ ప్రాంత వాసులు విశాఖలోని సచివాలయానికి రావాలన్నా కష్టమే.

మూడు ప్రాంతాలో రాజధాని పెట్టినా శాసనసభను ఒక చోట కేంద్రీకృతం చేయడం వల్ల ప్రజల వద్దకు ప్రభుత్వం వెళ్లడం సాధ్యం కాదు.

విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెడితే భూమి ఎలా? అమరావతిలో 35 వేల ఎకరాల వ్యవసాయ భూములు పాడైపోయాయి. అక్కడ ఇప్పుడు హైకోర్టు, సచివాలయం తప్ప అయిదేళ్లలో ఏదీ పూర్తి కాలేదు.

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN

అమరావతి అనుభవం విశాఖలోనూ పునరావృతం అవుతుందా...? అన్నది నా భయం. విశాఖలో నీటి కొరత ఉంది. వచ్చే అయిదారేళ్లలో పోలవరం ప్రాజెక్టు నుంచి నీరు వచ్చినా సరే ఇక్కడ ఉన్న పరిశ్రమలకు ఇచ్చిన కమిట్‌మెంట్ల వల్ల, పెరుగుతున్న జనాభా వల్ల ఆ నీరు సరిపోదు. అలాంటి సమయంలో సచివాలయం ఇక్కడ ఏర్పాటు చేస్తే, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తారు. దాంతో నీటి సమస్య మరింత పెరుగుతుంది.

దానికి బదులు... మూడు రాజధానులను వికేంద్రీకరణ చేయాలి. కర్నూలులోనే పూర్తి హైకోర్టు కాకుండా... ఒక హైకోర్టు బెంచ్ కర్నూలులో, అమరావతిలో మరో బెంచ్‌, ఇంకో బెంచ్ విశాఖలోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. న్యాయస్థానం ప్రజల వద్దకు వస్తుంది.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ (సచివాలయం)ను కూడా అలాగే చేయాలి. ఒక సెంటర్ విశాఖ, కర్నూలు, అమరావతిలో ఉంచాలి, కొన్ని శాఖలు అక్కడ ఉంటాయి. ఈ రోజుల్లో ఆధునిక కమ్యునికేషన్ వ్యవస్థ, ఇంటర్నెట్, వీడియో కాన్ఫరెన్స్ లాంటివి ఉండటం వల్ల మూడు అనుసంధానంగా పనిచేయొచ్చు. దాని వల్ల విశాఖపట్నం మీద భారం తగ్గుతుంది. ప్రజల దగ్గరకు అన్ని ప్రభుత్వ వ్యవస్థలూ వచ్చినట్లు ఉంటుంది.

మహారాష్ర్టలో శాసనసభ సమావేశాలు ముంబయి, నాగ్‌పూర్‌లో జరుగుతాయి. ఇక్కడ కూడా శాసనసభ మూడు ప్రాంతాల్లో రొటేషన్‌గా పెట్టాలి.

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN

గ్రామ సచివాలయాలు అన్నారు. రాజ్యాంగంలో గ్రామసభకు, పంచాయతీకి, మున్సిపాలిటీకి చాలా ప్రాధాన్యత ఉంది. అయినా ప్రభుత్వాలు వాటికి ఎలాంటి అధికారాలు ఇవ్వడం లేదు. కొంత వరకూ వికేంద్రీకరణలో భాగంగా అధికారుల అధికారాలను కూడా వికేంద్రీకరణ చేయాలి.

అమరావతిలో రాజధాని హాస్యాస్పదమైంది. కొన్ని కాంట్రీటు బిల్డింగులు, హెలీప్యాడ్‌లు, పెద్దపెద్ద భవనాలు రావడం వల్ల అదొక రియల్ ఎస్టేట్ స్కాంలా తయారైంది. ప్రభుత్వం అంటే బిల్డింగులు కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వం పనిచేసే విధానం. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ప్రజలకు కనిపించాలి... దీన్నే పారదర్శకత అంటారు.

ప్రజల దగ్గర ఉన్న అధికారులకు నిర్ణయం తీసుకునే అధికారం ఇవ్వాలి. అది డెలిగేషన్ అంటారు. పంచాయతీలకు, జిల్లా స్థాయిలో ఎలక్టెడ్ బాడీలకు అధికారం ఇవ్వాలి. దాన్నే డివల్యూషన్ అంటాం. ఇలాంటి ప్రభుత్వ విధానాలు రావాలి.

