అయిదు మైళ్ల అవతల పొరుగు దేశంలో ఉన్న భార్యను కలవాలని పన్నెండేళ్లు తపించాడు.. చివరకు నదిలో కొట్టుకొచ్చిన ఆమె శవాన్ని చూశాడు

  • అమీర్ పీర్జాదా, ఫర్హాత్ జావేద్
  • బీబీసీ ప్రతినిధులు
గులామ్ ఖాదిర్

భారత్, పాకిస్తాన్‌ల మధ్య 1971లో యుద్ధం జరిగి దాదాపు 50 ఏళ్లవుతోంది. కానీ, ఆ నాటి యుద్ధం వల్ల తలో దిక్కున మిగిలి చెల్లాచెదురైన కుటుంబాలు మాత్రం ఇంకా కోలుకోలేకపోతున్నాయి.

రెండు అణ్వస్త్ర దేశాల మధ్య జరిగిన ఆ యుద్ధం 13 రోజుల పాటు సాగింది. యుద్ధంలో ఎంతోమంది మరణించడమే కాదు.. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి.

అలాంటి కొన్ని కుటుంబాల కథే ఇది.. అప్పుడు విడిపోయిన ఆ కుటుంబసభ్యులు ఇప్పటివరకు మళ్లీ కలుసుకోలేకపోయిన వ్యధార్థ గాథ ఇది.

ప్రస్తుతం భారత్‌లో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన లద్ధాఖ్‌లో బాగా ఉత్తరాన ఉన్న తుర్‌తుక్, త్యాక్సీ, చలాంకా, థాంగ్‌లు 1971 యుద్ధానికి ముందు పాకిస్తాన్‌‌లో ఉండేవి. ఆ యుద్ధంలో భారత్ వాటిని తన పాలనలోకి తీసుకుంది.

కారకోరం పర్వత శ్రేణుల అంచున, ష్యోక్ నది వెంబడి ఈ చిన్న గ్రామాలున్నాయి.

లద్ధాక్.. బౌద్ధులు ఎక్కువగా ఉండే పట్టణం.. ఈ నాలుగు గ్రామాల ప్రజలు మాత్రం బాల్తీ భాష మాట్లాడే ముస్లింలు.

1971 వరకు ఈ నాలుగు గ్రామాలు పాకిస్తాన్‌లో భాగం. ఆ యుద్ధం తరువాత భారత్‌లో భాగమయ్యాయి.

2010 వరకు ఈ గ్రామాల్లోకి ఇతర ప్రాంతాలవారు వెళ్లేందుకు అనుమతించేవారు కాదు. 2010లో తొలిసారి తుర్‌తుక్‌లోకి పర్యటకులను అనుమతించారు.

ఆ యుద్ధం సమయంలో ఎన్ని కుటుంబాలు, ఎంతమంది విడిపోయారన్న సంఖ్య విషయంలో స్పష్టత లేనప్పటికీ ఈ గ్రామాల ప్రజలు మాత్రం 250కి పైగా కుటుంబాలు విడిపోయాయని చెబుతున్నారు.

ఇలా విడిపోయిన కుటుంబాల్లోని సభ్యుల్లో కొందరు పాకిస్తాన్‌లో ఉండిపోగా మరికొందరు అప్పటికి గ్రామంలో ఉండడం వల్ల భారత్‌లో ఉండిపోయారు. ఆ తరువాత రెండువైపుల ఉన్నవారూ ఎన్నిసార్లు వీసాల కోసం ప్రయత్నించినా రెండు దేశాలూ వారివారి వీసాలను తిరస్కరిస్తూ వస్తున్నాయి.

అయితే, ఇప్పటివరకు ఇలాంటివారిలో కేవలం 23 మందికి వీసాలు దొరకడంతో విడిపోయిన తమ కుటుంబసభ్యులను కలుసుకోగలిగారు.

ఫొటో క్యాప్షన్,

ష్యోకో నది

అయిదు మైళ్ల దూరంలోనే ఉన్నా 50 ఏళ్లుగా కలుసుకోలేని కుటుంబాలు

భారత్‌లో ఉన్న ఈ నాలుగు గ్రామాల్లోని వారు పాకిస్తాన్‌లోని తమవారిని కలుసుకునేందుకు ఆ దేశ వీసా పొందినప్పటికీ వారు తొలుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలోకి వెళ్లాలి. అక్కడి నుంచి మళ్లీ పాకిస్తాన్‌లోనే ఉన్న బాల్టిస్తాన్ ప్రాంతానికి వెళ్లాలంటే మరోమారు ఆ దేశ అనుమతులు అవసరం. అక్కడ వారికి ఆటంకాలు ఎదురవుతున్నాయి.

