CAAపై నిరసనలు: ‘‘భారత్‌ను హిందుత్వ భావజాల దేశంగా మార్చాలనుకుంటున్నారు.. అలా జరగనివ్వం’’- గాయకుడు టీఎం కృష్ణ

  • మురళీధరన్ కాశీవిశ్వనాథన్
  • బీబీసీ ప్రతినిధి
సీఏఏపై నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇవి హింసాత్మకంగా కూడా మారుతున్నాయి.

గురువారం నాడు తమిళనాడులో ఎంతోమంది సెలబ్రిటీలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారు.

నటుడు సిద్దార్ధ్, గాయకుడు టీఎం కృష్ణ, ఎంపీ తిరుమావలన్ వంటివారు ముందస్తు అనుమతి తీసుకోకుండా చెన్నైలో నిరసన ప్రదర్శన చేశారు.

"ఐదుగురున్నారా, ఐదువందల మంది ఉన్నారా అనేది కాదు. వాళ్లు నిరసన చేయాలనుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలి. వారిపై కేసు నమోదు చేశాం. సెలబ్రిటీలైనా, విద్యార్థులైనా... ఇది సాధారణ ప్రక్రియ" అని చెన్నై నగర పోలీస్ కమిషనర్ వీకే విశ్వనాథన్ బీబీసీకి తెలిపారు.

టీఎం కృష్ణను సంప్రదించగా, ఆయన "ఈ చర్యకు సంబంధించి నాకు ఇంతవరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఏ ప్రాతిపదికన నాపై కేసు నమోదు చేశారో తెలుసుకున్నాక మీకు వివరాలు వెల్లడిస్తాను" అని చెప్పారు.

అరెస్టుకు ముందు టీఎం కృష్ణ బీబీసీతో మాట్లాడారు.

బీబీసీ: పౌరసత్వ సవరణ చట్టంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

గాయకుడు టీఎం కృష్ణ: ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రభుత్వం పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్ అని ప్రత్యేకంగా మూడు ముస్లిం మెజారిటీ దేశాలను ఎంచుకుంది. ఆ ప్రాంతాల్లో నివసించే మైనారిటీలను మాత్రమే అనుమతిస్తాం అంటే అది కచ్చితంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడమే.

ఎన్ఆర్సీ ప్రకారం 19 లక్షల మంది రిజిస్ట్రీలో నమోదు కాలేదు. వీరిలో చాలా మంది హిందువులు. వీరికి మాత్రమే పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం తోడ్పడుతుంది. జాబితాలో శరణార్థులుగా ఉన్న హిందువులను మాత్రమే ఈ చట్టం అనుమతిస్తుంది. వాళ్లకి పౌరసత్వం లభిస్తుంది. ముస్లింలను వెనక్కి పంపేస్తారు. అమిత్ షా, మోదీల ఆలోచన ఎలా ఉంటుందో మనకు ఇప్పటికే తెలుసు. ఈ చట్టం వారి ఆలోచనను మరింత స్పష్టం చేస్తోంది.

వాళ్లు ఈ దేశాన్ని హిందుత్వ భావజాల దేశంగా మార్చాలనుకుంటున్నారు. లౌకిక రాజ్యం అనేది మన రాజ్యాంగానికి గుండె లాంటిది. దాన్ని వాళ్లు నాశనం చేయాలని చూస్తున్నారు. మేం దాన్ని జరగనివ్వం.

ఫొటో క్యాప్షన్,

టీఎం కృష్ణ

బీబీసీ: భారతీయులు ఏ మతానికి చెందినవారైనా సరే.. వారికి ఈ చట్టం వల్ల ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కదా.

టీఎం కృష్ణ: అది తప్పు. ఎందుకంటే, ఎన్ఆర్సీ ద్వారా ఏం అడుగుతున్నారు... భారత్‌లో మీరు ఎప్పుడు నివసించారు, ఎప్పుడు ఇక్కడికి వచ్చారు అని. మనం ఎవరైనా దానికి సమాధానం చెప్పగలమా? మన తాతగారి కాలం వరకూ బహుశా మనం చెప్పగలం. అంతకు మించి చాలామందికి తమ పూర్వీకుల గురించి తెలియదు. అలాంటప్పుడు, వాళ్లు రిజిస్ట్రీని తయారుచేసే సమయంలో, సరిహద్దు గ్రామాల్లో నివసించే ముస్లింలలో ఎవరి దగ్గరైనా సరైన పత్రాలు లేకపోతే వాళ్లను దేశం నుంచి బయటకు పంపించేస్తారు. కానీ, హిందువులు, సిక్కులు, క్రైస్తవులకు పౌరసత్వం ఇచ్చేందుకు వాళ్లు అంగీకరిస్తున్నారు. ఇది దేశంలోని ముస్లింలందరనీ భయాందోళనలోకి నెట్టే పరిణామం. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

ప్రజలు సీఏఏను ప్రత్యేకంగా చూస్తున్నారు. కానీ, ఎన్ఆర్సీ, సీఏఏల వెనక ఉన్న ఉమ్మడి వ్యూహం ఇది.

ఫొటో క్యాప్షన్,

సీఏఏపై నిరసనలు

బీబీసీ: తీవ్ర వ్యతిరేకత వస్తున్నాగానీ, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేది లేదని కేంద్రం చెబుతోంది. ఇప్పుడు ఏం జరగొచ్చని అనుకుంటున్నారు?

