పోలీసులపై సీఏఏ నరసనకారుల దాడి: ''ఆ రాళ్ల దాడిని తప్పించుకుని ప్రాణాలతో బయటపడతామని అనుకోలేదు''

అహ్మదాబాద్ పోలీసులు

అహ్మదాబాద్ నగరంలోని షా-ఎ-ఆలం ప్రాంతంలో గురువారం పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఒక నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులను రాళ్లతో కొట్టారని చెప్తున్నారు.

ఆ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

నిరసనకారులు పోలీసుల మీదకు రాళ్లు విసురుతుండటం.. ఆ తర్వాత పరిస్థితిని అదుపులోకి తీసుకురావటానికి పోలీసులు లాఠీ చార్జి, టియర్ గ్యాస్ ఉపయోగించాల్సి రావటం అందులో కనిపిస్తుంది.

నిరసనకారులు పోలీసు వాహనాల మీదకు కూడా రాళ్లు విసరటాన్ని ఆ వీడియోలో చూడవచ్చు.

పోలీసుల మీద ఆ బృందం దాడిచేస్తున్నపుడు షా-ఎ-ఆలం ప్రాంతంలోని కొంత మంది జనం పోలీసులకు సాయం చేయటానికి ముందుకు వచ్చారు.

అయితే.. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వార్తా కథనం ప్రకారం.. ఆ ఘర్షణలో పోలీసులు సహా 30 మంది గాయపడ్డారు. గాయపడిన పోలీసుల్లో డీసీపీ, ఏసీపీ, పోలీస్ ఇన్‌స్పెక్టర్ ర్యాంకుల అధికారులు కూడా ఉన్నారు.

పోలీసులు సుమారు 30 మంది నిరసనకారులను నిర్బంధించిన అనంతరం ''ఆగ్రహించిన ఒక గుంపు'' పోలీసు వాహనాలను చుట్టుముట్టిందని చెప్తున్నారనేది ఆ వార్తాపత్రిక కథనం.

అహ్మదాబాద్ పోలీసుల్లో గాయపడిన వారిని బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. అహ్మదాబాద్ పోలీస్ అధికారి జె.ఎం.సోలంకితో బీబీసీ ప్రతినిధి సాగర్ పటేల్ మాట్లాడారు. షా-ఎ-ఆలం వద్ద గురువారం జరిగిన హింసలో సోలంకి తలకు గాయాలయ్యాయి.

ఫొటో సోర్స్, KALPIT BHACHECH / BBC

ఫొటో క్యాప్షన్,

రాజేంద్ర సింగ్ రాణా

''గురువారం నాడు 'అహ్మదాబాద్ బంద్' పాటించాలని పిలుపునిచ్చారు. కాబట్టి ఉదయం 8 గంటల నుంచే పోలీసు సిబ్బందిని మోహరించాం'' అని ఆయన చెప్పారు.

''సమావేశం కోసం అనుమతి ఇవ్వాలని కోరారు. దానిని తిరస్కరించారు. అయితే చట్టవ్యతిరేకంగా సమావేశమయ్యే అవకాశాన్ని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశాం'' అని వివరించారు.

''గురువారం సాయంత్రం 5 గంటలకు ఆ గుంపు షా-ఎ-ఆలం దర్గా నుంచి బయలుదేరి రోడ్డు మీదకు దూసుకురావటం మొదలైంది. శాంతియుతంగా చెదిరిపోవాలని మేం సూచించాం. పోలీసులు నిర్బంధించిన వారిని వాళ్లు తమతో తీసుకెళ్తున్నారు. నిర్బంధించిన వారిని సూపరింటెండెంట్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ గుంపు పోలీసుల మీదకు రాళ్లు రువ్వింది'' అని చెప్పారు.

తన తలకు అయిన గాయం గురించి చెప్తూ.. ''చెదిరిపోవాలని.. పోలీసు కారు ముందు బైఠాయించిన మహిళలను తరలించటానికి మహిళా పోలీసులకు సాయపడాలని ఆ గుంపుకు నేను వివరిస్తున్నాను.. అకస్మాత్తుగా నా తలకు ఒక రాయి తగిలింది'' అని పేర్కొన్నారు.

ఆ రాళ్ల దాడిలో పోలీస్ కాన్వాయ్‌లో ఏసీపీ, డీసీపీ సహా 26 మంది గాయపడ్డారని చెప్పారు.

హింసను, వదంతుల వ్యాప్తిని అరికట్టడానికి శుక్రవారం నాడు కూడా పోలీసులను మోహరించారు.

సోలంకి తాను గాయపడ్డ ప్రాంతంలో శుక్రవారం మళ్లీ విధులకు హాజరయ్యారు. ''ప్రజలకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని.. పోలీసులకు సహకరించాలని మేం చెప్తున్నాం'' అన్నారాయన.

