ఈ దేశంలో పౌరులు కాదు, తమ ఓటర్లు మాత్రమే ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోంది: అభిప్రాయం

  • కుమార్ ప్రశాంత్
  • బీబీసీ కోసం
నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు మొత్తం దేశం రోడ్లపైకి వచ్చింది. ఈ సన్నివేశం చాలా వింతగా, ఇబ్బందికరంగా కనిపిస్తోంది.

దేశాన్ని ఏ పౌరులు బానిసత్వం నుంచి విముక్తి కలిగించారో, ఏ పౌరులు తమ దేశంలో తమదైన ప్రజాస్వామ్యం నిర్మించుకున్నారో, ఎవరైతే ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలను గద్దెనెక్కించి, కూల్చారో ఆ పౌరులు ఎన్నుకున్న ప్రభుత్వం ఇప్పుడు వారినే చట్టబద్ధత అడుగుతోంది. వారిని చట్టవిరుద్ధంగా మార్చే చట్టాన్ని రూపొందించింది.

కొందరు నౌకర్లు (ప్రధాన సేవకులు) యజమానిని నిర్ణయించే హక్కును తమ చేతుల్లోకి తీసుకుంటే తప్పేమీ లేదంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అత్యంత సున్నితమైన సమయం. ఇలాంటి సున్నితమైన సమయం ఎప్పుడొస్తుందంటే, ప్రభుత్వం రాజ్యాంగం నుంచి ముఖం తిప్పుకున్నప్పుడు, చట్టసభలు చట్టంతో కాకుండా సంఖ్యాబలంతో ఏకపక్షంగా వ్యవహరించినపుడు. అధికార యంత్రాంగం వంగి వంగి దండాలు పెట్టే దళంగా మారినప్పుడు, న్యాయవ్యవస్థ న్యాయాన్ని అనుసరించకుండా, మిగతా అన్నీ చేస్తున్నప్పడు, భారత్ ఇలాంటి కూడలిలోనే నిలబడుతుంది.

ఇదెలా ఉందంటే, ప్రభుత్వం దేశాన్ని జట్టులా మార్చేసింది. లోక్‌సభలో లభించిన మెజారిటీని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే లైసెన్సుగా మార్చేసుకుంది.

మెజారిటీని అంతిమ సత్యంగా భావించే ప్రభుత్వాలకు వాటి గొంతు మాత్రమే వినిపిస్తుంటుంది. వాటి ముఖమే కనిపిస్తుంటుంది. ప్రభుత్వమే ప్రజలు కాదని, ప్రజల వల్లే ప్రభుత్వం ఏర్పడిందని మర్చిపోతుంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చవచ్చు. కానీ, ప్రభుత్వం తను కోరుకున్నా పౌరులను మార్చలేదు.

ఫొటో సోర్స్, Getty Images

పౌరులను తాము తిరస్కరించలేమని, పౌరులు అనుకుంటే తమను ఇప్పటికిప్పుడే తిరస్కరించగలరని ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

మన రాజ్యాంగం మనకు పౌరసత్వ భావనను అందించింది. భారతదేశంలో జన్మించిన వ్యక్తి ఈ దేశ పౌరుడు అని చెబుతుంది.

అదే రాజ్యాంగం, ఎవరు ఎక్కడ జన్మించినా, వారు ఈ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేసుకుంటే, రాజ్యాంగబద్ధమైన ఏ వ్యవస్థనూ అది ఉల్లంఘించకపోతే, ప్రభుత్వం వారికి పౌరసత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది అని చెబుతుంది.

ప్రభుత్వం అలా చేస్తున్నప్పుడు వారి లింగ, మత, జాతి, రంగు, దేశం లాంటి ఏ వివక్షనూ చూపకూడదు.