అంతేకాదు.. ఈ నాలుగు గ్రామాల ప్రజలు సాధారణ రైతులు కావడంతో ఇదంతా చేయడానికి వారి ఆర్థిక పరిస్థితులూ అనుకూలంగా లేవు.

నిజానికి విడిపోయిన వారి కుటుంబసభ్యులు గట్టిగా 5 మైళ్ల దూరంలోనే ఉంటున్నప్పటికీ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దులు కారణంగా ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి.

ప్రపంచం కుగ్రామంలా మారిపోయిన ఈ రోజుల్లో కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకోవచ్చు కదా అనుకోవచ్చు.. కానీ, భారత్‌లోని కశ్మీర్ ప్రాంతం నుంచి వచ్చే ఎలాంటి కాల్స్‌ను పాకిస్తాన్ అనుమతించదు.. బ్లాక్ చేస్తుంది.

ఈ గ్రామాల్లో ఇంటర్నెట్ అనేది కూడా కలే. పాకిస్తాన్‌లోని తమవారితో మాట్లాడాలంటే వారికున్న ఏకైక మార్గం వాట్సాప్ కాల్. అందుకోసం వారం సమీపంలోని ఏదైనా నగరానికి వెళ్లి అక్కడి నుంచి ఇంటర్నెట్ సహాయంతో వాట్సాప్ కాల్ చేయాలి. పేదరికంలో ఉన్న వీరికి నిత్యం ఈ పనిచేయడం సాధ్యం కాదు.

ఫొటో సోర్స్, Avani roy

ఫొటో క్యాప్షన్,

హబీబా

భారత్‌లో ఉన్నవారేమంటున్నారు?

''మా అన్నను కలిసి 48 ఏళ్లయింది. నేను చనిపోయేలోగా ఆయన్ను కలవాలి'' అంటున్నారు హబీబా బేగమ్. హబీబా వయసు అరవయ్యేళ్లు దాటింది. ఆమె అన్న గులామ్ ఖాదిర్ పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని స్కర్దు ప్రాంతంలో ఉంటారు. ఈమె భారత్‌లోని కశ్మీర్‌లో ఉన్న త్యాక్సి గ్రామంలో ఉన్నారు.

1971 డిసెంబరు 16న త్యాక్సి గ్రామాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది.. అప్పటికి ఖాదిర్ పాక్‌లోనే వేరే ప్రాంతంలో ఉండగా కుటుంబసభ్యులంతా త్యాక్సి గ్రామంలో ఉన్నారు. దాంతో ఖాదిర్ పాకిస్తాన్‌లో ఉండిపోగా ఆయన కుటుంబమంతా భారత్ పాలనలోకి వెళ్లిన త్యాక్సిలో ఉండిపోయింది.

తన అన్న ఖాదిర్ పాకిస్తాన్ సైన్యంలో పనిచేసేవారని.. 1971 యుద్ధం సమయంలో ఆయన వేరే చోట విధుల్లో ఉన్నప్పుడు తమ గ్రామం భారత్ స్వాధీనంలోకి వచ్చిందని హబీబా చెప్పారు.

"ఆ రోజు భారత సైన్యం మా గ్రామాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు మేమంతా ఎంతో భయపడ్డాం. వారు మమ్మల్నేం చేస్తారో అని భయపడ్డాం. కొన్ని రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు కూడా రాలేదు" అని గుర్తు చేసుకున్నారామె.

కొండ అంచున కూర్చుని ష్యోక్ నదిని చూస్తూ హబీబా ఆనాడు ఏం జరిగింది.. తామెలా విడిపోయామన్నది చెప్పుకొచ్చారు. అవన్నీ గుర్తుచేసుకుంటూ, పాకిస్తాన్‌లోని తమ వారిని తలచుకుంటూ ఒక్కో మాట చెబుతున్నప్పుడు ష్యోక్ నదితో పాటు ఆమె కళ్లలోనూ నీరు ప్రవహించింది.

