CAA నిరసనలపై నరేంద్ర మోదీ: “కాంగ్రెస్‌, అర్బన్ నక్సలైట్లు వదంతులు వ్యాప్తి చేస్తున్నారు”

నరేంద్ర మోదీ సభ

ఫొటో సోర్స్, Twitter/Narendra Modi

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వస్తున్న నిరసనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దిల్లీ రాంలీలా మైదాన్‌లో జరుగుతున్న సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.

పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకతలు వస్తున్న సమయంలో ప్రధాని ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు.

"భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం ప్రత్యేకత" అని అందరితో మోదీ నినాదాలు చేయించారు.

"కొంతమంది దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. పేదలకు ఇళ్లు కట్టించే మా ప్రభుత్వం వారిని మీది ఏ మతం అని అడగలేదు" అని మోదీ అన్నారు.

కాంగ్రెస్ పార్టీ, అర్బన్ నక్సలైట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మోదీ ఆరోపించారు.

"నగరాల్లో ఉంటున్న కొంతమంది చదువుకున్న నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్లు ముస్లింలందరినీ డిటెన్షన్ సెంటర్లకు పంపిస్తారని వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఈ డిటెన్షన్ సెంటర్ అంటే ఏంటని చదువుకున్న వాళ్లు కూడా అడుగుతుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. రాజ్యాంగ సవరణ, ఎన్ఆర్సీ అంటే ఏంటో మరోసారి చదవండి. కాంగ్రెస్, అర్బన్ నక్సలైట్లు వ్యాప్తి చేస్తున్న వదంతులు పూర్తిగా అబద్ధం. దేశాన్ని నాశనం చేయాలనే దురుద్దేశంతోనే వారు ఇలా చేస్తున్నారు" అని మోదీ అన్నారు.

"ఎన్నార్సీ కాంగ్రెస్ సమయంలోనే వచ్చింది. అప్పుడు వాళ్లు నిద్రపోతున్నారా? మేం ఎన్నార్సీని కాబినెట్లో గానీ, పార్లమెంటుకు గానీ తీసుకురాలేదు. మీకు యాజమాన్య హక్కులు ఇవ్వడానికి మేం చట్టం ఆమోదించితే, అదే సెషన్లో మిమ్మల్ని బయట పంపించడానికి మేం చట్టం కూడా తీసుకువస్తామా?"

"ఒక చిన్న వ్యత్యాసం ఉంది. చొరబాటుదారులు ఎప్పుడూ తమ గుర్తింపు బయటపెట్టరు. శరణార్థి ఎప్పుడూ తన గుర్తింపు దాచుకోడు. ఈ చొరబాటుదారుల్లో చాలా మంది బయటికొచ్చి మాట్లాడుతున్నారు. వాళ్లు నిజం ఎందుకు మాట్లాడ్డం లేదు. వాస్తవాలు బయటికి వస్తాయని వాళ్లు భయపడుతున్నారు" అని మోదీ అన్నారు.

"రెండు వారాల క్రితం దిల్లీలోని మజ్నూ బస్తీలో పుట్టిన బాలికకు నాగరికత(పౌరసత్వం) అని పేరు పెట్టారు. నాగరికత, ఆమె తల్లిదండ్రులకు జీవితాలు బాగానే ఉన్నప్పుడు, దేశ పౌరుల సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు, మీకు బాధ ఎందుకు?" అని ప్రధాని ప్రశ్నించారు.

బహిరంగ సభలో ప్రధాని చివరగా "మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఒక వారం పాటు అక్కడంతా శుభ్రం చేసే కార్యక్రమాలు చేపట్టాలని" దిల్లీ ప్రజలను కోరారు.

పరిశుభ్రంగా ఉన్న దిల్లీతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని, అదే విధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి కూడా దిల్లీకి విముక్తి కల్పించే దిశగా అందరూ పనిచేయాలని అన్నారు.

రాజధాని దిల్లీని మరింత అందంగా తీర్చిదిద్దాలని సూచించారు.

ప్రధానమంత్రి మోదీ ర్యాలీని దిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఎన్నికల ప్రచార సభగా చూస్తున్నారు.

మోదీ ప్రసంగంపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఒక ట్వీట్ చేశారు.

నరేంద్రమోదీ సర్ నుంచి నేను ఆలోచన రేకెత్తించే ప్రసంగాన్ని వింటున్నాను అని సైనా తన ట్వీట్‌లో చెప్పారు.

మోదీ ఆరోపణలకు కాంగ్రెస్ సమాధానం

మోదీ ఆరోపణలకు సమాధానంగా కాంగ్రెస్ ఈ ఏడాది శీతాకాల సమావేశాలకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో "ఎన్ఆర్సీ ప్రక్రియ అస్సాం సహా దేశమంతటా ఉంటుందని" హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో చెబుతుంటారు.

"అస్సాం ఒప్పందం ప్రకారం ఎన్ఆర్సీని అస్సాంలో మాత్రమే అమలు చేయాలని కాంగ్రెస్ ఆలోచించింది. అస్సాంలోకి అక్రమంగా వలస వచ్చినవారు ఏ మతం వారైనా, వారిని బయటకు పంపిస్తాం అని అందులో స్పష్టంగా చెప్పాం. కానీ బీజేపీ దేశమంతటా ఎన్ఆర్సీ తీసుకురావాలని అనుకుంటోంది. దానిని పార్లమెంటులో ప్రకటించడమే కాదు, చాలా ప్రసంగాల్లో చెప్పారు" అని తమ అధికారిక ట్విటర్ హాండిల్లో ట్వీట్ చేసింది.

నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు భారతదేశ యువత భవిష్యత్‌ను ధ్వంసం చేశారని రాహుల్‌గాంధీ విమర్శించారు. నిరుద్యోగంపై ప్రజల ఆగ్రహాన్ని వాళ్లు ఎదుర్కోలేకపోతున్నారని ట్వీట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌ బిజ్‌నౌర్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో చనిపోయిన అనాస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పరామర్శించారు. డిసెంబర్ 20న బిజ్‌నౌర్‌లో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)