పౌరసత్వం ఉల్లంఘించలేనిది, పౌరుడు స్వయంగా ఆవిర్భవిస్తాడు. అలాంటి పౌరులతో తయారైన దేశం లేదా సమాజం ఒక వ్యక్తి, పార్టీ, సంస్థ, కూటమి కంటే పెద్దదిగా ఉంటుంది. చాలా పెద్దదిగా ఉంటుంది.

అందుకే పౌరులను ధ్రువీకరించే హక్కును ప్రభుత్వం స్వయంగా చేజిక్కించుకుంది. ప్రజాస్వామ్య, రాజ్యాంగ, పౌరుల నైతికత, సామాజిక బాధ్యతలకు అది విరుద్ధం.

మనం చరిత్రలో చూస్తే 1925 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించినప్పటి నుంచి, నేరుగా, ఒక స్పష్టమైన దృక్పథం కనిపిస్తుంది. అది హిందుత్వ అనేది తమ విజన్ అని చెబుతుంది. ఈ దేశాన్ని హిందూ దేశంగా చేసి తీరతామని వాదిస్తుంది.

ఫొటో సోర్స్, Pti

వినాయక్ దామోదర్ సావర్కర్, కేశవ్ బలిరామ్ హెడ్గేవార్, మాధవ్ సదాశివ్ గోల్వల్కర్ లాంటి వారి స్ఫూర్తితో, వ్యవస్థీకృతంగా నడిచే ఈ సంస్థ, తన పుట్టుక నుంచీ నిరంతరం మహాత్మాగాంధీ నుంచి అతిపెద్ద సవాలును ఎదుర్కొంటూ వచ్చింది.

మహాత్మాగాంధీ భారత స్వతంత్ర పోరాటంలో అతిపెద్ద దళపతి మాత్రమే కాదు, భారత సమాజానికి కొత్త దార్శనికులు కూడా.

ఆయన తనను హిందువుగా, సనాతన హిందువుగా చెప్పుకునేవారు. కానీ హిందుత్వ సంఘ్-పరివార్ విజన్‌లోని ఏ అంశాన్నీ అంగీకరించేవారు కాదు.

గాంధీకి నేరుగా సవాలు విసిరి, తమలో కలుపేసుకునే ప్రయత్నాలు చేసి, ఆయనపై కుట్రలు చేసి, ఎన్ని రకాలుగా ఎన్ని సార్లు ప్రయత్నించినా గాంధీ వారి చేతికి చిక్కలేదు. భారత ప్రజల్లో పెరుగుతున్న ఆయన ప్రభావాన్ని, పట్టును అడ్డుకోడానికి ఏ దారీ కనిపించకపోవడంతో, చివరికి ఆయన్నే అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది.

ఆ నిర్ణయంతోనే ఐదు విఫలయత్నాల తర్వాత 1948 జనవరి 30న సఫలం కాగలిగారు. గాంధీ హత్య జరిగింది.

ఈ హత్యతో దేశం అల్లకల్లోలంగా మారితే, ఆ ముసుగులో హిందుత్వవాద శక్తులు అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు అనేదే ఈ హత్య వెనుక వారి ప్రణాళిక. హిందుత్వ అనే వారి భావన అధికారం లేకుంటే సాకారం కాదు. అందుకే అధికారం కోసం వారు ఎప్పటినుంచో అన్వేషిస్తున్నారు.

గాంధీజీని హత్య చేశారు. కానీ, దేశంలో ఎలాంటి అల్లకల్లోలం ఏర్పడలేదు. ఆ ముసుగులో అధికారం అందుకునేంతగా ఏదీ జరగలేదు. జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ దేశాన్ని ఆ అల్లకల్లోల స్థితి నుంచి కాపాడారు. బయటకూడా పడేశారు. అందుకే నెహ్రూ వారికి లక్ష్యంగా మారారు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ హిందుత్వ అనే ఈ అంశం సమాజంలో ఏ స్థాయికి చేరాలని కోరుకుందో, అంత చోటు సంపాదించలేకపోయింది. తమ ఎజెండా ప్రకారం భారత్‌ను నిర్మించేలా వారికి అధికారంపై ఎప్పుడూ ఎలాంటి పట్టు లేకుండాపోయింది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదేళ్లు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అది జరిగుండచ్చు. కానీ, అటల్ 'చిన్న నెహ్రూ' అనే పేరును తొలగించుకోడానికి సిద్ధం కాలేదు. సంఘ్ హిందుత్వ ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ వచ్చారు.