ఖాదిర్ పాకిస్తాన్‌లో ఉండిపోగా ఆయన తల్లి, భార్య, సోదరుడు, చెల్లెలు, తాతయ్య, ఇతర బంధువులు భారత్‌లో ఉండిపోయారు. "ఆ రోజు తరువాత అమ్మ మళ్లీ అన్నను చూడలేకపోయింది. అప్పటి నుంచి అన్నను చూడాలన్న కోరికతో, చూడలేకపోయానన్న బాధతోనే ఆమె కన్నుమూసింది" అని హబీబా చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

భార్య బానో సమాధి వద్ద గులామ్ ఖాదిర్

'అన్నావదినలు ఒక్కసారి కలుసుకున్నారు'

సమీపంలోని ఒక కొండ వైపు చూపిస్తూ హబీబా.. "ఒక రోజు మా అన్న ఖాదిర్ తెల్ల జెండా ఊపుతూ సరిహద్దు దాటి ఆ కొండ దగ్గరకు వచ్చాడు. అక్కడే వదిన బానో ఆయన్ను కలుసుకోగలిగింది. వదినను తనతో వచ్చేయమని అన్న కోరాడు. కానీ, ఇక్కడ భారత్‌లో ఉన్న కుటుంబసభ్యులను సైన్యం ప్రశ్నిస్తుందని, వారితో తీసుకెళ్లిపోతుందనే భయంతో ఆమె అన్నతో పాటు వెళ్లలేదు'' అన్నారామె.

వీసా కోసం ప్రయత్నించాం కానీ..

ఖాదిర్ సోదరుడు షంషీర్ అలీ మాట్లాడుతూ.. "ఖాదిర్ వద్దకు ఆయన భార్య బానోను పంపించడానికి ప్రయత్నం చేశాను. శ్రీనగర్ తీసుకెళ్లి ఆమెకు పాస్‌పోర్టు చేయించాను. ఆ తరువాత దిల్లీ వెళ్లి పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేశాం. కానీ, పాకిస్తాన్ వీసా నిరాకరించింది" అని చెప్పారు.

దీంతో ఖాదిర్, ఆయన భార్య బానోలు సుమారు పన్నెండేళ్లు విడిగానే బతకాల్సి వచ్చింది.

"బానో 1983 ఆగస్టు 24న ష్యోకో నదిలో కొట్టుకుపోయింది. కొన్ని రోజుల పాటు వెతికినా దొరకలేదు. పాకిస్తాన్ సైనిక పోస్టుల్లో పనిచేసేవారి ద్వారా ఖాదిర్‌కు సమాచారం అందించాం. భారత సైన్యం కూడా ఒక మహిళ ష్యోకో నదిలో కొట్టుకుపోయినట్లు పాకిస్తాన్ సైన్యానికి సమాచారం ఇచ్చింది. చివరకు సెప్టెంబరు 3న ఖాదిర్‌కే బానో మృతదేహం కనిపించింది. పాకిస్తాన్ వైపు ష్యోకో నదీ తీరానికి ఆమె మృతదేహం కొట్టుకురావడంతో ఆయన చూసి అంత్యక్రియలు పూర్తిచేశారు" అంటూ సోదరుడు షంషీర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Avani roy

ఫొటో క్యాప్షన్,

షంషీర్

తాను కూడా సోదరుడిని కలుసుకునేందుకు పాకిస్తాన్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆ దేశం నిరాకరించిందని షంషీర్ చెప్పారు. అయితే, 18 ఏళ్ల తరువాత 1989లో సోదరుడిని కలిసేందుకు తనకు ఓ మార్గం దొరికిందని చెప్పారు.

ఖాదిర్ తాను హజ్ యాత్రకు వెళ్తున్నట్లు ఉత్తరం రాయడంతో తెలిసినవారి దగ్గర డబ్బు అప్పు తీసుకుని తాను కూడా వెంటనే హజ్ యాత్ర ఏర్పాట్లు చేసుకుని ఆయన్ను మక్కాలో కలుసుకున్నట్లు చెప్పారు.

''మేం ముసలివాళ్లమైపోయాం. నా సోదరుడు ఖాదిర్‌ను, ఆయన పిల్లలను చూడాలని ఆశగా ఉంది. నా సోదరుడి పక్కనే కూర్చుని మాట్లాడాలని ఉంది'' అన్నారు షంషీర్.

