పౌరసత్వ సవరణ చట్టం: ఉత్తర్‌ప్రదేశ్‌లో భారీ హింస, తొమ్మది మంది మృతి

  • 20 డిసెంబర్ 2019
Image copyright Getty Images

సీఏఏపై దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలు హింసత్మకంగా మారుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో శుక్రవారం అనేక ప్రాంతాల్లో చెలరేగిన హింసలో తొమ్మిది మంది మరణించారు.

రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక ఘటనల్లో పౌరులు మరణించారని ఉత్తర్ ప్రదేశ్ పోలీసు ఛీఫ్ ఓపీ సింగ్ చెప్పారు.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 2020 జనవరి 1 వరకూ 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లోని 52 జిల్లాలకు 50 జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. జబల్‌పూర్‌లోని నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు.

జాతీయ జనాభా రిజిస్టర్‌ను అప్‌డేట్ చేసే కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముంబైలోని ఆజాద్ మైదానంలో నిరసన తెలుపుతున్న యువతి Image copyright Getty Images

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన అసోంలో రద్దు చేసిన ఇంటర్నెట్ సేవలను శుక్రవారం పునరుద్ధరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

అసోం పౌరులకు ముప్పు లేదు - సీఎం సోనోవాల్

కాగా, పౌరసత్వ సవరణ చట్టం కారణంగా అసోంలోని ఏ పౌరుడి హక్కులనూ ఎవ్వరూ లాక్కోలేరని, అసోం భాష, గుర్తింపుకు ఎలాంటి ముప్పూ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు.

శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అస్సాం గౌరవం ఏరకంగానూ దెబ్బతినదని ఆయన వెల్లడించారు. తమకు ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉందని, రాష్ట్రంలో శాంతితో తాము ముందుకెళతామని వివరించారు.

దర్బార్ సినిమాలో రజినీకాంత్ Image copyright facebook/DarbarOffl

రజినీకాంత్ ట్వీట్‌: 'ఏ సమస్యకైనా పరిష్కారం కోసం అల్లర్లు, హింస మార్గం కాకూడదు'

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సినీ నటుడు రజినీకాంత్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని కానీ, దానికి సంబంధించిన వివాదాన్ని కానీ రజినీకాంత్ ఈ ట్వీట్‌లో ప్రస్తావించలేదు.

‘‘ఏ సమస్యకైనా పరిష్కారం కోసం అల్లర్లు, హింస మార్గం కాకూడదు. భారతదేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేశ భద్రతను, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు కొనసాగతున్న హింస నన్ను చాలా బాధిస్తోంది’’ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ ట్వీట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి రజినీకాంత్‌కు మద్దతుగా #IStandWithRajinikanth అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ఇండియా ట్రెండ్స్‌లో 64 వేల ట్వీట్లతో తొలి స్థానంలో ఉండగా.. రజినీకాంత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మనిషిలాగా ప్రవర్తించాడంటూ 17 వేల ట్వీట్లతో #ShameOnYouSanghiRajini అనే హ్యాష్ ట్యాగ్ మూడో స్థానంలో నిలిచింది.

‘‘రజినీ పరిణితిగల రాజకీయ వైఖరిని ప్రదర్శించారు. ఈ పరిస్థితిని వాడుకుని ప్రజాదరణ పొందడం ఆయనకు చాలా సులభం, కానీ పరిస్థితుల్ని రెచ్చగొట్టకుండా ఆయన ఒక వైఖరి తీసుకున్నారు’’ అని రజినీ ఫ్యాన్స్ జర్మనీ అనే ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

‘‘రజినీకాంత్ ఎక్కడా పౌరసత్వ సవరణ బిల్లును సమర్థించలేదు. శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇవ్వాలని కోరిన మొదటి వ్యక్తి ఆయనే. హింస పరిష్కారం కాదన్నారంతే. దేశంలో ఇలాంటి హింస మనకు కావాలా?’’ అని రజినీకాంత్ ఫ్యాన్స్ అనే మరొక ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.

‘‘దేనికైనా హింస పరిష్కారం కాదని మేం కూడా అంగీకరిస్తాం... కానీ పౌరసత్వ సవరణ చట్టంపై మీ వైఖరి ఏంటో స్పష్టం చేస్తారా, ఈ చట్టం మీకు అంగీకారమేనా? మిమ్మల్ని డైరెక్ట్ చేసిన యువ డైరెక్టర్లు సైతం ఈ చట్టంపై తమ అభిప్రాయం చెప్పారు. మీ అభిప్రాయాన్ని మేం ఎప్పుడు ఆశించగలం, తర్వాతి మూవీ ఆడియో లాంచ్‌లోనా’’ అని బూబలన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

‘‘సర్, మీరెందుకు ఒక వైఖరి తీసుకోరు? మీ రాజకీయ వ్యాఖ్యలు ప్రతిసారీ ఆ వైపు కానీ, ఈ వైపు కానీ ఉండవు. సురక్షిత రాజకీయాలు చేయడం మానండి, ఇవి పనిచేయవు’’ అని రక్షిత్ అనే యూజర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)