అందుకే అటల్ పాలన సంఘ్ హిందుత్వకు బలం కాకుండా, గ్రౌండ్ సిద్ధం చేసిన కాలంలా మారింది. దానికి అతిపెద్ద ప్రయోగశాలను నరేంద్రమోదీ గుజరాత్‌లో ప్రారంభించారు. అధికారం అండతో హిందుత్వను స్థాపించే ఆ ప్రయోగంలో సంఘ్, మోదీ ఇద్దరూ విజయం సాధించారు. ఇద్దరి కళ్లూ తెరుచుకున్నాయి.

ఫొటో సోర్స్, Nurphoto

తర్వాత, కాంగ్రెస్ అన్నిరకాల అసమర్థతల వల్ల దిల్లీ నరేంద్ర మోదీ చేతికి చిక్కింది.

అప్పటి నుంచి ఇప్పటివరకూ 1925లో అసంపూర్తిగా మిగిలిపోయిన అదే హిందుత్వ ఎజెండాను దిల్లీ నుంచి నడిపిస్తున్నారు.

ఇప్పుడు ప్రజాస్వామ్య రాజకీయాల్లో అధికారంపై ఎలాంటి నమ్మకం పెట్టుకోలేమని వీరు తెలుసుకున్నారు. అందుకే తమ ఆ ఎజెండాను పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. దానివల్ల ప్రజాస్వామ్యం తలకిందులయ్యే అవకాశానికి తెరపడుతుంది. అధికారం వారి చేతుల్లోనే స్థిరంగా ఉంటుంది.

నోట్లరద్దు నుంచి జాతీయ పౌరసత్వ జాబితా వరకు మొత్తం ఆట పౌరుల బలాన్ని ముక్కలు చేయడం, రాజ్యాంగాన్ని పనికిరాకుండా చేయడం, రాజ్యాంగ సంస్థలను ప్రభుత్వం తోలు బొమ్మలుగా మార్చడం తప్ప మరొకటి కాదు.

భారత అతిపెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ దురదృష్టం ఏంటంటే దానికి అధికార దాహం ఎక్కువ. అధికారం పోతే అది జబ్బు పడుతుంది. ఇందిరాగాంధీ ఆ పార్టీ చివరి నేత, ఆమె దగ్గర రాజకీయ నాయకత్వం అనే విషయం ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ తన నీడతోనే పోరాటం చేస్తోంది. బలహీనపడుతున్న ఇలాంటి పార్టీకి ఇప్పుడు రాజకీయ ఎజెండాను మోదీనే నిర్ణయిస్తారు.

విపక్షాలలో మిగతా అన్ని పార్టీలకూ అధికార పంపిణీలో తమ వాటాను దక్కించుకోవడం మించి ఎక్కువ స్థాయి లేదు, అలాంటి కలలు కూడా రావు. అలాంటప్పుడు భారత ప్రజాస్వామ్యంలో విపక్షం ఎక్కడుంది? అది పార్లమెంటులో లేదు, రోడ్లపై ఉంది. ఇప్పుడు యువత, పౌరులే భారత ప్రజాస్వామ్యంలో విపక్షాలు. ప్రజాస్వామ్యం ప్రజల్లోకి వస్తోంది అనే విషయం ఆశ కలిగించేది, పరవశం కలిగించేది కూడా.