ఫొటో క్యాప్షన్,

గులామ్ ఖాదిర్

పాకిస్తాన్ వైపు నుంచి..

గులామ్ ఖాదిర్ పాకిస్తాన్ సైన్యంలో సుబేదార్ హోదాలో రిటైరయ్యారు. ''పన్నెండేళ్లు ఒకరినొకరు కలుసుకోవాలన్న ఆశతో నేను, నా భార్య బతికాం. చివరకు ఆమె మృతదేహాన్ని ష్యోక్ నది నా దగ్గరకు తీసుకొచ్చింది'' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారాయన.

1971లో భారత్, పాక్ యుద్ధ సమయంలో సియాచిన్ గ్లేసియర్ సమీపంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఖాదిర్‌కు విధులు అప్పగించారు.

"అక్కడ నేను పాకిస్తాన్ తరఫున యుద్ధంలో ఉన్నప్పుడు ఓ కామ్రేడ్ నా దగ్గరకు వచ్చి మా ప్రాంతంలో మూణ్నాలుగు గ్రామాలను భారత్ స్వాధీనం చేసుకుందని చెప్పారు" అని గుర్తుచేసుకున్నారాయన.

యుద్ధం తరువాత తాను తన కుటుంబాన్ని కలుసుకోవడం కానీ.. లేదంటే తన కుటుంబ సభ్యులను పాకిస్తాన్ వైపు పంపించేయడం కానీ చేస్తారని మొదట ఖాదిర్ అనుకున్నారు.

కానీ, యుద్ధం ముగిసినా ఖాదిర్ అనుకున్నట్లు ఏమీ జరగలేదు. ఖాదిర్ పాకిస్తాన్‌లో.. భార్య, తల్లి, తోబుట్టువులు అందరూ భారత్‌లో ఉండిపోయారు. కేవలం ఉత్తరాలు తప్ప వారిమధ్య కమ్యూనికేషన్ లేకుండా పోయింది.

అలా విడిపోయిన తరువాత భారత్‌లో తల్లి, భార్య చనిపోయారు. భార్య చనిపోయిన తరువాత ఖాదిర్ స్కర్దులో మరో పెళ్లి చేసుకున్నారు. ఖాదిర్ ఇప్పుడుంటున్న గదిలో కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోలున్నాయి. అవన్నీ ఆయన తల్లి ఉత్తరాలతో పాటు పంపించినవి. అవే ఆయనకు తన కుటుంబానికి సంబంధించి కనిపించే జ్ఞాపకాలు.

కుటుంబంతో విడిపోయిన తరువాత ఒకే ఒక్కసారి ఆయన తల్లితో ఫోన్లో మాట్లాడారు.

"ఇరవై ఏళ్ల కిందట నాకు ఒక రోజు ఫోన్ వచ్చింది. అటువైపు మా అమ్మ.. అదే ఆమె గొంతు వినడం.. ఇద్దరం ఏడుస్తున్నాం. ఇంతలో కాల్ కట్ అయ్యింది. పాకిస్తాన్ నుంచి భారత్‌కు కాల్స్ చేయడంపై నిషేధం ఉండడంతో నేను తిరిగి కాల్ చేయలేకపోయాను'' అన్నారాయన.

ఖాదిర్ రిటైరైన తరువాత ఆ ప్రాంతంలోని మిగతావారితోపాటు పాకిస్తాన్ నుంచి భారత్‌లోని ఆ నాలుగు గ్రామాలకు మార్గం తెరవాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

"అప్పట్లో ప్రధాని జుల్ఫికల్ అలీ భుట్టోను కలిశాను కూడా. భారత్ స్వాధీనం చేసుకున్న గ్రామాలను మళ్లీ పాకిస్తాన్‌లోకి తీసుకోవాలంటే యుద్ధమైనా చేయాలి లేదంటే సుదీర్ఘమైన చర్చలైనా జరపాలని చెప్పారాయన నాతో. కానీ, ఆయనేం చేయలేదు. ప్రభుత్వాలకు లేఖలు రాసి, ఫోన్లు చేసిచేసి విసిగిపోయాను నేను'' అన్నారు ఖాదిర్.

''విడిపోయిన నా కుటుంబసభ్యులను నేను నా కలలో కలుస్తుంటాను. భారత ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ నేను కలలో వారిని కలుసుకోకుండా ఆపగలదా?' అంటారాయన.

