అమరావతి రైతుల ఆందోళన: ‘ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వస్తుందనుకోలేదు’- చంద్రబాబు

  • శంకర్ వడిశెట్టి
  • బీబీసీ కోసం
రాజధాని ప్రాంత ప్రజల ఆందోళనలో పాల్గొన్న చంద్రబాబు

ఫొటో సోర్స్, TDP

ఫొటో క్యాప్షన్,

రాజధాని ప్రాంత ప్రజల ఆందోళనలో పాల్గొన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ‌ధాని ప్రాంతంగా ప్ర‌క‌టించి, భూములు సేక‌రించిన త‌ర్వాత ఇప్పుడు పున‌రాలోచ‌న చేస్తోందని, దీనిని స‌హించ‌బోమంటూ అమ‌రావ‌తి రైతులు పేర్కొంటున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని, అమ‌రావ‌తిలోనే రాజ‌ధానిని కొన‌సాగించాల‌ంటూ వారు తమ ఆందోళ‌న‌ను తీవ్ర‌త‌రం చేస్తున్నారు. అభివృద్ధిని వికేంద్రీక‌రించాల‌ని, పాల‌న వికేంద్రీక‌ర‌ణ వ‌ల్ల ఫ‌లితం ఉండ‌ద‌ని వారు చెబుతున్నారు.

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాల్సిన అవసరముందంటూ ఈ నెల 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మొదలైన ఆందోళనలు వారం రోజులుగా కొనసాగుతున్నాయి.

రాజ‌ధాని ప్రాంత రైతులు, రైతుకూలీలు, మ‌హిళ‌లు, విద్యార్థులు, న్యాయ‌వాదులు వివిధ రూపాల్లో నిర‌స‌న‌ల్లో పాల్గొంటున్నారు. వారి ఆందోళ‌న‌కు మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు మద్దతు ప్ర‌క‌టించారు.

సోమవారం వివిధ రాజధాని గ్రామాల్లో ప‌ర్య‌టించి నిరసనకారులతో కలిసి 'జై అమ‌రావ‌తి' అంటూ నిన‌దించారు. రాజధాని అమ‌రావ‌తిని కాపాడుకుందామ‌ని, అందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు.

చంద్రబాబు విమర్శలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆయన ఇప్పటికీ రైతుల‌ను మోస‌గించేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ, రైతులు ఆందోళ‌న విర‌మించాల‌ని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కోరారు.

ఫొటో సోర్స్, FB/TDP.Official

ముఖ్య‌మంత్రి వ్యాఖ్యలతో రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళన, ఆగ్రహం, ఈ నెల 20న వెలువడిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదికతో మరింత పెరిగాయి.

నివేదిక వివరాలు తెలియగానే కొందరు నిరసనకారులు అసెంబ్లీ భవనాన్ని ముట్ట‌డించేందుకు య‌త్నించారు. క‌మిటీ ప్ర‌తినిధుల‌ను బ‌య‌ట‌కు రాకుండా అడ్డుకునే ప్ర‌య‌త్నమూ జరిగింది.

జీఎన్ రావు క‌మిటీ నివేదిక బూట‌క‌మ‌ని రాజ‌ధాని ప్రాంత రైతు ప్ర‌తినిధి సుధాక‌ర్ బీబీసీతో వ్యాఖ్యానించారు. రాజ‌ధాని ప్రాంతంలో క‌నీసం ప‌ర్య‌టించ‌కుండా, అందరి అభిప్రాయాన్ని తీసుకుని నివేదిక ఇచ్చామ‌ని చెప్పడం స‌మంజ‌సం కాద‌న్నారు. సీఎం మాట‌ల‌నే క‌మిటీ మళ్లీ చెప్పింది తప్ప, అందులో ప్ర‌జాభిప్రాయం ప్ర‌తిధ్వ‌నించ‌లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, FB/janasenaparty

ఫొటో క్యాప్షన్,

నాదెండ్ల మ‌నోహ‌ర్, కొణిదెల నాగ‌బాబు లాంటి జనసేన ముఖ్య నేత‌లు అమ‌రావ‌తిలో ఇప్పటికే ప‌ర్య‌టించారు.

జ‌న‌సేన‌తోపాటు రంగంలోకి టీడీపీ, బీజేపీ

రాజ‌ధాని రైతుల‌కు తొలుత జ‌న‌సేన పార్టీ మ‌ద్దతు ప్ర‌క‌టించింది. నాదెండ్ల మ‌నోహ‌ర్, కొణిదెల నాగ‌బాబు లాంటి పార్టీ ముఖ్య నేత‌లు అమ‌రావ‌తిలో ప‌ర్య‌టించారు. రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్దతు ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ తీరును త‌ప్పుబ‌ట్టారు. ఐదేళ్ల త‌ర్వాత రాజ‌ధానిని మారుస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం త‌గ‌ద‌న్నారు.

తర్వాత రైతులకు మద్దతుగా టీడీపీ, బీజేపీ ఆందోళన బాట పట్టాయి.

టీడీపీ తరపున తొలుత కొంద‌రు మాజీ మంత్రులు నిర‌స‌న‌ల్లో పాల్గొన‌గా, తాజాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వచ్చారు. సోమ‌వారం ఆయ‌న తుళ్లూరు, వెల‌గ‌పూడి గ్రామాల్లో ప‌ర్య‌టించారు. రైతుల ధ‌ర్నా శిబిరాల‌ను సంద‌ర్శించారు. ఆందోళ‌న‌లో ఉన్నవారికి సంఘీభావం ప్ర‌క‌టించారు.

