విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధానిగా మారేందుకు సన్నద్ధంగా ఉందా

  • విజయ్ గజం
  • బీబీసీ కోసం
విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేసేందుకు ఏర్పాటైన జీఎన్ రావు కమిటీ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి నివేదికను అందజేసింది.

అభివృద్ధి వికేంద్రీకరణ కోసం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవహారాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని అందులో సూచించింది.

విశాఖపట్నంను ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని.. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చింది.

అయితే, కార్యనిర్వాహక రాజధానిగా మారడానికి విశాఖ సన్నద్ధంగా ఉందా? ఈ భారాన్ని నగరం మోయగలదా? విశాఖకు ఉన్న సానుకూలతలు ఏంటి? ప్రతికూలతలు ఏంటి? తాజా ప్రతిపాదన గురించి ఇక్కడి పారిశ్రామిక, స్థిరాస్తి వర్గాలు ఏమంటున్నాయి?

ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది బీబీసీ.

విశాఖ మహానగరం ఒకప్పుడు మత్స్యకార గ్రామం. 18వ శతాబ్దంలో ఫ్రెంచ్ పాలనలోకి వెళ్లింది. బ్రిటీష్ పాలకులు దీన్ని స్వాధీనం చేసుకుని, నావికా స్థావరంగా అభివృద్ధి చేసుకున్నారు.

ఓడరేవు, తూర్పు నావికా దళం ప్రధాన కేంద్రం, ఓడల తయారీ పరిశ్రమ, ఉక్కు కర్మాగారం, బీహెచ్ఈఎల్, కోరమండల్ వంటి పరిశ్రమలు ఉండడంతో పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా నగరం చాలా వేగంగా అభివృద్ధి చెందింది.

రాష్ట్ర విభజన తర్వాత కొన్ని సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు కూడా ఇక్కడకు తరలివచ్చాయి. విశాఖకు పర్యటకుల తాకిడి కూడా ఎక్కువే.

దేశంలోని అన్ని ప్రధాన నగరాలకూ ఈ పట్టణం జల, వాయు, రోడ్డు, రైలు రవాణా మార్గాలతో అనుసంధానమై ఉంది.

1926లోనే నగరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇదికాక దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం, మారిటైం విశ్వవిద్యాలయం, ఐఐఎం, ఐఐఎఫ్ఇ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు విశాఖలో ఉన్నాయి.

విశాఖ పోర్టు ద్వారా ఏటా 120 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతుంది. 7.3 మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా 40 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

ప్రస్తుతం అనకాపల్లి నుంచి ఆనందపురం వరకూ, సబ్బవరం పెందుర్తిల మీదుగా ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది.

విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలన్న ప్రతిపాదనను స్థానిక వర్గాలు స్వాగతిస్తున్నాయి.

కనీస మౌలిక వసతులు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉండటం విశాఖకు సానుకూలమైన అంశమని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణ ప్రసాద్ అన్నారు.

''అమరావతిలో లాగా ఇప్పుడే విశాఖలో నిర్మాణాలు చేయాల్సిన పనిలేదు. ఇక్కడ మౌలిక వసతులు ఉన్నాయి. ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం కావడం వల్ల పాలన పరంగా ఎటువంటి ఇబ్బందులూ రావు. ట్రాఫిక్ పెరిగితే పరిశ్రమలకు కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. నగరంలోకి వలసలు మరింత పెరుగుతాయి. ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ రంగాలపై కాస్త ప్రభావం ఉంటుంది. పూర్తిస్థాయి రాజధానిగా మారడానికి సమయం పడుతుంది కాబట్టి ఈలోపు ఫాస్ట్ ట్రాన్స్‌పోర్ట్, మెట్రో లాంటివి ఏర్పాటు చేయాలి. అప్పుడు, ఆనందపురం, భోగాపురం, తగరపువలస, రాజపులోవ వంటి దూర ప్రాంతాలు కూడా నివాసానికి పనికి వస్తాయి'' అని ఆయన చెప్పారు.

మౌలిక వసతులను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని కృష్ణప్రసాద్ అభిప్రాయపడ్డారు.

విశాఖపట్నం సహజ సిద్ధమైన నగరమని, నగరానికి వలసలు పెరిగినా సమస్యలేవీ రావని క్రెడాయ్ విశాఖ యూనిట్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ అన్నారు.

''ఫార్మా, ఐటీ, పర్యాటక పరంగానూ విశాఖ అభివృద్ధి చెందింది. నగరాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తే.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఉపాధి లేక ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది చెన్నై, బెంగళూరు, మైసూరు, హైదరాబాద్ వలస వెళ్తున్నారు. విశాఖ రాజధానిగా మారితే, పరిపాలన వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి పరుగులు పెడుతుంది. రాష్ట్ర విభజన తరువాత విశాఖలో కొత్త పరిశ్రమలు వస్తాయని అనుకున్నాం. కానీ, ఏమీ రాలేదు. గతంలో స్థిరాస్తి రంగం పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. అయితే, ఇప్పటికిప్పుడు నగరానికి కొత్తవారు వలస వచ్చినా ఇబ్బంది లేదు. 10 వేలకు పైగా ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి'' అని చెప్పారు.

అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని నిర్ణయించడం మంచి పరిణామమని రిటైర్డ్ లా ప్రొఫెసర్ వైవీ సత్యనారాయణ అన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా హైకోర్టు ఏర్పాటవుతుందని, అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని అన్నారు. వివిధ ప్రాంతాల్లో హైకోర్టు బెంచ్‌లు ఏర్పడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

విశాఖ నగరంలో భూములు అందుబాటులో లేకపోయినా, శివారు ప్రాంతాలైన కొన్ని నియోజకవర్గాల్లో భూముల లభ్యత ఉందని స్థిరాస్తి వ్యాపారి కేకే రాజు అన్నారు.

''పర్యటకం, ఇతర రంగాలు అభివృద్ధి చెందుతుండటం వల్ల స్థిరాస్తి రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. భోగాపురం వరకూ విశాఖ శివారు ప్రాంతాలను కలుపుకుంటూ మెట్రో వస్తే.. విజయనగరం, అనకాపల్లి వరకూ అభివృద్ధి సాధ్యమవుతుంది'' అని చెప్పారు.

విశాఖపై భారం పడకుండా ఉండాలంటే, కొన్ని శాఖలు మిగతా రాజధానుల్లోనూ ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ కూడా అవసరమని ఆయన అన్నారు.

''పోలవరం నుంచి నీళ్లు రాకపోతే విశాఖకు వచ్చే ఐదేళ్లలో తీవ్ర ఇబ్బంది తప్పదు. వచ్చే ఐదేళ్లలో విశాఖలో ఏం చేయబోతున్నారన్న దానిపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. పోర్టుకు, ఏయూకు సంబంధించిన అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్భాటాలకు పోకుండా వాటిని వినియోగించుకోవాలి'' అని శర్మ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)