ఫొటో సోర్స్, Emily Garthwaite

ఫొటో క్యాప్షన్,

చలాంకాలో చిన్నారులు

భారత్‌లోని చలూంకా గ్రామం కథ..

''1971 యుద్ధంలో మా గ్రామం చలూంకాపై బాంబుల వర్షం కురిసింది. పాకిస్తాన్, భారత్ రెండు వైపుల నుంచి బాంబులు పడ్డాయి. ఒక ఇంటిపై ఒకేసారి మూడు బాంబులు పడ్డాయి'' అని ఆ గ్రామానికి చెందిన అరవయ్యేళ్ల అబ్బాస్ అలీ చెప్పారు.

1971 డిసెంబరు వరకు ఈ గ్రామం పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉండేది. డిసెంబరు 15 రాత్రి చలూంకా, తుర్‌తుక్, త్యాక్సి, థాంగ్ గ్రామాలను భారత్ తన అధీనంలోకి తీసుకుంది. రాత్రికి రాత్రి జరిగిన ఈ పరిణామం ఆ గ్రామాల్లో అప్పటి వరకు ఉన్నవారి దేశాన్ని మార్చేసింది.

ఫొటో సోర్స్, Avani roy

ఫొటో క్యాప్షన్,

అబ్బాస్ అలీ

''ఊళ్లో అందరం భయపడిపోయాం. ఊరంతా తగలబెట్టేస్తారనుకున్నాం. ఇక్కడే ఉంటే అందరం చనిపోకతప్పదేమో అనుకుని భయపడ్డాం'' అంటూ తనకు పన్నెండేళ్ల వయసున్నప్పుడు జరిగిన ఆ ఘటనలను గుర్తు చేసుకున్నారు అబ్బాస్ అలీ.

ఇప్పుడా ఊరిలో ఆయన్ను అంతా 'గోబా' అని పిలుస్తారు. బాల్టీ భాషలో గోబా అంటే నాయకుడని అర్థం. చలూంకా గ్రామ నాయకుడాయన. ఆ ఊళ్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు నడిపిస్తున్నారాయన.

"యుద్ధం తీవ్రంగా సాగుతున్నప్పుడు మా గ్రామంలోని వారంతా అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఫ్రానో అనే గ్రామానికి వెళ్లిపోయారు. పాక్ సైన్యం కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోమని చెప్పింది. అయితే, మేము, మరో కుటుంబం మాత్రం చలూంకాను వదిలి సమీపంలోని త్యాక్సీ గ్రామానికి వెళ్లాం. యుద్ధం తరువాత చలూంకాకు తిరిగి ఈ రెండు కుటుంబాలే వచ్చాయి. మిగతా 74 కుటుంబాలు ఫ్రానోలో ఉండిపోయాయి" అని చెప్పారు.

చలూంకాతో పాటు త్యాక్సీ కూడా భారత్ అధీనంలోకి రాగా ఫ్రానో మాత్రం పాకిస్తాన్‌లోనే ఉంది. దీంతో అక్కడకు వెళ్లినవారంతా పాకిస్తాన్‌లోనే ఉండగా ఈ రెండు కుటుంబాలు మాత్రం భారత్‌లో మిగిలిపోయాయి. ప్రస్తుతం పాకిస్తాన్ వైపు చిట్టచివరి గ్రామం ఫ్రానో.

ఫ్రానో వెళ్లిన కుటుంబాలవారు తిరిగి చలూంకాకు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కాలేదని చెప్పారాయన.

చలూంకాలో ఇప్పటికీ శిథిలమైన రాతి ఇళ్లు తమను వదిలి వెళ్లిన కుటుంబాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటాయి. సమీపంలోని ఇతర గ్రామాల నుంచి ఇక్కడకు వలస వచ్చినవారు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నిర్మాణ రంగ కార్మికులు కొందరు ఇలాంటి ఇళ్లలో ఉంటున్నారిప్పుడు.

చలూంకా నుంచి పాకిస్తాన్‌లోని ఫ్రానో వెళ్లి కుటుంబాలేమంటున్నాయి..

