పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు: ‘పోలీసులకు కనిపించకుండా లైట్లన్నీ ఆపేసి దాక్కున్నాం. ఎలాగోలా ఆ రాత్రి గడిచి బతికి బయటపడ్డాం’

ఇలస్ట్రేషన్

ఫొటో సోర్స్, NIKITA DESHPANDE/BBC

రికాత్ హష్మి.. దిల్లీకి చెందిన ముస్లిం విద్యార్థిని ఈమె. ఒక భారతీయ ముస్లింగా తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నానంటున్నారు. ఆ ఆందోళన ఎందుకో వివరించారు.

''భారత్‌లోని చాలా మంది ముస్లింల మాదిరిగానే నేనిప్పుడు మా భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తూ రోజులు గడుపుతున్నాను.

నా మతం కారణంగా నాకు ఉద్యోగం ఇవ్వడం మానేస్తారా? నా ఇంటిని నేను ఖాళీ చేయాల్సి వస్తుందా? మూకదాడికి గురవుతానా? ఈ భయం ఎప్పటికైనా పోతుందా?

దిల్లీలో నేను చదువుకుంటున్న జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీలో హింస చోటుచేసుకున్న తరువాత నా ఆందోళన చూసి అమ్మ ''ఓపిగ్గా ఉండు'' అని చెప్పింది.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులను అడ్డుకోవడానికి వారిని కొట్టి భయపెట్టారు.

పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లింలపై చూపిన వివక్ష ఈ నిరసనలకు కారణం. ''

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులకు గాయాలెందుకయ్యాయి?

''విద్యార్థులు వాహనాలను తగలబెట్టారు.. అల్లర్లకు ప్రేరేపించారని అంటున్నారు. కానీ, మాకు వ్యతిరేకంగా ఆధారాలు ఎక్కడ ఉన్నాయి?

కాల్పులు జరగలేదని పోలీసులు చెబుతున్నారు, అలాంటప్పుడు ఆసుపత్రుల్లో ఉన్న విద్యార్థులకు గాయాలెందుకయ్యాయి?'' అని ప్రశ్నించారామె.

''నేను జామియా విశ్వవిద్యాలయంలో దంతవైద్య కోర్సు చదువుతున్నాను. నేనిక్కడ ఉన్న కాలంలో ఎన్నో శాంతియుత నిరసనలు చూశాను.

ఆదివారం నాటి నిరసనల్లో నేను లేను. కానీ, పోలీసులు విద్యార్థులపై చేసిన దాడి బాధితురాలిని నేను.

పోలీసులు మా హాస్టల్ దగ్గరకు వచ్చేసరికి అందరూ భయంతో కేకలు వేశారు. లైట్లన్నీ ఆపేసి వారికి కనిపించకుండా దాక్కోవాలని ప్రయత్నించాం. ఎలాగోలా ఆ రాత్రి గడిచి మేం బతికి బయటపడ్డాం. ఈ ఘటనతో ఓ విషయం స్పష్టమైంది. మీరు నిరసనల్లో భాగం కాకపోయినా, విమర్శలు చేయకపోయినా ముస్లింలు కావడం వల్ల మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటారు'' అన్నారు రికాత్ హష్మి.

ఫొటో సోర్స్, Getty Images

రికాత్ తన చిన్ననాటి గుర్తుల్లోకి వెళ్లారు. చిన్నప్పుడు ప్రతి రోజూ హిందూ ఆధ్యాత్మిక పాటలు చెవిన పడుతుండగా ఉదయాన్నే నిద్ర లేచేవాళ్లమని గుర్తుచేసుకున్నారు.

ఒడిశాలో అంతా హిందువులే ఉన్న ఓ ప్రాంతంలో నివసించిన ఏకైక ముస్లిం కుటుంబం తమదని ఆమె చెప్పుకొచ్చారు.

అక్కడ అందరం కలిసి పండుగలు జరుపుకొనేవాళ్లమని.. ఈద్ సందర్భంగా అక్కడి హిందువులు తన చేతికి గోరింటాకు పెట్టేవారని.. తాను, తన తోబుట్టువులు నవరాత్రి ఉత్సవాలకు హిందువుల ఇళ్లకు వెళ్లి పండుగలో పాలుపంచుకునేవాళ్లమని చెప్పారు.

ముస్లింల ఇళ్లలో సంప్రదాయ వంటకమైన బిర్యానీ తినేందుకు నా హిందూ స్నేహితులు తరచూ మా ఇంటికి వస్తారు.

చిన్నప్పుడు మేముండే ప్రాంతంలో మసీదు ఉండేది కాదు. మా నాన్న మతాన్ని పాటించేవ్యక్తి కాదు కాబట్టి ఆయనెప్పుడూ దాని గురించి బాధపడేవారు కాదు. కానీ, మా అమ్మ మాత్రం ఇంట్లోనే రోజూ అయిదు సార్లు నమాజ్ చేసుకునేది.

నేనక్కడే ఓ కాన్వెంట్లో చదివాను.. ఎక్కువ మంది హిందువులే ఉండేవారు. కానీ, ఏనాడూ ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసిమెలసి ఉన్నాం.