టీఎం కృష్ణ: ఇప్పుడు రెండు మార్గాలున్నాయి.

  • కనీసం ఇప్పుడైనా సుప్రీంకోర్టు కొంత విజ్ఞతతో వ్యవహరించాలి. ఎందుకంటే, ఈ మధ్య కాలంలో సుప్రీం కోర్టు పనితీరులో విజ్ఞత కనిపించడం లేదు. కోర్టు జోక్యం చేసుకుని ఈ మొత్తం చట్టాన్ని తొలగించాలి. ఒక మతానికి మద్దతిచ్చే ఏ చర్యలనూ మన రాజ్యాంగం అనుమతించదు. పౌరసత్వాన్నే తీసుకుంటే, ఇది కేవలం ప్రజలకు సంబంధించినది కాదు. ఇది దేశంలోని ప్రజల మధ్యలో ఉన్న లౌకిక స్ఫూర్తిని చెబుతుంది. రాజ్యాంగం చెప్పేది అదే.
  • ఈ నిరసనలను మనం ఆపలేం. ఒకరోజో రెండు రోజులో జరిగిన తర్వాత ఇవి ఆగిపోతాయని వాళ్లు భావిస్తున్నారు. ఇక్కడ మనం యువతను అభినందించాలి. వాళ్లు రోడ్లపైకి వచ్చి, లాఠీ దెబ్బలు తిని, బులెట్లకు ఎదురొడ్డి, మనకు ఓ మార్గాన్ని చూపించారు. కనీసం ఇప్పుడైనా ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి అణచివేత చర్యల పట్ల అవగాహన రావాలి. ప్రభుత్వం ఇలాంటి చట్టాలను రూపొందించకుండా అడ్డుకోవాలి. ఈ ఒత్తిడిని కొనసాగించాలి.

బీబీసీ: ఓ వర్గం పౌరులు ఈ చట్టాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. దీన్నెలా చూడాలి?

టీఎం కృష్ణ: అలాంటివారు ఎప్పుడూ ఉంటారు. ఈ ప్రభుత్వం మంచిది, అది ప్రజలకు ఎప్పుడూ మంచే చేస్తుంది అని భావించేవారు, మతపరంగా వారి భావజాలాన్ని నమ్మేవారు ఈ చట్టాన్ని సమర్థిస్తున్నారు. కానీ, మధ్యలో మరో పెద్ద వర్గం ఉంది. వాళ్లు ఎటువైపూ ఉండరు. మనం వాళ్లతో మాట్లాడాలి. సీఏఏ మంచి చట్టం కాదు అని రోడ్లపై నిరసనలు చేస్తున్న వేలాది మంది ప్రజలు ఇప్పటికే స్పష్టతతో ఉన్నారు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది మధ్యలో ఉన్న వర్గం ప్రజలతో మాట్లాడాలి. సీఏఏతో ఉన్న నష్టాలేంటో వారికి తెలియదు. వాళ్లకి దీనిపై అవగాహన కల్పించి ఈ వైపు తీసుకురావాలి.

ఫొటో క్యాప్షన్,

టీఎం కృష్ణ

బీబీసీ: సినీ పరిశ్రమకు చెందిన చాలామంది దీనిపై నిశ్శబ్దంగా ఉన్నారు. మేధావులు కూడా దీనిలో పూర్తిగా పాలుపంచుకుంటున్నట్లు అనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?

టీఎం కృష్ణ: ఈ పరిస్థితిని చూస్తే నాకేమీ ఆశ్చర్యం లేదు. మన దేశంలో, సినిమా, సైన్స్, ఆర్ట్స్ రంగాల నుంచి వచ్చిన వారు అంత ధైర్యవంతులు కాదు. వాళ్లు వాళ్లగురించే ఆలోచిస్తారు. ప్రజా ప్రయోజనం కోసం మన సినీ, కళా రంగాల్లోని మెజారిటీ వ్యక్తులు ఎప్పుడూ బయటకు వచ్చి, బహిరంగంగా మద్దతు పలికింది లేదు. చాలా కొద్దిమంది మాత్రమే ధైర్యం చూపించారు, వాళ్లకు నా కృతజ్ఞతలు. మిగిలినవాళ్లు రారు, వాళ్లను మనం నమ్మలేం కూడా.

బీబీసీ: ఇలాంటి పరిస్థితుల్లో, ప్రతిపక్షాలు కూడా ఐక్యంగా ఉండడంలో విఫలమవుతున్నాయి. దీన్నెలా చూడాలి?

టీఎం కృష్ణ: మన ఎన్నికల రాజకీయాలతో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే, ఏ అంశంపైనా మన ప్రతిపక్షాలు ఏకం కావు. వాళ్లు ఎప్పుడూ కలిసి రారు, ఇలాంటి సీఏఏ లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్లు కలిసిరావట్లేదు. బీజేపీ ప్రభుత్వానికి ఇదే మరింత బలాన్నిస్తోంది. ఇప్పుడు ఈ వేలాది మంది ప్రజల మద్దతుతోనైనా ప్రతిపక్షాలు ఐక్యమవుతాయని ఆశిస్తున్నా. ఇప్పుడు కూడా అలా జరగకపోతే, మన ఎన్నికల రాజకీయాలు తర్వాత ఏ రూపం తీసుకుంటాయో ఎవరికీ తెలియదు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)