పౌరసత్వ సవరణ చట్టం: మంగళూరు కాల్పులతో కర్ణాటక, కేరళ మధ్య ఉద్రిక్తత

  • 22 డిసెంబర్ 2019
యడ్యూరప్ప Image copyright Reuters

పౌరసత్వ సవరణ బిల్లు, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, తర్వాత తలెత్తిన హింస కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.

మంగళూరులో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు విద్యార్థులు మృతిచెందడంతో, అక్కడ పలు కాలేజీల్లో చదువుతున్న తమ విద్యార్థులను తిరిగి రాష్ట్రానికి తీసుకురావడానికి కేరళ ప్రభుత్వం భారీగా బస్సులు పంపించింది.

"బస్సులు రాష్ట్రానికి చేరుకోగానే, కాసర్‌గౌడ్‌లో విద్యార్థులకు స్వాగతం పలికిన కేరళ రెవెన్యూ మంత్రి ఇ. చంద్రశేఖరన్ వారికి స్వీట్స్ తీనిపించారు" అని కేరళ సీఎంఓ అధికారి ఒకరు పేరు రాయవద్దనే షరతుతో చెప్పారు.

విద్యార్థుల ఆందోళనలు జరిగిన తర్వాత రోజు, కేరళకు చెందిన ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన 9 మంది జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న మంగళూరు పోలీసులు, వారిని తిరిగి కేరళకు పంపించారు.

కొంతమంది రిపోర్టర్లు తాము కేరళ ప్రభుత్వం గుర్తింపు పొందామని చెప్పినప్పటికీ, మంగళూరులో పోస్టుమార్టం జరుగుతున్న హాస్పిటల్ నుంచి రిపోర్ట్ చేయడానికి పోలీసులు జర్నలిస్టులను అనుమతించలేదు.

కాల్పులు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా కర్ఫ్యూ విధించారు. ఈ హింస వెనుక 'లోతైన కుట్ర' ఉందని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై సందేహం వ్యక్తం చేశారు. కేరళ నుంచి మంగళూరులోకి చాలా మంది ప్రవేశించారని ఆరోపించారు.

Image copyright Getty Images

మంగళూరు హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థుల కోసం బస్సులు పంపాలని కేరళ సర్కారు నిర్ణయం తీసుకున్నప్పుడు, వాటికి తగిన భద్రతను, రక్షణను కల్పించాలని కేరళ ముఖ్యమంత్రి విజయన్, కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్పకు లేఖ రాశారు.

మంగళూరులో చదువుతున్న కేరళ విద్యార్థుల సంఖ్యకు సంబంధించి గణాంకాలు ఏవీ లభించలేదు. వారి సంఖ్య వేలల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటు, మంగళూరు చేరుకున్న సీఎం యడ్యూరప్ప నగరంలో పరిస్థితిపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం 3 నుంచి సాయంత్రం 6 వరకూ, ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ కర్ఫ్యూ సడలిస్తున్నట్టు ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 6 తర్వాత మళ్లీ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.

బెంగళూరు, కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో ఎక్కడా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్దగా నిరసన ప్రదర్శనలు జరగడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు: అమరావతిపై నాకెలాంటి కోపం లేదు, నా ఇల్లు అక్కడే ఉంది - వైఎస్ జగన్

వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు

జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు

థీమ్ పార్క్ ప్రారంభోత్సవానికి పందితో బంగీ జంప్ చేయించారు

మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన ఫొటోలను గాంధీ స్మృతి మ్యూజియంలో నుంచి ఎందుకు తీసేశారు

‘ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా.. పిల్లల ఫొటో చూసి ఆగిపోయా’ - టీమిండియా మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్

భారత్-పాక్ ఉద్రిక్తతల సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి బదిలీ

భవిష్యత్తులో యంత్రాలు మనుషుల్లా మాట్లాడగలవా, జంతువులు కూడా నొప్పితో బాధపడుతాయా