డిసెంబర్ 31 లిక్కర్ అమ్మకాలపై ఏపీలో కొత్త మద్యం పాలసీ ప్రభావం ఉంటుందా?

  • 30 డిసెంబర్ 2019
బెంగళూరు వైన్ ఫెస్టివల్ 2019 Image copyright Getty Images

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది కొత్త మద్యం పాలసీ అమలులోకి వచ్చింది. అందులో భాగంగా అనేక మార్పులు తీసుకొచ్చారు. మద్యం దుకాణాలు తగ్గించడం, దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించడం, ధరలు పెంచడం, వేళలు తగ్గించడం వంటి ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.

దశలవారీగా రాష్ట్రలో మద్యాన్ని నిషేధించే లక్ష్యంతో ఇవన్నీ చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ మార్పులన్నీ మొదలైన మూడు నెలలకే కొత్త సంవత్సరం వచ్చేసింది. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారుతుందని.. అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం వస్తుందని గత కొన్నేళ్ల గణాంకాలు చెబుతున్నాయి.

మరి, ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విషయంలో అనేక మార్పులు జరగడంతో ఆ ప్రభావం అమ్మకాలపై ఉంటుందా? వేడుకలపై ఉంటుందా? అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది.

Image copyright Getty Images

ఈ ఏడాది ఎన్నో మార్పులు

ఏటా నూతన సంవత్సర ప్రారంభానికి ముందురోజు, అంటే డిసెంబరు 31న భారీగా మద్యం విక్రయమవుతోంది.

కానీ, ఇప్పుడు ఏపీలో మద్యం దుకాణాలు 20 శాతం మేర తగ్గాయి. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన అక్టోబరు 1, 2019 ముందు రోజు వరకు రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 3,500 దుకాణాలే ఉన్నాయి.

గతంలో పర్మిట్ రూములు ఉండేవి. ఇప్పుడు ఆ అనుమతులన్నీ ముగిశాయి. బెల్టు దుకాణాలను కూడా పూర్తిగా నిర్మూలించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు, మద్యం దుకాణాల్లో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే విక్రయాలు సాగిస్తున్నారు.

ఈ మార్పులన్నీ డిసెంబరు 31 విక్రయాలపై ప్రభావం చూపుతాయని అంచనా వేస్తున్నారు.

గత నాలుగేళ్లలో ఏపీలో డిసెంబరు 31న విక్రయాలు ఇలా..

సంవత్సరం మొత్తం విక్రయాలు(రూ. కోట్లలో) అమ్ముడైన భారతీయ తయారీ మద్యం( కేసుల్లో) అమ్ముడైన బీరు(కేసుల్లో)
2018 డిసెంబరు 31 118.96 2,05,087 1,45,519
2017 50.01 89,055 57,282
2016 81.72 2,23,007 64,977
2015 59.14 1,62,409 30,240

* 2018లో డిసెంబరు 31వ తేదీ ఒక్క రోజునే ఏపీ అబ్కారీ శాఖకు రూ.118.96 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో రూ.13.69 కోట్ల మద్యం విక్రయం కాగా అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో రూ.4.4 కోట్ల మేర విక్రయమైంది.

* 2017లో డిసెంబరు 31న మొత్తం రూ.50.01 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. ఆ రోజున అత్యధికంగా కృష్ణాజిల్లాలో రూ. 8.27 కోట్ల మేర మద్యం విక్రయం కాగా, అత్యల్పంగా శ్రీకాకుళంలో ఆ రోజున రూ. 1.7 కోట్ల మద్యం విక్రయమైంది.

డిసెంబరు 31 విక్రయాలలో రూ.50.01 కోట్లు తక్కువే. అయితే, అంతకుముందు రోజు డిసెంబరు 30న రూ. 103. 63 కోట్ల మద్యం అమ్ముడైంది. చాలామంది ముందుజాగ్రత్తగా డిసెంబరు 30నే కొనుగోళ్లు జరపడంతో డిసెంబరు 31 ఆదివారం కావడంతో ఆ రోజున అనుకున్నస్థాయిలో విక్రయాలు జరగలేదని ఎక్సయిజ్ అధికారి ఒకరు తెలిపారు.

* 2016 డిసెంబరు 31న రూ.81.72 కోట్ల మద్యం అమ్ముడుపోయింది. అత్యధికంగా గుంటూరు, విశాఖ జిల్లాల్లో రూ. 8.29 కోట్ల చొప్పున విక్రయం కాగా అత్యల్పంగా కడపలో ఆ రోజున రూ. 3.36 కోట్ల మద్యం విక్రయమైంది.

* 2015 డిసెంబరు 31న మొత్తం విక్రయాలు రూ.59.14 కోట్లు కాగా అందులో అత్యధికంగా నెల్లూరు జిల్లా నుంచి రూ. 10.46 కోట్ల ఆదాయం వచ్చింది. అత్యల్పంగా కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఆ రోజున రూ. 89 లక్షల చొప్పున మద్యం విక్రయాల ద్వారా ఆదాయమొచ్చింది.

Image copyright Getty Images

కొత్త పాలసీ ప్రభావం ఎలా ఉండనుంది?

రాష్ట్రంలో మద్య దుకాణాలను పూర్తిగా ప్రభుత్వమే నిర్వహిస్తుండడం.. వేళలు తగ్గించడం, దుకాణాల సంఖ్య కుదించడం వంటి మార్పులు తీసుకొచ్చిన తరువాత అక్టోబరు నెలలో కొంత ప్రభావం పడింది.

అయితే, క్రమంగా విక్రయాలు సాధారణ స్థితికి వచ్చాయి. ధరలు కూడా పెరగడం వల్ల ఆదాయంపైనా ప్రభావం కనిపించలేదు.

ప్రస్తుత డిసెంబరులో 16 నుంచి 21వ తేదీ మధ్య విక్రయాలు పరిశీలిస్తే ప్రతి రోజూ రూ. 70 కోట్లకు పైగానే ఆదాయం వచ్చింది.

ఈ లెక్కన ఏటా డిసెంబరు 31న రెండు మూడు రెట్లు విక్రయాలు పెరిగినట్లే ఈ ఏడాదీ దీనికి కనీసం రెండింతల ఆదాయం అంచనా వేసినా రూ. 140 కోట్లు అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని ఎక్సయిజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

డిసెంబరులో 16 నుంచి 21వ తేదీ మధ్య విక్రయాలు ఇలా..

తేదీ విక్రయాలు(రూ. కోట్లలో)
16.12.2019 79.45
17.12.2019 73.63
18.12.2019 70.46
19.12.2019 73.11
20.12.2019 71.22
21.12.2019 73.72

(ఆధారం: ఏపీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ శాఖ)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)