పౌరసత్వ సవరణ చట్టం: CAA, NRCలపై ఇస్లాం మత గురువులు ఏమంటున్నారు?

  • మహమ్మద్ షాహిద్
  • బీబీసీ ప్రతినిధి
నిరసన

ఫొటో సోర్స్, Getty Images

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏకు) వ్యతిరేకంగా దేశంలో చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయి. ఈ చట్టం ముస్లింలపై వివక్ష చూపిస్తోందని ఆరోపిస్తూ జనాలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, కర్నాటక, దిల్లీల్లో ఇలాంటి ప్రదర్శనలు హింసాత్మకంగానూ మారాయి.

అయితే, సీఏఏలో ముస్లింలు ఆందోళన చెందాల్సిందేమీ లేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది.

ఇది పొరుగుదేశాలైన పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లో ఏళ్లుగా వేధింపులు అనుభవించి, భారత్‌లో తప్ప మరెక్కడా ఆశ్రయం పొందలేకపోయిన మైనార్టీలకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన చట్టమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టత ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images

సీఏఏ వల్ల దేశంలోని ఎవరి పౌరసత్వమూ పోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, ఆప్, తృణమూల్ కాంగ్రెస్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశవ్యాప్తంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

కానీ, ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ముస్లిం వర్గాల్లో మాత్రం ఆందోళనలు ఇంకా పూర్తిగా తగ్గట్లేదు. జాతీయ పౌరసత్వ చట్టం తర్వాత కేంద్రం ఎన్ఆర్‌సీ తెచ్చి, తమను దేశం నుంచి వెళ్లగొడతుందని వారిలో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఏఏపై నిరసనలు ఓ దిశానిర్దేశం లేకుండా జరుగుతున్నాయి. వీటి వెనుక పెద్ద సంస్థలు గానీ, నాయకులు గానీ ఉన్నట్లు కనిపించడం లేదు.

ఈ ఆందోళనల్లో చోటుచేసుకుంటున్న హింసను ముస్లిం సముదాయంతో సహా అన్ని వర్గాలూ ఖండిస్తున్నాయి. ఇస్లాం మత గురువులు కూడా చాలా మంది సీఏఏపై స్పందించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అహ్మద్ బుఖారీ

‘ముస్లింలకు సీఏఏతో సంబంధమే లేదు’

దిల్లీలోని జామా మసీదు వద్ద శుక్రవారం ప్రార్థనల తర్వాత సీఏఏకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ జరిగింది. దిల్లీ గేట్ వద్ద నిరసనకారుల గుంపు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఆందోళన హింసాత్మకంగా మారింది.

జామా మసీదు ఇమామ్ అహ్మద్ బుఖారీ గత మంగళవారమే సీఏఏపై స్పందిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడారు.

ఈ చట్టంతో ముస్లింలకు సంబంధమే లేదని ఆయన అన్నారు. అయితే, నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఉంటుందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని ఆయన చెప్పారు.

నిరసనలు అదుపు తప్పకుండా ఉండటం చాలా ముఖ్యమని, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలని బుఖారీ సూచించారు.

సీఏఏ, ఎన్ఆర్‌సీల మధ్య చాలా తేడా ఉందని ఆయన చెప్పారు. ఎన్ఆర్‌సీ గురించి ఇప్పటికి ప్రకటనే వచ్చిందని, ఇంకా దానిపై చట్టం చేయలేదని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ముప్తీ ముకర్రమ్

‘విద్వేషం లేకపోతే స్థానం ఎందుకు ఇవ్వలేదు’

ఫతేహ్‌పురి మసీదు ఇమామ్ ముఫ్తీ ముకర్రమ్ అహ్మద్ కూడా ఆందోళనల్లో చోటుచేసుకుంటున్న హింసకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ నిరసనల కారణంగా వర్గాల మధ్య దూరం పెరగకూడదని ఆయన అన్నారు.

అయితే, ముస్లింల్లో సహనం ఇప్పుడు నశిస్తోందని, హక్కుల కోసం వారు నినదిస్తున్నారని ముకర్రమ్ వ్యాఖ్యానించారు.

''సీఏఏ మన రాజ్యాంగానికి విరుద్ధం. హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేసేందుకు దీన్ని తెచ్చారు. ప్రధాని, రాష్ట్రపతి, సుప్రీం కోర్టులపై మాకెలాంటి ఫిర్యాదులూ లేవు. కానీ, కొందరు ఈ దేశ విధానాలను మార్చాలనుకుంటున్నారు. దేశాన్ని విడదీయాలనుకుంటున్నారు. మేం దానికి వ్యతిరేకం'' అని అన్నారు.

సీఏఏ ముస్లిం వ్యతిరేక చట్టం కాకపోతే, అందులో ముస్లింలకు ఎందుకు చోటు లేదని ముకర్రం ప్రశ్నించారు.

''ముస్లింలపై ప్రభుత్వానికి ఏ విద్వేషమూ లేకపోతే, ఆ చట్టంలో ముస్లింలకు ఎందుకు స్థానం లేదు. ఎన్ఆర్‌సీ తేవాలని కూడా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఎన్ఆర్‌సీ తెస్తే.. హిందువులు, ముస్లింలు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు, ఇలా అందరూ లైన్లలో నిల్చోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే, మేం అంతర్జాతీయ వేదికలపైకి వెళ్తాం. ప్రభుత్వ విధానాలను అందరికీ చెప్తాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అజ్మేర్ దర్గా

‘భయాందోళనలు తెలుసుకోవాలి’

ప్రజలను ప్రభుత్వం అక్కునచేర్చుకోవడానికి మతం ఆధారం కాకూడదని రాజస్థాన్‌లోని అజ్మేర్ దర్గా సజ్జాదన్శీ సయ్యద్ జైనుల్ ఆబెదీన్ అలీ ఖాన్ అన్నారు.

సీఏఏను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. హిందువులు, ముస్లింల మధ్య శాంతి కొనసాగాలని, ఎవరికీ అన్యాయం జరగకూడదని అన్నారు.

''పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లకు చెందిన ముస్లింలకు సీఏఏలో చోటు ఇవ్వమని మేం చెప్పట్లేదు. భారత్‌లో, అస్సాంలో ఉన్న ముస్లింల సంగతేంటి? దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలి. దేశంలో అందరి అభిప్రాయాలూ వినాలి. ముస్లింల భయాందోళనలను తెలుసుకోవాలి. నివేదికపై పార్లమెంటులో సమగ్రంగా చర్చించి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి'' అని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఖాలిద్ రషీద్

'ముస్లింలను అవమానించారు'

లఖ్‌నవూలోని ఏశ్బాగ్ ఈద్గా ఇమామ్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ సీఏఏను వ్యతిరేకించారు.

సీఏఏలో చోటు కల్పించకుండా ప్రభుత్వం ముస్లింలను అమమానించిందని ఆయన అన్నారు. ముస్లింలకు ఈ చట్టంలో స్థానం ఇవ్వాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

అయితే, ఆందోళనల్లో హింసకు పాల్పడుతున్నవారికి ఎక్కడ చోటు ఉండకూదని ఖాలిద్ అన్నారు.

''చట్టం గురించి మాట్లాడుతూ, మరో వైపు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమంజసం కాదు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనల్లో అన్ని వర్గాలూ భాగమవుతుండటం మంచి పరిణామం. నిరసనకారులతో ప్రభుత్వం చర్చలు జరపాలి. సీఏఏలో చోటు దక్కించుకోకపోవడానికి ముస్లింలు చేసిన తప్పు ఏంటి?'' అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)