మన రాజ్యాంగంలోని మొదటి అధ్యాయం అదే చెబుతుంది. రోడ్లపైకి వచ్చిన ప్రజలు రాజ్యాంగంలోని అదే విషయాన్ని మాటిమాటికీ చెబుతున్నారు. రోడ్లపైకి వచ్చిన యువకులు, విద్యార్థులు, పౌరుల్లో అన్ని జాతులు, మతాల వారూ ఉన్నారు.

సీఏఏ ఏ విధంగానూ ముస్లింలకు ప్రశ్న కాదు. కానీ వారు మొట్టమొదటిసారి లక్ష్యంగా మారారు. ఎందుకంటే మిగతా అన్ని విభేదాలను టార్గెట్ చేసుకునే పాత్ర దీనితోనే వస్తుంది.

లాఠీ, బుల్లెట్, టియర్ గ్యాస్ ప్రయోగం మధ్య రహదారులపై భారతదేశంలోని ప్రతి పౌరుడు గొంతు నుంచి... తమ పౌరసత్వాన్ని గౌరవంగా, హక్కుగా భావిస్తాం అనే వినిపిస్తోంది. ఏ ప్రభుత్వం అయినా, ఒకరి పౌరసత్వాన్ని నిర్ణయించడం, అనేది మాకు అంగీకారం కాదు అని చెబుతున్నారు. అందుకే ప్రభుత్వాలు ఏ రాజ్యాంగంలో తాత్కాలిక కూర్పులు చేస్తాయో, ప్రజలు ఆ రాజ్యాంగ రచయితలు, దానికి శాశ్వత రక్షకులు కూడా.

ప్రభుత్వాలు స్వార్థం, అవినీతి, సంకుచిత మనస్తత్వం ఉన్నవి కావచ్చు. సంప్రదాయికంగా, జాత్యహంకారంతో ఉండచ్చు. ప్రభుత్వాలు అవకాశవాదంతో కూడా ఉండచ్చు, రంగులు కూడా మార్చచ్చు, ఆ విషయం ఎవరినుంచీ దాగదు.

ప్రభుత్వం రాజ్యాంగం ద్వారానే ఏర్పడుతుంది. కానీ రాజ్యాంగాన్ని గౌరవించదు. వీరంతా ఓట్లతో అధికారంలోకి వస్తారు. కానీ ఓటరును అవహేళన చేస్తారు. అబద్ధాన్ని ఆయుధంగా చేసుకుని చరిత్రను ముక్కలు ముక్కలు చేసి తమకు ఇష్టమొచ్చినట్లు ఉపయోగించాలనుకుంటుంది.

ఫొటో సోర్స్, Reuters

ఈరోజు అది మన పౌరసత్వంతో ఆటలాడాలనుకుంటోంది. రేపు మనతోనే ఆడుకుంటుంది. ప్రభుత్వం ఈ దేశంలో పౌరులు కాదు, వారి ఓటర్లు మాత్రమే ఉండాలని అనుకుంటోంది. అధికార ఆటలో ఈ సమాజాన్ని తోలుబొమ్మలుగా మార్చాలనుకుంటోంది. అందుకే రోడ్లపై యుద్ధం జరుగుతోంది. పార్లమెంటు నోటిమాట పడిపోయి, వ్యవస్థ గుడ్డిదైనప్పుడు రహదారులు యుద్ధ మైదానాలుగా మారతాయి.

ఏ సమాజం తమ హక్కుల కోసం పోరాడదో, వారు పిరికివాళ్లవుతారు, త్వరలో చెల్లాచెదురు కూడా అవుతారు. కానీ మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. హింస ఎప్పుడూ ఆత్మహత్యలా మారుతుంది.

