CAA: బిజనౌర్‌లో బుల్లెట్ తగిలి ఇద్దరు మృతి, ఫైరింగ్ చేయలేదన్న పోలీసులు

  • షానవాజ్ అన్వర్
  • బిజనౌర్ నుంచి
బిజనౌర్‌లో బుల్లెట్ తగిలి ఇద్దరు యువకుల మృతి

ఫొటో సోర్స్, SHAHNAWAZ ANWAR

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో మృతుల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. వీరిలో బిజనౌర్‌లో చనిపోయిన ఇద్దరు యువకులు కూడా ఉన్నారు.

అయితే, బిజనౌర్‌లో ఇద్దరు యువకులు ఎలా చనిపోయారు అనేదాని గురించి ప్రస్తుతం పక్కా సమాచారం అందడం లేదు. దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

శుక్రవారం స్థానికులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల్లో చాలా మంది పోలీసులు కూడా గాయపడ్డారు. అక్కడ చనిపోయిన వారి మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత వారిని ఖననం చేశారు.

నహటౌర్‌లో హింస

బిజనౌర్‌లో ధాంపూర్ తాలూకాలోకి వచ్చే ముస్లిం మెజారిటీ ఏరియా నహటౌర్‌లో శుక్రవారం ప్రార్థనల తర్వాత యువకుల గుంపు గ్యాస్ ఏజెన్సీ చౌక్ దగ్గర ఉన్న మూడు మసీదుల సమీపంలో గుమిగూడడం ప్రారంభించారు.

"నగరంలోని చాలా మంది యువకులు శుక్రవారం ప్రార్థనల తర్వాత మసీదుల నుంచి బయటకు వచ్చారు. యువకులంతా పౌరసత్వ సవరణ చట్టం అంటే సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడ ఉన్న యువకుల గుంపు ఎప్పుడైతే ఒక్కటై ఊరేగింపుగా బయల్దేరారో అప్పుడు పోలీసులు వారిని అడ్డుకోవాలని చూశారు. ఆ తర్వాత పరిస్థితి అదుపు తప్పింది" అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

ఫొటో సోర్స్, SHAHNAWAZ ANWAR

సాయంత్రం దాదాపు మూడు, నాలుగు గంటలకు పోలీసులు, స్థానిక పౌరులకు మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆందోళనకారుల చేతుల్లో భారత జెండా ఉంది. వారు ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నారు. అయితే సెక్షన్ 144 అమలులో ఉండడంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.

ఆందోళనకారులకు నాయకత్వం వహిస్తున్న వారిలో రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరూ లేరు. అయితే, వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్న వారితో స్థానిక సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు కూడా కనిపించారు.

ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ హింసాత్మకంగా మారగానే పోలీసులకు చెందిన కొన్ని మోటార్ సైకిళ్లకు, రెండు జీపులకు నిప్పు పెట్టారు. నిరసనకారులే వాటికి నిప్పు పెట్టారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.

"ఆ కలకలంలో ఫైరింగ్ శబ్దం వినిపించింది. పోలీసులు ఫైరింగ్ చేశారు, అందులో నోంధాకు చెందిన 20 ఏళ్ల సులేమాన్, 22 ఏళ్ల అనస్ చనిపోయారు" అని ఆందోళనకారులు చెప్పారు.

అయితే స్థానిక పోలీసులు తాము ఎలాంటి ఫైరింగ్ జరపలేదని చెబుతున్నారు. రాష్ట్ర పోలీస్ చీఫ్ ఓపీ సింగ్ కూడా రాష్ట్రంలో ఎక్కడా పోలీసుల వైపు నుంచి ఎలాంటి ఫైరింగ్ జరగలేదని ప్రకటించారు.

ఫొటో సోర్స్, SHANAWAZ ANWAR

మృతదేహాల ఖననం

"నేను బయటున్నాను. సులేమాన్‌కు బుల్లెట్ తగిలిందని నాకు ఫోన్లో చెప్పారు. నేను వెంటనే ఇంటికి చేరుకున్నాను. అతడిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లాను. కానీ సులేమాన్ దారిలోనే మృతిచెందాడు" అని మృతుడు సులేమాన్ చిన్నాన్న ముంసఫ్ చెప్పారు.

"జనంలో ఉన్న సులేమాన్, అనస్ మృతిచెందారు. వారి మృతికి కారణాలు తెలీలేదు. ఇద్దరి యువకుల మృతదేహాలకు పోస్టుమార్టం చేశాం" అని ధామ్‌పూర్ డిప్యూటీ కలెక్టర్ ధీరేంద్ర సింగ్ బీబీసీతో చెప్పారు.

ఒక ప్రశ్నకు జవాబుగా ఎస్‌డీఎం "పోస్టుమార్టం రిపోర్టు తర్వాత దీని గురించి పూర్తి స్పష్టత వస్తుంది. వారు బుల్లెట్ తగలడం వల్ల చనిపోయి ఉండొచ్చు. కానీ ఆ బుల్లెట్ ఎవరు కాల్చారు అనేదానిపై దర్యాప్తు చేయాల్సి ఉంటుంది" అన్నారు.

శుక్రవారం రాత్రి జిల్లా ఆస్పత్రిలో ముగ్గురిని చేర్పించారని, వారికి బుల్లెట్ తగిలిందని బిజనౌర్‌లో ఎసీఎంఓ డాక్టర్ ఏకే నిగమ్ కూడా చెప్పారు.

నగరం నుంచి మాయమైన యువకులు

శుక్రవారం పోలీసులు, స్థానికులకు ఘర్షణలు తర్వాత ఇద్దరు యువకులు మృతి చెందడంతో నగరం నివురుగప్పిన నిప్పులా ఉంది.

పేరు బయటపెట్టని ఒక స్థానికుడు "పగలు ఆ ఘర్షణలు జరిగిన తర్వాత చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలను బంధువుల దగ్గరకు పంపేశారు. పోలీసులు రాత్రికిరాత్రే ఇళ్లలోకి చొరబడి వారిని ఎత్తుకెళ్తారేమోనని మాకు భయమేస్తోంది" అన్నారు.

"మాకు పోలీసుల భయం వెంటాడుతోంది. మా పిల్లలే చనిపోతారు, మమ్మల్నే వేధిస్తారు" అని ఒక మహిళ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)