రైతుల‌నుద్దేశించి ఆయన మాట్లాడుతూ- "ఇలాంటి పరిస్థతుల్లో నేను ఇక్కడకి రావాల్సి ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రానికి మేలు క‌లుగుతుంద‌ని మీరు భూములిచ్చారు. కానీ ఇప్పుడు కేసులు పెట్టి, పోలీసుల‌తో అణ‌చివేయాల‌ని ఈ ప్ర‌భుత్వం చూస్తోంది. ఐదేళ్ల క్రితం ప‌రిష్కారమైపోయిన స‌మ‌స్య ఇది. ఇక్కడ ఎవ‌రైనా త‌మ‌కు రాజ‌ధాని కావాల‌ని అడిగారా.. కులాల‌కు, పార్టీల‌కు అతీతంగా అంద‌రూ భూములిచ్చారు. అందుకే 'విన్-విన్' ప‌ద్ధ‌తిలో అంద‌రికీ మేలు జ‌రిగేలా విధానం రూపొందించాం. ఇప్పుడు అమరావతిని చంపేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు" అని విమర్శించారు.

తనను నమ్మి భూములిచ్చారని చంద్రబాబు చెప్పారు. ఎస్సీలకు న్యాయం జరగాలని భూసమీకరణ (లాండ్ పూలింగ్) పెట్టి ప్లాట్లు ఇచ్చామన్నారు.

"నేను రాజకీయం చేయడం లేదు. ఇక ఇప్పుడు అంతా ఒకటే పార్టీ- అమరావతి పార్టీ. ఒకటే కులం- రైతులు, కూలీల‌ కులం. విశాఖ‌పట్నాన్ని ఎంతో అభివృద్ధి చేశాను. అన్నీ పోగొట్టేసి, చివ‌ర‌కు ఇప్పుడు అభివృద్ధి చేస్తామంటున్నారు. క‌ర్నూలులో కూడా నేను ఎన్నో చేశాను. అయినా జీఎన్ రావు కమిటీ ఎవరితోనైనా మాట్లాడింది లేదు. ముందుగానే సీఎం మాట్లాడారు. అందుకే ఇప్పుడు రైతుల‌ది ధ‌ర్మ‌పోరాట దీక్ష‌. రైతులూ, ధైర్యంగా ఉండండి. ఇది నియంతృత్వం కాదు. అంద‌రికీ న్యాయం, ధ‌ర్మం జ‌ర‌గాల‌ని నేను అడుగుతున్నాను" అని చంద్రబాబు చెప్పారు.

ఆయన ఎదుట ప‌లువురు రైతులు త‌మ ఆందోళ‌న‌ను వ్య‌క్తప‌రిచారు. ప్ర‌భుత్వాన్ని నమ్మి భూములిచ్చినందుకు ఇప్పుడు త‌మ‌ను న‌ట్టేట ముంచుతున్నార‌ని వాపోయారు.

బీజేపీ తరపున సీనియర్ నేత రఘునాథబాబు, ఇతర నేతలు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకుడు అంజిబాబు తదితరులు రైతుల ధర్నా శిబిరాలను సందర్శించారు. వారికి సంఘీభావం ప్రకటించారు.

చంద్ర‌బాబు మాటలు నమ్మి నిరసనలు కొనసాగించడం తగదు: బొత్స

చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు, అమ‌రావ‌తిలో ఆందోళ‌న‌ల‌పై మంత్రి బొత్స సత్యనారాయణ బీబీసీతో మాట్లాడుతూ- రాజధాని రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

రాజ‌ధాని పేరుతో అనేక అక్ర‌మాల‌కు పాల్పడ్డారని, ఇప్పుడు మ‌ళ్లీ రైతుల‌ను మోస‌గించేందుకు చంద్ర‌బాబు య‌త్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. భూముల కొనుగోళ్ల పేరుతో సాగిన వ్య‌వ‌హారాలు అసెంబ్లీ సాక్షిగా బ‌య‌ట‌పెట్టామన్నారు.

తాము అమ‌రావ‌తిని విద్యాకేంద్రంగా అభివృద్ధి చేయడానికి క‌ట్టుబ‌డ్డామని, జీఎన్ రావు క‌మిటీ నివేదికపై ఈ నెల 27న కేబినెట్ సమావేశంలో చ‌ర్చించి తుది ప్ర‌క‌ట‌న చేస్తామని ఆయన చెప్పారు. రైతులు ఆందోళ‌న విర‌మించాలని, ప్ర‌తిప‌క్ష నేత‌ల మాట‌లు న‌మ్మి నిర‌స‌న‌లు సాగించ‌డం త‌గ‌దని వ్యాఖ్యానించారు.

భూసమీకరణలో 'ఇన్‌సైడర్ ట్రేడింగ్' జరిగిందన్న ప్రభుత్వం, వైసీపీ నాయకుల ఆరోపణలపై చంద్రబాబు స్పందిస్తూ- "జ్యుడిషియ‌ల్ ఎంక్వైరీ వేయండి. హైకోర్ట్ జ‌డ్జితో విచార‌ణ జ‌ర‌పండి" అని సవాల్ విసిరారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)