ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు: కాంగ్రెస్-జేఎంఎం కూటమి విజయం

ఫొటో సోర్స్, Getty Images
రఘువర్ దాస్, హేమంత్ సోరెన్
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్-జేఎంఎం కూటమి విజయం సాధించింది. సోమవారం రాత్రి 10:45 గంటల వరకున్న ఎన్నికల కమిషన్ అధికారిక సమాచారం ప్రకారం మొత్తం 81 స్థానాలకుగాను 77 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి.
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీల కూటమి 45 స్థానాల్లో గెలిచింది. పాలక బీజేపీ 24 స్థానాలకు పరిమితమైంది.
ఈ 45 సీట్లలో జేఎంఎం 29, కాంగ్రెస్ 15, ఆర్జేడీ ఒకటి చొప్పున స్థానాల్లో విజయం సాధించాయి.
ఝార్ఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 41 సీట్లు రావాలి.
ఫలితం వెలువడాల్సి ఉన్న నాలుగు స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్, జేఎంఎం ముందంజలో ఉన్నాయి. మరో చోట బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఇంకో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు.
ఫొటో సోర్స్, Ravi Prakash
ముఖ్యమంత్రి పదవికి రఘువర్‌దాస్ రాజీనామా
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్‌దాస్ తన ఓటమిని అంగీకరించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌ని కలిసి రాజీనామా లేఖ అందించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన్ను గవర్నర్ కోరారు.
చాలాకాలం సేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు జార్ఖండ్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లోనూ రాష్ట్రానికి సేవ చేస్తామని ఆయన ట్వీట్ చేశారు.
జేఎంఎం అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఝార్ఖండ్ ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలు జేఎంఎం నాయకులు, పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రంలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది: హేమంత్ సోరెన్
ఝార్ఖండ్‌లో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందని హేమంత్ సొరెన్ అన్నారు.
తమపై నమ్మకం ఉంచి ఓటేసిన ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.
మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామని హేమంత్ సొరెన్ చెప్పారు.
"మహాకూటమి ఘనవిజయం సాధించబోతోంది. మేమంతా హేమంత్ సోరెన్ నాయకత్వంలో ఎన్నికల బరిలో నిలిచాం. ఆయనే కాబోయే ముఖ్యమంత్రి" అని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రఘువర్ దాస్ వెనుకంజ
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గంలో వెనుకంజలో ఉన్నారు. అక్కడ ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బీజేపీ తిరుగుబాటు అభ్యర్థి సర్యూ రాయ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌పై ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తాను స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటానని, విధానాలను బట్టి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమో, వ్యతిరేకించడమో చేస్తానని సర్యూ రాయ్ ఏఎన్ఐతో చెప్పారు.
ఝార్ఖండ్ వికాస్ మోర్చా (ప్రజాతంత్రిక్)- జేవీఎం (పీ) అభ్యర్థి బాబూలాల్ మరాండీ ఈ ఫలితాల సరళిపై స్పందించారు. ఆయన తన ధన్వర్ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
"ఫలితాలు మా అంచనాలకు తగ్గట్లుగా లేవు. కానీ, ప్రజల నిర్ణయాన్ని మేం గౌరవించాలి. వారు మాకు ఏ పాత్ర పోషించే అవకాశం ఇస్తే దాన్ని మేం పోషిస్తాం. ఏం చేయాలి, ఎలా చేయాలనేది పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత మేం చర్చించుకుంటాం" అని ఆయన అన్నారు.
ఐదు దశల్లో పోలింగ్..
ఝార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 మధ్య ఐదు దశల్లో పోలింగ్ జరిగింది.
సుమారు 65.17% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రఘువర్ దాస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఝార్ఖండ్‌లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి ముఖ్యమంత్రి ఆయనే.
ఫొటో సోర్స్, Getty Images
బీజేపీ ఈసారి 79 స్థానాల్లో పోటీ చేసింది. క్రితం సారి (2014) ఎన్నికల్లో ఆ పార్టీకి 37 స్థానాలు వచ్చాయి.
అప్పుడు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ నేతృత్వంలోని ఝార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) పార్టీలోని ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరారు.
ఈసారి ఏజేఎస్‌యూ బీజేపీతో తెగదెంపులు చేసుకుని, విడిగా పోటీ చేసింది. అయితే, ఎన్నికల తర్వాత తిరిగి బీజేపీతో కలిసే అవకాశాలూ లేకపోలేదని ఏజేఎస్‌యూ అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.
గత ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)కు 17, కాంగ్రెస్‌కు 6 సీట్లు వచ్చాయి.
ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు, ఆర్జేడీ జట్టు కట్టి పోటీ చేశాయి. ఈ కూటమి బీజేపీకి గట్టి సవాలు విసురుతోంది.
ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థల్లో ఎక్కువ భాగం రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని.. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
ఫొటో సోర్స్, Getty Images
లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడో రాష్ట్రం
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడో రాష్ట్రం ఝార్ఖండ్.
ఇంతకుముందు హరియాణా, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
హరియాణాలో దుష్యంత్ చౌతాలా పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది.
మహారాష్ట్రలో మాత్రం అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఇవి కూడా చదవండి:
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- CAA-సోనియా గాంధీ: ప్రజాందోళనను బీజేపీ అణచివేయాలని చూస్తోంది
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
- రియాన్స్ వరల్డ్: ఎనిమిదేళ్ల ఈ అబ్బాయి ఏడాదిలో రూ. 184 కోట్లు సంపాదించాడు
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు
- అమరావతిలో భూముల ధరలు: ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత, ఇప్పుడు ఎలా మారాయి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

మహారాష్ట్ర: బీజేపీకి అధికారాన్ని దూరం చేసిన ఆ ఆరు తప్పులు..
గోవాలో, హరియాణాలో మెజార్టీ సీట్లు రాకపోయినా, బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగింది. మహారాష్ట్రలో మాత్రం బీజేపీ వ్యూహాలు ఎందుకు పనిచేయలేదు? ఆ పార్టీ చేసిన తప్పులేంటి?