గుడిసెలో ఉండి కూడా ప్రజలకు మంచి పాలన అందించే అవకాశం ఉంది. దీన్నే గుడ్ గవర్నెన్స్ అంటారు.

ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏమిటంటే... రానున్న 5 నుంచి 10 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేయబోతోందో ఒక శ్వేత పత్రం తయారు చేయాలి.

హైకోర్టుకు మూడు బెంచ్‌లు కావాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేస్తే అనుమతులు వస్తాయి. న్యాయస్థానంలో చిన్నచిన్న కేసులు గ్రామస్థాయి, జిల్లా స్థాయికి వెళ్లిపోవాలి. అక్కడ అధికారులకు ఆ రకంగా తర్ఫీదు ఇవ్వాలి. దానివల్ల హైకోర్టుపై భారం తగ్గుతుంది.

సచివాలయంలో అధికారాలు చాలావరకు జిల్లా స్థాయికి ఇవ్వాలి. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది. మనది ప్రజా స్వామ్యం. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉన్నప్పుడు రాజధాని ప్రాధాన్యత తగ్గిపోతుంది. స్థానిక సంస్థలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

ఇటువంటి సంస్కరణలతో ఒక శ్వేతపత్రం తయారు చేస్తే, దానిపై ప్రజల్లో చర్చ జరగాలి.

ఫొటో సోర్స్, AP CRDA

గత ప్రభుత్వం హయాంలో అనేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు. అవే పొరపాట్లు కొత్త ప్రభుత్వం చేయకూడదు.

మూడు రాజధానుల అంశం మీద కూడా ప్రజల్లో చర్చ జరిగితే అనేక కొత్త అలోచనలు వస్తాయి. ముఖ్యమంత్రి ఆ విధంగా అలోచించాలి. ఇలాంటివి చేయడం వల్ల అంధ్రప్రదేశ్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తుంది.

ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తే విశాఖకు చాలా సమస్య వస్తాయి. అమరావతి కంటే ఎక్కువ సమస్యలు విశాఖలో ఉన్నాయి. నీటి సమస్య, కాలుష్యం ఉన్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలు ఇప్పటికే ఇంటి స్థలాల కోసం తగరపు వలస దాటి వెళ్తున్నా అందుబాటు ధరలలో స్థలం దొరకడం లేదు.

ఇప్పుడు సెక్రటేరియట్‌ను తీసుకువస్తే భూమి లభ్యత కష్టంగా ఉంటుంది. భూముల ధరలు చుక్కలనంటే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఆర్భాటానికి పోకుండా పెద్ద పెద్ద భవనాలు నిర్మించకుండా తక్కువ ఖర్చుతో చేయాలి.

శ్రీబాగ్ ఒప్పందాన్ని గుర్తు చేసుకోవాలి. గతంలో తెలంగాణ డెవలప్‌మెంట్ బోర్డు, రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డు, అంధ్రా డెవలప్‌మెంట్ బోర్డులు ఉండేవి. వాటి అధ్యక్షులకు కేబినెట్ హోదా ఉండేది. కానీ, తర్వాత అవి కాలగర్భంలో కలిసిపోయాయి. మనం ఉత్తరాంధ్ర డెవలప్‌మెంట్, రాయలసీమ డెవలప్‌మెంట్ బోర్డులు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. వాటికి అధికారాలు ఇవ్వాలి. ఏది చేసినా ప్రజల సమ్మతి లేకుండా చేయకూడదు. ప్రజలలో చర్చ జరగాలి.

దక్షిణాఫ్రికా మోడల్ మనకు సెట్ కాదు. చాలా దేశాల్లో అది విఫలమైంది. మన మోడల్ మనమే చూసుకోవాలి. విశాఖలో అనేక భవనాలు ఉన్నాయి. కొత్తవి కట్టే బదులు వాటిని ఉపయోగించుకోవచ్చు.

శాసనసభ సమావేశాలు మూడు చోట్ల రొటేట్ అవ్వాలి. తమ ప్రాంతంలో శాసనసభ సమావేశాలు జరిగాయనే విషయం ప్రజలలో అత్మగౌరవం తెస్తుంది.

అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)