1971 యుద్ధం నాటికి యువకుడిగా ఉన్న చో మాట్లాడుతూ.. "బాంబుల వర్షం కురుస్తున్న మా గ్రామాలను వదిలి పాకిస్తాన్లోని ఇతర గ్రామాలకు వెళ్లిపోవాలని అప్పట్లో పాక్ సైనికులు ప్రకటించారు. అయినా మేం మూడు రోజుల పాటు అక్కడే ఉన్నాం. కానీ.. బాంబులు మరింతగా పడుతుండడంతో మేం చలూంకాకు 6 మైళ్ల దూరంలోని తుర్‌తుక్‌కు మొదట వెళ్లాం. అది శీతాకాలం, ఆగకుండా వర్షం కురుస్తోంది. తుర్‌తుక్‌‌లోనూ అదే పరిస్థితులు ఉండడంతో అక్కడి నుంచి మరో మూడు గ్రామాలను దాటుకుని ఫ్రానో వెళ్లాం. అక్కడికి వెళ్లేసరికి తెలిసింది... మా గ్రామాలు భారత్‌ అధీనంలోకి వెళ్లిపోయాయని, మేం తిరిగి అక్కడికి వెళ్లలేమని'' అన్నారాయన.

ప్రస్తుతం ఫ్రానోయే పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లోని చిట్టచివరి గ్రామం. అక్కడ రెండు దేశాల సైనికులు పెద్ద సంఖ్యలో ఉంటారు. అక్కడికి వెళ్లేందుకు మీడియాను అనుమతించరు.

చో, ఇతర కుటుంబాలవారు ఫ్రానోలో తాత్కాలిక శిబిరాల్లో ఏడేళ్ల పాటు ఉన్నారు. మళ్లీ సరిహద్దును తెరిచి తమ ఊళ్లకు వెళ్లనిస్తారని వారు ఎదురుచూశారు. కానీ, ఆ అవకాశం రాకపోవడంతో వారంతా ఆ ఊళ్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.

''ఆ తరువాత మాలో చాలామంది పనులు వెతుక్కుంటూ పాకిస్తాన్‌లోని వేర్వేరు నగరాలకు వెళ్లిపోయారు. మిగతావారు ఫ్రానోలోనే ఇళ్లు కట్టుకున్నారు'' అని చెప్పారాయన. 1971 డిసెంబరు 16కి ముందు చలూంకాయే పాకిస్తాన్‌లోని చిట్టచివరి గ్రామం.

జమ్ము, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో ఈ కుటుంబాలపై ఎలాంటి ప్రభావం పడింది?

2019 ఆగస్టు 5 నుంచి జమ్ము, కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించారు. జమ్ము, కశ్మీర్‌ను రెండు ప్రాంతాలుగా విభజించారు. దీంతో ఈ నాలుగు గ్రామాలు ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్‌లోకి వచ్చాయి. లద్ధాక్ ఎక్కువగా బౌద్ధులుండే ప్రాంతం.

త్యాక్సీకి చెందిన గులామ్ హుస్సేన్ సామాజిక కార్యకర్త. లద్ధాఖ్‌లో బాల్టీ ప్రజల సంక్షేమం కోసం ఆయన 1997 నుంచి పనిచేస్తున్నారు.

పాకిస్తాన్‌లో ఉండిపోయిన ఈ గ్రామస్థుల కుటుంబసభ్యులకు ఇక్కడి నుంచి వీరి ఆడియో, వీడియో సందేశాలను పంపించడంలో సాయం చేస్తుంటారు.

''నా సొంత కుటుంబసభ్యులూ పాకిస్తాన్‌లో ఉండిపోయారు కాబట్టి ఈ బాధ నాకు కూడా తెలుసు. అందుకే వీరికి సాయపడుతుంటాను'' అన్నారాయన.

లద్ధాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంతో వీరంతా మళ్లీ సరిహద్దును తెరుస్తారన్న ఆశను పూర్తిగా వదులుకున్నారని చెప్పారాయన.

''భారత్, పాకిస్తాన్‌ల రాజకీయాల మధ్య మేం నలిగిపోతున్నాం. అప్పుడప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగైనట్లు అనిపించినా మళ్లీ ఏదో ఒకటి జరిగి మొదటికొస్తోంది. మా కుటుంబాలు ఏకమవుతాయన్న ఆశ చచ్చిపోయింది'' అంటూ ఆవేదన చెందారు అబ్బాస్ అలీ.

ఇవికూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)