హైదరాబాద్ ఎన్‌కౌంటర్: దిశ కేసు నిందితుడి భార్యకు 13 ఏళ్లే : ప్రెస్‌ రివ్యూ

దిశ కేసులో ఏ4 భార్య

దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల్లో ఒకరి భార్య వయసు 13 ఏళ్లేనని వెల్లడైనట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

'ఏ4' భార్య చదువుకున్న పాఠశాలలో నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం విచారణ జరిపి, వివరాలు సేకరించింది. ఆమె వయసు 13సంవత్సరాల ఆరు నెలలుగా గుర్తించింది.

ఏ4 భార్య ఇప్పుడు ఆరు నెలల గర్భవతి. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటి నుంచి బాబాయి, నాయనమ్మ వద్ద ఆమె ఉండేది. ఏ4ను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అత్తగారింటికి వచ్చింది.

ఆమెకు 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారులు ఏ4 తల్లిదండ్రులకు చెప్పారు. అయితే, వారు అందుకు అంగీకరించలేదు.

ఆ బాలికకు మరో చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరు తమ బాబాయి ఇంట్లో ఉంటున్నారు. వారినైనా సంరక్షణ కేంద్రానికి పంపిస్తారా అని అధికారులు అడిగారు. బాలిక చెల్లెలు తమ వద్దే ఉంటుందని, తమ్ముడిని సంరక్షణ కేంద్రానికి పంపిస్తానని వారి బాబాయి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

వేరైన శిశువు తల, మొండెం

అచ్చంపేటలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రసవ సమయంలో ఓ శిశువు తల, మొండెం వేరయ్యాయంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రిలో ఓ గర్భిణికి వైద్యులు సాధారణ ప్రసవం చేస్తుండగా శిశువు తల భాగం మొండెం నుంచి వేరుపడింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన స్వాతి ఈ నెల 18న ఉదయం ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రిలో చేరారు. అదే రోజు ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తారాసింగ్, వైద్యులు సుధారాణి, సిరాజుద్దీన్‌ ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు.

తీవ్ర రక్తస్రావం అవుతుండటం, శిశువు తలభాగం బయటకు కనిపించడంతో బయటకు లాగేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మొండెం నుంచి తల వేరుపడగా మొండెం మాత్రం గర్భిణి కడుపులోనే ఉండిపోయింది.

ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన వైద్యులు శిశువు పొట్ట నీరుతో నిండి ఉండటంతో బయటకు రావట్లేదని, మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్‌ ఆసుపత్రికి వెళ్లాలని రెఫర్‌ చేశారు. దీంతో కుటుంబ సభ్యులు గర్భిణిని హైదరాబాద్‌లోని జజ్జిఖాన ఆస్పత్రికి తరలించారు.

గురువారం ఆ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్‌ చేసి మృత శిశువును బయటకు తీశారు. శిశువు తలభాగం లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు.

కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం అచ్చంపేట ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. తమకు విషయం చెప్పకుండా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌ ఆసుపత్రికి రెఫర్‌ చేశారని మండిపడ్డారు.

ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ తారాసింగ్, డాక్టర్‌ సుధారాణిని సస్పెండ్‌ చేస్తూ డీఎంహెచ్‌ఓ ఉత్తర్వులు జారీ చేశారు.

ఫొటో సోర్స్, twitter/Itslavanya

లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్‌టీ సోదాలు

సినీ, టీవీ ప్రముఖులు లావణ్య త్రిపాఠి, సుమ, అనసూయ నివాసాల్లో జీఎస్‌టీ అధికారులు సోదాలు జరిపినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎస్టీని ఎగ్గొట్టిన కేసులకు సంబంధించి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు లావణ్య త్రిపాఠి, సుమ కనకాల, అనసూయ భరద్వాజ్‌ ఇళ్లలో శుక్రవారం సోదాలు చేపట్టారు.

వీరి ఇళ్లతోపాటు నగరంలోని మొత్తం 23 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని లావణ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆమె సినిమా షూటింగ్‌ను రద్దు చేసుకుని ఇంటికి చేరుకున్నారు.

అదే సమయంలో మణికొండలోని యాంకర్‌ సుమ కనకాల, బంజారాహిల్స్‌లోని అనుసూయ భరద్వాజ్‌ ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు.

హైదరబాద్‌లోని చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజీ యూనిట్లు, భవన నిర్మాణ సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీలు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ తదితర 23 సంస్థల్లో ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.

కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ పెట్టుబడులు పెట్టారని, ఆ సంస్థలపై సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎస్‌టీ ఎగ్గొట్టిన ఆరోపణలున్నట్లు సమాచారం. ఆ సంస్థల్లో సోదాల్లో భాగంగానే లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ ఇళ్లలో సోదాలు జరిగినట్లు తెలిసింది.

సాధారణంగా సినీ నటులు వ్యక్తిగతంగా సర్వీస్‌ ట్యాక్స్‌, జీఎస్‌టీ చెల్లించే నిబంధనలు ఉండవు. వీరి భాగస్వామ్యం ఉన్న సంస్థలు గతంలో సర్వీస్‌ ట్యాక్స్‌, ఇప్పుడు జీఎస్‌టీని చెల్లించాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, FACEBOOK/VZMGOAP

‘అమరావతికి సేకరించిన భూములను అభివృద్ధి చేస్తాం’

అమరావతి కోసం కోసం రైతుల నుంచి తీసుకున్న భూములను గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపినట్లు ‘ప్రజాశక్తి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

భూములు వెనక్కి ఇచ్చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలు అసైన్డ్‌ భూములకు సంబంధించినవని, వాటిని మాత్రమే రైతులకు వెనక్కి ఇచ్చేస్తామని బొత్స సత్యనారాయణ అన్నారు.

రాజధాని ప్రకటనకు రెండు నెలలకు ముందే హెరిటేజ్‌ భూములను కొనుగోలు చేసిందని, ఇది ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కాదా అని బొత్స ప్రశ్నించారు. భూ సేకరణలో సేకరించిన భూములను ప్రభుత్వం వినియోగిస్తుందని అన్నారు.

ప్రతిపక్షాల నేతలు రాజకీయాల కోసం ఏమైనా మాట్లాడతారని, 13 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానమని బొత్స చెప్పారు. ప్రజలకే తప్ప, తాము ప్రతిపక్షాలకు జవాబుదారీ కాదన్నారు.

రూ.లక్ష కోట్లు పెట్టి రాజధానిని నిర్మించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని, అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తే మిగిలిన 12 జిల్లాల సంగతి ఏమిటని ప్రశ్నించారు.

ఏ అంశమైనా కేబినెట్‌లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అసెంబ్లీ, రాజ్‌భవన్‌ ఇక్కడే ఉంటాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)