చిరంజీవి: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఆలోచనను అందరూ స్వాగతించాలి

చిరంజీవి జగన్

ఫొటో సోర్స్, Facebook/Lokesh Paila

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవహారాలకు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

ఈ ప్రతిపాదనపై కేంద్ర మాజీ మంత్రి, నటుడు చిరంజీవి స్పందించారు.

ఏపీలో మూడు రాజధానుల ప్రతిపాదనను అందరూ స్వాగతించాలని చెప్పారు.

శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులు చూసినా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివినా, తాజాగా జీఎన్ రావు కమిటీ సిపార్సులు చూసినా అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని స్పష్టంగా తెలుస్తోందని మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో చిరంజీవి అన్నారు.

"అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ పరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలి" అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, chiranjeevi

ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్ధి కోసం నిపుణుల కమిటి చేసిన సిఫార్సులు సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయని ఆయన అన్నారు.

"ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో మరో లక్ష కోట్ల అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉంది" అని ప్రెస్‌నోట్‌లో చిరంజీవి అన్నారు.

సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్తున్న కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల విధానం భద్రతనిస్తుంది ఆయన చెప్పారు.

అయితే, ఇదే సమయంలో రాజధాని రైతుల్లో నెలకొన్న భయాందోళనలు ,అభద్రతాభావాన్ని తొలగించాలని చిరంజీవి సూచించారు. అమరావతి ప్రాంత రైతులు నష్టపోకుండా, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అనుమానాలను నివారించే ప్రయత్నం ప్రభుత్వం చేయాలని సూచించారు.

ఫొటో సోర్స్, Janasena

మంత్రి మండలి నిర్ణయం కోసం వేచి చూస్తాం: జనసేన

మూడు రాజధానుల ప్రతిపాదనపై జనసేన పార్టీ కూడా స్పందించింది. దీనిపై మంత్రిమండలి నిర్ణయం కోసం వేచి చూస్తామంటూ జనసేనా ప్రెస్‌నోట్ విడుదల చేసింది.

"జీఎన్ రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అయోమయం, గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితి మంచిది కాదు. కమిటీ నివేదికపై కేబినెట్‌లో సమగ్రంగా చర్చిస్తామని మంత్రులు ప్రకటిస్తున్నారు. మంత్రిమండలి నిర్ణయం తర్వాత ఈ విషయంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని" అని జనసేన విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో పేర్కొంది.

'అభివృద్ధి అంటే సంపద సృష్టించే వనరులను ఏర్పాటు చేయడం. అది ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలను పెంపొందించేదిగా ఉండాలి. అభివృద్ధి అంటే నాలుగు ప్రభుత్వ కార్యాలయాలనో లేక నాలుగు భవనాలుగానో తాము భావించడం లేదు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది'' అని ప్రెస్‌నోట్‌లో ఆ పార్టీ తెలిపింది.

"పాల‌న కేంద్రీక‌ర‌ణ అమ‌రావ‌తిలో జ‌రిగింద‌ని చెబుతూ, ఇప్పుడు విశాఖలో కూడా అదే చేస్తామ‌న‌డం ఏ విధంగా స‌మంజ‌సం? విశాఖ‌లో ఆర్థిక వ‌న‌రుల మీద దృష్టితోనే అక్కడ రాజ‌ధాని పెడుతున్నారు" అని జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన వెంక‌ట మ‌హేష్ బీబీసీతో అన్నారు.

చిరంజీవి లాంటి సామాజిక దృక్పతం ఉన్న నాయ‌కుడు కూడా అన్నీ ప‌రిశీలించి వ్యాఖ్యానిస్తే బాగుంటుంది. జీఎన్ రావు క‌మిటీ రిపోర్టుని క్షుణ్ణంగా ప‌రిశీలించిన త‌ర్వాత స్పందించ‌డం మంచిద‌ని అనుకుంటున్నామని ఆయన బీబీసీకి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)