NPR: ఇక జాతీయ జనాభా పట్టిక.. ప్రజల వేలిముద్రల సేకరణ.. పౌరసత్వ గుర్తింపు కార్డులు జారీ.. వచ్చే వారంలో ఆమోదం - ప్రెస్ రివ్యూ

ఇండియా గేట్

ఫొటో సోర్స్, Getty Images

పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం వచ్చే వారం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని.. దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ - ఎస్‌పీఆర్) రూపకల్పనకు అనుమతి ఇవ్వనుందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ఒకసారి ఎన్‌పీసీ తయారైన తరువాత దాని ఆధారంగా జాతీయ పౌరుల జాబితా (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ - ఎన్‌ఆర్‌సీ)ని రూపొందించనుంది.

దేశవ్యాప్తంగా జాతీయ జనాభా పట్టిక తయారీకి రూ. 3,941 కోట్లు కేటాయించాలని కేంద్ర హోంశాఖ కోరుతోంది. దేశంలోని నిజమైన పౌరుల వివరాలు సేకరించడమే ఎన్‌పీఆర్ లక్ష్యం. ప్రజలందరి వేలి ముద్రలు సేకరించడం, అందరికీ పౌరసత్వ గుర్తింపు కార్డులు ఇవ్వడం ఈ ప్రక్రియ లక్ష్యమని ఓ అధికారి చెప్పారు.

ఎన్‌పీఆర్‌ను తాజా సమాచారంతో సవరించినట్టు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్‌జీఐ) ధ్రువీకరించిన తరువాతే ఎన్‌ఆర్‌సీపై నోటిఫికేషన్ ఇస్తారు. ఆర్‌జీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అసోం మినహా మొత్తం దేశమంతటా జనాభా పట్టికను రూపొందిస్తారు.

ఈ ప్రక్రియ 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. జనాభా లెక్కలను మునుపటి లాగానే గ్రామ, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో సేకరిస్తారు. గడచిన ఆరు నెలలుగా ఒక ప్రాంతంలో నివసిస్తున్న వారిని, లేదంటే రానున్న ఆరు నెలల పాటు అదే చోట ఉంటామని చెప్పిన వారిని స్థానికులుగా పరిగణిస్తారు.

పౌరసత్వ చట్టం సవరణలపై ఆందోళనలు జరుగుతున్న దృష్ట్యా జనాభా పట్టిక రూపకల్పన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్టు కేరళ, పశ్చిమబెంగాల్ సీఎంలు ప్రకటించారు. అయితే ఇలాంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని కేంద్ర హోంశాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు.

‘‘మీ బుద్ధిని ఉపయోగించండి.. బౌలర్ ఫీల్డింగ్ సెట్ చేయాలి.. కెప్టెన్ కాదు’’: సీఏఏ నిరసనలపై కపిల్ స్పందన

''మన సమాజంలో ఓ గుంపు అది మంచి అంటూ.. అంతా అది మంచే అనుకుంటారు. అలాకాదు, మీ బుద్ధిని ఉపయోగించండి. క్రికెట్‌లోనూ నేను అదే చెబుతాను. బౌలర్ ఫీల్డింగ్ సెట్ చేయాలి, కెప్టెన్ కాదు. అలాగే ఏదైన విషయం జరిగినప్పుడు దానికి గల కారణాలు ఏంటి అని మెదడు పెట్టి ఆలోచించాలి'' అని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పేర్కొన్నట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపవచ్చు కానీ ప్రజా ఆస్తులను ధ్వంసం చేయటం తప్పు అని కపిల్ వ్యాఖ్యానించారు. ‘‘నేను ఇది తప్పు, మంచి అనడం లేదు. ఎవరైనా భావాన్ని వ్యక్తం చేయవచ్చు. మీరు వెళ్లి మీ భావాలను వ్యక్తపరచండి. కానీ, దేశం గురించి ఎప్పుడూ ఆలోచించాలి’’ అని సూచించారు.