ప్రైవేటు అయినా పబ్లిక్ అయినా, ఏ ఆస్తిని ధ్వంసం చేసినా, అది నిజానికి మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కోవడం లాంటిది. పోరాటం వ్యవస్థతో అయితే అప్పుడు వ్యక్తి ద్వితీయం అవుతాడు. పౌరసత్వాన్ని నిర్ణయించే తమ చర్యలు వెనక్కు తీసుకోమని ప్రభుత్వానికి చెప్పాలి, లేదంటే దానికి అర్థమయ్యేలా చేయాలి.

దేశంలో చొరబాటుదారులతో సమస్య అయితే, తమ వ్యవస్థను చురుగ్గా చేసే బాధ్యత ప్రభుత్వానిది, కేవలం ప్రభుత్వానిదే. చొరబాటుదారులు బిలాల్లోంచి దేశంలోకి ప్రవేశించరు. వారు వ్యవస్థలోని బలహీనతల్లోకి ప్రవేశిస్తారు.

గోడ బలహీనంగా ఉన్నప్పుడే కన్నం వేయవచ్చనే విషయం వారికి తెలుసు. అందుకే, మీరు ప్రభుత్వంగా ఉండాలి.. కుట్రదారులుగా కాదు. మీరు మీ బలహీనతలు దూరం చేసుకోవాలి... పౌరులను బలహీనం చేయకూడదు.

కొన్ని రోజుల క్రితమే యూనిఫాం వేసుకున్న పోలీసులు రాజధాని దిల్లీ రోడ్లపై ఆందోళనకారులుగా కనిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారులను దిగ్బంధించారు.

ఫొటో సోర్స్, Getty Images

అప్పడు వారు వకీళ్లను ఎదుర్కోడానికి ప్రజల మద్దతు కోరుకున్నారు. అప్పుడు ఎవరూ వారిపై టియర్ గ్యాస్, బుల్లెట్లు ప్రయోగించలేదు ఎందుకు? లాఠీలు లేవా, నీళ్ల కత్తులు దూయలేరా? వేరే ఏ వేదికపైనా తమ గురించి వినిపించనప్పుడు, వారు తమ మాట చెప్పడానికి రోడ్లపైకి వచ్చారని పౌరులు ఒకే గొంతుతో చెప్పారు.

పోలీసులను కూడా అలాగే అర్థం చేసుకోవాలి. పోలీసులకు పౌరుల నుంచి ఎలాంటి మద్దతు లభించిందో, పౌరులకు కూడా పోలీసుల నుంచి అలాంటి మద్దతే లభించాలి కదా. ఈరోజు పోలీసులు పౌరులతో ఎలా ప్రవర్తిస్తున్నారంటే, వారు తమ శత్రువులను ఎదుర్కొంటున్నట్లు ఉంది.

పోలీసులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీల కార్యకర్తలు, మన, వారి అమ్మనాన్నలు కూడా ఈ పోరాటం పౌరసత్వాన్ని కాపాడుకునే యుద్ధం అని అర్థం చేసుకోవాలి. అందుకే హింస కాదు.. ధైర్యం కావాలి. బుల్లెట్లు కాదు.. సైద్ధాంతిక నినాదాలు కావాలి. రాళ్లు రువ్వడం కాదు... దృఢమైన సమ్మె చేయాలి. గాడ్సే కాదు.. గాంధీలా మారాలి. పారిపోవడం కాదు.. మార్చడానికి చూడాలి. భయపడకూడదు.. పోరాడాలి. ఓటమి కాదు.. గెలవాలి. గుంపును చూసి భయపడేలా కాదు.. మీరు శాంతి శక్తిగా మారాలి. పౌరులకు అతిపెద్ద బలం సంకల్ప బలమే.

వారు ఆ బలాన్ని, సంయమనాన్ని కోల్పోకూడదు. అప్పుడే ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. ప్రభుత్వం అర్థం చేసుకుని తమ అడుగు వెనక్కు తీసుకుంటే, మన ప్రజాస్వామ్యం అత్యంత బలంగా ఆవిర్భవిస్తుంది.

ఫొటో సోర్స్, EPA

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)