ఒకే ఒక్కసారి ఒక మిత్రుడు 'ముస్లింలు రోజూ స్నానం చేయరట నిజమేనా' అని అడిగాడు.. నేనూ దానికి నవ్వేసి అదేమీ కాదని చెప్పాను.

మతం జీవితంలో ఒక భాగమే కానీ ఇంతవరకు ఎన్నడూ ముస్లింగా అస్తిత్వ సమస్య రాలేదు.

మమ్మల్ని విభజించడానికి బలగాలు బయలుదేరాయి.. అయితే, మొన్నటిలాంటి అనుభవాలు మళ్లీ ఎదురవుతాయా లేదా అన్నది చెప్పలేను.

సమాజాన్ని నాశనం చేస్తున్న రేపిస్టులుగా, పాకిస్తాన్‌‌కు మద్దతు పలికే టెర్రరిస్టుల్లా, ప్రేమ పేరుతో హిందువులను ఇస్లాంలోకి మార్చేసేవారిలా, మాంసం తినేవారిలా మమ్మల్ని చూపించడం ఎక్కువవుతోంది.

నిజానికి భయంతో బతికే రెండో తరగతి పౌరులుగా మారిపోతున్నాం మేం'' అన్నారామె.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ట్వీట్‌లో ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ''శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుకోవలసిన సమయం ఇది'' అన్నారు. అంతకు ఒక రోజు ముందు వేలాది మంది ప్రజలు, డజన్ల కొద్దీ కెమెరాల ముందు ప్రధాని మాట్లాడుతూ.. ''ఆస్తులను దహనం చేసినవారిని టీవీల్లో చూడొచ్చు.. వారు వేసుకున్న దుస్తులను బట్టి వారెవరో గుర్తించొచ్చు'' అన్నారు.

ఆయన అంతకంటే వివరంగా చెప్పకపోయినా అది నా మతంపై చేసిన దాడని అర్థమవుతుంది. ఆ మాటలు నన్ను మరింతగా నా మతంపట్ల అభిమానం పెరిగేలా చేశాయి. నేనిది భౌతిక కోణంలో చెప్పడం లేదు.

నాకు పదహారో ఏట నుంచే హిజాబ్ ధరించడం అలవాటు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లాను. అక్కడ హిజాబ్ ధరించిన ఎంతోమంది అమ్మాయిలను చూశాను.

అప్పటి నుంచి నేనూ దాన్ని నా రూపంలో భాగంగా మార్చుకున్నాను.

ఇప్పుడు 22 ఏళ్ల వయసులో నా దేశ రాజ్యాంగం, నా మతానికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను.

అదుపు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థ, వివక్షాపూరిత విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పాలనుకుంటున్నాను.

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నా అభిప్రాయం చెప్పిన ప్రతిసారీ హిందూ-ముస్లింల మధ్య సమస్యను పెంచుతున్నానని ఆరోపించారు. జాతి విద్రోహి, హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేశారు.

ఫొటో సోర్స్, Getty Images

మతం, జాతీయవాదం ఒకదానితో ఒకటి పెనవేసుకున్న ప్రమాదకరమైన కొత్త శకంలో మనమిప్పుడు బతుకుతున్నాం.

హిందూ జాతీయవాద భావజాలాన్ని పాలక పార్టీ అందిపుచ్చుకుంది. మత వివక్షతో కొన్ని చట్టాలను చేస్తున్నారు. గోరక్షక దళాలు ముస్లింలపై విద్వేష దాడులకు దిగుతున్నాయి.

ఇలాంటి పరిస్థితులలో అసమ్మతి గళాలూ నెమ్మదిగా మూగబోతున్నాయి.

ఇది నేను పెరిగిన అందరినీ కలుపుకొని పోయిన భారత దేశం కాదు.. 20 కోట్ల భారతీయ ముస్లింలకు మెరుగైన పరిస్థితులు కావాలి''

''కానీ మాలో ఇంకా ఆశ ఉంది. ద్వేషం, మూర్ఖత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన గళం వినిపిస్తోంది. మాకు వ్యతిరేకంగా తయారైనవారు మానవత్వంతో మారేందుకు ఇది స్ఫూర్తి కావొచ్చేమో.

ప్రస్తుతానికి, నా ప్రపంచం వేరవడంతో నేను మౌనంగా నిరీక్షిస్తున్నాను.

హాస్టల్ నుంచి ఖాళీ చేయించి బలవంతంగా సెలవుపై పంపించారు. నా చదువుపైనా ఈ ప్రభావం పడింది. నా తల్లిదండ్రులను కలుసుకొనేందుకు వెళ్లాలంటే వారుంటున్నచోటా నిరసనలు తీవ్రంగా ఉన్నాయి.

అందుకే.. ఇక్కడే ఉండిపోయాను. ''శక్తులన్నీ కూడగట్టుకుని ఓపిగ్గా ఉండు'' అన్న మా అమ్మ మాటలను గుర్తు చేసుకుంటున్నాను'' అన్నారామె.

(పూజా ఛాబ్రియాతో రికాత్ హష్మి చెప్పిన వివరాల ప్రకారం రాసిన కథనం)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)