‘‘మీ వాహనం కాల్చకుండా.. ఓ బస్సును మీరు కాల్చకూడదు. మీ చెయ్యిని మీరు నరుక్కోలేనప్పుడు.. వేరే వ్యక్తిని ఎలా చంపుతారు? ఇది మన దేశం, మనం దాని ప్రయోజనం గురించి ఆలోచించాలి. అది మనకు అర్థం కాని విషయమేమీ కాదు. మీ భావప్రకటన చేసేందుకు అన్ని హక్కులు మీకు ఉన్నాయి. కానీ, ఇది అందుకు సరైన పద్ధతి కాదు.మీరు పన్ను కడుతూ.. ఇలాంటివి చేస్తే అది మీ డబ్బు మీరు కాల్చుకున్నట్లే'' అని కపిల్ పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ కూడా భావ ప్రకటన గురించి ఇదే విధంగా చెప్పారని కపిల్ తెలిపారు. ''మహ్మాత్మా గాంధీ, సర్ధార్ పటేల్ కూడా భావప్రకటనకు మద్దతుగా నిలిచారు. కానీ, పరిస్థితులను మన చేతిలోకి తీసుకొని.. గూండా అని పిలిపించుకోకూడదు. మీ పని మీరు చేయండి.. కానీ దేశాభివృద్ధికి అడ్డుపడొద్దు'' అని హితవుపలికారు.

ఫొటో సోర్స్, Getty Images

‘‘నన్ను చంపేస్తామని ఫోన్‌లో బెదిరిస్తున్నారు’’: దిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు

మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌.. తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని.. తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని శనివారం దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అంతర్జాతీయ ఫోన్‌ నంబర్‌ నుంచి తనకు హత్యా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని గౌతం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు భద్రత కల్పించాలని డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌కు ఆయన విజ్ఞప్తిచేశారు.

గంభీర్‌ ఫిర్యాదును నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా నంబర్‌ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Facebook/Election Commission of India

తెలంగాణలో ‘19 ఏళ్లుంటేనే ఓటు హక్కు’.. వచ్చే ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో వింత పరిస్థితి!

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్టో ఓటేసే అదృష్టాన్ని లక్షల మంది నవ ఓటర్లు త్రుటిలో కోల్పోనున్నారని ‘సాక్షి’ ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు వచ్చే ఏడాది జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి తొలి వారంలో నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలున్నాయి.

మున్సిపల్‌ ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనకు 2019 జనవరి 1వ తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం అర్హత తేదీగా ఖరారు చేసింది. 2020 షెడ్యూల్‌ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రకటించనుంది.

ఈ జాబితాను ప్రాతిపదికగా తీసుకుంటే మున్సిపల్‌ ఎన్నికలను మార్చిలో నిర్వహించాల్సి ఉంటుంది. మార్చి నుంచి మే వరకు వరుసగా పరీక్షలు ఉండటంతో ఎన్నికలు వాయిదా వేసుకోక తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలను ఎలాగైనా జనవరి/ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

అందుకే 2019 జనవరి 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోంది. ఈ పరిస్థితుల్లో 2020 జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల నాటికి.. 18 ఏళ్ల వయసు వచ్చిన వారు ఓటు వేయలేరు.

2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు కలిగి ఉండి మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించే నాటికి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు కలిగి ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారవర్గాలు పేర్కొన్నాయి. అంటే.. ఓటరుగా నమోదైన ఏడాది తర్వాత - 19 సంవత్సరాల వయసు దాటిన వారు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకోగలరు.

ఈ నెల 16న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన అసెంబ్లీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు సంపాదించని, అర్హులైన పౌరులు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల తేదీ నాటికి ఓటరుగా నమోదు చేసుకుంటే ఓటు హక్కు పొందుతారని ఓ అధికారి 'సాక్షి'కి తెలిపారు.

వార్డు/డివిజన్ల వారీగా మున్సిపాలిటీలు/కార్పొరేషన్ల ఓటర్ల జాబితాను మరో వారం రోజుల్లో ప్రకటిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత నుంచి ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటించే తేదీ లోగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)