అసదుద్దీన్ ఒవైసీ: ‘‘పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీలను వ్యతిరేకించేవారంతా ఇళ్లపై జాతీయ జెండా ఎగరేయండి’’

హైదరాబాద్ నిరసనలు

పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం కమిటీ హైదరాబాద్‌లోని దారుస్సలాంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

బహిరంగ సభకు హాజరైనవారు అల్లాహో అక్బర్ నినాదాలు చేయడంతో, మతపరమైన నినాదాలు చేయవద్దని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వారిని కోరారు. హిందుస్తాన్ జిందాబాద్ లాంటి నినాదాలు చేయాలన్నారు.

దేశంలో ఎన్ఆర్‌సీ, పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లపై భారత జాతీయ జెండా ఎగురవేసి నిరసన తెలపాలని ఒవైసీ కోరారు. ఈ దేశంలో ఇంకా గాంధీ విలువలు ఇంకా బతికే ఉన్నాయన్న సందేశాన్ని ఇంటిపై ఎగిరే ఆ జెండా ఇస్తుందన్నారు.

దారుస్సలాంలోని ఇదే మైదానానికి 70 ఏళ్ల కిందట జిన్నా (పాకిస్తాన్ జాతిపిత) వచ్చారని, అప్పట్లో జిన్నాతో కరచాలనం చేసేందుకు ఒక వ్యక్తి వెళ్లారని, అతడిని పాకిస్తాన్ రావాలని జిన్నా ఆహ్వానించడంతో వెళ్లిపోయారని ఒవైసీ చెప్పారు. ఆ వ్యక్తిని తాను కొన్నేళ్ల కిందట కలిశానని, పాకిస్తాన్ వెళ్లటమే తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అని అతను తనకు చెప్పారని ఒవైసీ వెల్లడించారు.

జిన్నా రెండు దేశాల సిద్ధాంతాన్ని తాను స్వీకరించలేదని ఒవైసీ చెప్పారు.

"ఇక్కడ లోకల్స్ మోదీ, అమిత్ షా కాదు. అంబేద్కర్ లేకపోతే నేను లేను అని మోదీ అన్నారు. కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఈ హిట్లర్ మోడల్, ఈ ఆర్యన్ మోడల్ అంగీకరించం" అని ఈ సమావేశానికి హాజరైన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నేత ఎన్ శరత్ అన్నారు.

"కాంగ్రెస్, బీజేపీ వేరు కాదు, రెండూ ఫాసిస్టులే. సంఘ్ పరివార్‌కు ఇద్దరు కొడుకులు, పెద్ద కొడుకు కాంగ్రెస్, చిన్న కొడుకు బీజేపీ" అని శరత్ అన్నారు.

దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు అయేషా రెనా, లదీదా షకాలూన్‌ ఈ సభకు హాజరయ్యారు. వారికి పెద్దసంఖ్యలో జనం స్వాగతం పలికారు.

ఫొటో క్యాప్షన్,

అయేషా రెనా

అయేషా రెనా మాట్లాడుతూ.. ''పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్కరికీ నా సలాం. విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నాను. పోలీసుల అదుపులో ఉన్న ప్రతి విద్యార్థినీ విడిచిపెట్టాలి'' అన్నారు.

ఫొటో క్యాప్షన్,

లదీదా షకాలూన్

లదీదా షకాలూన్ మాట్లాడుతూ.. ''ఈ నిరసన కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు సంతోషం. మా ఈ పోరాటంలో హైదరాబాద్ విద్యార్థులంతా భాగస్వాములు కావాలని కోరుతున్నాను. న్యాయం కోసం చేసిన త్యాగాలు, పోరాటాలను సమర్థించాల్సిన అవసరం ఉంది అన్నారు.

వివిధ మసీదులకు చెందిన మౌలానాలు ఈ సభలో మాట్లాడారు. "దేశం మోదీ, షాల కంటే ఎక్కువగా తమకు చెందింది అని అన్నారు. ఇలాంటి ప్రక్రియను ఇంతకు ముందు కూడా వ్యతిరేకించామని, ప్రాణాలు పోయినా దానిని ఒప్పుకోమని" చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం కమిటీ ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు వేల సంఖ్యలో హాజరయ్యారని పోలీసులు చెప్పారు.

హైదరాబాద్‌లో అంతా ప్రశాంతంగా ఉందని ఎలాంటి వదంతులు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు, వ్యాప్తి చేయద్దని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)