‘సీసీటీవీ దృశ్యాల ద్వారా నిందితులను గుర్తిస్తాం’

ఇదిలావుంటే.. ''డీసీపీ బిపిన్‌తో కలిసి షా-ఎ-ఆలం చేరుకున్నారు పోలీసులు. కానీ, వాళ్లు వెంటనే రాళ్లు రువ్వటం మొదలుపెట్టారు. పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి'' అని మరో పోలీసు అధికారి రాజేంద్రసింగ్ రాణా చెప్పారు.

రాళ్లు రువ్వుతున్న వారిని నిలువరించటానికి స్థానికులు ప్రయత్నిస్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఆ వీడియో ద్వారా నిందితులను గుర్తించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని రాణా తెలిపారు.

''బతికి బయటపడతాం అనుకోలేదు''

మరో పోలీసు అధికారి ఖుమాన్‌సిన్హ్ వాఘాలే వీపు మీద, చేతుల మీద గాయాలతో ఆస్పత్రిలో చేరారు.

బీబీసీ ప్రతినిధి తేజాస్ వైద్యతో ఆయన మాట్లాడుతూ.. ''నేను షా-ఎ-ఆలం దర్గా గేటు దగ్గర విధుల్లో ఉన్నాను. సాయంత్రం 5 గంటలు దాటి 5 నిమిషాలైంది. దర్గా దగ్గర సమావేశమైన జనం అకస్మాత్తుగా ఒక పోస్టరును పట్టుకుని బయటకు వచ్చారు'' అని చెప్పారు.

''అధికారులందరూ కూడా అక్కడున్నారు. మేం నిరసనకారులను పట్టుకుని పోలీసు వాహనాల్లోకి ఎక్కించాం. ఆ గుంపు ముందస్తు ఏర్పాట్లతో వచ్చింది. ముందుగా సిద్ధం చేసుకోకపోతే అకస్మాత్తుగా అన్ని రాళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్లు పోలీసుల మీద దాడి చేయటానికి ముందుగానే సిద్ధమయ్యారు'' అని ఆయన పేర్కొన్నారు.

''రాళ్ల దాడి ఎంత తీవ్రంగా ఉందంటే.. నేను పక్కనే ఉన్న కుర్చీని అడ్డు పెట్టుకున్నాను. ఒక రాయి ఆ కుర్చీని కూడా పగులగొట్టింది. జనం పారిపోవటం మొదలుపెట్టారు. మా దగ్గర లాఠీలు, హెల్మెట్లు ఉన్నాకూడా పరిస్థితి భీకరంగా మారిపోయింది. వాళ్లు మాకు అవకాశమే ఇవ్వలేదు. మేం ఇక మా పని అయిపోయిందని అనుకున్నాం'' అని వివరించారు.

ఫొటో క్యాప్షన్,

ఖుమాన్‌సిన్హ్

'శాంతియుత ప్రదర్శన కోసమే ప్రణాళిక'

''పోలీసులు తమ కుటుంబాన్ని చూడరు.. ఏ పండగలకూ ఇంటికి వెళ్లరు. ఎప్పుడూ ప్రజలకు సేవ చేయటానికి సిద్ధంగా ఉంటారు. పోలీసుల మీద ఇటువంటి దాడి జరిగితే.. అటువంటి జనం ఉండటం సిగ్గుచేటు'' అని ఖుమాన్‌సిన్హ్ వ్యాఖ్యానించారు.

ఈ అంశం గురించి స్థానికుడైన షకీల్ ఖురేషి బీబీసీతో మాట్లాడుతూ.. ''ఆ రోజు మొత్తం మేం శాంతియుతంగా నిరసన తెలిపాం. సాయంత్రం 5:30 నుంచి 6:00 గంటల సమయంలో మేం దర్గా దగ్గర సమావేశమయ్యాం'' అని చెప్పారు.

''మేం శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాం. కానీ పోలీసులు మమ్మల్ని వెళ్లనివ్వలేదు. మా నాయకులను అరెస్ట్ చేశారు. మా మీద లాఠీ చార్జి చేశారు. చాలా మంది గాయపడ్డారు'' అని పేర్కొన్నారు.

''ఇది మతం గురించి కాదు. ఇది చట్టానికి సంబంధించిన విషయం. ఇక్కడ శాంతియుత నిరసన జరుగుతుందన్న సమాచారం ముందు ఉంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''మేం ఒక స్థలాన్ని నిర్ణయించాం. మేం సమావేశమైనపుడు.. మా నాయకుడు సన్నీ బాబాను అరెస్ట్ చేశారు. దానిని మేం వ్యతిరేకించాం. దీంతో పోలీసులు మా మీద లాఠీచార్జి చేశారు'' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)